
వాషింగ్టన్: 2025లో చైనాతో యుద్ధం తప్పకపోవచ్చని అమెరికా ఎయిర్ మొబిలిటీ కమాండ్ చీఫ్ జనరల్ మైక్ మినహాన్ అంచనా వేశారు. 2024లో అమెరికాతోపాటు తైవాన్‌లో ఎన్నికలు జరగాల్సి ఉన్నందున, ఆ అవకాశంగా తీసుకుని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తైవాన్‌పై దాడికి పాల్పడవచ్చన్నారు. అందుకే, ఏఎంసీ సిబ్బంది గురి తప్పకుండా కాల్పులు జరిపేలా కఠోర శిక్షణకు సిద్ధం కావాలని, రికార్డులను అప్‌డేట్ చేయించుకోవాలని సూచించారు.
ఈ మేరకు ఆయన శుక్రవారం తన కమాండర్లకు పంపిన మెమో మీడియాకు అందింది. చైనాపై పోరాడి గెలిచేందుకు సమీకృత, పటిష్ట బృందాలను సిద్ధం చేయాలని నిర్దేశించారు. ఎయిర్ మొబిలిటీ కమాండ్(ఏఎంసీ) కింద 50 వేల మంది ఆర్మీ సిబ్బంది, 500 విమానాలు ఉన్నాయి. రవాణా, ఇంధన అవసరాలు తీర్చడం ఈ విభాగం ప్రధాన బాధ్యతలు. తైవాన్ చైనాలో అంతర్భాగం, ఎప్పటికైనా కలిపేసుకుంటామంటూ డ్రాగన్ దేశం చెబుతోంది. ఈ అంశంపై చైనా, అమెరికాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment