బీజింగ్: కొత్త ఏడాది వేడుకల వేళ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. తైవాన్‌ను చైనాలో కలుపుకోవడాన్ని ఎవరూ ఆపలేరంటూ జిన్‌పింగ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. చైనా, తైవాన్ వేరు కాదంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
చైనా దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా దేశ ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్బంగా జిన్‌పింగ్ సంచలన కామెంట్స్ చేశారు. తైవాన్‌ను చైనాలో కలుపుకోవడం ఎవరూ ఆపలేరని అన్నారు. చైనాలో తైవాన్ అంతర్భాగమేనని తెలిపారు. తైవాన్ జలసంధికి ఇరువైపులా ఉన్న చైనా ప్రజలు ఒకే కుటుంబం. మన రక్త సంబంధాలను ఎవరూ తెంచలేరు. మాతృభూమి పునరేకీకరణను ఎవరూ ఆపలేరు. అందుకే తైవాన్ చుట్టూ వైమానిక, నౌకాదళ విన్యాసాలు చేపట్టినట్లు చెప్పారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇక, ఇప్పటికే ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెల కొన్నవేళ జిన్‌పింగ్ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇదిలా ఉండగా.. గత కొద్ది కాలంగా రెండు దేశాల మధ్య ఈ విషయమై ఘర్షణ నడుస్తోంది. చాలాసార్లు చైనా.. తైవాన్‌ను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిచింది. నిజానికి చైనా, తైవాన్ దేశాలు పరస్పర విరుద్ధమైన జీవన విధానాన్ని కలిగి ఉంటాయి. తైవాన్ ప్రజాస్వామ్యదేశం కాగా, చైనా కమ్యూనిస్టు దేశం. ఇటీవల కాలంలో తైపీపై బీజింగ్ తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోంది. ద్వీపదేశమైన తైవాన్‌కు ప్రపంచదేశాలతో ఎలాంటి సంబంధాలు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తోంది. మే నెలలో తైవాన్ అధ్యక్షుడిగా లాయ్ చింగ్ ఎన్నికైన తర్వాత ఆదేశ ప్రాదేశిక జలాల్లో చైనా ఇప్పటి వరకు మూడు సార్లు భారీ మిలటరీ విన్యాసాలు చేపట్టింది. తైవాన్‌ని బలప్రయోగం ద్వారా తన ఆధీనంలోకి తీసుకురావడానికి చైనా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. చాలా సార్లు జల, గగన తలాల్లో నియమాలను ఉల్లంఘించింది.
మరోవైపు.. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ మరో మూడు వారాల్లో అధికారంలోకి రాబోతున్న తరుణంలో జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తైవాన్‌ని అమెరికా ఆసియాలో వ్యూహాత్మక మిత్రదేశంగా భావిస్తోంది. అమెరికా తైవాన్‌కి అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా ఉంది. చైనా నుంచి తైవాన్‌ని రక్షించేందుకు అమెరికా అండగా నిలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment