జీఎంఆర్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ రేటింగ్లో కోత
దీనికిచ్చే రుణాలకు రిస్కుంది: మూడీస్
న్యూఢిల్లీ: రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్... మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ కన్సార్షియం సారథ్యంలోని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (డీఐఏఎల్) క్రెడిట్ రేటింగ్‌ను తగ్గిస్తూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నిధుల లభ్యత విషయంలో ఆందోళనకర పరిస్థితుల కారణంగా .. రేటింగ్‌ను ‘బీఏ2’ నుంచి ‘బీఏ1’కి తగ్గిస్తున్నట్లు పేర్కొంది. రుణాలకు సంబంధించి గణనీయమైన రిస్కు ఉన్నట్టుగా ‘బీఏ’ సూచిస్తుంది. ‘‘ఈ కంపెనీకి నిర్వహణకు అవసరమైన నిధులను సమకూర్చుకోగలిగే సామర్థ్యం తగ్గింది. ఈ సామర్థ్యానికి సంబంధించి ఆందోళనకరమైన పరిస్థితి కొనసాగుతోందనేది తాజా డౌన్‌గ్రేడ్ సూచిస్తుంది’’ అని మూడీస్ వైస్ ప్రెసిడెంట్ అభిషేక్ త్యాగి తెలిపారు.
ఎయిర్‌పోర్ట్స్ ఎకనమిక్ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్‌ఏ) ఇటీవల ఇచ్చిన టారిఫ్ ఆర్డరు కారణంగా 2018 ఆర్థిక సంవత్సరం నుంచి వార్షిక ఏరోనాటికల్ ఆదాయాలు సుమారు రూ. 2,000 కోట్ల మేర (దాదాపు 70 శాతం) తగ్గవచ్చని మూడీస్ పేర్కొంది. ఇది కంపెనీ ఆదాయాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని అభిప్రాయపడింది. ఇక రాబోయే 3-5 ఏళ్లలో ప్రతిపాదిత విస్తరణ ప్రణాళికలతో ఆర్థికపర మైన ఒత్తిడి మరింతగా పెరగవచ్చని తెలిపింది. ఇలా విస్తరణ ప్రణాళికలు, నియంత్రణ వ్యవస్థపరమైన అనిశ్చితి తదితర అంశాల మూలంగా సమీప భవిష్యత్‌లో రేటింగ్ పెరిగే అవకాశాలు లేవని పేర్కొంది.. ప్రస్తుతానికి తగిన ంత లిక్విడిటీ ఉన్నందున స్థిరమైన అవుట్‌లుక్‌ను కొనసాగిస్తున్నట్లు మూడీస్ వివరించింది. జీఎంఆర్ గ్రూప్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ (ఏఏఐ), జర్మనీకి చెందిన ఫ్రాపోర్ట్ కలిసి డీఐఏఎల్‌ను జాయింట్ వెంచర్‌గా ఏర్పాటు చేశాయి.