అమెరికా, చైనాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయనే ఊహాగానాలు ఇటీవలి కాలంలో వినిపిస్తున్నాయి. ఈ రెండు దేశాలు బద్ధ శత్రువులుగా మారాయని, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు అంతం కావడం లేదనే వార్తలు కూడా హల్‌చల్ చేస్తున్నాయి.
తాజాగా ఇరు దేశాల మధ్య నెలకొన్న ఆందోళనకర పరిస్థితులకు సంబంధించి మీడియాకు అమెరికా వివరణ ఇచ్చింది. ఆసియా-పసిఫిక్‌లో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నప్పటికీ, చైనాతో యుద్ధం చేసేంతటి పరిస్థితులు లేవని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఉన్నత స్థాయి భద్రతా అధికారుల బృందానికి తెలిపారు. అపోహలు, అపార్థాలను తొలగించడానికి, నివారించడానికే ఈ అంశంపై స్పష్టత ఇచ్చినట్లు పేర్కొన్నారు.
సింగపూర్‌లోని షాంగ్రి-లా డిఫెన్స్ ఫోరమ్‌లో చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్‌తో గంటకు పైగా జరిగిన సమావేశం అనంతరం ఆస్టిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2022లో యూఎస్ ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌ను సందర్శించిన తర్వాత యూఎస్, చైనా సైన్యాల మధ్య సంబంధాలు ముగిసిపోయాయి. ఆ తర్వాత ఇద్దరు రక్షణ శాఖ ఉన్నతాధికారులు ముఖాముఖి సమావేశం కావడం ఇదే మొదటిసారి. ఈ భేటీ గురించి వివరించడానికి నిరాకరించిన ఆస్టిన్, ఇరు దేశాల నేతలు మరోమారు సమావేశం కావాల్సిన అవసరం ఉందన్నారు.
మీడియాతో ఆస్టిన్ మాట్లాడుతూ ఊహలు, అపార్థాలకు అవకాశం తగ్గించేలా ఇరు దేశాల నేతలు కలసి పనిచేయాలన్నారు. ప్రతీ భేటీ ఆహ్లాదకరమైనది కాదని, అయినప్పటికీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ముఖ్యమని అన్నారు. ఇదిలావుండగా ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఇదే ఫోరమ్‌లో ప్రసంగించారు. తమ దేశానికి చెందిన కోస్ట్‌గార్డ్‌తో చైనా సైన్యం ఘర్షణకు దిగిన సమయంలో ఒక్క ఫిలిపినో పౌరుడు మృతి చెందినా, దానిని యుద్ధ చర్యగా పరిగణిస్తామని, తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని మార్కోస్ జూనియర్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment