Delhi International Airport
-
ఎయిర్‌పోర్ట్‌లో భారీగా ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లు స్వాధీనం..
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లు భారీగా పట్టుబడ్డాయి. ఇటీవలే యాపిల్ సంస్థ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అచితూ ఈ ఫోన్లను అక్రమంగా తీసుకెళ్తున్న ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహిళ తన వ్యానిటీ బ్యాగ్‌లో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లను టిష్యూ పేపర్లలో చుట్టి దాచిపెట్టిందని అధికారులు తెలిపారు. కాగా ఐఫోన్ సిరీస్‌లో.. 16 ప్రో మాక్స్ టాప్ మోడల్.ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. హాంగ్‌కాంగ్ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న ఓ మహిళ 26 ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఫోన్లను తీసుకొచ్చింది.ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయంలో ఆమెను పట్టుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి మరింత విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. స్మగ్లింగ్ చేసిన ఆ ఫోన్లు ఖరీదు సుమారు 37 లక్షలు ఉంటుందని అంచనా. -
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో జీఎంఆర్ వాటా పెంపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో (డీఐఏఎల్) మరో 10 శాతం వాటాను జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (జీఐఎల్) దక్కించుకుంది. డీఐఏఎల్‌లో తనకున్న 10 శాతం వాటాను ఫ్రాపోర్ట్ ఏజీ ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ సరీ్వసెస్ వరల్డ్‌వైడ్ విక్రయించింది. డీల్ విలువ 126 మిలియన్ డాలర్లు. డీల్ తదనంతరం డీఐఏఎల్‌లో జీఐఎల్ వాటా 74 శాతానికి చేరింది. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు 26 శాతం వాటా ఉంది. వాటా కొనుగోలు ప్రక్రియ 180 రోజుల్లో పూర్తి అవుతుందని జీఎంఆర్ గ్రూప్ సోమవారం తెలిపింది. -
337 విమానాలు ఆలస్యం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీని పొగమంచు కష్టాలు వదలట్లేవు. వరుసగా నాలుగో రోజు దట్టమైన పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గురువారం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 337 విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. కొన్ని విమానాలను సమీపంలోని ఇతర ఎయిర్‌పోర్టులకు దారి మళ్లించారు. ఈ ఎయిర్ పోర్టు నుంచి ప్రతి రోజు దాదాపు 1200ల విమానాలు రాకపోకలు సాగిస్తాయి. కాగా.. పొగమంచు కారణంగా విమానాల రాకపోకల్లో ఇబ్బందులు తలెత్తితే ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ప్రయాణికులు తమ ప్రయాణాన్ని వాయిదా లేదా రద్దు చేసుకునేందుకు అనుమతిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రతి ఏడాది చలి కాలంలో నెల నుంచి నెలన్నర రోజులు ఇలాంటి పరిస్థితి తలెత్తడం సాధారణం. -
ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయంలో వేగంగా చెకిన్..
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ ఆధారిత ‘డిజి యాత్రా’ బీటా వెర్షన్ మొబైల్ అప్లికేషన్ బెంగళూరు, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాల వద్ద సోమవారం నుంచి పనిచేయడం ప్రారంభమైంది. ఈ యాప్ సాయంతో ప్రయాణికులు విమానాశ్రయంలోకి వేగంగా చెకిన్ కావచ్చని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రకటించింది.ఈ సదుపాయం ప్రారంభించిన తర్వాత 20వేల మంది ప్రయాణికులు మొదటి రోజు అవాంతరాల్లేని, సురక్షిత ప్రయాణ అనుభవాన్ని చూసినట్టు తెలిపింది. బయోమెట్రిక్, ఇతర కీలక వివరాలను ప్రయాణికులు మూడో నంబర్ టెర్మినల్ వద్ద సమర్పించిట్టు ప్రకటన విడుదలైంది. ఈ యాప్‌నకు బోర్డింగ్ పాస్‌ను లింక్ చేయడం ద్వారా ఎయిర్‌పోర్ట్‌లోని పలు తనిఖీలను మానవ ప్రమేయం లేకుండా, డీజిటల్‌గా పూర్తి చేసుకోవడం సాధ్యపడుతుంది. డిజి యాత్రా బీటా వెర్షన్‌ను పరీక్షించేందుకు బెంగళూరు, ఢిల్లీ విమానాశ్రయాలనే ఎంపిక చేశారు. విస్తృత పరిశీలన తర్వాత అన్ని విమానాశ్రయాల్లో దీన్ని ప్రవేశపెడతారు. -
ఢిల్లీ ఎయిర్ పోర్టులో కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన విమానం
న్యూఢిల్లీ: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న స్పైస్ జెట్ విమానం(ఎస్జీ 160) సోమవారం ఉదయం టేకాఫ్ అయ్యే సమయంలో కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్యాసింజర్ టెర్మినల్ నుంచి టేకాఫ్ కోసం రన్‌వేపైకి విమానం వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం వెనక్కి తీస్తుండగా కరెంట్ పోల్‌ను విమానం కుడి వైపు ఉన్న వింగ్ బలంగా తాకింది. దీంతో విమానం కుడివైపు రెక్క(రైట్ వింగ్) దెబ్బతింది. అలాగే కరెంట్ స్తంభం కూడా డ్యామేజ్ అయ్యింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు అవ్వకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రమాదానికి గురైన విమానం ఢిల్లీ నుంచి జమ్మూకి వెళ్లాల్సి ఉంది. విమానం ప్రమాదానికి గురికావడంతో మరో విమానాన్ని ఏర్పాటు చేసి ప్రయాణికులను జమ్మూకు పంపించారు. మరోవైపు విమానం కరెంట్ పోల్‌ను ఢీకొట్టడంపై దర్యాప్తుకు ఆదేశించినట్టు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. -
అంత బంగారాన్ని నోట్లో ఎలా దాచర్రా సామి..!
దేశంలో బంగారం స్మగ్లింగ్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎంత వీలైతే అంత దేశాల సరిహద్దులు దాటించేందుకు స్మగ్లర్లు కొత్త కొత్త పద్దతుల్ని అన్వేషిస్తున్నారు. సినిమా స్టైల్లో బంగారాన్ని తరలిస్తున్నారు.కొన్ని సార్లు అధికారులకు అడ్డంగా దొరికేస్తున్నారు. తాజాగా ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఇద్దరు స్మగ్లర్లు విచిత్రంగా బంగారాన్ని తరలిస్తూ ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డారు. సినిమాల్లో బంగారాన్ని కడుపులో, లేదంటే తలపై విగ్గులో పెట్టుకొన్ని స్మగ్లింగ్ చేసే సన్నివేశాల్ని చూసే ఉంటాం. ఆ సన్నివేశాలు ఈ ఉబ్బెకిస్తాన్ గోల్డ్ స్మగ్లర్లు బాగా నచ్చినట్లన్నాయి. అందుకే తెలివిగా బంగారాన్ని నోట్లో పెట్టుకొని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.దుబాయ్ నుంచి వచ్చిన ఉజ్బెకిస్తాన్ స్మగ్లర్లను ఢిల్లీ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరి వద్ద నుంచి సుమారు 951 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరు బంగారాన్ని ఎలా స్మగ్లింగ్ చేశారో తెలుసా? బంగారాన్ని పళ్ల సెట్ల తరహాలో డిజైన్ చేయించారు.ఆ సెట్ ను నోట్లో అమర్చుకుని దుబాయ్ నుంచి ఢిల్లీకి వచ్చారు. అంత బంగారాన్ని నోట్లో ఎలా పెట్టుకున్నారనేదే ఆశ్చర్యంగా ఉన్నా.. ఢిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో బయటపడింది. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించగా..స్మగ్లింగ్ కు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నోట్లో బంగారం పెట్టుకొని స్మగ్లింగ్ చేయడంపై నెటిజన్లు తమదైన స్టైల్లో 'అంత బంగరాన్ని నోట్లో ఎలా దాచర్రా సామి' అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: అయ్యో చిట్టి తల్లి.. అప్పుడే నూరేళ్లు నిండాయా.. -
ఢిల్లీ విమానాశ్రయానికి మరో ఘనత
న్యూఢిల్లీ: జీఎంఆర్ ఆధ్వర్యంలోని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (డీఐఏఎల్) తాజాగా మరో ఘనతను సొంతం చేసుకుంది. డీఐఏఎల్ కార్బన్ అక్రిడిటేషన్‌ను ‘లెవల్ 3+, తటస్థ స్థితి’కి ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ అప్‌గ్రేడ్ చేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కార్బన్ తటస్థ స్థితిని పొందిన తొలి విమానాశ్రయం డీఐఏఎల్ అని సంస్థ ఓ ప్రకటన లో తెలిపింది. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ సర్టిఫికెట్‌ను డీఐఏఎల్ సీఈవో ఐ ప్రభాకర్‌రావు కెనడాలోని మాంట్రియల్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో స్వీకరించారు. -
జీఎంఆర్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ రేటింగ్‌లో కోత
దీనికిచ్చే రుణాలకు రిస్కుంది: మూడీస్ న్యూఢిల్లీ: రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్... మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ కన్సార్షియం సారథ్యంలోని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (డీఐఏఎల్) క్రెడిట్ రేటింగ్‌ను తగ్గిస్తూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నిధుల లభ్యత విషయంలో ఆందోళనకర పరిస్థితుల కారణంగా .. రేటింగ్‌ను ‘బీఏ2’ నుంచి ‘బీఏ1’కి తగ్గిస్తున్నట్లు పేర్కొంది. రుణాలకు సంబంధించి గణనీయమైన రిస్కు ఉన్నట్టుగా ‘బీఏ’ సూచిస్తుంది. ‘‘ఈ కంపెనీకి నిర్వహణకు అవసరమైన నిధులను సమకూర్చుకోగలిగే సామర్థ్యం తగ్గింది. ఈ సామర్థ్యానికి సంబంధించి ఆందోళనకరమైన పరిస్థితి కొనసాగుతోందనేది తాజా డౌన్‌గ్రేడ్ సూచిస్తుంది’’ అని మూడీస్ వైస్ ప్రెసిడెంట్ అభిషేక్ త్యాగి తెలిపారు. ఎయిర్‌పోర్ట్స్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్ఏ) ఇటీవల ఇచ్చిన టారిఫ్ ఆర్డరు కారణంగా 2018 ఆర్థిక సంవత్సరం నుంచి వార్షిక ఏరోనాటికల్ ఆదాయాలు సుమారు రూ. 2,000 కోట్ల మేర (దాదాపు 70 శాతం) తగ్గవచ్చని మూడీస్ పేర్కొంది. ఇది కంపెనీ ఆదాయాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని అభిప్రాయపడింది. ఇక రాబోయే 3-5 ఏళ్లలో ప్రతిపాదిత విస్తరణ ప్రణాళికలతో ఆర్థికపర మైన ఒత్తిడి మరింతగా పెరగవచ్చని తెలిపింది. ఇలా విస్తరణ ప్రణాళికలు, నియంత్రణ వ్యవస్థపరమైన అనిశ్చితి తదితర అంశాల మూలంగా సమీప భవిష్యత్‌లో రేటింగ్ పెరిగే అవకాశాలు లేవని పేర్కొంది.. ప్రస్తుతానికి తగిన ంత లిక్విడిటీ ఉన్నందున స్థిరమైన అవుట్‌లుక్‌ను కొనసాగిస్తున్నట్లు మూడీస్ వివరించింది. జీఎంఆర్ గ్రూప్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ (ఏఏఐ), జర్మనీకి చెందిన ఫ్రాపోర్ట్ కలిసి డీఐఏఎల్ను జాయింట్ వెంచర్‌గా ఏర్పాటు చేశాయి. -
ఢిల్లీ ఎయిర్ పోర్టులో సోలార్ ప్లాంట్ సామర్థ్యం పెంపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) సౌర విద్యుత్ ప్లాంటు సామర్థ్యాన్ని 7.84 మెగావాట్లకు పెం చినట్లు జీఎంఆర్ కన్సార్షియం సారథ్యంలోని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (డీఐఏఎల్) తెలిపింది. 2020 నాటికి దీన్ని 20 మె.వా.కు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు సంస్థ సీఈఓ ఐ ప్రభాకరరావు పేర్కొన్నారు. ఇప్పటిదాకా ఈ ప్లాంటు 2.14 మె.వా. సామర్థ్యంతో పనిచేస్తోంది. యునెటైడ్ నేషన్స్ పర్యావరణ అనుకూల వ్యవస్థ (యూఎన్ఎఫ్సీసీసీ) కింద ప్రపంచంలోనే తొలిసారిగా నమోదైన ఎయిర్‌పోర్టు తమదేనని ప్రభాకరరావు పేర్కొన్నారు. -
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పెరిగిన జీఎంఆర్ వాటా
10 శాతం వాటాను రూ. 492 కోట్లకు కొన్న జీఎంఆర్ పూర్తిగా వైదొలిగిన మలేషియా ఎయిర్పోర్ట్ లిమిటెడ్ దీంతో 64 శాతానికి పెరిగిన వాటా జీఎంఆర్ వాటా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(డీఐఏఎల్) నుంచి విదేశీ భాగస్వామ్య కంపెనీ మలేషియా ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ బెరహాద్ (ఎంఏహెచ్‌బీ) పూర్తిగా వైదొలిగింది. ఎంఏహెచ్‌బీ కలిగి ఉన్న 10 శాతం వాటాను సుమారు రూ. 492 కోట్లు (7.9 కోట్ల డాలర్లు) జీఎంఆర్ ఇన్ఫ్రా కొనుగోలు చేసింది. దీంతో డీఐఏఎల్‌లో జీఎంఆర్ వాటా 54 శాతం నుంచి 64 శాతానికి పెరిగింది. ప్రస్తుత చట్టాల ప్రకారం విదేశీ భాగస్వామ్య కంపెనీకి యాజమాన్య నిర్ణయాలు తీసుకునే అధికారం లేకపోవడంతో వైదొలుగుతున్నట్లు మలేషియన్ ఎయిర్‌పోర్ట్స్ ప్రకటించింది. సుమారు 22 మిలియన్ డాలర్ల లాభంతో ఎంఏహెచ్‌బీ వైదొలిగినట్లు అంచనా. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టులో ఎంఏహెచ్‌బీ 57.6 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. మలేషియా ఎయిర్‌పోర్ట్స్ వైదొలగాలని నిర్ణయించుకోవడంతో కీలకమైన ఎయిర్‌పోర్ట్‌లో వాటా పెంచుకున్నట్లు జీఎంఆర్ ఎయిర్పోర్ట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సిదార్థ కపూర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కానీ ఈ వాటా కొనుగోలుకు ఎయిర్పోర్ట్ అథార్టీ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి లభించాల్సి ఉంది.