
న్యూఢిల్లీ: విమానం ల్యాండయిన కొద్ది సేపటికే అస్వస్థతకు గురైన పైలట్ ప్రాణాలు విడిచారు. ఈ ఘటన బుధవారం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం బుధవారం శ్రీనగర్ నుంచి ఢిల్లీకి చేరుకుంది. ల్యాండయిన కొద్దిసేపటికే పైలట్(30) అస్వస్థతగా ఉందని చెప్పడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని విశ్వసనీయ వర్గాలు గురువారం వెల్లడించాయి. అనారోగ్య కారణాలతో ఆ పైలట్ చనిపోయినట్లు ఎయిరిండియా ప్రతినిధి ఒకరు వివరించారు. ఇతర వివరాలను వెల్లడించలేదు. ‘ఈ సమయంలో గోప్యతను గౌరవించాలని, అనవసర ఊహాగానాలను నివారించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సమయంలో సంబంధిత అధికారులకు సహకరించేందుకు కట్టుబడి ఉన్నాం’అని తెలిపారు.