1988వ సంవత్సరం అక్టోబర్ 2 నుంచి 1990 ఆగస్టు వరకు ప్రతి ఆదివారం ఉదయం 9:00 గంటలు... ఇండియాలో టీవీ ఉన్న ప్రతి ఇంటికీ వచ్చి ‘మహాభారత్’గారియల్ ఇండియాని మహదానందానికి గురి చేసింది. ‘మహా ఇండియా’గా మార్చేసింది.
ప్రపంచ గ్రంథమైన మహాభారతాన్ని దత్తత తీసుకోవాలని కలగన్నాడు ఓ వ్యక్తి.‘లోకంలో లేనిది మహాభారతంలో లేదు, మహాభారతంలో లేనిది లోకంలో లేద’న్న వ్యాసుడి జ్ఞానాన్ని కూడా దత్తత తీసుకోవాలనుకున్నాడు. నిజంగా అది సాధ్యమేనా?!.. మహాభారతం, రామాయణం వంటి పురాణాల గురించి తెలియని ఆధునిక తరాలు ఈ దృశ్యీకరణను చూసి తప్పుగా అర్థం చేసుకోకూడదు. అంటే, మూలం చెడకూడదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాలి అనుకున్నాడు.
అతనే నిర్మాత బి.ఆర్.చోప్రా. ఎంత ఖర్చుకైనా వెనకాడేది లేదన్నాడు. సిద్ధం అన్నాడు దర్శకుడిగా రవిచోప్రా. కృష్ణార్జునుల్లా యుద్ధంలో అడుగుపెట్టి విజేతలై నిలిచారు ఈ తండ్రీ కొడుకులు. 1988 గాంధీ జయంతినాడు దూరదర్శన్‌లో 45 నిమిషాలపాటు ‘మ...హా...భా..ర...త్...’ సీరియల్ ప్రసారమయ్యింది. 94 ఎపిసోడ్లలో హస్తినాపురం బుల్లితెర మీదుగా నట్టింటికి దిగి వచ్చింది. కురుక్షేత్రాన్ని కళ్లముందు నిలిపింది. రామాయణం సీరియల్ తర్వాత ప్రజలందరినీ టీవీల ముందు కట్టిపడేసిన సీరియల్ మహాభారత్. ఈ సీరియల్‌ను చూసి కానీ ప్రజలు తమ పనులకు వెళ్లేవారు కాదు. ఈ సీరియల్‌ని ఆ తర్వాత కెనడా బిబిసిలో ప్రసారం చేస్తే యాభైలక్షల మంది వీక్షించారట.
కాలం చెప్పిన కథ
ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అస్త్రాలు ఆకాశంలో తారాజువ్వల్లా లేవడం, శత్రువుల గుండెలను చీల్చడం బుల్లితెర ప్రేక్షకులు విస్మయంగా వీక్షించారు. ఎవరికీ తెలియని కథను కళ్లకు కట్టడం వేరు...అందరికీ తెలిసిన కథను అందునా యుగయుగాలుగా ప్రజల నోళ్లలో నానుతున్న కథను దృశ్యీకరించడం అంటే, ఎలా చెప్పాలి? అందుకే కాలంతో దోస్తీ చేశాడు దర్శకుడు. కాలం సాక్షీభూతంగా కథను చెప్పడం మొదలుపెట్టింది. ‘నేను కాలాన్ని. అజరామరంగా వెలుగొందే భారత కథను మీకు చెబుతున్నాను. ఇది కేవలం భరతవంశానికి చెందిన కథ మాత్రమే కాదు. భారతీయ సంస్కృతికి చెందినది. సత్య–అసత్యాల మధ్య జరిగిన మహా యుద్ధ కథ ఇది. చీకటికి – వెలుగుకు మధ్య జరిగిన యుద్ధ కథ ఇది. ఇందులోని పాత్రలు, సందర్భాలు నేను దగ్గరగా చూశాను. నేను అనుభూతించాను. ఇప్పటికీ మంచి – చెడులతో పోరాడుతూనే ఉన్నాను.
నాకు ముగింపు అన్నది లేదు. గతంలో జరిగింది ఇప్పుడూ జరుగుతుంది. భవిష్యత్తులోనూ జరుగుతుంది. ఇది ఇతిహాస గ్రంథం మాత్రమే కాదు. ఇది అందరి కథ. అందరూ ఈ కథలో ఉన్నారు. ఈ కథలో ఉన్నవారందరూ ప్రపంచమంతటా ఉన్నారు. కృష్ణుడు అర్జునుడికి గీతా ఉపదేశం చేయడమో, దుర్యోధనుడు ద్రౌపదిని అవమానించడం మాత్రమే భారత కథ కాదు. ఇది మీ కథ. ఇది నా కథ..’ అంటూ కాలం భరత మహారాజును పరిచయం చేస్తుంది. మహారాజు భరతుడి హస్తినాపురం రాజదర్బారుతో ఈ కథ మొలుపెడుతుంది కాలం.హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు ఒకే దేశంగా పరిపాలించిన చంద్రవంశరాజు భరతడు తన తదనంతరం రాజును ప్రకటించాల్సి సమయం వచ్చింది.
తన తొమ్మిది మంది పుత్రులలో ఎవరిని యువరాజుగా ప్రకటించాలన్నదే భరతుడి సమస్య. ఒక రోజు దర్బారులో భరతుడు –‘రాజుకు ఉండాల్సిన లక్షణాలు నా తొమ్మిది మంది పుత్రుల్లో ఎవరికీ లేవు. అన్ని లక్షణాలూ గల భరద్వాజ ముని పుత్రుడు భుమన్యుడిని దత్తతు తీసుకుంటున్నాను. అతడే ఈ సామ్రాజ్యాధినేత’ అని ప్రకటిస్తాడు. ఇక్కడ తల్లి–కొడుకుల మధ్య సంవాదం మనల్ని ఆలోచింపచేస్తుంది. రాజు కావాలంటే వారసత్వంగా కాదు ప్రజలను రక్షించి, పరిపాలించేవాడు కావాలి అని తల్లికి చెప్పే భరతుడి మాటలు భవిష్యత్తుతరాలకు మార్గదర్శకం చేస్తున్నట్టుగా ఉంటాయి. ప్రతీపుడి కొడుకు శంతనుడు. అతనికి సురగంగ వల్ల దేవరాతుడు, సత్యవతి ద్వారా విచిత్రవీర్యుడు, చిత్రాంగదుడు అనే ఇద్దరు కొడుకులు జన్మిస్తారు.
కొడుకులిద్దరూ అర్ధంతరంగా చనిపోవడంతో కురువంశానికి వారసుడు లేకపోవడంతో తల్లి సత్యవతి అభ్యర్థనకు వ్యాసుడు తలవంచుతాడు. వ్యాసుని ద్వారా అంబిక, అంబాలికలకు దృతరాష్ట్రుడు, పాండురాజులు జన్మిస్తారు. పుట్టుకతో అంధుడైన దృతరాష్ట్రుడికి రాజ్యం కట్టబెట్టలేక అతని తమ్ముడు పాండురాజును రాజును చేస్తారు. అన్న దృతరాష్ట్రుడికి పుట్టిన వందమంది కొడుకులకు, పాండురాజుకు పుట్టిన ఐదుగురు కొడుకులకు మధ్య జరిగిన దాయాదుల పోరుకు కురుక్షేత్రం వేదిక అవుతుంది. ఇది న్యాయ–అన్యాయాలకు మధ్య జరిగిన పోరుగా కురుక్షేత్రం చూపుతుంది. యుద్ధం ముగిసి, ధర్మరాజు హస్తినాపుర రాజుగా పట్టాభిషిక్తుడవుతాడు.
అంపశయ్య మీద భీష్ముడు ప్రాణాలు వదలడంతో సీరియల్ ముగుస్తుంది.జీవితం ప్రశ్నార్థకంగా మారినప్పుడల్లా కాలం దానికి సమాధానం చెబుతూ వస్తోందని మహాభారతంలోని ప్రతి కథ మన కళ్లకు కడుతుంది. వర్తమానం భయపెట్టినప్పుడల్లా ధర్మంవైపుగా అడుగు వేయమని అభయమిస్తుంది. అన్ని సంఘటనలను మౌనసాక్షిగా వీక్షించిన కాలం చెప్పే మాటలకు మన మనసులో గూడు కట్టుకున్న ఒక్కోపొర తొలగిపోతున్నట్టుగా ఉంటుంది. ‘నేను ధర్మం అధర్మం మీద గెలిచే విధానాన్ని మీకు పరిచయం చేశాను. ధర్మం వైపుగా ఉండాలా, అధర్మం వైపుగా సాగాలా అనేది మీ మనసుల్లోనే ఉంది. ఇది కౌరవులకు – పాండవులకు జరిగిన యుద్ధం కాదు. మీ మనసుల్లో ధర్మం–అధర్మం ప్రస్తావన రేగినప్పుడల్లా కురుక్షేత్రం ప్రతిబింబమై మీకు సమాధానమిస్తుంది. మీ మనసే ఓ కురుక్షేత్రం. దాంట్లో ఏ వైపుగా మీరుంటే గెలుపు సుసాధ్యమో మీరే తెలుసుకోవాలి’ అని ధర్మబోధ చేస్తుంది కాలం.
బుల్లితెర వ్యాసుడు బి.ఆర్.చోప్రా
రామాయణం, మహాభారతం రెండు మహాగ్రంధాలు. రామానంద్ సాగర్, బిఆర్ చోప్రా ఇద్దరికిద్దరూ సమర్థులు. సాగర్ రామాయణం తర్వాత బరిలోకి దిగాలని మహాభారత్ మేకింగ్‌ను పోస్ట్‌పోన్ చేసుకున్నారట చోప్రా. ఆ సమయంలో చోప్రా, అతని కుమారుడు రవి కొన్ని టెలీఫిల్మ్స్ తీశారు. ఈ సమయంలో రహి మసూన్ రెజా, సతీష్ భట్నాగర్, నరేంద్ర శర్మలతో కలిసి స్క్రీన్ ప్లే, మాటలు సిద్ధం చేసుకున్నారట. దీనికి ఆరు నెలల సమయం పట్టింది. కొత్త ఆర్టిస్టుల కోసం వేలమందిని స్క్రీన్ టెస్ట్ చేశారు. అమితాబ్‌బచ్చన్‌ని మహాభారత్‌కు తీసుకోవాలనే ఆలోచన చేశారు. అయితే ఓ సినిమా సందర్భంలో అమితాబ్‌కి గాయాలు అవడంతో ఆ ప్రయత్నాన్ని మానుకున్నారట. రామాయణం బుల్లితెర మీద అప్పటికే సూపర్ సక్సెస్ అయ్యింది. అంటే, తమ ప్రయత్నం ఇంకా ఘనంగా ఉండాలి. పురాణేతిహాసాలు అన్ని కాలాలకు సంబంధించినవి. అందుకే కాలం వాయిస్‌తో ‘మై సమయ్ హూ’ అంటూ ఈ సీరియల్‌ని మొదలుపెట్టారు. రెండేళ్ల పాటు వచ్చిన ఈ సీరియల్ ద్వారా వందలాది నటులు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలన్నది చోప్రాల లక్ష్యం.
దాదాపు రూ.9 కోట్లతో తీసిన ఈ సీరియల్‌లోని కురుక్షేత్ర సన్నివేశానికి ముంబయ్ ఫిల్మ్ సిటీ వేదిక అయ్యింది. కొన్ని సన్నివేశాలను రాజస్థాన్‌లో తీశారు. ఈ సీరియల్ అంతా ఒక ఎత్తు అయితే ‘హరీష్ భిమాని’ వాయిస్ ఒక ఎత్తు. గంభీరంగా పలికే ఆ స్వరం టీవీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి కూచోబెట్టింది. రామాయాణం పౌరాణిక గాథగా తీస్తే, మహాభారత్ పూర్తిగా డ్రమాటిక్ మోడల్‌కే వాల్యూ ఇచ్చారు. బి.ఆర్.చోప్రా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘మహాభారత్ గ్రంథంలోని ప్రతి నీడనూ అన్వేషించాం. అందుకే ప్రేక్షకులు అంతగా ఆదరించారు. కొన్ని వివరణలను వదిలివేసింది అనే విమర్శకులూ ఉన్నారు. కానీ ప్రేక్షకుల నాడియే అసలు సిసలు విజయం’ అన్నారు. ‘అథ శ్రీ మహాభారత కథ’ అంటూ చిన్నితెర మీద అతి పెద్ద ప్రయత్నం చేసి గెలిచిన చోప్రాకి దూరదర్శన్, తిలకించిన అశేష ప్రేక్షకజనం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే.
►ఉర్దూ రచయిత, కవి రహి మసూమ్ రజా వ్యాస మహాభారతం నుంచి ఈ సీరియల్ మూల కథను రాసుకున్నారు.
►‘మ..హా..భా..ర..త్’ టైటిల్ సాంగ్‌ను కంపోజ్ చేసింది ప్రసిద్ధ సంగీత దర్శకుడు రాజ్‌కమల్. దీనిని గాయకుడు మహేంద్ర కపూర్ పాడగా, హరీష్ భిమాని తన గొంతును (కాలం) జత కలిపాడు. ఇందులోని శ్లోకాలు భగవద్గీత నుంచి తీసుకున్నారు.
►బాలీవుడ్ నటుడు రాజ్‌బబ్బర్ అప్పటికే అగ్రనటుల జాబితాలో ఉన్నారు. చోప్రా తీసే సినిమాల్లో రాజ్‌బబ్బర్ నటించాలనేది వారికి ఒక సెంటిమెంట్‌గా వస్తుండేది. మహాభారత్ టీవీ సీరియల్‌లోనూ భరతుడుగా రాజ్‌బబ్బర్‌ను చూస్తాం. 1988లో మహాభారత్ వస్తే, 1989లో ఉత్తరాఖండ్ నుంచి రాజ్యసభకు ఎం.పీగా ఎన్నికయ్యారు రాజ్‌బబ్బర్.
►భీష్మ పాత్రధారి ముఖేష్‌ఖన్నా మహాభారత్ తర్వాత సినిమా నటుడిగా నిలదొక్కుకున్నారు. చంద్రకాంత, శక్తిమాన్ వంటి సీరియల్స్‌తోనూ ప్రసిద్ధి పొందారు.
►ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడే బుల్లితెర మీద కనిపిస్తున్నాడా అనిపించే నటుడు, దర్శకుడు నితిష్ భరద్వాజ్ నటన ఈ సీరియల్‌కి ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు.
►కర్ణపాత్రధారి పంకజ్‌ధీర్‌కి ఈ సీరియల్‌తో స్టార్‌డమ్ వచ్చేసింది. సనమ్ బేవఫా, బాద్‌షా వంటి సినిమాలతో పాటు చంద్రకాంత, కింగ్ జునాడ్‌గడ్, హరిశ్ఛంద్ర వంటి సీరియల్‌లోనూ ఆ తర్వాత షారూఖ్‌ఖాన్ చెన్నై ఎక్స్‌ప్రెస్‌లోనూ పంకజ్‌ధీర్ నటించారు.
►అర్జున్‌గా నటుడు ఫిరోజ్‌ఖాన్, ద్రౌపదిగా రూపా గంగోలితో పాటు ఈ సీరియల్‌లోని ప్రధాన పాత్రధారులంతా ప్రముఖులయ్యారు. ద్రౌపది పాత్రకు ముందు జుహీచావ్లాను అనుకున్నారట. చివరగా రూపాగంగూలీని ద్రౌపది పాత్రకు ఎంపిక చేశారు. అభిమన్యుడిగా నటుడు చంకీపాండే సంతకాలు చేసినా, అతనికున్న సినిమా షెడ్యూల్ కుదరకపోవడంతో మాస్టర్ మయూర్‌ని అభిమన్యుడి పాత్రకు తీసుకున్నారు.
►1988 లో వచ్చిన చోప్రా మహాభారత్ తర్వాత 2013 లో స్వస్తిక్ ప్రొడక్షన్స్ అనే సంస్థ దాదాపు రూ. 120 కోట్ల వ్యయంతో మహాభారత్ సీరియల్‌ని నిర్మించింది. ఈ సీరియల్ మొత్తం 128 ఎపిసోడ్లుగా వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment