బీజింగ్: తైవాన్, చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా తయారైంది. గత కొంతకాలంగా తైవాన్‌పై బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తున్న చైనా తాజాగా, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తైవాన్ అంశంలో విదేశీ జోక్యం పెచ్చుమీరుతోందంటూ పరోక్షంగా అమెరికాపై మండిపడుతోంది. తాజాగా చైనా రక్షణ శాఖ చేసిన ప్రకటన ఈ వివాదాన్ని మరింత పెంచేలా ఉంది. తైవాన్‌కు స్వాతంత్ర్యం అంటే యుద్ధం తప్పదని హెచ్చరించింది. చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి వు కియాన్ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ‘‘తైవాన్ జలసంధిలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చేపట్టిన సైనిక కార్యకలాపాలు జాతీయ సార్వభౌమత్వాన్ని భద్రతను కాపాడటానికి చేపట్టిన చర్యలు. ఇక తైవాన్‌లో కొందరు మాత్రమే స్వాతంత్ర్యం కావాలంటున్నారు. నిప్పుతో చెలగాటం ఆడితే ఆ అగ్నికే ఆహుతి అయిపోతారంటూ’’ హెచ్చరికలు జారీ చేశారు.
(చదవండి: చైనా లేఖ; గెట్ లాస్ట్ అన్న తైవాన్!)
ఇటీవలే చైనా యుద్ధ విమానాలు తన గగనతలంలోకి వచ్చాయని తైవాన్ ఆరోపించగా.. అమెరికాకు చెందిన విమాన వాహక నౌకలు దక్షిణ చైనా సముద్రంలో ప్రవేశించాయి. ఈ పరిణామాలు చైనాకు ఆగ్రహం తెప్పించాయి. తన సార్వభౌమత్వాన్ని సవాలు చేసేందుకు దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలు మోహరించినట్టు డ్రాగన్ భావిస్తోంది. మరోవైపు తైవాన్ అధ్యక్షుడు తై ఇంగ్ వెన్ తమది ఇప్పటికే స్వతంత్ర దేశమని.. తమ దేశం పేరు రిపబ్లిక్ ఆఫ్ చైనా అని పేర్కొంటుండడం కూడా డ్రాగన్‌కు కంటగింపుగా మారింది. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమేనని చైనా ఎప్పటినుంచో వాదిస్తోన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment