TV serials
-
టీవీ సీరియల్స్‌కు బ్రేక్.. షూటింగ్‌లు రద్దు
ముంబై : దేశ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసులు అధికమవుతుండటంతో మహమ్మారి కట్టడికి ప్రభుత్వం ఇప్పటికే మినీ లాక్ డౌన్ (పాక్షిక లాక్ డౌన్)ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉదయం సెక్షన్ 144, నైట్ కర్ఫ్యూతోపాటు వీకెండ్లో అంటే వచ్చే శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి సోమవారం ఉదయం ఏడు వరకు (శని, ఆది) సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధించింది.తాజాగా కరోనాను అదుపుచేసే చర్యల్లో భాగంగా రాష్ష్ర్ట ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముంబైలో టీవీ సీరియళ్ల షూటింగ్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే మినీ లాక్డౌన్లో భాగంగా ఇప్పటికే హోటళ్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, ధార్మిక, దర్శనీయ స్థలాలు, మైదానాలు, జిమ్‌లు, సెలూన్లు మూసి వేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,45,384 కొత్త కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే కరోనాతో 794 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1, 32,05,926కు చేరుకుంది. కాగా మొత్తం మరణాల సంఖ్య 1,68,436కి చేరుకుంది.నిన్న కరోనా నుంచి కోలుకుని 77,567 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 19,90,859 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ సంఖ్య 10,46,631కి చేరుకుంది. చదవండి: మహారాష్ట్రలో మినీ లాక్డౌన్ సంపూర్ణ లాక్డౌన్: 9 నుంచి 19 వరకు మొత్తం బంద్ -
ఓల్డ్ ఈజ్ గోల్డ్: ఈ నటీమణుల డైట్ ఏంటో తెలుసా?
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఆ తరం.. దీనికి నిదర్శనం వారి ఆరోగ్యకర జీవన విధానం.. ప్రస్తుతం మనిషి జీవిత కాలం క్షీణిస్తూ, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న తరుణంలో పాతకాలపు ఆహార పద్ధతులను అన్వేస్తున్నారు. నేడు ‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఆ తరం నటీమణుల ఆహార అలవాట్లు, వారి జీవన విధానాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం.. – సాక్షి, సిటీబ్యూరో గంజినే సూప్‌గా తాగేవాళ్లం.. 66 ఏళ్ల వయస్సులో కూడా ఆరోగ్యంతో ఉన్నానంటే చిన్నప్పుడు నేను పెరిగిన విధానం మాత్రమే. ఇంట్లో అమ్మ చేసిన ఆహారం తప్ప బయటి చిరుతిల్లు ఉండేవి కావు. మా తరంలో పుట్టుసారం బాగుండేది. మా అమ్మ 8 నెలల గర్భిణిగా ఉండే వరకు మొదటి పాపకు పాలను ఇచ్చేది. అప్పుడు బియ్యం, జొన్నల నుంచి తీసిని గంజిని సూప్‌గా ఇచ్చేవారు. చెట్టుపైనే మగ్గిన పండ్లను తినేవాళ్లం. నేను తులసి, కరివేపాకు, వాము, సొంటి, మిరియాలు, ధనియాలు, జిలకర్ర మిశ్రమాల పొడితో కాచిన డికాషన్ మాత్రమే తాగుతాను. – క్రిష్ణవేణి, హిట్లర్ గారి పెళ్లాం సీరియల్ బతకడానికి తినాలి.. నేను ఆరి్టస్ట్ని.. ఎప్పుడూ ఆక్టివ్‌గా ఉండాలి. దీనికి నా బాల్యంలోని ఆహార పద్ధతులే సహకరించాయి. ఇప్పటికీ నాకు బీపీ, షుగర్లాంటి సమస్యలు లేవు. పస్తుతం నీళ్లు, పాలు, నూనె, కూరగాయలు, బియ్యం ఏది చూసినా కల్తే.. ప్రస్తుతం పలువురు ఆరోగ్య నిపుణులు అధికంగా అన్నం తినకూడదని చెబుతుంటారు. మేమైతే అన్నీ తినేవాళ్లం. దానికి తగ్గ శారీరక శ్రమ చేసేవాళ్లం. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. అన్నం తగ్గించి చిరుధాన్యాలను అధికంగా తీసుకోవాలి. బతకడానికి తినాలి.. తినడానికి బతకకూడదు. – శివపార్వతి. ఇంటి గుట్టు సీరియల్ సౌత్ ఇండియన్ ఫుడ్.. నా ఫిట్నెస్కి ముఖ్య కారణం వర్క్‌హాలిక్‌గా, నాన్ఆల్కాహాలిక్గా ఉండటం. ముఖ్యంగా నాకు ఇష్టమైన దక్షినాదిలోని ఆహారపు అలవాట్లు మంచి ఆరోగ్యాన్నిచ్చాయి. సౌత్ ఇండియన్ ఫుడ్ అయిన ఇడ్లి ఇంటర్నేషనల్ లైట్ బ్రేక్‌ఫాస్ట్ మారింది. మొదటి నుంచి శాఖాహారిని కావడం వలన మానసికంగా శారీరకంగా ఫిట్‌గా ఉన్నాను. స్వచ్ఛమైన నెయ్యిని ఫుడ్‌లో వాడుతుంటాను. ఇది ఆరోగ్యాన్నే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నాలోని డాన్స్ స్కిల్స్ నేను ఫిట్‌గా, గ్లామర్‌గా ఉండటానికి మరో కారణం. – సుధా చంద్రన్, నెంబర్ వన్ కోడలు సీరియల్ మానసిక ఆరోగ్యం అవసరమే.. శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యం ముఖ్యం. ఇప్పటికీ ఆరోగ్యంగా ఉంటూ అన్ని పనులను ఉత్సాహంగా చేస్తున్నానంటే అనవసర విషయాలను పట్టించుకోకపోవడమే. ఈ మానసిక ధృడత్వానికి కారణం నా ఆహార అలవాట్లే. విటమిన్లు, ప్రొటీన్స్ అధికంగా అందించే బొప్పాయి వంటి పండ్లను అధికంగా తింటాను. ఎలాంటి డైట్‌ను పాటించను. జంక్ ఫుడ్‌కి దూరంగా ఉంటూ అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలకు ప్రాధాన్యం ఇస్తాను. ఫ్రూట్, వెజిటేబుల్ జ్యూస్‌లు తాగుతూ వ్యాయామం చేస్తాను. – లక్ష్మీ ప్రియ, నాగభైరవి సీరియల్ -
పక్కనోళ్లు మామూలుగా దగ్గినా..
దాదాపు 70 రోజుల లాక్డౌన్ అనంతరం సీరియళ్ల షూటింగ్‌కు ప్రభుత్వం అనుమతివ్వడంతో నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే పరిమిత సంఖ్యలో ఆర్టిస్టులతో షూటింగ్ ప్రారంభమైన కొన్ని రోజులకే నటులకు కరోనా పాజిటివ్ తేలడంతో వెంటనే షూటింగ్స్ నిలిపివేశారు. మళ్లీ షూటింగ్స్ ప్రారంభమై నిర్విరామంగా కొనసాగుతుండగా నిర్మాతలు, ఆర్టిస్టులు, సిబ్బందికి ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. షూటింగ్ ప్రాంతాన్ని అన్ని రకాలుగా శానిటైజేషన్ చేయడంతో పాటు నటీనటులతో పాటు ఇతర టెక్నిషియన్స్ పీపీఈ కిట్లతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లక్డీకాపూల్: కోవిడ్19 మహమ్మారి ప్రభావం బుల్లితెర సీరియళ్లపై పడిందనే చెప్పవచ్చు. షూటింగ్ చిత్రీకరణలో ఆహారపు అలవాట్లు, నిర్వహణలో కూడా పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో క్యాటరింగ్ ఫుడ్‌పై ఆధారపడిన ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులకు ఇప్పుడు పోషకాహారం, ప్రూట్స్, కషాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఇది ఒక ఎత్తు అయితే కరోనా కష్టకాలంలో టీవీ సీరియల్స్ రంగానికి 30 శాతం మేరకు కార్మిక కొరత కూడా ఏర్పడింది. మరో పక్క సీరియళ్ల నిర్మాణంలో బడ్జెట్ అంచనాలు 30 శాతం మేరకు పెరిగాయి. కాల్షీట్ టైమ్‌లో కూడా గంట, గంటన్నర కోత పడుతుంది. పైగా రోజుకి రూ. 15 నుంచి రూ. 20 వేల వరకు అదనపు ఖర్చు అవుతోంది. దీంతో ఒక్కొక్క ఎపిసోడ్‌కి టీవీ చానల్స్ ఇచ్చే దానికంటే అదనపు భారంపడుతున్నట్టు సమాచారం. ఈ కరోనా వైరస్ ఒక విధంగా నిర్మాతలకు ఆర్థిక భారంగా తయారైంది. షూటింగ్ లోకేషన్ మొత్తం రెండు సార్లు శానిటైజేషన్, సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్క్‌లు, గ్లౌజ్‌ల సరఫరా అనివార్యమైంది. పైగా యూనిట్ సిబ్బందికి జీవిత బీమా సౌకర్యాన్ని సైతం కల్పిస్తున్నారు. ఇందుకు ఒక్కొక్క యూనిట్‌పైన సుమారు లక్ష రూపాయిలు అవుతున్నట్టు తెలుస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. బిక్కు బిక్కుమంటూ ఏపిసోడ్స్ చిత్రీకరణ కొనసాగుతుంది. అయినప్పటికీ పోటీ రంగంలో తట్టుకుని నిలబడేందుకు పలువురు ప్రొడ్యూసర్లు సతమతమవుతున్నారు. ఫ్రీగా పని చేసే పరిస్థితి లేదు.. షూటింగ్లో ఫ్రీగా పని చేసే పరిస్థితి లేదు. భయం భయంగానే షూటింగ్‌లు చేస్తున్నాం. పక్కనోళ్లు మామూలుగా దగ్గినా.. ఆందోళనపడాల్సి వస్తుంది. దాంతో షూటింగ్ లొకేషన్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం కార్తీక దీపం సీరియల్లో హీరో క్యారెక్టర్ చేస్తున్న తనకు ఆ క్యారెక్టర్ పేరు డాక్టర్ బాబు స్థిరపడేలా ఉంది. మా సీరియల్స్ పట్ల ప్రేక్షకులు అంతా ఇన్వాల్ అవుతున్నారు. ఏదిఏమైనా కరోనా వల్ల షూటింగ్ స్పాట్లో ప్రొటీన్, హెల్దీ ఫుడ్‌తో పాటు ప్రూట్స్ అందుబాటులో ఉంటున్నాయి. దాంతో పాటు కషాయం కూడా దొరుకుతుంది. కరోనాకు ముందు ఇలాంటి సదుపాయం లేదు. వాస్తవానికి నేనైతే అప్పుడు..ఇప్పుడు ఇంటి నుంచే ఫుడ్ తెచ్చుకుంటున్నాను. కరోనా తర్వాత ఇప్పుడు చాలా మంది కూడా అదే పాటిస్తున్నారు. ఆరోగ్యపరంగా కరోనా వల్ల మేలు జరిగిందనే చెప్పాలి. – నిరుపం పరిటాల, బుల్లి తెర హీరో అన్నం పెట్టగలుగుతున్నాం.. కరోనా కష్టకాలంలో తెలుగు టీవీ సీరియళ్ల నిర్మాణం చాలా ఒడిదుడుగులను ఎదుర్కొంటోంది. అయితే హోటళ్లు, మాల్స్, థియేటర్ల వాళ్ల కన్నా మా పరిస్థితి చాలా బెటర్. లాక్ డౌన్ విరామం అనంతరం సీరియళ్ల నిర్మాణానికి అవకాశం కల్పించినందుకు చాలా హ్యాపీగా ఉంది. కొంత మందికైనా అన్నం పెట్టగలుగుతున్నాం. లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక ఈ రంగంపై ఆధారపడిన వాళ్లు అన్నానికి ఇబ్బంది పడ్డారని చెప్పడానికి చాలా బాధగా ఉంది. అలాంటి మళ్లీ సీరియల్స్ నిర్మించేందుకు అవకాశమిచ్చారు. – గుత్తా. వెంకటేశ్వరరావు, కార్తీక దీపం సీరియల్ నిర్మాత చాలా టఫ్ జాబ్.. కరోనా నేపథ్యంలో షూటింగ్‌లు చేయడమంటే కష్టంతో కూడుతున్న అంశం. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా టఫ్ జాబ్. అయినప్పటికీ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే షూటింగ్‌లు చేసుకునేందుకు మార్గదర్శకాలు చేశాం. ఆ దిశగా ఎక్కడ రాజీపడకుండా నిర్మాతలు టీవీ సీరియళ్లను తీసున్నారు. అయినా అవుట్‌ఫుట్ దెబ్బతింటోంది. ప్రొడ్యూసర్ అప్పుడే కోల్కోలేదు. దాదాపుగా 30 శాతం లోటు బడ్జెట్‌తో సాగుతుంది. – ఎన్.అశోక్, అధ్యక్షుడు, తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ -
పరిస్థితి మెరుగయ్యేదాకా షూటింగ్‌లు ఆపాలి!
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి అటు బాలీవుడ్ ప్రముఖులను, ఇటు బుల్లి తెర నటులను బెంబేలెత్తిస్తోంది. వరుసగా నటులు కరోనా బారినపడుతూ ఉండటంతో లాక్డౌన్ సడలింపుల తరువాత మొదలైన షూటింగ్‌ల సందడి నీరుగారిపోయింది. దీనికి తోడు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కుటుంబానికి వైరస్ సోకడం మరింత ఆందోళన కలిగిస్తోంది. షూటింగ్ సమయంలోనే అమితాబ్‌కు వైరస్ అంటుకుందన్నఅంచనాలు ఈ భయాలకు మరింత తోడయ్యాయి. దక్షిణాది టీవీ నటుడు, ఏక్తా కపూర్ నిర్మిస్తున్న ‘కసౌతి జిందగీ కే-2’ నటుడు పార్థ్ సమతాన్‌కు కోవిడ్-19 పాజిటివ్ రావడంతో నటి బిపాసా బసు సోషల్ మీడియాలో స్పందించారు. కరోనా వైరస్ బారిన పడే అవకాశాలు నటీనటులకే ఎక్కువ ఉన్నాయంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు కొంత కాలంపాటు షూటింగ్‌లకు దూరంగా ఉంటే మంచిదని ఆమె సూచించారు. యూనిట్ సభ్యులు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ (పీపీఈ) కిట్లు, ఫేస్ షీల్డ్స్ లాంటి సేఫ్టీ మెజర్స్తో పనిచేయవచ్చు..కానీ నటులకు అలాంటి పరిస్థితి లేదు. మాస్క్‌లు తదితర రక్షణ కవచాలు లేకుండానే నటించాల్సి ఉంటుందని బిపాసా బసు గుర్తు చేశారు. నటీనటులు కరోనా బారిన పడుతుండటానికి ఇదే కారణమన్నారు. అందుకే పరిస్థితులు మెరుగయ్యేంతవరకు అన్ని రకాల షూటింగులను ఆపేయాలని కోరారు. (నటుడికి కరోనా.. సహా నటులకు కోవిడ్ పరీక్షలు) మరోవైపు బిపాసా బసు భర్త, నటుడు కరణ్ సింగ్ గ్రోవర్, కసౌతి జిందగీ కే 2 లో మిస్టర్ బజాజ్ పాత్రను పోషించారు. అయితే కరోనా కారణంగా కరణ్ సింగ్ ఈ ప్రాజెక్టునుంచి తప్పుకోవడంతో నటుడు కరణ్ పటేల్ ఈ పాత్రలో నటిస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఎపిసోడ్ల షూటింగ్ పూర్తయింది. ఈ వారంలో ఇవి టెలికాస్ట్ కావాల్సి ఉంది. అయితే పార్థ్ సమతాన్ కు కరోనా సోకడంతో ‘కసౌతి జిందగీ కే’ సెట్లో ప్రకంపనలు రేపింది. దీనిపై నిర్మాత ఏక్తా కపూర్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు.(బాలీవుడ్లో మరో విషాదం) కాగా కరోనా కట్టడికోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్లో క్రమంగా సడలింపుల నేపథ్యంలో టెలివిజన్ షోలు, సినిమాలు, ఇతర ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్టుల చిత్రీకరణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇటు తెలుగు టీవీ నటులు కూడా కరోనా బారిన పడటం కలవరం రేపిన సంగతి తెలిసిందే. View this post on Instagram All necessary precautions are being taken, SOPs being followed. For us at Balaji, Health & Safety comes first, above all else! Take care. Jai Mata Di.🙏🏻 #Repost @balajitelefilmslimited with @make_repost A post shared by Erk❤️rek (@ektarkapoor) on Jul 12, 2020 at 4:50am PDT -
కొత్తగా.. వింతగా ఉంది
సుదీర్ఘ విరామం తర్వాత ఆదివారం నగరంలో టీవీసీరియళ్ల షూటింగ్‌లు ప్రారంభమయ్యాయి. మాస్కులు, భౌతిక దూరం, శానిటైజేషన్ వంటి కరోనా నిబంధనల మధ్య..మళ్లీ తారల తళుకులు, కెమెరాల ఫ్లాష్‌లు, టెక్నీషియన్ల హడావుడితో సెట్లో సందడి కన్పించింది. జూబ్లీహిల్స్: దాదాపు మూడునెలల విరామం తర్వాత తారలు తళుక్కుమంటున్నారు. కెమెరా ఫ్లాష్‌లు, లైట్‌బాయ్‌లు, క్లాప్‌లు, మేకప్ మ్యాన్లు, టెక్నీషియన్ల హడావుడి మధ్య కోట్లాదిమంది నిత్యం చూసే టీవీ సీరియళ్ల షూటింగ్ సందడి ఆదివారం నగరంలో ప్రారంభమైంది. కరోనా నిబంధనలు, ఆంక్షల మధ్య శానిటైజేషన్, మాస్కులు, భౌతికదూరంతో పనిచేయడం తదితర పక్కా రక్షణ ఏర్పాట్లతో షూటింగ్ ప్రారంభించినట్లు దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఈ మేరకు ఫిలింనగర్లో నిర్వహిస్తున్న రక్తసంబంధం టీవీ సీరియల్ బృందాన్ని ‘సాక్షి’ పలకరించగా వారు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కొత్తగా.. వింతగా ఉంది మూడునెలల తర్వాత షూటింగ్‌లు ప్రారంభం కావడంతో అంతా కొత్తగా.. వింతగా ఉంది. షూటింగ్ ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. అదే సమయంలో భయంగా కూడా ఉంది. ఏదిఏమైనా జీవితం ముందుకు సాగాలి. ప్రతిఒక్కరూ పనిచేయక తప్పదు. పూర్తిస్థాయి జాగ్రత్తలతో షూటింగ్లో పాల్గొంటున్నాం. – జాకీ, నటుడు అన్ని జాగ్రత్తలతో.. మూడు నెలలుగా ఇంట్లోనే ఉండి లాక్డౌన్ సమయంలో కుటుంబంతో ఎక్కువ కాలం గడిపే అవకాశం దొరికింది. ఇష్టమైన వంటలు చేసుకుంటూ బంధుమిత్రులతో వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ హాయిగానే గడిపాం. ఇక జీవనోపాధి తప్పనిసరి. అన్ని జాగ్రత్తలతో షూటింగ్లో పాల్గొంటున్నాం. – జ్యోతిరెడ్డి, సీరియల్ నటి నిబంధనల మేరకు షూటింగ్ ప్రభుత్వ నిబంధనల మేరకు షూటింగ్ చేస్తున్నాం. షూటింగ్ ప్రదేశాన్ని పూర్తిగా శానిటైజ్ చేస్తున్నాం. నటులు, సిబ్బందికి థర్మల్ స్క్రీనింగ్ చేసి అనుమతిస్తున్నాం. మాస్క్‌లు తప్పనిసరి చేశాం. ఆహారం కూడా జాగ్రత్తగా సిద్ధం చేస్తున్నాం. పీపీఈ కిట్లు ధరించిన మేకప్ సిబ్బంది నటీనటులకు మేకప్ చేస్తున్నారు.– సర్వేశ్వర్‌రెడ్డి, సీరియల్ నిర్మాత -
టీవీ షూటింగ్‌లకు ఓకే
కర్ణాటక, యశవంతపుర: తక్కువమంది కళాకారులు, సాంకేతిక నిపుణులతో టీవీ సీరియల్స్ చిత్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. టీవీ అసోసియేషన్‌తో సీఎం సమీక్షించారు. కరోనా నివారణ మార్గదర్శకాలను పాటిస్తూ చిత్రీరకణ చేసుకోవటానికీ అంగీకరించారు. సీరియల్స్ షూటింగ్లో 12 మంది మాత్రమే ఉండాలి. బహిరంగ ప్రదేశాలలో షూటింగ్‌లకు అనుమతి లేదు. -
ఎక్తా కపూర్‌పై విరుచుకుపడ్డ ‘శక్తిమాన్’ హీరో
నిర్మాత ఎక్తా కపూర్ మహభారతాన్ని చంపేసిందంటూ నటుడు ముఖేష్ ఖన్నా ఆమెపై విరుచుకుపడ్డారు. 2008లో వచ్చిన ‘కహానీ హమారా మహాభారతం’ సీరియల్‌ను ఎక్తా నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక లాక్డౌన్ నేపథ్యంలో ఈ సీరియల్ పునః ప్రసారం అవుతుంది. కాగా ముఖేష్ ఖన్నా హీరోగా నటించిన ‘శక్తిమాన్’ను కూడా పునః ప్రసారం చేయనున్నట్లు చెప్పారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుత జనరేషన్‌ను దృష్టిలో పెట్టుకుని ‘శక్తిమాన్’ న్యూ వర్షన్‌ను మళ్లీ ప్రసారం చేయనున్నాం. అయితే ఇది ఎక్తా ‘మహాభారతం’ తరహాలో ఉండదు. ఈ సీరియల్లో ద్రౌపతి పాత్రకు భుజంపై టాటూ ఉంటుంది. అయితే ఎక్తా మహాభారతాన్ని ఆధునికంగా తీస్తున్నట్లు సీరియల్ మొదట్లోనే చెప్పారు. సంస్కృతి అనేది ఎప్పుటికీ ఆధునికమైనది కాదు.. కాలేదు కూడా. ఒకవేళ ఆధునికం చేయాలని ప్రయత్నించిన రోజే.. సంస్కృతి అంతమైపోతుంది’ అని మండిపడ్డారు. ఒకవేళ ఈ సీరియల్ పేరు ‘క్యుంకీ గ్రీక్ భీ కబీ హిందూస్థానీ’ అయుంటే తాను ఎక్తా ‘మహాభారతాన్ని’ సమర్థించేవాడినని అన్నారు. ఒక ఇతిహాసాన్ని మార్చే హక్కు వారికి ఎవరూ ఇచ్చారని విమర్శించారు. మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడి కంటే ఎక్తా తెలివిగా ఉండాలని ప్రయత్నించారని ఎద్దేవా చేశారు. రామయణం, మహాభారతాలు పురాణాలు మాత్రమే కాదని, అవి మన భారతదేశ చరిత్రలుగా ఎత్తిచూపాలనుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. (మహాభారతం తిరిగి వచ్చేసింది) -
దారి మళ్లించాడు
టీవీ సీరియళ్లు ఆసక్తిగా చూస్తాం. ఆ సీరియళ్లలో నటించే హీరోయిన్లన్నా కూడా ఆసక్తే కానీ, వాళ్ల గురించి మనకు పెద్దగా తెలిసే అవకాశం లేదు. ఎప్పుడైనా వాళ్లంతట వాళ్లు చెప్పుకుంటే తప్ప! హిందీ సీరియళ్లు ఇష్టపడేవారు చాహత్ ఖన్నాను కూడా ఇష్టపడే ఉంటారు. 2011 నుంచి 2014 వరకు సోనీ ఎంటర్టైన్మెంట్లో ప్రసారం అయిన ‘బడే అచ్చే లగ్తే హై’ తో ఆమె బాగా పాపులర్ అయ్యారు. అలాగే జీటీవీలో నాలుగేళ్ల క్రితం వచ్చిన ‘ఖుబూల్ హై’ అమెను గుర్తుంచుకునేలా చేస్తుంది. చాహత్ ఇప్పటికీ కొన్ని టీవీ సీరియళ్లలో నటిస్తున్నారు. కొన్ని సినిమాల్లో కూడా కనిపించారు. ఈమధ్య .. ఓ నాలుగు రోజుల క్రితం.. ఏమైందంటే ఏదో ఈవెంట్ ఉంటే ముంబై నుంచి ఢిల్లీ వెళ్లారు చాహత్. తిరుగు ప్రయాణంలో ముంబై ఫ్లయిట్ ఎక్కడానికి తెల్లవారుజామునే క్యాబ్ బుక్ చేసుకుని ఎక్కారు. విమానాశ్రయంలో చాహత్ (ఫైల్ ఫొటో) ఆ చీకట్లో కొంచెం దూరం వెళ్లాక క్యాబ్ డ్రైవర్ ఆమెను అసభ్యకరమైన మాటలతో వేధించడం మొదలు పెట్టాడు. వేధింపులే కాదు.. క్యాబ్‌ని దారి కూడా మళ్లించే ప్రయత్నం చేశాడు. చాహత్కి అనుమానం వచ్చి వెంటనే ఫోన్ యాప్‌లోంచి పోలీసులకు సమాచారం ఇవ్వబోతుంటే దారికొచ్చాడు. ఆ గండం గట్టెక్కిందీ అనుకుంటే.. ఫ్లయిట్ ఎక్కాక.. రన్ వే మీద విమానం ఎందుకో సడెన్ బ్రేక్‌లతో ఆగి కదలినట్లనిపించింది. ఆ కుదుపునకు కడుపులో తిప్పి, వాంతి కాబోయి, గుండె ఆగిపోయినంత పనైందట చాహత్కు. ఈ వివరాలు ఒక తాజా ఇంటర్వ్యూలో చెబితే బయటికి ప్రపంచానికి తెలిశాయి. ‘‘ఒక్కోసారి ఇంతే. అన్నీ ఒకేసారి వచ్చిపడతాయి’’ అని నవ్వుతూ అంటున్నారు చాహత్. -
ప్రాణం తీసిన టీవీ సీరియల్
చెన్నై,తిరువొత్తియూరు: ఇంటికి నిప్పు అంటుకున్నా టీవీ సీరియల్లో లీనమైన ఓ వివాహిత మంటల్లో చిక్కుకుని మృతి చెందిన ఘటన మదురైలో చోటుచేసుకుంది. కామరాజపురం భగత్‌సింగ్ వీధికి చెందిన రమేష్ భార్య మహాలక్ష్మి (41). కుటుంబ సమస్యల కారణంగా ఇద్దరు పిల్లలతో భర్త వేరుగా ఉంటున్నాడు. బంధువు ఇంటిలోని మిద్దెపై మహాలక్ష్మి అద్దె ఇంటిలో ఉంటోంది. మంగళవారం సాయంత్రం ఇంటిలో దీపం వెలిగించిన తరువాత టీవీ సీరియల్ చూడడానికి కింద ఇంటికి దిగి వచ్చింది. దీపం ఒరిగి ఇంటికి మంటలు అంటుకుంది. ఇది చూసిన ఇరుగుపొరుగు వారు మహాలక్ష్మికి తెలిపారు. దీంతో ఆమె దిగ్భ్రాంతి చెంది పైకి వెళ్లి మంటలు ఆర్పడానికి ప్రయత్నించడంతో మంటల్లో చిక్కుకుని మృతి చెందింది. -
శ్వేతా తివారీ
‘పనిలో అంకిత భావం ఉండాలి’ అనే మాట అర్థం కాని వారెవరైనా శ్వేతా తివారీ ఏం చెబుతున్నారో వింటే చక్కగా పనిలో పడిపోతారు. శ్వేత టీవీ నటి. గుర్తుకు రావడం లేదా? స్టార్ ప్లస్ వారి ‘కసౌటీ జిందగీ కే’ (జీవితం పెట్టే పరీక్షలు) హీరోయిన్. ఇంకా గుర్తుకు రావడం లేదా? హిందీ బిగ్ బాగ్ షోలో నాలుగో సీజన్ విజేత ఈవిడే! ఇప్పుడు కూడా మీకు గుర్తుకురాకపోతే.. ఈ ఫోటో చూసినా ఆమె గుర్తుకు రారు. ఎందుకంటే.. అప్పటికీ ఇప్పటికీ శ్వేత బాగా స్లిమ్ అయ్యారు. పోనీ ‘బెగుసరాయ్’ డైలీ టీవీ సీరియల్ జ్ఞాపకం ఉందా? 2015–2016 మధ్య జీటీవీ (అండ్ టీవీ) వచ్చింది. అందులో శ్వేత వేశ్య పాత్రధారి. ‘ఎలా ఒప్పుకుంటారు?’ అలా చేయడానికి అని ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆ పాత ప్రశ్ననే ఓ వెబ్ షోలో శ్వేతను కొత్తగా అడిగారు షోకి వచ్చినవారు. ఆ సందర్భంలోనే ‘పనిలో అంకిత భావం’ గురించి మాట్లాడారు శ్వేత. ‘‘పని నాకు దైవంతో సమానం. ఆ రోజు నేను ఉపవాసం ఉన్నా కూడా.. క్యారెక్టర్ కోసం అవసరమైతే మాంసాహారం కూడా తింటాను’’ అని చెప్పారు. టీవీ నుంచి వచ్చిన శ్వేత ఇంకో మాట కూడా చెప్పారు.. ఎప్పటికీ టీవీని విడిచిపెట్టి పోనని! ఇది కూడా అంకిత భావమే కానీ, వృత్తి నిబద్ధత అంటే ఇంకా బాగుంటుంది. -
ఫ్రెండ్స్‌కి ఈ విషయం చెబితే ‘మరీ, విలనా!’ అన్నారు.
‘ఇప్పుడు నటన అంటే ప్రత్యేకించితరగతులు అక్కర్లేదు. ఏ క్యారెక్టర్ అయినా అవలీలగా పరకాయప్రవేశం చేయడమే. స్క్రీన్‌కి నప్పేలా ఉన్నామా..! పాత్రకు తగ్గట్టు మనల్ని మనం మార్చుకోగలుగుతున్నామా!’ అని చూసుకుంటే చాలు అంటోంది ఆద్య. బుల్లితెరపై ఉన్న ఇష్టం బి.టెక్ నుంచి సీరియల్ వైపుగా అడుగులు వేయించిందని చెబుతోంది.‘ఈ ఫీల్డ్కి హీరోయిన్గా పరిచయం అవుదామనే వచ్చాను. ఎక్కడ ఏ సీరియల్ ఆడిషన్స్ జరిగినా అక్కడ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి వెళ్లాను. మొదట సెలక్ట్ కాలేదు. కానీ, నిరుత్సాహపడలేదు. బి.టెక్ చేస్తున్నప్పటి నుంచే ట్రయల్స్ వేస్తూనే ఉన్నాను. ఈ విషయం ఇంట్లో చెబితే మొదట వద్దన్నారు. ‘చక్కగా చదువుకుంటున్నావ్. ఏదైనా జాబ్ చూసుకొని సెటిల్ అవక ఎందుకా తిప్పలు’ అన్నారు. చదువు వరకు బి.టెక్ ఓకే. కానీ, జాబ్ అంటే.. ఆ లైఫ్ రొటీన్ అయిపోతుంది అనిపించింది. క్రియేటివ్ వైపు ఉంటే ప్రతీరోజూ కొత్తగా జీవించవచ్చు కదా! అనిపించింది. ఇదే మాట అమ్మనాన్నలకు చెప్పాను. నటన అంటే నాకున్న ఆసక్తి వల్ల అమ్మనాన్న ఓకే అనక తప్పలేదు. అలా మొత్తానికి ‘స్టార్ మా’లో వచ్చే ‘అగ్నిసాక్షి’ సీరియల్లో అవకాశం వచ్చింది. మరీ విలనా?! సీరియల్లో హీరోయిన్ అవుదామనే ఈ ఫీల్డ్కి వచ్చాను. కానీ ఆడిషనల్స్లో మాత్రం ‘విలన్‌గా యాక్ట్ చేయగలవా?’ అని అడిగారు. వద్దంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం ఎలాగ?! విలన్ క్యారెక్టర్ అయితే త్వరగా ప్రేక్షకులు గుర్తించే అవకాశం ఎక్కువ. పాత్ర ప్రేక్షకుల్లోకి త్వరగా వెళుతుంది. కొంత డోలాయమాన పరిస్థితి. మా ఫ్రెండ్స్‌కి ఈ విషయం చెబితే ‘మరీ, విలనా!’ అన్నారు. అలా అన్నవాళ్లే ఆ తర్వాత ‘నటించే అవకాశం ఎక్కువ ఉండేది విలన్ క్యారెక్టర్‌కే’ అన్నారు. అమ్మనాన్నకు చెబితే ‘నీ ఇష్టం రా’ అన్నారు. ఇవన్నీ ఆలోచించుకొని ‘నేను నటించడానికి సిద్ధం’ అన్నాను. అలా అగ్నిసాక్షి సీరియల్లో విలన్‌గా మీ ముందుకు వచ్చాను. ‘అగ్నిసాక్షి’గా న్యాయం నా పేరే ఈ సీరియల్లో నా క్యారెక్టర్‌కీ పెట్టారు. హీరో శంకర్, హీరోయిన్ గౌరి లను విడదీసే క్యారెక్టర్ నాది. హీరో శంకర్‌ని ఇష్టపడుతూ ఉంటుంది ఆద్య. గౌరికి ప్రతీవిషయంలో అడ్డు పడుతుంటుంది. గౌరీశంకర్ల ప్రేమను చెడగొట్టాలని చూస్తుంటుంది. గౌరిని చెడ్డదానిలా నలుగురిలో నిలబెట్టాలని ప్రయత్నిస్తుంటుంది. నటించడానికి ఎక్కువ స్కోప్ విలన్పాత్రకే ఎక్కువ ఉందని ఇప్పుడు నాకు అనుభవంలోకి వచ్చింది. అందుకే నా పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేయడానికి కృషి చేస్తున్నాను. ప్రతి సారీ ఇంతకుముందుకన్నా బాగా నటించాలనే ఆలోచనతో చేస్తున్నా. దీంతో వర్క్‌ని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాను. గమనిస్తూ .. అమ్మనాన్న, అన్నయ్య ఇప్పుడు ఫుల్‌హ్యాపీ నేను కోరుకున్న ఫీల్డ్‌లో ఉన్నందుకు. ముగ్గురూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడ ఎంతోమంది సీనియర్ నటీనటులు. వారి నటననే కాదు ఖాళీ సమయాన్ని వారు సద్వినియోగం చేసుకునే విధానాన్ని గమనిస్తూ ఉంటాను. ఖాళీ సమయం దొరికితే పుస్తకాలు చదవడం, కాస్ట్యూమ్స్ కోసం షాపింగ్ చేయడం, ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్పడం నాకున్న ఇష్టాలలో ముఖ్యమైనవి.– నిర్మలారెడ్డి -
నేనూ టీవీ సీరియళ్లు చూస్తా...
గన్‌ఫౌండ్రీ: తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సత్యసంగీత ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో పలువురు కళాకారులకు, తెలుగు మూవీ, ఆర్టిస్ట్స్ యూనియన్ సభ్యులకు కళారత్న పురస్కారాలను ప్రదానం చేశారు. శుక్రవారం రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై అవార్డులను అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మంచి ప్రతిభ కలిగిన ఆర్టిస్టులు టీవీ సీరియళ్లలో నటిస్తున్నారని, అందువల్లే తాను కూడా నిత్యం టీవీ సీరియళ్లు చూస్తున్నానని చెప్పారు. రాజకీయ నాయకులకు కొంత ఒత్తిడి ఉంటుందని, ఇటువంటి, సీరియళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు చూస్తే ఒత్తిడి తగ్గుతుందన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సినీ సంగీత విభావరి, సీనియర్ ఎన్టీఆర్ డూప్ భాస్కర్ ప్రదర్శనలు ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వాణిజ్య ప్రోత్సాహక మండలి చైర్మన్ దేవర మల్లప్ప, సంగీత నాటక అకాడమీ అధ్యక్షుడు బి.శివకుమార్, సినీ నటుడు రఘుబాబు, సీల్వెల్ కార్పొరేషన్ ఎండీ బండారు సుబ్బారావు, సత్యసంగీత ఇంటర్నేషనల్ సంస్థ అధ్యక్షుడు ఓంకార్ రాజ్, తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నగర అధ్యక్షుడు ఎం.బి కృష్ణాయాదవ్, సుబ్బరాయశర్మ తదితరులు పాల్గొన్నారు. -
నెహ్రూ చూపిన భారత్
చరిత్ర తెలియనివాడు వర్తమానాన్ని గ్రహించలేడు, భవిష్యత్‌ను దర్శించలేడు. భారతదేశం వేల ఏళ్లుగా ఘన వారసత్వాన్ని, సంస్కృతిని, నాగరకతల సంగమాన్ని, భిన్న జీవన గతులను కలిగి ఉంది. వీటిని అర్థం చేసుకోకపోతే ఈ దేశం, ఈ దేశ ప్రజలు, మన పొరుగువారు, వారి ఆలోచనలు ఏవీ అర్థం కావు. నెహ్రూ తన డిస్కవరీ ఆఫ్ ఇండియా గ్రంథం ద్వారా దేశాన్ని ఎలా చూడాలో కళ్లకు కట్టారు. భారత్ ఏక్ ఖోజ్ సీరియల్ ఆ గ్రంథానికి ఉత్తమ దృశ్యరూపాన్ని ఇచ్చింది. నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలంటే నీ కుటుంబ చరిత్రను తెలుసుకోవాలి. అర్థం చేసుకోవాలి. నిన్ను నువ్వు సరికొత్తగా నిర్మించుకోవాలంటే దేశ చరిత్రను సమగ్రంగా ఔపోసన పట్టాలి. ఐదు వేల ఏళ్ల భారతదేశ చరిత్రను తెలుసుకోవాలంటే మాత్రం ‘భారత్ ఏక్ ఖోజ్’ సీరియల్‌ను చూడాలి. 1988లో దూరదర్శన్‌లో ఏడాదిపాటు ప్రసారమైన ఈ సీరియల్ తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంది. దేశ స్వాతంత్య్రం నాటి పరిస్థితుల నుంచి వెనక్కి వెళ్లి ఐదు వేల ఏళ్ల క్రితం నాటి ముచ్చట్లన్నీ మొత్తం 53 ఎపిసోడ్లలో ప్రతి భారతీయుడి కళ్లకు కట్టింది ఈ సీరియల్. మన దేశంలో వివిధ కాలాలలో చారిత్రక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలలో వచ్చిన మార్పులు సామాన్యమైనవి కావు. నాగరికతవైపు పరుగులు తీసే క్రమంలో వచ్చే పెనుమార్పుల గురించి ఒక్కమాటలో చెప్పలేం. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని భిన్నసంస్కృతులు, భిన్న మతాలు, బహుళజాతి సంఘాలు, నాగరికతలో వచ్చిన ఎన్నో మార్పులు మన దేశంలో ఉన్నాయి. వాటన్నింటినీ ఈ సీరియల్లో వీక్షించారు నాటి ప్రేక్షకులు. కొన్నిసార్లు సాంకేతికపరమైన డాక్యుమెంటరీ, మరికొన్నిసార్లు పూర్తిడ్రామా.. ఈ ఎపిసోడ్స్‌లో ప్రేక్షకులను అబ్బురపరిచాయి. రామాయణ్, మహాభారత్ల తర్వాత మళ్లీ అంతటి ఖ్యాతిని తన ఖాతాలో వేసుకుంది భారత్ ఏక్ఖోజ్ సీరియల్‌తో దూరదర్శన్. నెహ్రూ చెప్పిన కథ ‘భారత్ ఏక్ ఖోజ్ సీరియల్’ పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుస్తకం ‘ది డిస్కవరీ ఆఫ ఇండియా’ ఆధారంగా రూపొందించబడింది. ఈ ఎపిసోడ్స్‌ను నటుడు రోషన్ సేత్ జవహర్లాల్ నెహ్రూ పాత్ర పోషించారు. జవహర్లాల్ నెహ్రూ కథ చెబుతున్నట్టుగా ఎపిసోడ్స్ రన్ అవుతుంటాయి. ఈ సీరియల్ దర్శక, నిర్మాత శ్యామ్ బెనగల్ చేసిన అద్భుతమైన ఆలోచనకు ప్రతిరూపం భారత్ ఏక్ఖోజ్. ప్రతి ఆదివారం ఉదయం 11గంటలకు ఏడాది పాటు ప్రసారమైంది. 1947 నుంచి ఐదువేల ఏళ్ల వెనక్కి ప్రయాణించి మన మూలాల్ని మనకు పరిచయం చేస్తుంది ఈ సీరియల్. దర్శకనిర్మాత శ్యామ్‌బెనగల్ ఈ సీరియల్‌ని తీర్చిదిద్దితే, దీనిలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు ఓమ్పురి. తరతరాలు కదిలి ఈ సీరియల్ భారతీయ చరిత్రను అద్భుతంగా విశ్లేషించింది. భారతీయ సంస్కృతి, మూఢనమ్మకాలు, పురాణాలు, కావ్యాలు, నాటకాలు, సంగీతం, సినీ సాంకేతిక పరిజ్ఞానం.. ఇలా దశలవారీగా జరిగిన పురోగతిని పరిచయం చేసింది భారత్ ఏక్ ఖోజ్. మరో ఇరవై సంవత్సరాల తర్వాత కూడ సీరియల్ ప్రస్తావన వస్తే భారత్ ఏక్ ఖోజ్ సీరియల్ ద్వారా మొత్తం తరాలన్నీ కదిలివచ్చాయని, ఇది చారిత్రక దృక్పథాన్ని మెరుగుపరచడమే గాక, మన అద్భుతమైన గతం గురించి లోతైన అవగాహన కలిగి ఉండేలా ప్రేక్షకుడిని ప్రేరేపించిందని తెలుస్తుంది. ఎలక్షన్ క్యాంపెయిన్ నెహ్రూ చదువు నిమిత్తం పాశ్చాత్యదేశాలకు వెళ్లడం, అక్కడి స్నేహపూరితమైన వాతావరణం ఈ సీరియల్లో చూస్తాం. అలాగే 1936–37లలో జరిగిన ఎలక్షన్ క్యాంపెయిన్‌కి ఈ సీరియల్లో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. నెహ్రూ భారతదేశం అంతటా విస్తృతంగా పర్యటించారు. పట్టణాలు, నగరాలు, గ్రామాలలోనూ తన పర్యటన కొనసాగించారు. దీనిలో భాగంగా ఆయన ఒక గొప్ప ఆవిష్కరణకు పునాది వేసుకున్నారు. ఈ పర్యటన వల్ల ఆయనకు దేశంపై ప్రేమ పెరగడం ప్రారంభించింది. 1944లో అహ్మద్‌నగర్ ఫోర్ట్ జైలులో ఉన్నప్పుడు ఏకాంతంగా కొన్ని నెలల పాటు కూర్చుని, భారతదేశపు సరికొత్త ఆవిష్కరణపై సొంత ప్రయాణాన్ని నమోదు చేసుకున్నారు నెహ్రూ. ఆ ఘట్టాన్ని ఇందులో చూడచ్చు. శ్యామ్‌బెనగల్ ఇండియన్ గ్రేట్ డైరెక్టర్, స్క్రీన్‌రైటర్ శ్యామ్ గురించి చెప్పాలంటే సినిమానే ఆయన, ఆయనే సినిమా. ఎన్నో అవార్డులు ఆయన సినిమాకు సాహో అన్నాయి. ‘కులం–మతం ఈ రోజుల్లోనూ ఉన్నాయి. అయితే ఇవి భారతీయులుగా ఉండకుండా నిరోధించలేవు. ఈ సీరియల్ ద్వారా వాటివల్ల వచ్చే కారణాలను మాత్రమే విశ్లేషించాం’ అని తెలిపారు. 1986లో ఈ సీరియల్ స్క్రిప్ట్ మొత్తం సిద్ధం చేసుకున్నాం. 1988లో నవంబర్ 14న నెహ్రూ పుట్టిన రోజున ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారమవ్వాలన్నది ప్లాన్. ఎపిసోడ్ నిడివి ఒకటి 60 నిమిషాలు వస్తే మరికొన్ని 80, 90 నిమిషాలు కూడా వచ్చాయి. కానీ మాకున్న సమయం అరగంట మాత్రమే. అందుకే చాలా కుదించాల్సి వచ్చింది’ అని తెలిపారు ఈ సీరియల్ గురించిన ఓ ప్రస్తావనలో శ్యామ్‌బెనగల్. రోషన్ సేత్ ఇండియన్ యాక్టర్. భారత్ ఏక్ ఖోజ్‌లో జవహర్లాల్ నెహ్రూ పాత్ర పోషించారు. తనే కథ చెబుతున్నట్టు చరిత్రలోకి సేత్తో కలిసి మనమూ ప్రయాణిస్తాం. ఈ షోని ఆసక్తికరంగా మన అటెన్షన్‌ను తనవైపు తిప్పుకునేలా చేయడంలో కృతకృత్యమయ్యాయి రోషన్సేత్ ఆహార్యం, మాటలు. ఓమ్పురి ఇండియన్ యాక్టర్‌గా దేశమంతటా ఓమ్ సుపరిచితమే. అమెరికా, బ్రిటన్, పాకిస్థాన్‌లో తన నటనా పటిమను ప్రదర్శించారు ఓమ్పురి. పద్మశ్రీ అవార్డు గ్రహీత. వెండితెర, బుల్లితెర మీద ఓ వెలుగు వెలిగిన నటుడు. ఈ సీరియల్లో.. భారత్‌మాతాకి జై, ది బిగినింగ్స్, ది వేదిక్ పీపుల్ అండ్ ది రిగ్వేద, క్యాస్ట్ ఫార్మేషన్, మహాభారత్, రామాయణ, రిపబ్లిక్స్ అండ్ కింగ్డమ్స్, చాణక్య అండ్ చంద్రగుప్త, అశోక, కాళిదాస, అక్బర్, ఔరంగజేబు, టిప్పుసుల్తాన్, 1857 నాటి పరిస్థితులు, మహాత్మా ఫూలే, వివేకానంద, గాంధీ, దేశవిభజన, డూ ఆర్ డై... వంటి 53 ఎపిసోడ్లలో నాటి చారిత్రక ఘట్టాలను బుల్లితెరపై వీక్షించి పరవశులయ్యారు ప్రేక్షకులు.– ఎన్.ఆర్ -
సీరియల్స్‌లో ఛాన్స్ ఇస్తానంటూ ఆర్టిస్టులకు ఎర
సాక్షి, హైదరాబాద్: ఓ ప్రైవేట్ టీవీ చానల్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ పేరు మీద నకిలీ ఫేస్బుక్ ఐడీ సృషించి అవకాశాల ఇస్తామంటూ అందినకాడికి వసూలు చేస్తున్న ఓ మహిళను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఆమె నుంచి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ హరనాథ్ కథనం ప్రకారం...చిత్తూరు జిల్లా వాయలపాడుకు చెందిన శ్రీలత అలియాస్ శ్రీదేవి అలియాస్ సుస్మిత బెంగళూరులోని అత్తూరులో నివాసం ఉంటోంది. బుల్లితెర సీరియల్స్‌ను క్రమం తప్పకుండా చూసే శ్రీలతకు తెలుగు టీవీ ఆర్టిస్టులంటే మమకారం పెరిగింది. ఈ క్రమంలోనే 2018 జూలైలో ఓ ప్రైవేట్ టీవీ చానెల్స్‌లో సీరియల్స్ ప్రారంభ, ముగింపు సమయంలో ప్రొడ్యూసర్, డైరెక్టర్‌గా శ్రీదేవి తుమ్మల అని వచ్చింది. దీంతో ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పాటు సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు ‘శ్రీదేవి తుమ్మల’ పేరుతో నకిలీ ఫేస్బుక్ ఐడీతో పేజీ తెరిచింది. టీవీ, మూవీ ఆర్టిస్ట్‌లు అవాలనుకునేవారితో ఈ ఫేస్బుక్ ఐడీ ద్వారా సంప్రదించేది. వారికి సీరియల్స్‌లో ఛాన్సులు ఇప్పిస్తామంటూ డబ్బులు తీసుకొని విలాస జీవితానికి అలవాటుపడింది. అలాగే టీవీ ఆర్టిస్టులు నిషామా, శిరీష, కరుణ, ఇతరులకు ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్‌లు పంపి నిజమైన ప్రొడ్యూసర్ శ్రీదేవి తుమ్మలగా రోజువారీతో చాట్ చేసేది. ఎవరైనా ఫేస్బుక్ ద్వారా సంప్రదిస్తే చాలు సీరియల్స్‌లో అవకాశం ఇప్పిస్తానంటూ బ్యాంక్ ఖాతాలు ఇచ్చి డబ్బులు డిపాజిట్ చేయమని కోరేది. ఈ విధంగానే 2018 సెప్టెంబర్‌లో వంశీ అనే వ్యక్తికి టీవీ సీరియల్స్‌లో అవకాశమిస్తానని రూ.50వేలు వసూలు చేసింది. అలాగే మణికొండకు చెందిన క్రాంతికుమార్‌కు ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి ఇతర మహిళ ఫొటోలను పంపి చాట్‌చేసి సన్నిహిత్యాన్ని పెంచుకుంది. ఆమె పంపిన ఫొటోలకు ఫ్లాట్ అయిన క్రాంతికుమార్ ఆమెతో ప్రేమలో పడిపోయాడు. దీన్ని అవకాశంగా తీసుకున్న శ్రీలత పలుమార్లు తన బ్యాంక్ ఖాతాల్లో అతడితో రూ.ఆరు లక్షలు డిపాజిట్ చేయించుకుంది. అయితే ఈ విషయం ప్రొడ్యూసర్ శ్రీదేవి తుమ్మల దృష్టికి వెళ్లడంతో తన పేరుతో అమాయకులకు మాయమాటలు చెప్పి మోసం చేస్తోందని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు టెక్నికల్ డాటాతో నిందితురాలు శ్రీలతను బెంగళూరులో అరెస్టు చేసింది. గతంలోనే ఇటువంటి కేసుల్లోనే శ్రీలతను హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. -
భర్తను పట్టించుకోకుండా సీరియల్స్ చూస్తోందని..
పుణె : తనను ఏ మాత్రం పట్టించుకోకుండా పాకిస్తాన్‌కు చెందిన సీరియల్స్ చూస్తుందని ఓ 40 ఏళ్ల వ్యక్తి తన భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటన పుణెలోని సాలిస్‌బరిలో గత సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హోర్డింగ్స్ వ్యాపారం చేసే ఆసీఫ్ సత్తార్ నయాబ్, తన భార్యా పిల్లలతో కలసి సాలిస్‌బరిలో నివసిస్తున్నాడు. అయితే సోమవారం ఉదయం పాల ప్యాకెట్ విషయంలో సత్తార్ నయాబ్‌కు అతని భార్యకు చిన్నపాటి గొడవ జరిగింది. లీకైన పాల ప్యాకెట్ తెచ్చాడని కొడుకుపై అరుస్తున్న తన భార్యను నయాబ్ మందలించాడు. ఈ క్రమంలో మాటకు మాట పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. అనంతరం నయాబ్ తన పనికి వెళ్లాడు. సాయంత్రం తిరొగిచ్చిన తర్వాత అతని భార్య ఎంతకు మాట్లాడలేదు. పైగా బెడ్ రూంలోకి వెళ్లి అతన్ని ఏమాత్రం పట్టించుకోకుండా మొబైల్లో పాకిస్తాన్ సీరియల్ చూస్తు ఉండిపోయింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నయాబ్ పక్కనే ఉన్న రాడ్‌తో ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె కుడిచేతి బొటనవేలు విరిగిపోయింది. వెంటనే ఆమె.. తన భర్త తనను చంపడానికి ప్రయత్నించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు నయాబ్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
మహా ఇండియా
1988వ సంవత్సరం అక్టోబర్ 2 నుంచి 1990 ఆగస్టు వరకు ప్రతి ఆదివారం ఉదయం 9:00 గంటలు... ఇండియాలో టీవీ ఉన్న ప్రతి ఇంటికీ వచ్చి ‘మహాభారత్’గారియల్ ఇండియాని మహదానందానికి గురి చేసింది. ‘మహా ఇండియా’గా మార్చేసింది. ప్రపంచ గ్రంథమైన మహాభారతాన్ని దత్తత తీసుకోవాలని కలగన్నాడు ఓ వ్యక్తి.‘లోకంలో లేనిది మహాభారతంలో లేదు, మహాభారతంలో లేనిది లోకంలో లేద’న్న వ్యాసుడి జ్ఞానాన్ని కూడా దత్తత తీసుకోవాలనుకున్నాడు. నిజంగా అది సాధ్యమేనా?!.. మహాభారతం, రామాయణం వంటి పురాణాల గురించి తెలియని ఆధునిక తరాలు ఈ దృశ్యీకరణను చూసి తప్పుగా అర్థం చేసుకోకూడదు. అంటే, మూలం చెడకూడదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాలి అనుకున్నాడు. అతనే నిర్మాత బి.ఆర్.చోప్రా. ఎంత ఖర్చుకైనా వెనకాడేది లేదన్నాడు. సిద్ధం అన్నాడు దర్శకుడిగా రవిచోప్రా. కృష్ణార్జునుల్లా యుద్ధంలో అడుగుపెట్టి విజేతలై నిలిచారు ఈ తండ్రీ కొడుకులు. 1988 గాంధీ జయంతినాడు దూరదర్శన్‌లో 45 నిమిషాలపాటు ‘మ...హా...భా..ర...త్...’ సీరియల్ ప్రసారమయ్యింది. 94 ఎపిసోడ్లలో హస్తినాపురం బుల్లితెర మీదుగా నట్టింటికి దిగి వచ్చింది. కురుక్షేత్రాన్ని కళ్లముందు నిలిపింది. రామాయణం సీరియల్ తర్వాత ప్రజలందరినీ టీవీల ముందు కట్టిపడేసిన సీరియల్ మహాభారత్. ఈ సీరియల్‌ను చూసి కానీ ప్రజలు తమ పనులకు వెళ్లేవారు కాదు. ఈ సీరియల్‌ని ఆ తర్వాత కెనడా బిబిసిలో ప్రసారం చేస్తే యాభైలక్షల మంది వీక్షించారట. కాలం చెప్పిన కథ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అస్త్రాలు ఆకాశంలో తారాజువ్వల్లా లేవడం, శత్రువుల గుండెలను చీల్చడం బుల్లితెర ప్రేక్షకులు విస్మయంగా వీక్షించారు. ఎవరికీ తెలియని కథను కళ్లకు కట్టడం వేరు...అందరికీ తెలిసిన కథను అందునా యుగయుగాలుగా ప్రజల నోళ్లలో నానుతున్న కథను దృశ్యీకరించడం అంటే, ఎలా చెప్పాలి? అందుకే కాలంతో దోస్తీ చేశాడు దర్శకుడు. కాలం సాక్షీభూతంగా కథను చెప్పడం మొదలుపెట్టింది. ‘నేను కాలాన్ని. అజరామరంగా వెలుగొందే భారత కథను మీకు చెబుతున్నాను. ఇది కేవలం భరతవంశానికి చెందిన కథ మాత్రమే కాదు. భారతీయ సంస్కృతికి చెందినది. సత్య–అసత్యాల మధ్య జరిగిన మహా యుద్ధ కథ ఇది. చీకటికి – వెలుగుకు మధ్య జరిగిన యుద్ధ కథ ఇది. ఇందులోని పాత్రలు, సందర్భాలు నేను దగ్గరగా చూశాను. నేను అనుభూతించాను. ఇప్పటికీ మంచి – చెడులతో పోరాడుతూనే ఉన్నాను. నాకు ముగింపు అన్నది లేదు. గతంలో జరిగింది ఇప్పుడూ జరుగుతుంది. భవిష్యత్తులోనూ జరుగుతుంది. ఇది ఇతిహాస గ్రంథం మాత్రమే కాదు. ఇది అందరి కథ. అందరూ ఈ కథలో ఉన్నారు. ఈ కథలో ఉన్నవారందరూ ప్రపంచమంతటా ఉన్నారు. కృష్ణుడు అర్జునుడికి గీతా ఉపదేశం చేయడమో, దుర్యోధనుడు ద్రౌపదిని అవమానించడం మాత్రమే భారత కథ కాదు. ఇది మీ కథ. ఇది నా కథ..’ అంటూ కాలం భరత మహారాజును పరిచయం చేస్తుంది. మహారాజు భరతుడి హస్తినాపురం రాజదర్బారుతో ఈ కథ మొలుపెడుతుంది కాలం.హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు ఒకే దేశంగా పరిపాలించిన చంద్రవంశరాజు భరతడు తన తదనంతరం రాజును ప్రకటించాల్సి సమయం వచ్చింది. తన తొమ్మిది మంది పుత్రులలో ఎవరిని యువరాజుగా ప్రకటించాలన్నదే భరతుడి సమస్య. ఒక రోజు దర్బారులో భరతుడు –‘రాజుకు ఉండాల్సిన లక్షణాలు నా తొమ్మిది మంది పుత్రుల్లో ఎవరికీ లేవు. అన్ని లక్షణాలూ గల భరద్వాజ ముని పుత్రుడు భుమన్యుడిని దత్తతు తీసుకుంటున్నాను. అతడే ఈ సామ్రాజ్యాధినేత’ అని ప్రకటిస్తాడు. ఇక్కడ తల్లి–కొడుకుల మధ్య సంవాదం మనల్ని ఆలోచింపచేస్తుంది. రాజు కావాలంటే వారసత్వంగా కాదు ప్రజలను రక్షించి, పరిపాలించేవాడు కావాలి అని తల్లికి చెప్పే భరతుడి మాటలు భవిష్యత్తుతరాలకు మార్గదర్శకం చేస్తున్నట్టుగా ఉంటాయి. ప్రతీపుడి కొడుకు శంతనుడు. అతనికి సురగంగ వల్ల దేవరాతుడు, సత్యవతి ద్వారా విచిత్రవీర్యుడు, చిత్రాంగదుడు అనే ఇద్దరు కొడుకులు జన్మిస్తారు. కొడుకులిద్దరూ అర్ధంతరంగా చనిపోవడంతో కురువంశానికి వారసుడు లేకపోవడంతో తల్లి సత్యవతి అభ్యర్థనకు వ్యాసుడు తలవంచుతాడు. వ్యాసుని ద్వారా అంబిక, అంబాలికలకు దృతరాష్ట్రుడు, పాండురాజులు జన్మిస్తారు. పుట్టుకతో అంధుడైన దృతరాష్ట్రుడికి రాజ్యం కట్టబెట్టలేక అతని తమ్ముడు పాండురాజును రాజును చేస్తారు. అన్న దృతరాష్ట్రుడికి పుట్టిన వందమంది కొడుకులకు, పాండురాజుకు పుట్టిన ఐదుగురు కొడుకులకు మధ్య జరిగిన దాయాదుల పోరుకు కురుక్షేత్రం వేదిక అవుతుంది. ఇది న్యాయ–అన్యాయాలకు మధ్య జరిగిన పోరుగా కురుక్షేత్రం చూపుతుంది. యుద్ధం ముగిసి, ధర్మరాజు హస్తినాపుర రాజుగా పట్టాభిషిక్తుడవుతాడు. అంపశయ్య మీద భీష్ముడు ప్రాణాలు వదలడంతో సీరియల్ ముగుస్తుంది.జీవితం ప్రశ్నార్థకంగా మారినప్పుడల్లా కాలం దానికి సమాధానం చెబుతూ వస్తోందని మహాభారతంలోని ప్రతి కథ మన కళ్లకు కడుతుంది. వర్తమానం భయపెట్టినప్పుడల్లా ధర్మంవైపుగా అడుగు వేయమని అభయమిస్తుంది. అన్ని సంఘటనలను మౌనసాక్షిగా వీక్షించిన కాలం చెప్పే మాటలకు మన మనసులో గూడు కట్టుకున్న ఒక్కోపొర తొలగిపోతున్నట్టుగా ఉంటుంది. ‘నేను ధర్మం అధర్మం మీద గెలిచే విధానాన్ని మీకు పరిచయం చేశాను. ధర్మం వైపుగా ఉండాలా, అధర్మం వైపుగా సాగాలా అనేది మీ మనసుల్లోనే ఉంది. ఇది కౌరవులకు – పాండవులకు జరిగిన యుద్ధం కాదు. మీ మనసుల్లో ధర్మం–అధర్మం ప్రస్తావన రేగినప్పుడల్లా కురుక్షేత్రం ప్రతిబింబమై మీకు సమాధానమిస్తుంది. మీ మనసే ఓ కురుక్షేత్రం. దాంట్లో ఏ వైపుగా మీరుంటే గెలుపు సుసాధ్యమో మీరే తెలుసుకోవాలి’ అని ధర్మబోధ చేస్తుంది కాలం. బుల్లితెర వ్యాసుడు బి.ఆర్.చోప్రా రామాయణం, మహాభారతం రెండు మహాగ్రంధాలు. రామానంద్ సాగర్, బిఆర్ చోప్రా ఇద్దరికిద్దరూ సమర్థులు. సాగర్ రామాయణం తర్వాత బరిలోకి దిగాలని మహాభారత్ మేకింగ్‌ను పోస్ట్‌పోన్ చేసుకున్నారట చోప్రా. ఆ సమయంలో చోప్రా, అతని కుమారుడు రవి కొన్ని టెలీఫిల్మ్స్ తీశారు. ఈ సమయంలో రహి మసూన్ రెజా, సతీష్ భట్నాగర్, నరేంద్ర శర్మలతో కలిసి స్క్రీన్ ప్లే, మాటలు సిద్ధం చేసుకున్నారట. దీనికి ఆరు నెలల సమయం పట్టింది. కొత్త ఆర్టిస్టుల కోసం వేలమందిని స్క్రీన్ టెస్ట్ చేశారు. అమితాబ్‌బచ్చన్‌ని మహాభారత్‌కు తీసుకోవాలనే ఆలోచన చేశారు. అయితే ఓ సినిమా సందర్భంలో అమితాబ్‌కి గాయాలు అవడంతో ఆ ప్రయత్నాన్ని మానుకున్నారట. రామాయణం బుల్లితెర మీద అప్పటికే సూపర్ సక్సెస్ అయ్యింది. అంటే, తమ ప్రయత్నం ఇంకా ఘనంగా ఉండాలి. పురాణేతిహాసాలు అన్ని కాలాలకు సంబంధించినవి. అందుకే కాలం వాయిస్‌తో ‘మై సమయ్ హూ’ అంటూ ఈ సీరియల్‌ని మొదలుపెట్టారు. రెండేళ్ల పాటు వచ్చిన ఈ సీరియల్ ద్వారా వందలాది నటులు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలన్నది చోప్రాల లక్ష్యం. దాదాపు రూ.9 కోట్లతో తీసిన ఈ సీరియల్లోని కురుక్షేత్ర సన్నివేశానికి ముంబయ్ ఫిల్మ్ సిటీ వేదిక అయ్యింది. కొన్ని సన్నివేశాలను రాజస్థాన్‌లో తీశారు. ఈ సీరియల్ అంతా ఒక ఎత్తు అయితే ‘హరీష్ భిమాని’ వాయిస్ ఒక ఎత్తు. గంభీరంగా పలికే ఆ స్వరం టీవీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి కూచోబెట్టింది. రామాయాణం పౌరాణిక గాథగా తీస్తే, మహాభారత్ పూర్తిగా డ్రమాటిక్ మోడల్‌కే వాల్యూ ఇచ్చారు. బి.ఆర్.చోప్రా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘మహాభారత్ గ్రంథంలోని ప్రతి నీడనూ అన్వేషించాం. అందుకే ప్రేక్షకులు అంతగా ఆదరించారు. కొన్ని వివరణలను వదిలివేసింది అనే విమర్శకులూ ఉన్నారు. కానీ ప్రేక్షకుల నాడియే అసలు సిసలు విజయం’ అన్నారు. ‘అథ శ్రీ మహాభారత కథ’ అంటూ చిన్నితెర మీద అతి పెద్ద ప్రయత్నం చేసి గెలిచిన చోప్రాకి దూరదర్శన్, తిలకించిన అశేష ప్రేక్షకజనం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే. ►ఉర్దూ రచయిత, కవి రహి మసూమ్ రజా వ్యాస మహాభారతం నుంచి ఈ సీరియల్ మూల కథను రాసుకున్నారు. ►‘మ..హా..భా..ర..త్’ టైటిల్ సాంగ్‌ను కంపోజ్ చేసింది ప్రసిద్ధ సంగీత దర్శకుడు రాజ్‌కమల్. దీనిని గాయకుడు మహేంద్ర కపూర్ పాడగా, హరీష్ భిమాని తన గొంతును (కాలం) జత కలిపాడు. ఇందులోని శ్లోకాలు భగవద్గీత నుంచి తీసుకున్నారు. ►బాలీవుడ్ నటుడు రాజ్‌బబ్బర్ అప్పటికే అగ్రనటుల జాబితాలో ఉన్నారు. చోప్రా తీసే సినిమాల్లో రాజ్‌బబ్బర్ నటించాలనేది వారికి ఒక సెంటిమెంట్‌గా వస్తుండేది. మహాభారత్ టీవీ సీరియల్లోనూ భరతుడుగా రాజ్‌బబ్బర్‌ను చూస్తాం. 1988లో మహాభారత్ వస్తే, 1989లో ఉత్తరాఖండ్ నుంచి రాజ్యసభకు ఎం.పీగా ఎన్నికయ్యారు రాజ్‌బబ్బర్. ►భీష్మ పాత్రధారి ముఖేష్ఖన్నా మహాభారత్ తర్వాత సినిమా నటుడిగా నిలదొక్కుకున్నారు. చంద్రకాంత, శక్తిమాన్ వంటి సీరియల్స్‌తోనూ ప్రసిద్ధి పొందారు. ►ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడే బుల్లితెర మీద కనిపిస్తున్నాడా అనిపించే నటుడు, దర్శకుడు నితిష్ భరద్వాజ్ నటన ఈ సీరియల్‌కి ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ►కర్ణపాత్రధారి పంకజ్ధీర్కి ఈ సీరియల్‌తో స్టార్డమ్ వచ్చేసింది. సనమ్ బేవఫా, బాద్షా వంటి సినిమాలతో పాటు చంద్రకాంత, కింగ్ జునాడ్గడ్, హరిశ్ఛంద్ర వంటి సీరియల్లోనూ ఆ తర్వాత షారూఖ్‌ఖాన్ చెన్నై ఎక్స్‌ప్రెస్‌లోనూ పంకజ్ధీర్ నటించారు. ►అర్జున్‌గా నటుడు ఫిరోజ్‌ఖాన్, ద్రౌపదిగా రూపా గంగోలితో పాటు ఈ సీరియల్లోని ప్రధాన పాత్రధారులంతా ప్రముఖులయ్యారు. ద్రౌపది పాత్రకు ముందు జుహీచావ్లాను అనుకున్నారట. చివరగా రూపాగంగూలీని ద్రౌపది పాత్రకు ఎంపిక చేశారు. అభిమన్యుడిగా నటుడు చంకీపాండే సంతకాలు చేసినా, అతనికున్న సినిమా షెడ్యూల్ కుదరకపోవడంతో మాస్టర్ మయూర్‌ని అభిమన్యుడి పాత్రకు తీసుకున్నారు. ►1988 లో వచ్చిన చోప్రా మహాభారత్ తర్వాత 2013 లో స్వస్తిక్ ప్రొడక్షన్స్ అనే సంస్థ దాదాపు రూ. 120 కోట్ల వ్యయంతో మహాభారత్ సీరియల్‌ని నిర్మించింది. ఈ సీరియల్ మొత్తం 128 ఎపిసోడ్లుగా వచ్చింది. -
హమ్ లోగ్ ఇలా మొదలైంది...
కుటుంబం అంటే ఏక ఆలోచన కాదు. ఏక వ్యక్తి కాదు. ఏక రూపం కాదు.కాని అలా ఉండాలని అనుకునేవారు.వైఫల్యాలని దాచిపెట్టాలని అనుకునేవారు.గెలుపు బయటకు చూపించాలనుకునేవారు.ఇంటి గుట్టు ఇంట్లోనే ఉంచాలనుకునేవారు.ఇది ఒత్తిడి. దాచే కొద్దీ లోలోన వచ్చే ఉడుకు.అలాంటి సమయంలో ‘హమ్‌లోగ్’ సీరియల్ వచ్చింది.కుటుంబం అంటే అనేక ఆలోచనలూ అనేక వ్యక్తిత్వాలు అనేక రూపాలు అని చెప్పింది. వైఫల్యాలు ఉంటాయి... భంగపాట్లు ఉంటాయి... తిరిగి లేచి నిలబడటమూ ఉంటుంది... ఇదేమీ దాచిపెట్టాల్సిన రహస్యమూ కాదు.. అని ఆ సీరియల్ చెప్పింది.అప్పుడూ ఉన్నది ఆ మనమే. ఇప్పుడూ ఉన్నదీ మనమే.మన కోసం ఎప్పుడూ కావాలి ఒక ‘హమ్‌లోగ్’.దూరదర్శన్‌లో సీరియల్స్‌కు తెర తీసిన తొలి సీరియల్ ఇది.సగం దేశ జనాభా చూసిన సీరియల్. సూపర్ హిట్ సీరియల్. బసేసర్ రామ్‌ది ఓ మధ్యతరగతి కుటుంబం. మద్యానికి బానిస. భార్య చిల్లర డబ్బులు ఎక్కడ పెడుతుందో వెతుక్కుంటూ ఆ పూటకు మందు గడిస్తే చాలు అనుకునే రకం. భార్య భగవంతి ఇంటి గుట్టు బయటపెట్టుకోకూడదనే సగటు ఇల్లాలు. వీరికి ఐదుగురు పిల్లలు. పెద్ద కొడుకు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కూతురు సినిమా నటి కావాలని తపిస్తూ ఉంటుంది. చిన్న కూతురికి డాక్టర్ కావాలనేది కల. మరో కొడుక్కి క్రికెట్ అంటే పిచ్చి.. ఇలా ఈ పాత్రలన్నింటినీ కుటుంబం అనే తోరణానికి గుచ్చి 35 ఏళ్ల క్రితం బుల్లితెర మీద ఆవిష్కరించారు రచయిత మనోహర్ శ్యామ్జోషి, దర్శకులు కుమార్వాస్దేవ్లు. ఆ అందమైన తోరణం పేరు ‘హమ్‌లోగ్.’ బుల్లితెర మీద మొట్ట మొదటి సీరియల్‌గా అశేష జన నీరాజనాలు అందుకుంది హమ్‌లోగ్. ఇప్పటికీ ప్రజల గుండెల్లో పదిలంగా నిలిచిపోయింది. నేటికీ ఇవే సంఘర్షణలు సీరియల్ అయినా సినిమా అయినా ప్రజల మనసుల్లో బలమైన ముద్రవేయాలంటే అవి తమ మధ్య నడిచే కథలై ఉండాలి. తమ మధ్య కదలాడే పాత్రలై ఉండాలి. అలాంటి కథను పరిచయం చేసింది ‘హమ్‌లోగ్’ సీరియల్. అందుకే ఈ కథ 35 ఏళ్ళ నాటిది అయినా ఇప్పటికీ తాజాగా అనిపిస్తుంది. అప్పటికే 70 ఏళ్ల సినిమాను మించిన పాపులారిటీ 154 ఎపిసోడ్లు ఉన్న ఈ ఒక్క సీరియల్ తీసుకొచ్చింది. ఓ మహిళా ఇది నీ కథ.. ‘హమ్‌లోగ్’ ప్రధానంగా స్త్రీ సాధికారత గురించే చెబుతుంది. ఈ షోలోని మహిళా పాత్రధారులు ముఖ్యంగా బసేసర్రామ్ భార్య భగవంతి పాత్రలో జయశ్రీ అరోరా నటించారు. జయశ్రీ తొమ్మిదేళ్ల వయసు నుంచే డ్రామా ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత టెలివిజన్ నటి అయ్యారు. కథక్, మణిపురి డ్యాన్సర్. ఎన్నో బాలీవుడ్ సినిమాలు, సీరియల్స్‌లో సహపాత్రధారిగా నటించారు జయశ్రీ. హమ్‌లోగ్‌లో ఐదుగురు పిల్లల తల్లిగా ‘నీకేం తెలియదు ఊరుకో’ అని కసురుకునే కుటుంబసభ్యుల నడుమ త్యాగం చేయడమే జీవితంగా భావిస్తుంది భగవంతి పాత్ర. ఇప్పటికీ భారతీయ సగటు తల్లుల పరిస్థితి అంతా ఇలాగే ఉంటుంది. భర్తకు, పిల్లలకు జీతం, భత్యం లేని పనిమనిషిగా సేవలు చేస్తూ, కుటుంబం యోగక్షేమాలే తన బాగోగులు అనుకుంటుంది. 2019లో ఇప్పటికీ ఇలాంటి భగవంతిలను మన ఇరుగింట్లోనో, పొరుగింట్లోనో చూస్తూనే ఉంటాం. ఇక కూతుళ్లు బడ్కి, మఝ్లీ, ఛుట్కీ.. వారు పడే సంఘర్షణలు, ఎదుర్కొనే సమస్యలు, గుర్తింపుకోసం తహతహలాడే గుణం ఆద్యంతం కనిపిస్తుంటుంది. ఐదుగురు పిల్లల్లో పెద్ద కూతురు బడ్కీ.స్వేచ్ఛను కోరుకుంటుంది కానీ బయటకు వ్యక్తపరచలేదు. లోలోపల తీవ్ర మానసిక వత్తిళ్లకు లోనవుతూ ఉంటుంది. గుండెమాటున కన్నీళ్లు దాచుకుంటూ కాలం గడుపుతుంటుంది. మొత్తానికి సామాజిక సేవే వృత్తిగా మార్చుకుంటుంది. బడ్కీగా సీమా భార్గవ్ నటించారు. ఈమె సినిమా, టీవీ, నాటకరంగ నటి. 2017 నాటికి 63 ఫిల్మ్‌ఫేర్ అవార్డ్లు సాధించిందిన సీమ 2017లో బరేలీ కి బర్ఫీ, శుభ్ మంగల్ సావధాన్.. ఈ రెండు సినిమాల్లో ఉత్తమ సహనటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డ్‌కి ఒకేసారి నామినేట్ అవడం విశేషం. ఏక్తాకపూర్ సీరియల్ ‘కసమ్స్ సె’ లో మౌసిగా సీమా టీవీ ప్రేక్షకులకు సుపరిచితురాలు. ఆ తర్వాత 2014లో హిప్ హిప్ హుర్రే సీరీస్ ద్వారా సింగిల్ మదర్‌గా సీమ నటన సుప్రసిద్ధం. ఇక హమ్లోగ్లోని రెండవ కూతురు మఝ్లీ. స్వేచ్ఛను పొందడానికి, తన ఉనికిని నిలబెట్టుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది మఝ్లీ. తన కలలకు అడ్డుపడిన ప్రతి ఒక్కరితోనూ వాదిస్తూనే ఉంటుంది. మహిళా స్వయంశక్తిగా ఎదగాలంటే ఎన్ని ఒడిదొడుకులను దాటాలో మఝ్లీ పాత్ర చూపుతుంది. ఇలాంటి అమ్మాయిలు ఇప్పటికీ మనకి చాలా ఇళ్లలో కనిపిస్తూ ఉంటారు. మఝ్లీగా దీప్తీ సేథ్ నటించారు. ఈ సీరియల్ తర్వాత దీప్తి ఏడు టీవీ సీరియళ్లు, నాలుగు సినిమాల్లో నటించారు. ఇంట్లో చిన్న కూతురు ఛుట్కీ. చదవంటే ప్రాణం. డాక్టర్ కావాలనేది తన కల. భగవంతి, బడ్కీలకు ఈ అమ్మాయి మీద ఎనలేని నమ్మకం. తండ్రి నుదుటి మీద ఏర్పడ్డ చారలకు కారణం అది అతని ముఖానికి నప్పడమా, లేక ఆడపిల్లలకు కట్నం ఇచ్చుకోవాలనా? అనే ఆలోచన చేస్తూ ఉంటుంది. భవిష్యత్తు తరాల తరుణుల ఆలోచనకు అద్దంలా ఉంటుంది ఈ పాత్ర. బసేసర్ రామ్.. వినోద్నాగ్పాల్ హమ్‌లోగ్‌లో ప్రధాన పాత్రధారి అయిన బసేసర్ రామ్. వినోద్నాగ్పాల్ ఈ సీరియల్లో బసేసర్రామ్గా నటించాడు. మధ్యతరగతి తండ్రిగా, మద్యానికి బానిస అయిన వ్యక్తిగా నాగ్‌పాల్ నటన అందరినీ ఆకట్టుకుంది. హాస్యాన్ని వ్యంగ్యధోరణిలో అస్త్రాలుగా వదిలేవాడు. ‘హమ్‌లోగ్ కథ 25–30 పేజీలు ఉంటుందేమో. రచయిత మనోహర్ శ్యామ్ జోషి బ్రెయిన్లోనే స్క్రిప్ట్ అంతా రెడీగా ఉండేది. ఆయన జ్ఞాపక శక్తి అమోఘం. ప్రతి ఎపిసోడ్లో ఏయే అంశాలు రావాలో అనర్గళంగా ఆన్ది స్పాట్లోనే చెప్పేసేవారు. ఇన్నేళ్లయినా ఖోస్లా కా ఘోస్లా, లవ్ షువ్ తె చికెన్ ఖురానా.. వంటి సీరియల్స్‌లోనూ నాకోసం పాత్రలు ఉండటం అంటే హమ్‌లోగ్ నాకు ఇచ్చిన అదృష్టమే’ అని వివరించారు ఓ ఇంటర్వ్యూలో నాగ్‌పాల్. మధ్య తరగతి కష్టం మద్యం, లింగవివక్ష, కళ్ల ముందు ఎన్నో అవకాశాలు, వాటిని అందుకోలేని పేదరికం, మసకబారిన సామాజిక విలువలు, గుడ్డి నమ్మకాలు.. ఇలాంటివెన్నో ‘హమ్‌లోగ్’ చూపుతుంది. ఇప్పటికీ హమ్‌లోగ్ (మన దేశ ప్రజలు) కనపడని ఈ దెయ్యాలతో నిత్యం పొరాటం చేస్తూనే ఉన్నారు. అందుకే ఇది అందరి సీరియల్ అయ్యింది. ఇప్పటి సీరియల్స్‌కి దిశా నిర్దేశం చేసే ఒక గైడ్ హమ్‌లోగ్. – ఎన్.ఆర్. ఇండియన్ టెలివిజన్ కార్యక్రమాలలో ఒక మాస్టర్ పీస్ ‘హమ్‌లోగ్.’ వాస్తవికతకు దగ్గరగా ఉండేవి అప్పటి కార్యక్రమాలు. 80, 90ల కాలంలో అదొక సామాజిక విప్లవం. దీంతో దూరదర్శన్ ప్రజల జీవితాల్లో ఒక భాగమైపోయింది. అంజలి సెజ్వాల్ (గృహిణి) నేను ఈ సీరీస్ సీడీలు మొత్తం కొని దాచుకున్నాను. ఇప్పటికీ చూడదగింది. దిగువ మధ్యతరగతి ఎదుర్కొనే సవాళ్లను బాగా చూపించింది హమ్‌లోగ్. రవి సింఘ్ (పంజాబీ) ముప్పై ఏళ్ల క్రితం నాటి మాటి. తక్కువ ఆదాయం, ఎక్కువ సంతోషం ఉండే రోజులవి. కంప్యూటర్, మొబైల్ వంటివి లేవు అప్పట్లో. అదొక గోల్డెన్ పీరియడ్. మనుషుల మధ్య సత్సంబంధాలు, ఒకరికొకరు సాయపడే గుణం ఎక్కువ. ఆ సీరియల్‌ని తలుచుకుంటే నాటి రోజులు గుర్తుకువస్తాయి. నాటి రోజులను తలుచుకుంటే తప్పకుండా హమ్‌లోగ్ ఒక భాగమై ఉంటుంది. బ్రహ్మదత్త శర్మ అవి వేసవి సెలవులు. అప్పట్లో మా ఇంట్లో సౌకర్యం అంటే ఒక టేబుల్ ఫ్యాన్, బ్లాక్ అండ్ వైట్ టీవీ. హమ్‌లోగ్‌లో వచ్చే పాత్రల గురించి మా అమ్మతో చర్చించేదాన్ని. నాటి రోజులు తలుచుకుంటే ఇప్పటికీ కన్నీళ్లు ఆగవు. – అరుణా చౌహాన్ మొట్ట మొదటి సీరియల్ యాంకర్ అశోక్‌కుమార్ ప్రతి ఎపిసోడ్ చివరలో అగ్ర సినిమా నటుడు అశోక్‌కుమార్ స్క్రీన్ మీద కనిపించేవారు. కథలో, వాస్తవంలో జరుగుతున్న పరిణామాలను, రాబోయే ఎపిసోడ్లో జరిగే విషయాన్ని చాలా క్లుప్తంగా, ఆలోచనాత్మకంగా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుపోయేలా చెప్పేవాడు. అందుకే అందరికీ అశోక్‌కుమార్ ఒక సలహాదారుడిలా, తమ కుటుంబ సన్నిహితుడిలా అనిపించేవారు. అశోక్‌కుమార్ 50 ఏళ్ల సినీ జీవితంలో కంటే 18 నెలల హమ్‌లోగ్ సీరియల్ తెచ్చిపెట్టిన పేరు ప్రఖ్యాతులు అన్నీ ఇన్నీ కావు. అశోక్‌కుమార్ స్టైల్‌గా, గంభీరంగా కనిపించడానికి సన్‌గ్లాసెస్ పెట్టుకుంటున్నాడు అనుకునేవారు అంతా. కానీ, తన ముందు టెలీప్రామ్టర్లోని అక్షరాలు కనపడటానికి గ్లాసెస్ ధరించేవాడని ప్రేక్షకులెవ్వరికీ తెలియదు. మూలం... మెక్సికన్ సీరియల్ ఇండియన్ టెలివిజన్‌లో మొట్టమొదటగా అడుగుపెట్టిన డ్రామా సీరీస్ ‘హమ్ లోగ్’. దూరదర్శన్‌లో ఈ సీరియల్ జూలై 7 1984 ప్రారంభమై 17 డిసెంబర్ 1985 వరకు 154 ఎపిసోడ్లు ప్రసారమైంది. దీనిని మెక్సికన్ టెలివిజన్ సీరీస్ ‘వెన్ కన్‌మిగో(V్ఛn ఛిౌnఝజీజౌ 1975)లోని మూల కథ నుంచి తీసుకున్నారు. నాటì ప్రసారశాఖ మంత్రి వసంత్ సాథే మైండ్‌లో రూపుదిద్దుకున్న ఆలోచనకు దృశ్య రూపం కల్పించారు రచయిత మనోహర్ శ్యామ్ జోషి, స్క్రిప్ట్ రైటర్, ఫిల్మ్ మేకర్ పి.కుమార్ వాసుదేవ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిల్ బిస్వాస్, హిందీ సినీ నటుడు అశోక్‌కుమార్‌లు. -
పరుగో పరుగు!
సినిమాలు అంతగా లేని, టీవీ సీరియల్స్ అసలే లేని రోజులవి.మా ఊరి పురోహితులు రాత్రి అవగానే ఎవరి అరుగుల మీద వాళ్లు కూర్చొని భారతంలోని పద్యాలను రాగయుక్తంగా పాడుతూ అర్థాలు చెప్పేవాళ్లు. వావిళ్ళ రామస్వామిశాస్త్రులు ప్రచురించే నాటకాల పుస్తకాలను మద్రాస్ నుంచి తెప్పించి మా నాన్నగారు నాటకీయంగా చదివి వినిపించేవారు. ‘శ్రీకృష్ణ తులాభారం’ ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’‘కురుక్షేత్రం’ ‘సతీసావిత్రి’ వంటి నాటకాలు ఇందులో ఉండేవి.కంగుంది కుప్పం అనే ఊరికి చెందిన నాటక ట్రూపు మా ప్రాంతమంతా తిరిగి టికెట్‌పై నాటకాలు ఆడేవారు. ఆరోజుల్లో స్త్రీ పాత్ర స్త్రీలే ధరించే నాటక గ్రూపు అది. మంచి మంచి డ్రస్సులు, మేకప్ సామాగ్రి, స్టేజీ అలంకరణతో నాటకాన్ని రక్తి కట్టించేవాళ్లు. టికెట్‌కు రెండణాల చొప్పున అమ్మి నాటకాన్ని ప్రదర్శించేవారు. ‘సతీసావిత్రి నాటకాన్ని ప్రదర్శించబోతున్నారు’ అని సాయంత్రమే తప్పెటతో ఊళ్లో చాటింపు వేశారు. నాటకం చూడ్డానికి ఊళ్లో జనం ఎగబడ్డారు. పెట్రోమాక్స్ లైట్ల వెలుగులో జనం స్టేజీకి ఎదురుగా కంపౌండ్ పరదాకు ఆనుకొని కూర్చున్నారు. స్త్రీలు ఒక పక్క, పురుషులు మరో పక్క కూర్చున్నారు. మధ్యలో దారి విడిచిపెట్టారు. ‘పరబ్రహ్మ, పరమేశ్వర, పురుషోత్తమ సదానంద’ పాట పూర్తయింది. తెర పైకి లేచింది. సావిత్రి, సత్యవంతులు స్టేజీ పైకి వచ్చారు. పాటలు పద్యాలు ఊపందుకున్నాయి. రెండుమూడు సీన్లు అయిన తరువాత యమధర్మరాజు రాబోతున్నాడు. ప్రేక్షకుల ఈలలతో స్టేజీ ముందు గోలగోలగా ఉంది. మా ఊరి వీరాచారి యమధర్మరాజు పాత్ర పోషించడంతో క్రేజ్ పెరిగింది. వీరాచారికి నాటకాల్లో వేసిన అనుభవం ఉంది. ఎప్పుడైనా పురాణపఠనం జరిగేటప్పుడు ఆయన పాటలు, పద్యాలు రాగయుక్తంగా పాడేవాడు.‘పో బాల పొమ్మికన్ నావెంట రా వలదు రా తగదు’ పాటను వీరాచారి బాగా పాడతాడు.తెర పైకి లేసింది.యమధర్మరాజుగారి పటాటోపం తెలియజేసేట్లు హోర్మోనియం, తబలాలు పెద్ద శబ్దంతో మోగాయి. ఒక చేతిలో యమపాశం, మరొక చేతిలో గదతో యమధర్మరాజు వేషంలో ఉన్న వీరాచారి నిజమైన దున్నపోతుపై ఆసీనుడై కనిపించడంతో ఈలలు చప్పట్లు. ఈ శబ్దాలకు తోడు హార్మోనీ, తబలా శబ్దాలతో పాపం దున్నపోతు బెదిరిపోయింది. వీరాచారిని స్టేజీపై పడదోసి పరదాలను చీల్చుకొని పరుగులు తీసింది. వీరాచారి చెయ్యి విరిగింది. అదృష్టం కొద్దీ ప్రేక్షకులలో ఎవరికీ ఏమీ కాలేదు. అందరూ తలా ఒక దిక్కు పరుగులు తీశారు. ‘సహజంగా ఉంటుంది’ అని పక్కింటి వాళ్లను బతిమిలాడి దున్నపోతును తీసుకొచ్చాడట వీరాచారి.సహజత్వం సంగతేమిటోగానీ... దున్నపోతు పుణ్యమా అని వీరాచారి చేయి విరగ్గొట్టుకోవాల్సి వచ్చింది. – సామా కేశవయ్య, తుంబూరు, చిత్తూరు జిల్లా -
టీవీ సీరియల్స్ మీద కూడా సెన్సార్ బోర్డు నిఘా ఉండాలి
తూర్పు గోదావరి : 'మద్యం తాగించి.. పాఠశాలలోనే పూడ్చివేత' ఈ సంఘటనను చూస్తుంటే ఇటీవల వచ్చిన ‘దృశ్యం’ సినిమా గుర్తురాక మానదు. అయితే ఇందులో ప్రియురాలి భర్తను హత్య చేసి అతనిని కొత్తగా నిర్మించిన పాఠశాలలో పూడ్చిపెట్టారు. వివరాల్లోకి వెళితే.. కిర్లంపూడి మండలం ముక్కొల్లు గ్రామానికి చెందిన మచ్చా సత్తిబాబు, జ్యోతి దంపతులు. జ్యోతికి చంద్రమాంపల్లికి చెందిన చెక్కిడాల రాజాతో అక్రమ సంబంధం ఉంది. ఆ నేపథ్యంలో జూన్ 19న సత్తిబాబు అదృశ్యమయ్యాడు. అతని ఆచూకీ లభించకపోవడంతో అదృశ్యమైనట్టు జూన్ 26న బంధువులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో రాజా సత్తిబాబును చంద్రమాంపల్లి ఆహ్వానించాడు. అక్కడ మరో ఇద్దరితో కలసి గ్రామంలో నూతనంగా నిర్మించిన స్కూల్ కాంప్లెక్స్‌లో మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న సత్తిబాబును హత్య చేసి అదే పాఠశాలలో పూడ్చిపెట్టారు. హత్యకు ఉపయోగించిన రాడ్‌ను దివిలి గ్రామ శివారులో చెత్త కుప్పలలో పడవేశారు. బైక్‌ను జి. రాగంపేటలోని ఒక యువకుడి ఇంట్లో ఉంచారు. మంచానికి కట్టేసి.. రంగంపేట మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన వాసంశెట్టి వీర వెంకట సత్యనారాయణ కల్లు గీత కార్మికుడు. అతను వ్యవసాయం కూడా చేస్తుంటాడు. జగ్గంపేట మండలం, కాట్రావుల పల్లికి చెందిన భవానితో 9 ఏళ్ల క్రితం అతనికి వివాహం అయింది. వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అతనిపొలంలో కోటపాడు గ్రామానికి చెందిన రాజా శ్రీను రెండేళ్లుగా పని చేస్తున్నాడు. రాజా శ్రీనుతో సత్యనారాయణ భార్య భవానికి వివాహేతర సంబంధం ఏర్పడింది. జూలై 25వ తేదీ రాత్రి 10 గంటలకు సత్యనారాయణ ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఇద్దరూ కనిపించారు. దాంతో వారి మధ్య ఘర్షణ జరిగింది. ప్రియుడితో కలసి భవాని సత్యనారాయణను మంచానికి కట్టి వేసి దాడి చేశారు. సత్యనారాయణ అరుపులు విని పొరుగువారు బాధితుడి తల్లిని తీసుకొనివచ్చే సరికి ఇంటి తలుపులు వేసి ఉన్నాయి. సత్యనారాయణ చంపేస్తున్నారు బాబోయ్ అని అరుస్తుండడంతో గ్రామస్తులు తలుపులు పగుల గొట్టుకొని లోనికి ప్రవేశిస్తుండగా వారిని నెట్టుకుంటూ భవాని, ఆమె ప్రియుడు రాజా శ్రీను పరారయ్యారు. కొన ఊపిరితో ఉన్న సత్యనారాయణను బయటకు తీసుకువచ్చే సరికి మృతి చెందాడు. మద్యం తాగించి చున్నీతో పీక నులిమి.. రాజమహేంద్రవరం రూరల్, హుక్కుంపేట కు చెందిన వడ్డి ఇమ్మానియేలు తాపీపని చేసుకుని జీవిస్తుంటాడు. ఇమ్మానియేలుకు దేవితో వివాహం అయింది. వారికి ఇద్దరు పిల్లలు. ఇమ్మానియేలుకు పిడింగొయ్యి గ్రామానికి చెందిన గండ్రోతు శివ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ స్నేహంగా ఉండేవారు. శివ దేవితో పరిచయం పెంచుకొని వివాహేతర సంబంధం కొనసాగించసాగాడు. వీరి అక్రమ సంబంధం తెలుసుకున్న ఇమ్మానియేలు గొడవ చేశాడు. ఆనేపథ్యంలో జూలై 26వ తేదీన సీతపల్లిలోని గండి బాపనమ్మ గుడికి వెళ్దామని ఇమ్మానియేలును శివ ఒప్పించాడు. ఇద్దరూ 26వ తేదీ మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై వెళ్లారు. ప్రియుడి సూచన మేరకు దేవి బస్సులో బయల్దేరింది. స్నేహితులు ఇద్దరూ గోకవరంలో ఒక మద్యం షాపులో మద్యం కొనుగోలు చేసి సీతపల్లి వచ్చి సమీపంలోని పోలవరం ప్రాంతంలో ఇద్దరూ మద్యం సేవించారు. ఇమ్మానియేలుతో శివ అతిగా మద్యం తాగించాడు. ఇంతలో అక్కడకు దేవి చేరుకుంది. శివ, దేవి కలసి ఇమ్మానియేలు పీకను చున్నీతో బిగించి హత్య చేసి అతనిని పెట్రోల్ పోసి కాల్చారు. సెల్ ఫోన్లో సిమ్ కార్డు తీసి అక్కడే పడవేశారు. మద్యం సీసా, సెల్ ఫోన్ ఆధారంగా నిందితులను పోలీసు అరెస్ట్ చేశారు. ఇమ్మానియేలు, దేవికి పుట్టిన ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.మమతానురాగాలకు పుట్టిల్లు కుటుంబం. ఆ కుటుంబం.. దాంతోపాటు మానవసంబంధాలు మంటగలుస్తున్నాయి. వివాహేతర సంబంధాల ప్రభావంతో కుటుంబాలు ధ్వంసమవుతున్నాయి. భర్తలను భార్యలు, భార్యలను భర్తలు తమ ప్రియులు లేదా ప్రియురాళ్ల సహాయంతో హతమార్చేస్తున్నారు. కన్నబిడ్డలని కనికరం కూడా చూపకుండా పసివాళ్లను సైతం మట్టుబెట్టేస్తున్నారు. జిల్లాలో జరిగిన ఇలాంటి సంఘటనలు మానవత్వానికి మచ్చగా నిలిచాయి. –రాజమహేంద్రవరం క్రైం టీవీ సీరియల్స్ మీద కూడా సెన్సార్ బోర్డు నిఘా ఉండాలి దేశంలో విదేశీ సంస్కృతి పెరిగిపోయింది. టీవీ సీరియల్స్ , సినిమా ప్రభావం మహిళలపై పడుతోంది. దీంతో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. పూర్వం ఉమ్మడి కుటుంబ వ్యవస్ధ ఉండేటప్పుడు తప్పు చేస్తే పెద్దవారు దండించే వారు. ఆభయంతోనైనా సక్రమమైన మార్గంలో నడిచే వారు. ప్రస్తుతం తప్పులను సరిదిద్దే వారు లేకపోవడంతో విచ్చలవిడితనం వచ్చేసింది. అక్రమ సంబం«ధాలతోనే సుఖంగా ఉంటుందనే అపోహతో హత్యలు చేస్తూ తమ జీవితాలను చేజేతులారా సర్వనాశనం చేసుకుంటున్నారు. టీవీ సీరియల్స్ మీద కూడా సెన్సార్ బోర్డు నిఘా ఏర్పాటు చేయాలి. టీవీ సీరియల్స్‌లో అక్రమ సంబంధాల పాత్రలు నిరోధించకపోతే సమాజంలో మరిన్ని ప్రమాదకర ధోరణులు పెచ్చరిల్లుతాయి. తల్లిదండ్రులు తమ పిల్లలు వాట్సప్, ఫేస్ బుక్‌లలో ఏవిధమైన మెసెజ్‌లు చూస్తున్నారో గమనించాలి. టెక్నాలజీని దుర్వినియోగం చేస్తే జీవితాలు నాశనం అవుతాయి.–ముప్పాళ్ల సుబ్బారావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు నైతిక విలువలు నేర్పించాలి విద్యార్థి దశ నుంచే నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలి. ఆధునిక కాలంలో విలువలు పడిపోయాయి. మోడరన్ కల్చర్‌లో విచ్చలవిడితనం పెరిగిపోయింది. పురుషులలో 90 మంది పరాయి స్త్రీతో మానసిక వ్యభిచారం చేయడం, అలాగే స్త్రీలలో 75 మంది పరాయి పురుషుడిని ఊహించుకోవడం జరుగుతుంది. 20 నుంచి 30 శాతం తప్పటడుగు వేస్తున్నారు. కొంత మందిలో వ్యక్తిత్వలోపం, చంచలత్వం ఉంటుంది. ఇలాంటి వారు ఒకరి కంటే ఎక్కువ మందితో సంబంధాలు కొనసాగిస్తారు. తమను అడ్డుంటే వారిని తొలగించుకోవడానికి కూడా వెనుకాడరు. ఇంట్లో మనుషులు చూపించే ప్రేమ కంటే బయటవారు చూపే ప్రేమలో ఎక్కువ విలువ ఉన్నట్టు అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి పెంచి పోషించిన తల్లిదండ్రులు కంటే పార్కులో పరిచయమైన ప్రేమికుడు చెప్పినదే ఎక్కువగా ఆకర్షణగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య చక్కటి ఆనుబంధం పెరగకపోతే పరాయివారి అకర్షణకు లోనవుతారు. సాధారణంగా 10 ఏళ్ల సంసార జీవితం జరిగిన తరువాత, 40 ఏళ్లు వచ్చాక వంకర చూపులు చూస్తారు. సీరియల్స్‌లో మహిళలను విలన్‌గా చూపించే సంస్కృతి పోవాలి. విదేశాలలో మాదిరిగా కఠినమైన శిక్షలు ఉండాలి. అప్పుడే నేరాల శాతం తగ్గుతుంది.–డాక్టర్ కర్రి రామారెడ్డి, మానసిక వైద్యుడు, రాజమహేంద్రవరం -
ఔరా.. ఏమి నటన!
పిట్ట కొంచెం కూత ఘనం అన్న నానుడిని తలపిస్తున్నాడు ఆ బాలుడు. ఇటు బుల్లి తెరపై.. అటు వెండి తెరపై అసమాన నటనా చాతుర్యంతో అబ్బురపరుస్తున్నాడు. ఏడేళ్ల ప్రాయంలోనే టీవీ సీరియల్స్‌లో అరంగ్రేటం చేసిన రోహన్ రాయ్తనదైన ప్రతిభతోదూసుకెళ్తున్నాడు. డైలాగ్‌లను అలవోకగా చెబుతూ తనకు తానే సాటిఅని నిరూపిస్తున్నాడు. సాక్షి, హైదరాబాద్ : గచ్చిబౌలి జీపీఆర్ఏ క్వార్టర్స్‌లో నివసిస్తున్న చిన్న సుబ్బారాయుడు, రాధా మాధవి దంపతుల కుమారుడు రోహన్ రాయ్. స్థానికంగా ఉన్న కేంద్రీయ విద్యాలయలో రెండో తరగతి చదువుతున్నాడు. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే అచ్చంగా వారి గొంతును అనుకరించి మాట్లాడేవాడు. సినీనటుడు రజనీకాంత్ డైలాగ్‌లను చెబుతుండేవాడు. గోన గన్నారెడ్డి సినిమా డైలాగ్‌లు అలవోకగా చెప్పేవాడు. కుమారుడి ప్రతిభను గమనించిన తల్లిదండ్రులు 2016లో జీ తెలుగు సీజన్ –1 డ్రామా జూనియర్స్‌కు దరఖాస్తు చేశారు. ఆ పోటీలతో బుల్లితెరపై రోహన్ రాయ్ కేరీర్ మొదలైంది. అప్పటి నుంచి టీవీ సీరియల్స్, సినిమాలో రోహన్‌కు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. టీవీ సీరియళ్లలో.. మా టీవీ సీరియల్ ‘కథలో రాజకుమారీ’లో అభి పాత్రలో హీరో అన్న కొడుకుగా నటిస్తున్నాడు. జీ తెలుగులో ప్రసారమయ్యే గుండమ్మ కథ సీరియల్లో గుండమ్మ మేనల్లుడుగా నటిస్తున్నాడు. నెలలో రెండు షెడ్యూల్స్‌లో షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ టీవీలో అభిరుచి అనే చెఫ్ ప్రోగ్రాంలో రోహన్ యాంకర్‌గా 40 ఎపిసోడ్లు చేశాడు. జీ తెలుగులో కామెడీ షో, బోనాలు, హోలీ, ఉగాది ఉత్సవాల్లో పాల్గొన్నాడు. అంతే కాకుండా గోల్డెన్ అవార్డ్స్, అప్సర అవార్డు ఫంక్షన్లలో పాల్గొన్నాడు. అవార్డుకు ఎంపికయ్యింది ఇలా.. జీ తెలుగులో డ్రామా జూనియర్ పోటీల్లో భాగంగా 2016లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో రిజిస్ట్రేషన్ చేసుకున్న 3000 మంది చిన్నారుల్లో 25 మందిని ఎంపిక చేశారు. వీరిలో రోహన్ 6వ స్థానంలో నిలిచాడు. జూనియర్ డ్రామా పోటీల్లో గోన గన్నారెడ్డి, రజనీకాంత్, రాంగోల్‌వర్మ, ప్రకాశ్‌రాజ్ నటనలను నాటిక రూపంలో ప్రదర్శించాడు. యమధర్మరాజు పాత్రతో ఆకట్టుకున్నాడు. ఫైనల్ పోటీలలో అమ్మాయి గెటప్‌లో అమెరికా కోడలుగా నటించాడు. డైనమెట్ ఆఫ్ డ్రామా జూనియర్స్– 2017అవార్డ్ అందుకున్నారు. అంతే కాకుండా తత్వపీఠం ఉగాది పుస్కారాన్ని రోహన్‌కు అందించింది. సినిమా అవకాశాలు.. 2017లో రాజుగారి గది– 2లో హీరోయిన్ సమంత ట్యూషన్ స్టూడెంట్‌గా రోహన్ కనిపిస్తాడు. ఈ సినిమాతో రోహన్ కేరీర్ ప్రారంభమైంది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన రంగుల రాట్నం సినిమాలో రోహన్ బర్త్ డే ఈవెంట్‌కు మేనేజర్‌గా హీరోయిన్ చిత్ర శుక్లా వ్యవహరిస్తుంది. ఈ సన్నివేశంలో బాలనటుడు రోహన్ హీరోయిన్ను ఏడ్పిస్తాడు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో నిర్మితమవుతున్న సినిమాలో హీరో రామ్‌చరణ్ చిన్ననాటి పాత్రలో రోహన్ రాయ్ నటిస్తున్నాడు. మా ఊరిలో మా ప్రేమ కథ చిత్రం హీరో విజయ్ చిన్ననాటి పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే గుంటూరు టాకీస్– 2లో నటుడు నరేష్ కొడుకుగా నటిస్తున్నాడు. హీరో కావాలనుంది.. పెద్దయ్యాక సినిమాల్లో హీరోగా నటించాలని ఉంది. నటనలో మంచి పేరు తెచ్చుకోవాలనుంది. అమ్మా నాన్న నన్నెంతగానే ప్రోత్సస్తున్నారు. హీరో అల్లు అర్జున్ ఎంతో ఇష్టం. అతను స్టైలిష్‌గా ఉంటాడు. డ్యాన్స్ బాగా చేస్తాడు. – రోహన్ రాయ్ -
‘సినిమాల్లో మితిమీరుతున్న అశ్లీలం’
సాక్షి, అమరావతి : సినిమాల్లో అశ్లీల సన్నివేశాలు మితిమీరుతున్నాయని ఏపీ మహిళ కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమార్ అన్నారు. పశ్చిమ గోదావరిలోని ఏలూరులో శుక్రవారం ఆమె మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజా కుమారి మాట్లాడుతూ.. టీవీ సీరియల్స్‌లో మహిళలను చాలా దారుణమైన క్యారెక్టర్లుగా చూపిస్తున్నారని పేర్కొన్నారు. టీవీ సీరియల్స్ నుంచి అశ్లీల సన్నివేశాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజలు ప్రతి విషయంలో సామాజిక బాధ్యత వహించాలని, శాంతి భద్రతల కొరకు పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రజలందరూ చట్టాలపై అవగహన పెంచుకోవాలని సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరమని, ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి పార్లమెంట్లో ఎంపీ గల్లా జయదేవ్ అద్భుతంగా మాట్లాడారని కొనియాడారు. గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్లే మహిళలకు అవగాహన కల్పించి స్థానికంగా ఉపాధి పొందేలా ఏర్పాటు చేస్తామని తెలిపారు. -
ఒక్క తుమ్ము చాలు!
ఏ వ్యాపారం కలిసిరాని యెంకటరత్నం దిక్కుతోచక ‘అంతులేని స్టోరీ’ అనే టీవీ సీరియల్ తీశాడు. ఏ నక్క తోక తొక్కాడోగానీ ఈ సీరియల్ ఫస్ట్ ఎపిసోడ్‌తోనే ప్రేక్షకులను ఎడాపెడా ఆకట్టుకోవడం మొదలైంది. రాత్రి పది దాటిన తరువాత ఎప్పుడో ప్రసారమయ్యే ఈ సీరియల్‌ను నిద్ర మానుకొని మరీ చూసేవారు. చూసేవారు ఏం ఖర్మ! ఆ రాత్రి బిగ్గరగా ఏడ్చేవారు. అంతకంటే బిగ్గరగా నవ్వేవారు. ఆందోళనతో అరిచేవారు. ఒక్కటా రెండా... ఆ సీరియల్ ప్రసారమవుతున్నంతసేపూ ప్రేక్షకులు నవరసాల్లో గజ ఈత కొట్టేవాళ్లు. కేవలం ఈ సీరియల్ పుణ్యమా అని పాతాళంలో ఎక్కడో ఉన్న ఆ టీవీ రేటింగ్, ఎక్కడో ఆకాశంలోకి వెళ్లిపోయింది. మరి అలాంటి సీరియల్‌కు ‘కథ’ అనే ఇంధనం అయిపోయింది. బండి ముందుకు వెళ్లడానికి మొరాయిస్తోంది. ఎలాగైనా సరే మరో పాతిక వారాలైనా సీరియల్‌ను సీరియస్‌గా ముందుకు లాగాలని డిసైడైపోయాడు నిర్మాత యెంకటరత్నం. టాలీవుడ్లో భయంకరంగా చేయి తిరిగిన రచయిత సీడీ భయంకర్ దగ్గరిగికి వెళ్లాడు. ‘‘మీరు ఎంత డబ్బు అడిగినా కళ్లు మూసుకొని ఇస్తాను. నా సీరియల్‌ను సాగతీయండి ప్లీజ్’’ అని వినయంగా వేడుకున్నాడు.‘‘డబ్బుల సంగతి తరువాత, ముందు మీ సీరియల్ మూల కథ ఏంటో చెప్పండి’’ అని సిగరెట్ ముట్టించాడు భయంకర్. అప్పుడు ఆ నిర్మాత ఇలా చెప్పాడు:‘అనగనగా ఒక కుటుంబరావు. ఆయనకు ఆరుగురు తమ్ముళ్లు. ముగ్గురు చెల్లెళ్లు. ఈ ఆరుగురు తమ్ముళ్లు బలాదూరుగా తిరుగుతుంటారు. ఇంటి భారమంతా కుటుంబరావే మోస్తుంటాడు. తమ్ముళ్లకు ఎన్ని మంచి మాటలు చెప్పినా పెడ చెవిన పెడుతూ అన్నను ఇబ్బందుల పాలు చేస్తూనే ఉంటారు. కానీ, ఒక సంఘటనతో వారికి అన్న అంటే విపరీతమైన అభిమానం ఏర్పడుతుంది. ఒకరోజు... కుటుంబరావు ఇంటి ముందు పడవలాంటి కారు ఆగింది. అందులో నుంచి ఆరున్నర అడుగుల ఖరీదైన వ్యక్తి బయటికి వచ్చాడు. ఆయన కుటుంబరావు పనిచేసే కంపెనీ అధిపతి ఆనందరావు. టైమ్ వేస్ట్ చేయడం ఆయనకు అట్టే ఇష్టం ఉండదు. ఇంట్లోకి రావడంతోనే చెప్పదల్చుకున్నది ఇలా సూటిగా చెప్పాడు...‘‘నీ సిన్సియారిటీ నాకు నచ్చిందయ్యా! నీ అందం మా అమ్మాయికి నచ్చిందయ్యా! టోటల్‌గా నిన్ను మా ఇంటి అల్లుడిని చేసుకోవాలనుకుంటున్నామయ్యా. అయితే ఒక షరతు. పెళ్లి తరువాత నువ్వు మా ఇంట్లోనే ఉండాలయ్యా. ఈ ఇంట్లో వాళ్లను టోటల్‌గా మరిచిపోవాలయ్యా. ఆలోచించుకోవయ్యా...’’ ఈ మాటలు వినడంతోనే కుటుంబరావు కళ్లు తెలుగు సినిమాల్లోలాగా మండుతున్న అగ్నిగోళాలయ్యాయి. తెలుగు నవలల్లో మాదిరిగా పిడికిళ్లు బలంగా బిగుసుకున్నాయి. తన యజమాని కూర్చున్న కుర్చీని బలంగా తన్ని....‘‘ఇంకోసారి నీ ముఖం నాకు కనిపించనీయకు. ఎంత మాటన్నావ్? తుచ్ఛమైన నీ ఆస్తికోసం... అచ్చమైన నా కుటుంబాన్ని వదులుకోవాలా!స్వచ్ఛమైన భారత్‌లో పుట్టిన అచ్చమైన మగాడినిరా. ఖబడ్దార్’’ అని అరిచాడు.ఆనందరావు వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు. అన్న ఔదార్యాన్ని చూసి చలించిపోయిన తమ్ముళ్లు ఆ క్షణమే మారిపోయారు. కష్టపడ్డారు. వ్యాపారాలు పెట్టారు. లక్షలు సంపాదించారు. అన్న పెళ్లిఘనంగా చేశారు. సిటీ ఔట్స్కర్ట్స్లో పెద్ద ఇల్లు తీసుకుని అందరూ హాయిగా ఉండటంతో శుభం కార్డు పడిపోయింది. నాకు దిక్కుతోచకుండా అయింది’’‘‘కథ సుఖాంతం అయింది కదా! ఇంకా దీనిలో సాగతీయడానికి ఏముంది?’’ అని ‘ఇక మీరు వెళ్లవచ్చు’ అన్నట్లు చూశాడు భయంకర్. చేసేదేమీ లేక వచ్చిన దారినే వెనక్కి వెళ్లిపోయాడు నిర్మాత యెంకటరత్నం. విక్రమార్కుడి భుజం మీద ఉన్న భేతాళుడు గొంతు విప్పి....‘‘రాజా! కాసేపు నువ్వు రాజువి కాదు రైటర్‌వి అనుకుందాం. ఇదిగో... ఈ బుట్టలో కొన్ని చీటీలు ఉన్నాయి. ఆ చీటిలలో కొన్ని పదాలు రాసి ఉన్నాయి. ఈ బుట్టలో నుంచి ఒక చీటి తియ్యి. ఆ చీటీలో ఏ పదం ఉందో... కేవలం ఆ ఒక్క పదంతో ‘అంతులేని స్టోరీ’ సీరియల్‌ను పాతిక వారాల వరకు సాగతీయాలి. సారీ... నావల్ల కాదు అన్నావో నీతల వెయ్యి వక్కలవుతుంది’’ అని వార్నింగ్ ఇచ్చాడు బేతాళుడు.‘‘అలాగే’’ అంటూ ఆ బుట్టలో నుంచి ఒక చీటీ తీశాడు విక్రమార్కుడు.‘తుమ్ము’ అని వచ్చింది. విక్రమార్కుడు స్టోరీని మొదలు పెట్టాడు.... ‘‘సుఖసంతోషాలతో జీవిస్తున్న కుటుంబరావు ఇంటికి ఒకరోజు ఆయన అత్త ఆండాళమ్మ వచ్చింది. ఒక వారం రోజులు ఉండి తిరిగివెళ్లిపోతున్న సమయంలో కుటుంబరావు చిన్న తమ్ముడు హాచ్ అనితుమ్మాడు. కొంచెం సేపు ఆగి వెళ్లమ్మా... అంది కూతురు. లోపల భయంగా ఉన్నా... నాకు అలాంటి పట్టింపులేమీ లేవమ్మా... అంటూ బయటకు అడుగు వేసిన ఆండాళ్లమ్మ... ఒక అరటి తొక్క మీద కాలు వేసి సర్రున జారి పడింది. ఈ క్రమంలో ఆమె తలకు బలమైన దెబ్బతగలడం వల్ల మతిచలించింది. ‘నీ తుమ్ముతో బంగారంలాంటి మా అమ్మను పిచ్చిదాన్ని చేస్తావా?’ అని కుటుంబరావు తమ్ముడి కాలరు పట్టుకున్నాడు ఆయన బామ్మర్ది బాలరాజు. నా తమ్ముడి కాలర్ పట్టుకుంటావా? అని కన్నెర్ర చేస్తూ... అప్పడాల కర్రతో బాలరాజు తల మీద ఒక్కటిచ్చుకుంది కుటుంబరావు పెద్దచెల్లె. ఈ దెబ్బతో బాలరాజుకు పట్టపగలే చుక్కలు కనిపించి మతిచలించింది. రెండు రోజుల తరువాత కుటుంబరావు మామ గుర్నాథం వచ్చి...‘‘జరిగింది పీడకల అనుకుందాం. అందరం మునపటిలా కలిసి ఉందాం’’ అన్నాడు. అలా అన్నాడో లేదో ‘హాచ్’ అని బలంగా తుమ్మింది కుటుంబరావు తమ్ముడి భార్య పంకజం. ఆమె తుమ్ము ధాటికి పైన ఉన్న పెద్ద పాత గడియారం ఊడి గుర్నాథం తల మీద పడింది. ఆ దెబ్బకు ఆయన మతిచలించింది. ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడని కుటుంబరావు భార్య అప్పుడు గొంతులో నిప్పులు పోసుకొని ఆవేశంగా ఇలా మాట్లాడింది...‘‘నాకుంది ఒకే ఒక అమ్మ. ఆమెను పిచ్చిదాన్ని చేశారు. నాకుంది ఒకే ఒక తమ్ముడు. వాడ్ని పిచ్చివాడిని చేశారు. నాకుంది ఒకే ఒక నాన్న. ఆయన్ని పిచ్చివాడ్ని చేశారు. ఇక్కడ ఉంటే నాకు కూడా పిచ్చెక్కించేలా ఉన్నారు. ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండలేను’’ అంటూ ఇంటిని విడిచి పుట్టింటికి వెళ్లిపోయింది కుటుంబరావు భార్య.పుట్టింటికి వెళ్లిన కుటుంబరావు భార్య తన సొంతకాళ్ల మీద ఎలా నిలబడింది అనేదాన్ని పది ఎపిసోడ్లు లాగించవచ్చు. పిచ్చి వాళ్లయిన అమ్మ, నాన్న, తమ్ముళ్లను మళ్లీ మూమూలు స్థితికి ఎలా తీసుకువచ్చిందనేది మరో పది ఎపిసోడ్లు లాగించవచ్చు.‘విలన్ మీరు కాదు. మేము కాదు. విధి లిఖితమైన తుమ్ము మాత్రమే’ అని ఇరువర్గాలు ఒక అండర్‌స్టాండింగ్‌కు వచ్చిన పరిస్థితి గురించి మరో పది ఎపిసోడ్లు లాగించవచ్చు’’ అని ముగించాడు విక్రమార్కుడు. ‘శబ్బాష్ రాజా!’ అంటూ విక్రమార్కుడి భుజంపై నుంచి ఎగిరిపోయాడు బేతాళుడు. – యాకుబ్ పాషా -
మూడు ‘ముళ్ల’బంధం..
రమేష్, రాణి ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి మరీ వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లు బాగానే కలిసి ఉన్నారు. ఇరువురి మధ్య వివాదాలు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో రమేష్ తాగుడికి బానిసయ్యాడు. అతడి భార్య రాణి భర్తతో కాపురం చేయడం కష్టమని తాను తనతో ఉండలేనని చెప్పి పోలీసులనుఆశ్రయించింది. కిరణ్, లక్ష్మిలది పెద్దల కుదిర్చిన వివాహం.. ఏడాది కాపురానికి ఫలితంగా ఓ పాప కూడా ఉంది. కొన్నాళ్లకు కిరణ్, లక్ష్మిల మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. భార్య ఫేస్బుక్లో వేరొకరితో చాట్ చేస్తుందనేది కిరణ్ వాదన. పెద్దల మధ్య పంచాయతీ పెట్టాడు. వారిద్దరూ విడిపోయిందుకు సిద్దమయ్యారు. రాజమహేంద్రవరం :వీరే కాదు.. ఇలా ఎన్నె సంఘటనలు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. పంతాలు.. పట్టింపులు.. ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం.. అక్రమసంబంధాలు.., టీవీ సీరియళ్లు.. సోషల్‌మీడియా ప్రభావం.. ఇలా ఎన్నో కారణాలతో పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. వివాహబంధం విచ్ఛిన్నమై విడాకుల వరకు వెళుతోంది. ముఖ్యంగా ప్రేమ వివాహాలు అతికొద్ది సమయంలోనే అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. అసలెందుకు ఇలా జరుగుతోంది?. వాటి కారణాలను విశ్లేషిస్తూ సాక్షి ప్రత్యేక కథనం.. వధువు అభిప్రాయానికి విలువ లేదు.. మన సమాజంలో నక్షత్ర బలం, జాతకాలు, వియ్యం అందుకునే వారు మనతో సరితూగుతారా? ఆస్తులు, పాస్తులు వంటివి ఆలోచించే తల్లిదండ్రులు అమ్మాయి ఇష్టాలను చూడకుండా కొన్ని సందర్భాల్లో వివాహాలు చేయడం వల్ల పెళ్లిళ్లు విఫలమవుతున్నాయి. విదేశాల్లో వివాహానికి ముందు వధూవరులకు కౌన్సెలింగ్ ఇస్తారు. ఇరువురి లోపాలు తెలుసుకుంటారు. మన సమాజంలో కూడా వధూవరులకు వివాహానికి ముందే కౌన్సెలింగ్ ఇచ్చే ఏర్పాట్లు చేయడం వల్ల కొంత వరకూ వివాహాలు నిలిచే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. అక్రమ సంబంధాలతో సంసారంలో చిచ్చు టీవీ సీరియల్స్, సినిమాలు, వాట్సప్, ఫేస్ బుక్, తదితర సోషల్ మీడియాలు సంసారాలపై విపరీతమైన ప్రభావం చూపిస్తున్నాయి. ప్రస్తుతం వస్తున్న సీరియల్స్, సినిమాల్లో ప్రేమ, హింస, అక్రమ సంబంధాలు తదితర కథాంశాలు ప్రసారమవుతున్నాయి. భర్త డ్యూటీ నిమిత్తం ఎక్కడో పని చేసుకొని వారం పది రోజులకోసారి వచ్చే కుటుంబాల్లో, ప్రతిరోజూ ఇంటికి వచ్చే కుటుంబాల్లోనూ ఈ టీవీ సీరియళ్లు, సినిమాలు, సోషల్ మీడియాలో వచ్చే కథలు ఒంటిరిగా ఉండే మహిళలపై విపరీతమైన ప్రభావం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమ సంబంధాలకు దారి తీసి.. చివరికి భర్తనే హత్య చేసేంత స్థాయికి చేరుతున్నాయి. సంసారాన్ని కూలదీస్తున్న సెక్షన్ 498ఏ కేసులు సంసారంలో చిన్న విభేదాలు వచ్చి పోలీస్ స్టేషన్‌కు వెళితే వరకట్న వేధింపుల కేసులు, పెట్టి భర్త, అత్తమామలు, ఆడపడుచులపై కేసులు పెడుతున్నారు. దీని వల్ల మొత్తం కుటుంబం పోలీస్ స్టేషన్, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీంతో ఇరువురి కుటుంబాల్లో ఎడబాటు పెరుగుతోంది. కొంత వరకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి సంసారాలు నిలబెడుతున్న సందర్భాలూ ఉన్నాయి. పెళ్లిళ్లు నిలబడాలంటే ముందుగా వధూవరులు అర్థం చేసుకునేలా కౌన్సెలింగ్ ఇవ్వడం, ముందుగానే ఇరు కుటుంబాల వారు స్థితిగతులు అర్ధం చేసుకోవడం, వంటివి చేయాలని సూచిస్తున్నారు. మహిళా పోలీస్ స్టేషన్లో నమోదైన విడాకుల కేసులు ♦ 2016 సంవత్సరంలో 1023 కేసులు నమోదయ్యాయి. వీటిలో 926 కేసులకు ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఇచ్చి పోలీసులు సర్దుబాటు చేశారు. 97 కేసులలో ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ♦ 2017లో 1124 కేసులు నమోదు కాగా 1004 కేసులకు ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఇచ్చారు. 120 కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ♦ 2018 మే 31 వరకూ 521 కేసులు నమోదు కాగా 381 కేసుల్లో కౌన్సెలింగ్ ఇచ్చి సర్దుబాటు చేశారు. 73 కేసుల్లో ఎఫ్ఐఆర్లు వేశారు. -
చిన్నారి ప్రాణం తీసిన టీవీ సీరియల్
కోల్‌కతా : టీవీ సీరియల్లో వచ్చిన ఆత్మహత్య సీన్‌ను అనుకరించి ఓ ఏడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన కోల్‌కతా, ఇచ్చాపుర్ పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన చోటుచేసుకున్న సమయంలో ఆ చిన్నారి రెండు నెలల తమ్ముడు మినహా ఇంట్లో ఎవరూ లేరు. బ్యాంక్‌లో డబ్బు డిపాజిట్ చేయడానికి ఆ చిన్నారి తల్లి బయటకు వెళ్లగా.. తండ్రి రోజువారి పని మీద వెళ్లాడు. అయితే ఆ తల్లి తన పిల్లలను ఓ కంట కనిపెట్టమని, పక్కింటి వారికి సైతం చెప్పింది. కానీ ఆమె తిరొగొచ్చేసరికి స్కార్ఫ్‌తో ఉరేసుకున్న తన బిడ్డ కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు పేర్కొన్నారు. ఆ చిన్నారి రోజు సీరియల్స్‌లో వచ్చే సీన్స్‌ను అనుకరించేదని, వాటిని చూసి తామంతా మురిసిపోయేవాళ్లమని, కానీ ఇంతటీ ఘోరం జరుగుతుందని ఊహించలేదంటూ ఆ బాలిక బంధువులు కన్నీటీ పర్యంతమయ్యారు. టీవీ సీరియల్లో చూసిన సీన్‌ను అనుకరించబోయి ఆ చిన్నారి మృతి చెందినట్లు తెలుస్తోందని, పోస్ట్‌మార్టన్ రిపోర్ట్ కోసం వేచి చూస్తున్నామని ఓ సీనియర్ పోలీస్ అధికారి మీడియాకు తెలిపారు. ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇది తొలిసారేం కాదు. గతేడాది సైతం ఓ ఏడేళ్ల చిన్నారి సీరియల్లో వచ్చిన సీన్‌ను చూసి అగ్నికి ఆహుతైంది. మీరట్‌లో ఓ ఎనిమిదేళ్ల బాలిక ఓ క్రైమ్ సిరీయల్‌ను చూసి బలవన్మరణానికి పాల్పడింది. అప్పట్లో ఈ ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. పిల్లలు చూసే సీరియల్స్, టీవీ షోల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటనలు హెచ్చరిస్తున్నాయి. -
టీవీ సీరియల్స్ చేస్తాను: ఇలియానా
సాక్షి, ముంబయి: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి అక్కడే సెటిలైన హీరోయిన్లలో గోవా సుందరి ఇలియానా ఒకరు. తాను టీవీ సీరియల్స్ లో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇలియానా చెప్పగానే, ఇక సిల్వర్ స్క్రీన్ నుంచి ఆమె తప్పుకోనుందేమోనని ఇండస్ట్రీ వర్గాలు ఒక్కసారిగా షాక్ తిన్నాయి. అసలు విషయం ఏంటంటే.. ఇటీవల ఇలియానా చేసిన వ్యాఖ్యలను కొందరు దుష్ప్రచారం చేయడమే అందుకు కారణం. తాను నటించిన మూవీ ముబారకన్ శనివారం సోని మ్యాక్స్ లో ప్రసారం అవుతుందని అందరూ మూవీని చూడాల్సిందిగా నటి ఇలియానా ప్రమోట్ చేసుకున్నారు. దీనిపై కొందరు స్పందిస్తూ.. ఎన్నో సినిమాల్లో నటించారు, బుల్లితెరపై కనిపించే ఆలోచన లేదా అంటూ ఆమెను అడిగారు. సీరియల్స్ లో నటిస్తానని కచ్చితంగా చెప్పలేను. అయితే ఛాలెంజింగ్ రోల్ దొరికితే టీవీ సీరియల్స్ లో కనిపించేందుకు తనకు ఏ ఇబ్బంది లేదన్నారు ఇలియానా. సినిమా నచ్చితే థియేటర్లకు మళ్లీ మళ్లీ వచ్చి చూసి ప్రేక్షకులు మమ్మల్ని ఆధరిస్తారు. సీరియల్స్ లో అలాంటి అవకాశం ఉండదు. కీలకపాత్ర వస్తే మాత్రం బుల్లితెరపై కనిపించేందుకు వెనుకాడనని స్పష్టం చేశారు. అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించిన ముబారకన్ లో అనిల్ కపూర్, అతియా శెట్టి, అర్జున్ కపూర్ లు ప్రధాన పాత్రలు పోషించారు. -
అమ్మానాన్న ఆశీస్సులతోనే నటన
మామిడికుదురు: ‘మాటీవీ’లో ప్రచారమవుతున్న ‘సుందరకాండ’, ‘శ్రీనివాస కల్యాణం’తో పాటు గతంలో ప్రచారమైన ‘సీతామహలక్ష్మి’ తదితర టీవీ సీరియల్స్‌లో బాల నటుడిగా మెప్పించి, పలువురి ప్రశంసలు అందుకున్న ఆరేళ్ల ‘నేహాంత్’ ప్రస్తుతం ఒకటవ తరగతి చదువుతున్నాడు. అప్పనపల్లిలో జరుగుతున్న ‘నిన్నే చూస్తూ’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న నేహాంత్ గురువారం కొద్ది సేపు స్థానిక విలేకర్లతో ముచ్చటించాడు. నాన్న కృష్ణమూర్తి, అమ్మ లక్ష్మి ఆశీస్సులతో చిత్ర రంగంలో ప్రవేశించానన్నాడు. మొదటి నుంచి తనకు నటన అంటే ఎంతో ఇష్టమని, తన ఇష్టానికి అనుగుణంగా తల్లిదండ్రులు ప్రోత్సహించారని చెప్పాడు. మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఇంటి దగ్గర తీరిక సమయంలో వారినే అనుకరిస్తూ ఉంటానని అన్నాడు. తన ఇష్టదైవం ఆంజనేయస్వామి పాత్రను ‘సుందరకాండ’ టీవీ సీరియల్లో నటించడం ఆనందంగా ఉందన్నాడు. టీవీల్లో సీరియల్స్‌లో హాస్యాన్ని పండించే వివిధ పాత్రల్లో ఇంత వరకు మూడొందలకు పైగా ఎపిసోడ్స్‌లో నటించానని చెప్పాడు. ‘నిన్నుకోరి’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’, ‘అజ్ఞాతవాసి’ చిత్రాల్లో నటించానని, ‘నిన్నే చూస్తూ’ తనకు అయిదవ చిత్రమని తెలిపాడు. తమది హైదరాబాద్ అని, కోనసీమ ప్రాంతానికి రావడం ఇదే మొదటిసారన్నాడు. పచ్చని కొబ్బరి చెట్లు, గోదావరి అందాలు, ఇక్కడి ప్రజలు చూపే ఆదరణ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని పేర్కొన్నాడు. -
ప్రీమియర్ రైళ్లలో సినిమాలు చూడొచ్చు
న్యూఢిల్లీ: ప్రీమియర్ రైళ్లలో ప్రయాణించే వారు త్వరలోనే తమ ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లలో టీవీ సీరియల్స్, సినిమాలు చూసే అవకాశం లభించనుంది. ఆదాయం పెంచుకునే చర్యల్లో భాగంగా రైల్వే శాఖ కంటెంట్ ఆన్ డిమాండ్ సర్వీసుతో పాటు రేడియో సర్వీసును తీసుకురానుంది. కంటెంట్ ఆన్ డిమాండ్ సర్వీసును పొందేందుకు ప్రయాణికులు కొంత రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. రేడియో సర్వీసును మాత్రం ఉచితంగా అందించనున్నారు. మొదటగా రాజధాని, శతాబ్ది, దురంతో, హమ్‌సఫర్ రైళ్లలో ఈ సర్వీసును ప్రవేశపెడతారు. -
రైళ్లలోనూ సీరియల్స్ చూడొచ్చు!
న్యూఢిల్లీ: అత్యాధునిక మార్పులకు శ్రీకారం చుడుతున్న ఇండియన్ రైల్వేస్.. ప్రయాణికుల అభిరుచులకు తగినట్లుగా సకల సర్వీసులను అందించే ప్రయత్నం చేస్తోంది. ప్రయాణం కారణంగా టీవీ సీరియల్స్ చూడలేకపోయామనే బెంగ లేకుండా.. రైల్వే స్టేషన్లు, బోగీల్లోనే ప్రసారాలు అందుబాటులో ఉండేవిధంగా ప్రణాళికలు వేస్తోంది. వొడాఫోన్, ఐడియా, ఎయిర్టెల్ లాంటి టెలీకం దిగ్గజాల ద్వారా రైల్ రేడియో సర్వీసెస్, కంటెంట్ ఆన్ డిమాండ్‌ను అందుబాటులో తీసుకువస్తోంది. వీడియో స్ట్రీమింగ్ ఆధారంగా టీవీ సీరియళ్లు, సినిమాలు, షార్ట్ వీడియోలు, చిన్న పిల్లల ప్రోగ్రామ్‌లు ప్రసారం అయ్యేలా కసరత్తు మొదలుపెట్టినట్లు బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూప్ (బీసీజీ) వెల్లడించింది. -
అంతులేని కథలు..
టీవీ సీరియళ్లు కొన్ని ఏళ్లకేళ్లు సాగుతుంటాయి. ఆ కథలకు అంతుండదు. ఎక్కడ ప్రారంభమై, ఎక్కడ ముగుస్తాయో నిర్వాహకులే చెప్పలేరు. ప్రేక్షకుల ఆదరణ ఉన్నంత కాలం కొనసాగిస్తూనే ఉంటారు. ఒకవేళ వీక్షకుల్ని ఆకట్టుకోకపోతే, ఉన్నట్టుండి సీరియల్‌ను ముగించేస్తారు. కొన్ని సీరియళ్లు, మాత్రం వీక్షకుల ఆదరణతో ఏళ్ల తరబడి సాగుతుంటాయి. మధ్యలో చిన్న విరామం తీసుకున్నప్పటికీ, అదే కాన్సెప్టుతో కూడిన కొత్త సిరీస్‌ని మళ్లీ మొదలెడతారు. దీంతో అవి దశాబ్దాలపాటు సాగుతుంటాయి. ఇలా టెలివిజన్ చరిత్రలో అత్యధిక కాలం ప్రసారమైన సీరియళ్ల గురించి తెలుసుకుందాం.. ద గైడింగ్ లైట్ (57 ఏళ్లు).. టెలివిజన్ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రసారమైన సీరియల్ ఇదే. అమెరికాకు చెందిన సీబీఎస్ చానెళ్లో ఈ సీరియల్ దాదాపు 57 ఏళ్ల పాటు ప్రసారమైంది. అత్యంత ఎక్కువ కాలం ప్రసారమైన సీరియల్ కాబట్టి, దీనికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కింది. 1952 జూన్ 30న తొలి ఎపిసోడ్ ప్రసారం కాగా, 2009, సెప్టెంబర్ 18న చివరి ఎపిసోడ్ ప్రసారమైంది. బుల్లితెరపై ప్రసారం కాక ముందు 1937 నుంచి పదిహేనేళ్లపాటు ఇది అమెరికాలోని ఎన్బీసీ రేడియోలో టెలికాస్ట్ అయ్యింది. అటు టీవీలో, ఇటు రేడియోలో ప్రసారమైన ధారావాహికగా చూస్తే ఇది 72 ఏళ్లపాటు ప్రేక్షకుల్ని అలరించింది. మొత్తం 18,262 ఎపిసోడ్లుగా ఇది వీక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రారంభంలో రోజూ పదిహేను నిమిషాలు మాత్రమే టెలికాస్ట్ అయ్యేది. అయితే ప్రేక్షకుల ఆదరణ బావుండడంతో క్రమంగా అరగంట, గంటపాటు కూడా ప్రసారమైంది. కానీ క్రమంగా ప్రేక్షకుల ఆదరణ తగ్గడంతో ఈ సీరియల్ 2009లో ఆగిపోయింది. యాజ్ ద వరల్డ్ టర్న్స్ (54 ఏళ్లు) టీవీ ప్రేక్షకుల్ని అత్యధిక కాలం అలరించిన రెండో సీరియల్ యాజ్ ద వరల్డ్ టర్న్స్. 54 ఏళ్లపాటు టీవీలో ప్రసారమైన ఈ సీరియల్ తొలి ఎపిసోడ్ 1956 ఏప్రిల్ 2న ప్రారంభమైంది. చివరి ఎపిసోడ్ 2010, సెప్టెంబర్ 17న ప్రసారమైంది. అమెరికాలోని సీబీఎస్ చానెళ్లో ఇది ప్రసారమయ్యేది. ఇర్నా ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన ఈ యాజ్ ద వరల్డ్ టర్న్స్ను ‘ద గైడింగ్ లైట్’కి సిస్టర్ షోగా పిలిచేవారు. ఈ సీరియల్ ఎక్కువగా న్యూయార్క్‌లోని మన్హట్టన్లోనే షూటింగ్ జరుపుకొంది. 1956లో ఇది రోజూ మధ్యాహ్నం పదిహేను నిమిషాలు మాత్రమే ప్రసారమయ్యేది. ఆ తర్వాత రోజూ సాయంత్రం నాలుగున్నర గంటలకు మారి, అరగంట ప్రసారమయ్యేది. పన్నెండేళ్ల ప్రసారమయ్యాక వీక్షకుల ఆదరణ బావుండడంతో గంట పాటు టెలికాస్ట్ చేసేవారు. కుటుంబ కథా నేపథ్యంతో రూపొందిన ఈ సీరియల్ పూర్తయ్యేవరకు దాదాపు 13,000 ఎపిసోడ్లు ప్రసారమైంది. జనరల్ హాస్పిటల్ (54 ఏళ్లు).. 1963 ఏప్రిల్ 1న తొలిసారిగా ప్రారంభమైన ఈ అమెరికన్ సీరియల్ ఇప్పటికీ ప్రసారమవుతుండడం విశేషం. ఇప్పటివరకు దాదాపు 54 ఏళ్లుగా జనరల్ హాస్పిటల్ వీక్షకుల్ని అలరిస్తూనే ఉంది. మధ్యలో కొన్నిసార్లు విరామం తీసుకుని, తర్వాత కొత్త సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. టీవీ హిస్టరీలో అత్యధిక కాలం ప్రసారమైన మూడో సీరియల్గానే కాక, అత్యధిక కాలం నిర్మాణంలో ఉన్న సీరియల్‌గా కూడా ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. ఫ్రాంక్ అండ్ డోరిస్ హర్స్‌లీ అనే దంపతులు దీనికి రచన చేశారు. పోర్ట్ చార్లిస్ అనే ఒక కల్పిత నగరంలోని హాస్పిటల్ నేపథ్యంగా ఈ సీరియల్ సాగుతుంది. 2003లో టీవీ గైడ్ అనే ఓ సంస్థ జనరల్ హాస్పిటల్‌ను సీరియల్ ఆఫ్ ఆల్‌టైమ్‌గా ప్రకటించింది. ద యంగ్ అండ్ రెస్ట్‌లెస్ (44 ఏళ్లు).. అమెరికాలోని సీబీఎస్ చానళ్లో ప్రసారమవుతున్న ద యంగ్ అండ్ రెస్ట్‌లెస్ 44 ఏళ్లుగా కొనసాగుతుండడం విశేషం. తొలి ఎపిసోడ్ 1973 మార్చి 26న ప్రసారమైంది. అప్పటినుంచి 1980 వరకు వారానికి ఐదు రోజుల చొప్పున, రోజూ అరగంటపాటు ఇది ప్రసారమయ్యేది. అనంతరం ప్రసార సమయం గంటకు పెరిగింది. గత ఏడాది సెప్టెంబర్ వరకు ఈ సీరియల్ 11 వేల ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. అమెరికాలోనే కాకుండా ఇతర దేశాల్లో సైతం స్థానిక చానళ్లలో ఇది ప్రసారమవుతోంది. విస్కన్సిన్ రాష్ట్రంలోని జినోవా అనే ఒక కల్పిత నగరంలోని వ్యక్తుల జీవితాల ఆధారంగా ఈ సీరియల్ కొనసాగుతోంది. డేస్ ఆఫ్ అవర్ లైవ్స్ (51 ఏళ్లు).. 1965లో తొలిసారిగా ప్రసారమైన డేస్ ఆఫ్ అవర్ లైవ్స్ ఇప్పటికీ కొనసాగుతుండడం విశేషం. అమెరికాలోని ఎన్బీసీ చానళ్లో 1965, నవంబర్ 8న ఈ సీరియల్ ప్రారంభమైంది. 51 ఏళ్లుగా ప్రసారమవుతున్న ఈ సీరియల్ ఈ ఏడాది ఫిబ్రవరి 24 నాటికి 13,032 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. 1965 నుంచి 1975 వరకు తొలుత రోజు అరగంట మాత్రమే ప్రసారమయ్యేది. కానీ ప్రేక్షకాదరణ బావుండడంతో 1975 ఏప్రిల్ 21 నుంచి రోజూ అరగంటపాటు ప్రసారమయ్యేది. సాలెమ్ అనే ఒక కల్పిత నగరంలో ఉండే కొన్ని కుటుంబాలు, వారి మధ్య సంఘర్షణలతో ఈ సీరియల్ రూపొందింది. అమెరికాలోనే కాకుండా ఇతర దేశాల్లో సైతం ఇది ప్రసారమైంది. 2013 వరకు ఆన్లైన్లో డేస్ ఆఫ్ అవర్ లైవ్స్ రీ టెలికాస్ట్ అయ్యేది. వన్ లైఫ్ టు లివ్ (45 ఏళ్లు).. ఇది కూడా అమెరికన్ సీరి యలే. 1968 నుంచి 2012 వరకు దాదాపు 45 ఏళ్లపాటు ఇది ప్రసారమైంది. అమెరికాలోని ఏబీసీ చానళ్లో 1968 జూలై 15న తొలి ఎపిసోడ్ ప్రసారం కాగా, చివరి ఎపిసోడ్ 2012 జనవరి 13న ప్రసారమైంది. కానీ చివరి సిరీస్‌ను 2013 ఏప్రిల్ 29 నుంచి ఆగస్టు 19 వరకు ఆన్లైన్లో ప్రసారం చేశారు. పెన్సిల్వేనియాలోని లియాన్ వ్యూ అనే ఒక కల్పిత నగరంలోని కొంత మంది వ్యక్తుల జీవితంలోని సంఘటనల ఆధారంగా వన్ లైఫ్ టు లివ్ సాగుతుంది. 45 ఏళ్లపాటు ప్రేక్షకుల్ని అలరించి, అత్యధిక కాలం ప్రసారమైన ఐదో సీరియల్‌గా నిలిచింది. – సాక్షి, స్కూల్ ఎడిషన్ -
ఇక యప్ టీవీ సీరియల్స్...
సొంతంగా షూటింగ్; ఇప్పటికే 10 ఎపిసోడ్లు పూర్తి ♦ త్వరలో ఓ స్పోర్ట్స్, తెలుగు చానల్‌తో ఒప్పందాలు ♦ దీంతో ఆ చానల్స్ కార్యక్రమాలు యప్ టీవీకే పరిమితం! ♦ నెలకు రూ.99కే 250 చానల్స్ ప్రసారం; వీక్షకులు 50 లక్షలకు పైనే ♦ ఇప్పటికే రూ.680 కోట్ల నిధుల సమీకరణ పూర్తి ♦ ‘సాక్షి’తో యప్ టీవీ ఫౌండర్, సీఈఓ ఉదయ్ నందన్ రెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యప్ టీవీ అంటే!! ప్రాంతీయ టీవీ చానెల్స్‌తో ఒప్పందం చేసుకొని.. ఆయా కార్యక్రమాలను విదేశాల్లో ప్రసారం చేసే ఆన్లైన్ వేదికగా అభివర్ణిస్తారు. కానీ ఇపుడా యప్ టీవీ సొంతంగా సీరియల్స్‌ను నిర్మిస్తోంది. ఇప్పటికే 10 ఎపిసోడ్స్ నిర్మాణమూ పూర్తయింది. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది కూడా! ‘‘అంతేకాదు!! తొలిసారిగా ఓ స్పోర్ట్స్ చానెల్, ఓ తెలుగు చానెల్‌తో ఎక్స్‌క్లూజివ్ ఒప్పందం చేసుకుంటున్నాం. దీంతో వాటి కార్యక్రమాలు యప్ టీవీలో మాత్రమే ప్రసారమవుతాయి’’ అంటూ తమ విస్తరణ ప్రణాళికలు, భవిష్యత్ కార్యాచరణ గురించి యప్ టీవీ ఫౌండర్ సీఈఓ ఉదయ్ నందన్ రెడ్డి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధికి చెప్పారు. వివరాలు ఆయన మాటల్లోనే... యప్కు బీజం ఇలా..: నోర్టెల్ నెట్వర్క్స్, సిమెన్స్ వంటి టెలికం కంపెనీల్లో దశాబ్ద కాలంపైనే పనిచేశా. టెలికం బూమ్‌తో విధుల నిమిత్తం చాలా దేశాలు తిరిగా. ఎక్కడికెళ్లినా నాకెదురైన ప్రధాన సమస్య.. అక్కడి టీవీల్లో మన భాషలోని చానెల్స్ రాకపోవటమే! టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందాక కూడా ఇదేంటని అనిపించేది. అదే యప్ టీవీ పునాదికి బీజం వేసింది. సాంకేతికత అభివృద్ధి, దక్షిణాది చానెల్స్‌తో ఒప్పందాలు, మార్కెటింగ్ కోసం మూడేళ్లు శ్రమించి రూ.2 కోట్ల పెట్టుబడితో జార్జియా ప్రధాన కేంద్రంగా 2006లో యప్ టీవీని ఆరంభించాం. ఒక్క మాటలో... స్థానిక భాషల్లోని టీవీ చానెల్స్‌తో ఒప్పందం చేసుకొని వాటి కంటెంట్‌ను ఇంటర్నెట్ ద్వారా ఎవరైనా, ఎక్కడైనా, ఏ డివైజ్‌లోనైనా చూసుకునేదే యప్ టీవీ. 250 చానెల్స్; 25 వేల గంటల కంటెంట్..: ప్రస్తుతం ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక దేశాల్లోని 250 టీవీ చానల్స్‌తో ఒప్పందం చేసుకున్నాం. వీటిలో 102 వినోద చానెల్స్, 16 సినిమా, 30 మ్యూజిక్, 85 న్యూస్, 40 ఆధ్యాత్మిక చానెళ్లున్నాయి. వాటి కార్యక్రమాలు లైవ్ లేక రికార్డింగ్వి యప్ టీవీలో చూసుకోవచ్చు. ప్రస్తుతం మా టీవీలో 25 వేల గంటల నిడివి గల వీడియో కంటెంట్ ఉంది. సినిమాల కోసం యప్ ఫ్లిక్స్, షార్ట్ ఫిల్మ్సŠ, వెబ్ సీరియల్స్ కోసం యప్ బజార్ ఉన్నాయి. నెలకు రూ.99; వీక్షకులు 50 లక్షలకు పైనే ప్రస్తుతం ట్యాబ్లెట్స్, పీసీ, స్మార్ట్‌ఫోన్స్ ఇలా 27 రకాల డివైజ్‌ల ద్వారా... అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్, యూకే, మలేషియా, న్యూజిలాండ్, కరేబియన్, మధ్యప్రాచ్య దేశాలకు చెందిన 50 లక్షల మంది యప్ టీవీని చూస్తున్నారు. నెలకు చందా ధర రూ.99. అమెరికాలో అయితే నెలకు 20 డాలర్లు. ఇందులో 65–70 శాతాన్ని చానల్స్‌కు చెల్లిస్తాం. మిగిలింది మా ఆదాయం. ప్రస్తుతం 80 లక్షల యప్ టీవీ యాప్స్ డౌన్లోడ్ అయ్యాయి. రూ.680 కోట్ల నిధుల సమీకరణ పూర్తి... 2017 ముగింపు నాటికి రూ.350 కోట్ల ఆదాయాన్ని లకి‡్ష్యస్తున్నాం. ఇప్పటికే సగానికి పైగా చేరుకున్నాం. ఇప్పటివరకు 2 రౌండ్లలో రూ.680 కోట్లు సమీకరించాం. గత అక్టోబర్‌లో అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్ ఎమరాల్డ్ 50 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఇటీవల అమెరికన్ రిలైబుల్ ఐపీటీవీని సబ్స్క్రిప్షన్ విధానంలో కొన్నాం. అవకాశముంటే విదేశాల్లోని చానల్స్‌నూ కొనుగోలు చేస్తాం. ఎక్స్‌క్లూజివ్ ఒప్పందాలు.. హైదరాబాద్‌లో స్థానిక నటులతో ఒక సీరియల్ తీస్తున్నాం. ఇప్పటికే 10 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. ఫిబ్రవరిలో తెలుగు, తమిళ భాషల్లో... తర్వాత మరాఠీ, బెంగాలీలో ప్రసారం చేస్తాం. 2017 ముగింపు నాటికి 20–25 ప్రోగ్రామ్స్‌ను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. త్వరలో ఒక స్పోర్ట్స్ చానల్, తెలుగు చానల్‌తో ఎక్స్‌క్లూజివ్ ఒప్పందాలు చేసుకుంటాం. దీంతో వాటి కార్యక్రమాలు యప్ టీవీలో మాత్రమే ప్రసారమవుతాయి. ఈ అవకాశం ముందుగా అమెరికా సబ్‌స్క్రైబర్స్‌కు మాత్రమే ఇస్తాం. -
ఆ కోరిక ఇంకా తీరలేదు!
టీవీ సీరియల్స్, ప్రోగ్రామ్స్ చూసేవాళ్లకి చిరపరిచితుడు. లైవ్‌షోస్ అలవాటున్నవారు లైక్ కొట్టే మాస్టర్ ఆఫ్ సెర్మనీ. అనుకరణ కళాభిమానులకు మిమిక్రీ మిస్సైల్. సినిమా ప్రేక్షకులకీ తెలిసినోడు... యాడ్సలోనూ కనిపిస్తాడు. ప్రైవేటు సంస్థల బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రత్యక్షమవుతాడు. స్టాండప్ కామెడీ నుంచి షార్ట్ ఫిల్మ్‌ల దాకా... ఒక రంగంలో సక్సెస్ అయితే అక్కడే అతుక్కుపోయి ఫ్యూచర్‌ను వెతుక్కునే ధోరణికి దూరంగా, నచ్చిన ప్రతి రంగానికీ దగ్గరగా తనను తాను నిత్య నూతనంగా మలచుకుంటున్న లోహిత్ కుమార్ తన గురించి ‘సాక్షి’తో పంచుకున్న కబుర్లు ఆయన మాటల్లోనే... ఎంటర్టైన్మెంట్... ఓ సెంటిమెంట్... మాది వరంగల్ జిల్లాలోని పెదవోడూరు గ్రామం. రైతు కుటుంబం. నాకో అన్నయ్య ఉన్నాడు. ప్రస్తుతం ప్రభుత్వోద్యోగి. ఆవులు, గేదెలు, దూడలు, పక్షులు, పిట్టల పలకరింపులు వింటూ... వాటిని అనుకరిస్తూ పెరిగాను. అదే నా తొలి మిమిక్రీ స్కూల్ అని చెప్పాలి. స్నేహితులు, బంధువుల సమూహం ఎక్కడ కనపడినా వారిని ఏదో ఒక రకంగా ఎంటర్టైన్ చేయడం నాకలవాటు. బహుశా అదే ఇంకా కంటిన్యూ అవుతోందనుకుంటా. చిన్నప్పుడు అబ్బిన మిమిక్రీ కాలేజీడేస్‌లో స్టేజ్ ప్రోగ్రామ్స్‌తో పాటు యాడ్స్‌లోనూ భాగం అయ్యేలా చేసింది. అలా డిగ్రీ చదివేటప్పుడే నేను సెల్ఫ్ ఎంప్లాయ్డ్ అయిపోయా. అందుకేనేమో... నాకెప్పుడూ ఫ్యూచర్ గురించి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కలగదు. కొత్త కొత్త రంగాలవైపు నా ప్రయాణం ఆగలేదు. అనుకరిస్తూ... అనుభూతిస్తూ... గుంటూరులోని హిందూ కాలేజ్ ద్వారా మిమిక్రీలో వరుసగా 3 సార్లు స్టేట్ ఫస్ట్ వచ్చాను. కేవలం 15 నిమిషాల్లో 150 శబ్ధాలు పలికించి తక్కువ టైమ్‌లో అత్యధిక శబ్ధాలు అనుకరించిన కళాకారుడిగా 1992లో లిమ్కాబుక్‌లోకి ఎక్కాను. ఈ రికార్డ్ ఇప్పటికి అలాగే నా పేరు మీదే ఉంది. ప్రతిరోజూ ఒక కొత్త వాయిస్ సాధన చేయడం నాకు అలవాటు. కమల్ హాసన్ వాయిస్ అనుకరణతో బాగా పేరొచ్చింది. వ్యక్తిగతంగా టాలీవుడ్ విలన్ షియాజీ షిండే వాయిస్ ఇష్టం. వేదిక ఎక్కితే వినోదం పంచడమే నాకు తెలుసు. అందుకు ఎలాంటి అవకాశం వచ్చినా వదులుకోను. ఆ క్రమంలోనే పరిచయస్థుల సూచనమీద ఓ ప్రోగ్రామ్‌లో ఎమ్సీ (మాస్టర్ ఆఫ్ సెర్మనీ) గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వేల సంఖ్యలో ఎమ్సీగా చేశాను. . సీరియల్స్ టూ సినిమాస్... బాపుగారి బుడుగు టివి సీరియల్లో నటించే అవకాశం వచ్చినప్పుడు నాకు 24 ఏళ్లు. అప్పటి నుంచి ఇక వెనుతిరిగి చూడకుండా 17కి పైగా సీరియల్స్ చేశాను. మనసు చూడతరమా? పుత్తడిబొమ్మ, గోరింటాకు, మేఘమాల... ఇలాంటి సూపర్‌హిట్స్ ఉన్నాయి. యండమూరి లేడీస్ హాస్టల్లో మెయిన్ క్యారెక్టర్ చేశాను. ఒకేసారి 6 సీరియల్స్‌కి చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న రోజుల్లోనూ ఇతర అభిరుచుల్ని, కొత్తవి నేర్చుకోవడాన్ని మానలేదు. సీనియర్దర్శకుడు కోదంరామిరెడ్డి తీసిన 2 షార్ట్ ఫిల్మ్స్‌లో లీడ్‌రోల్స్ చేశాను. ఇక ఇప్పుడు సినిమాల మీదే ఎక్కువ దృష్టి పెట్టాను. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన స్నేహగీతం సహా ఇప్పటిదాకా 15 సినిమాల వరకూ చేసుంటాను. ఓ మనసు, రాంగ్‌రూట్, అక్షరం, సతీ తిమ్మమాంబ తదితర చిత్రాల్లో నటిస్తున్నాను. అగ్నిసాక్షిగా, దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రూపొందించిన లేడీస్ అండ్ జెంటిల్మన్ విడుదల కానున్నాయి. కమెడియన్‌గా, విలన్‌గా, కామెడీ విలన్‌గా చేయాలనే కోరిక తీరాలి. ఏ స్టేజ్‌లో ఉన్నా స్టేజ్ మీదే... షూటింగ్ లేకపోతే యాంకరింగ్ అది లేకపోతే మిమిక్రీ, అది లేకపోతే ఎమ్సీగా... ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. అభినయాన్ని, హాస్యాన్ని కలబోసిన స్టాండప్ కామెడీని అందించే అతితక్కువ తెలుగు స్టేజ్ పెర్ఫార్మర్లలో ఒకడిని అయ్యాను. దాదాపు 13 సంవత్సరాల పాటు ల్యాంకో సంస్థలో రిక్రియేషన్ అంబాసిడర్‌గా చేశాను. తాజాగా బేస్ థింగ్స్ బ్రాండ్‌కి అంబాసిడర్‌గా ఎంపికయ్యా. ప్రసాద్ అనే స్నేహితుడితో కలిసి పిఎల్ మీడియా వర్క్స్ బేనర్ మీద సినిమా నిర్మాణంలోకి కూడా ప్రవేశించాను. ‘ఎప్పటి నుంచో చూస్తున్నాం... ఇంకా అంతే యంగ్‌గా కనిపిస్తున్నావ్’ అని ఫ్రెండ్స్ నన్ను అంటుంటారు. చేసే పనిలో రొటీన్ ఫీలింగ్ లేకపోతే బోర్ ఉండదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఎగ్జయిట్మెంట్ అందుకుంటుంటే... అదే టానిక్‌లా పనిచేసి మనల్ని నిత్య యవ్వనులుగా ఉంచుతుందని నా నమ్మకం. - ఎస్.సత్యబాబు -
నా పాత్ర బాధపడినా... నాకు కన్నీళ్లొస్తాయి!!
గోదావరి తీరాన రాజమండ్రిలో పుట్టి పెరిగిన అమ్మాయి మధు. అందుకేనేమో ఆమె ముఖంలో, నవ్వులో, పలుకులో అచ్చమైన తెలుగుదనం ఉట్టి పడుతుంటుంది. టీవీ సీరియల్స్‌లో ఆమెను చూస్తుండే సీనియర్ సిటిజన్లు ఆమెలో తమ మనవరాలిని చూసుకుంటారు. ‘‘షాపింగ్‌మాల్స్‌లో కనిపించినా, బయట మరెక్కడ కనిపించినా పెద్దవాళ్లు నన్ను గుర్తుపట్టి ‘ఎంత నటన అయితే మాత్రం ఎందుకమ్మా! నిన్ను మరీ అంత ఏడిపిస్తారు’ అని బాధపడేవాళ్లు. నన్ను, నా పాత్రను అంతగా ఆదరిస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది’’ అంటారు మధు. తృప్తినిచ్చిన సన్నివేశం! నాకు ఎక్కువ సంతృప్తినిచ్చిన సన్నివేశం ‘మిస్సమ్మ’లో వచ్చింది. అందులో ఇంటికి పెద్ద కూతుర్ని. చెల్లెలు పెళ్లి చేసుకుని హనీమూన్‌కెళ్లి ఉంటుంది. ప్రతి సంఘటననూ ఫోన్లో చెబుతూ ఉంటుంది. అదే సమయంలో ఇంట్లో తండ్రి ప్రాణాలు పోతాయి. చెల్లి అక్కడ షాపింగ్ చేస్తూ నాన్న కోసం శాలువా కొంటున్నాను, నాన్నకు చాలా బాగుంటుంది అని సంతోషంగా చెబుతూ ఉంటే, ఇక్కడ తండ్రి పార్థివ దేహం మీద శాలువా కప్పుతుంటారు. తండ్రి పోయిన విషయం చెప్పకుండా మేనేజ్ చేయాల్సిన సీన్ అన్న మాట. గొంతులో, ముఖంలో బాధ పొంగుకొస్తుండాలి, చెల్లికి అనుమానం రాకుండా సంతోషం ధ్వనింపచేయాలి. సావిత్రి... సౌందర్య! సావిత్రి నటన, సౌందర్య కట్టుబొట్టు నాకు చాలా ఇష్టం. నేను నటిని కాక ముందు కూడా వాళ్ల నటనను బాగా ఇన్వాల్వ్ అయి చూసేదాన్ని. ఇప్పుడైతే ఈ పాత్రను వాళ్లయితే ఎలా చేసేవాళ్లు అనే కోణంలో సాధన చేస్తున్నాను. అది నాకు చాలా ప్లస్ అవుతోంది. ఏ రోజు ఏ సీన్ నటించాల్సి ఉంటే ఆ తరహా మేకప్, డ్రస్‌తో వెళ్లి పోతాను. పాత్రలో అంతగా ఇన్వాల్వ్ అవుతాను కాబట్టి గ్లిజరిన్ పెట్టకుండానే నాకు ఏడుపు వచ్చేస్తుంది. అంతా సహజంగా ఉంటుందని డెరైక్టర్, మిగిలిన నటులు మెచ్చుకుంటారు కూడా. తీరాల్సిన కోరిక! ఇప్పటి వరకు నాకు డబ్బింగ్ చెప్పే అవకాశం రాలేదు. నా పాత్రకు సొంత గొంతుతో నటించాలని ఉంది. అలాగే పవిత్రబంధం సినిమాలో సౌందర్య చేసినటువంటి పాత్రలో నటించాలని ఉంది. ఇక కుటుంబం అంటే అక్కకు పెళ్లయింది. రాజమండ్రిలో ఉంటుంది. అమ్మానాన్న, నేను హైదరాబాద్‌లో ఉంటున్నాం. దేవుడు మంచి అమ్మానాన్నలను ఇచ్చాడు. ఆదరించే బంధువులను ఇచ్చాడు. అడక్కుండానే నటిని చేశాడు. అలాగే మంచి అబ్బాయితో పెళ్లి చేయిస్తాడనే నమ్మకం ఉంది. -
నాన్న నమ్మకాన్ని నిలబెడతా
నాన్న నమ్మకాన్ని నిలబెడతానంటున్నారు నటి శ్రుతి హాసన్. ఈ క్రేజీ నాయకి మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సంగీతం, నృత్యం, సాహిత్యంలో కూడా మంచి ప్రమేయం ఉన్న నటి. ఈమె ప్రతిభ అందరికంటే ఆమె తండ్రి కమలహాసన్‌కు బాగా తెలుసు. ఇటీవల శ్రుతిహాసన్ పుట్టినరోజు సందర్భంగా కమల్ స్క్రీన్‌ప్లే రైటింగ్ శక్తిని మెరుగు పరచుకునేందుకు కంప్యూటర్ సాఫ్ట్వేర్ సామగ్రిని బహుమతిగా అందించారట. దీనిగురించి శ్రుతిహాసన్ మాట్లాడుతూ తనలో మంచి రచనా శక్తి ఉందని నాన్నకు నమ్మకం అన్నారు. దాన్ని మరింత మెరుగు పరచాలని సలహా ఇచ్చారని తెలిపారు. తన 15వ ఏట నుంచే రచనా శక్తిని పెంచుకుంటూ వస్తున్నానని చెప్పారు. ఇప్పటికే పలు పాటలు, రచనలు, లఘు చిత్ర కథలు రాసినట్లు వెల్లడించారు. వాటికిప్పుడు మరింత మెరుగు దిద్దాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. మరిన్ని లఘు చిత్ర కథలను తయారు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. తన జీవితంలో ఎదుర్కోని.. అంటే ప్రేమ, ఇత్యాది అంశాలను పొందుపరుస్తూ ఆ కథలు ఉంటాయని అన్నారు. అంతర్జాతీయ చిత్రాలను, టీవీ సీరియళ్లను ఎక్కువగా చూడమని నాన్న చెబుతుంటారని తెలిపా రు. తానిప్పుడు ఆయన సలహా పాటించనున్నట్లు చెప్పారు. -
టీవీలో సీరియల్స్ కాకుండా వార్తలు కూడా చూడాలి
మహిళలకు పద్మశాలి సంఘం నేత పిలుపు బోరివలి, న్యూస్‌లైన్: మహిళలు కేవలం టీవీలో వచ్చే సీరియల్స్‌ను కాకుండా వార్తలు కూడా విని కొంత పరిజ్ఞానం పెంచుకోవాలని ప్రాంతీయ పద్మశాలి సంఘం మహిళా శాఖ అధ్యక్షురాలు గుంటుక శైలజ పిలుపునిచ్చారు. బోరివలి పశ్చిమంలోని ప్రబోదన్ ఠాక్రే హాలులో శ్రీ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం పసుపు-కుంకుమ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి మహిళలో ఓ శక్తి దాగి ఉంటుందనీ, దాన్ని గుర్తించాలని చెప్పారు. పిల్లలను కూడా వార్తలు చూసేలా ప్రోత్సహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంత రం వైద్య రంగంలో సేవలందిస్తున్న తెలుగు వారిని సన్మానించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులందచేశారు. కార్యక్రమం చివరిలో మహిళలకు పసుపు-కుంకుమలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం మహిళా శాఖ అధ్యక్షురాలు ఆడగట్ల అరుణ, పద్మశాలి సంఘం అధ్యక్షులు చిల్క నారాయణ, ఉపాధ్యక్షులు పడిగె శివాజీ, ప్రధాన కార్యదర్శి చిల్క గోవర్దన్, ఉపకార్యదర్శి కట్టమహేందర్, కోశాధికారి దాస చంద్రకాంత్, సైవరాములు, ఆడగట్ల రవీంద్ర, కోడూరు అరుణ తదితరులు పాల్గొన్నారు. -
బాద్షా సరసన..
పాకిస్థానీ బుల్లితెర నటి మహిరాఖాన్ నక్క తోక తొక్కినట్టుంది. టీవీ సీరియల్స్‌తో పాక్‌లో ప్రజాభిమానాన్ని పొందిన ఈ ముద్దుగుమ్మ తాజాగా బాలీవుడ్లో అరంగేట్రం చేయనుంది. మొదటి సినిమాలోనే బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్ సరసన నటించే చాన్స్ కొట్టేసింది. ‘హ్యాపీ న్యూ ఇయర్’ సక్సెస్‌తో ఊపుమీదున్న కింగ్‌ఖాన్ తర్వాతి సినిమా ‘రయీస్’లో ఆయనతో జట్టుకట్టనుంది. ఇన్నాళ్లూ బుల్లితెరతో ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఈ పొరుగు దేశపు అందం.. వెండితెరపై ఎలాంటి మ్యాజిక్‌లు చేస్తుందో చూడాలి. -
ఈ బంధం ఇక సడలదా?!
అసలు కథను పక్కకు నెట్టేసి, కొసరు కథలతో సీరియళ్లను సాగదీయడం టీవీ వాళ్లకు బాగా అలవాటైన పనే. కానీ ఆ సాగతీత మరీ అర్థం పర్థం లేకుండా ఉంటే మాత్ర ప్రేక్షకుల బుర్రలు వాచిపోవడం ఖాయం. జీ టీవీలో ప్రసారమయ్యే ‘పవిత్రరిష్తా’తో ఇప్పుడు అదే సమస్య వచ్చింది. మొన్న ఆగస్టు 22కు 1,378 ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న ఈ సీరియల్లో కథేంటి అని ఆలోచిస్తే... జుట్టు పీక్కున్నా గుర్తుకు రాదు. ఎందుకంటే అసలు కథను అందరూ ఎప్పుడో మర్చిపోయారు. మానవ్, అర్చన అనే రెండు పాత్రలు, వారి కుటుంబాల చుట్టూ తిరగుతూ మొదలైన కథ... ఇప్పుడు చాలామంది చుట్టూ తిరుగుతోంది. రకరకాల పాత్రలు రంగ ప్రవేశం చేశాయి. చెప్పలేనని మార్పులు చోటు చేసుకున్నాయి. మొదట మానవ్‌గా నటించిన సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ సినిమాల్లోకి వెళ్లిపోయాడు. అతడి స్థానంలో హితేన్ తేజ్వానీ ఎంటరయ్యాడు. కానీ హీరోయిన్ ఇప్పటికీ అంకితా లోఖండేనే. ఆమెతో పాటు హితేష్ కూడా పేరున్నవాడు కావడంతో సీరియల్‌కి ఇంకా కాస్త ఆదరణ ఉంది. లేదంటే ఆ జీడిపాకాన్ని భరించడం అంత సులభం కాదు. పవిత్రబంధం అంటూ ఇలా రకరకాల బంధాలను అలా కలుపుకుంటూ పోతుంటే... ప్రేక్షకులకు పిచ్చెక్కిపోవడం ఖాయం! వాస్తవాలకు దర్పణం సీరియళ్లు చూస్తే నిజ జీవితాలకు దగ్గరగా ఉన్నట్లే అనిపిస్తుంది. కానీ నిజంగా నిజాలను చెప్పే సీరియళ్లు వేళ్లమీద లెక్కపెట్టేటన్నే ఉంటాయి. కుటుంబ సమస్యలు, పాత్రలు పడే ఇబ్బందుల్ని చూపించడమే తప్ప... సమాజం, అందులోని సమస్యలు, వాటికి పరిష్కారాలు వంటి వాటిని చర్చించే సీరియళ్లు ఎప్పుడోగానీ రావు. చాలా కాలం తర్వాత ‘బాలికావధు’ ఒకటి వచ్చింది. ఆ సీరియల్ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా తెరకెక్కింది. ఇప్పుడు అదే కోవలో ‘ఉడాన్’ (కలర్స) ప్రారంభమయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని వెనుకబడిన గ్రామాల్లో పాతుకునిపోయి ఉన్న బాల కార్మిక వ్యవస్థ చుట్టూ తిరిగే కథ ‘ఉడాన్’. కోట్లకు పడగలెత్తిన ఓ జమీందారు ఊరిని గుప్పెట్లో పెట్టుకుంటాడు. ధన సహాయం చేస్తున్నట్టు, జీవనోపాధి కల్పిస్తున్నట్టు నటిస్తూ... అందరినీ తమ కాళ్ల దగ్గర పడివుండేలా చేసుకుంటాడు. అలాంటి ఊళ్లో జన్మిస్తుంది ‘చకోర్’. ఆమె కడుపులో ఉన్నప్పుడు డబ్బు అవసరమై జమిందారు దగ్గరకు వెళ్తే, బిడ్డను తాకట్టు పెట్టించుకుని డబ్బు ఇస్తాడు. ఏడేళ్లు వచ్చేవరకూ పెంచి, తర్వాత బిడ్డను తమకు అప్పగించమని కండిషన్ పెడుతుంది జమీందారు భార్య. కూతుర్ని తాకట్టు పెట్టామన్న బాధ, ఏడేళ్ల తర్వాత ఆమె తమకు దూరమైపోతుందే అన్న ఆవేదనతో చకోర్ తల్లిదండ్రులు కుమిలిపోతుంటారు. ఇవేమీ తెలియని చకోర్ సంతోషంగా కాలం గడుపుతూ ఉంటుంది. చిలిపి చేష్టలతో, అల్లరి వేషాలతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. మరి ఏడేళ్లు వచ్చాక చకోర్ జీవితం ఏమవుతుంది? ఎదిగేకొద్దీ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది అన్న ఉత్కంఠతో సాగుతోంది ‘ఉడాన్’. చిన్నారి చకోర్గా స్పందన్ చతుర్వేద్ నటన అద్భుతం. ఇప్పటికే మధుబాల, సంస్కార్ లాంటి సీరియళ్లకు తన టాలెంట్‌తో అందాన్ని తెచ్చిన స్పందన్... చకోర్ పాత్రను రక్తి కట్టిస్తోంది. గతంలో ఉడాన్ పేరుతో దూరదర్శన్‌లో ఓ సీరియల్ ప్రసారమైంది. మన దేశంలో మొట్టమొదటి మహిళా డీజీపీ కంచన్ చౌదరి భట్టాచార్య జీవితం ఆధారంగా, ఆవిడ చెల్లెలు కవితా చౌదరి తీసిన ఆ సీరియల్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. మరి ఈ ‘ఉడాన్’ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి! -
ప్రేక్షకుల వేలు విడవని నటుడు
సందర్భం: ‘సుత్తివేలు’ జయంతి ఒక పాత్ర, ఒక మేనరిజమ్ ద్వారా ఒక నటుడి పేరే మారిపోవడం, చరిత్రలో ఆ పేరుతోనే మిగిలిపోవడం చాలా చిత్రమైన విషయం. సినీ చరిత్రలో అలాంటి అదృష్టం దక్కిన అరుదైన కొందరు నటుల్లో సుత్తివేలు ఒకరు. కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు అనే అసలు పేరుతో ఆయన తెలిసింది చాలా కొద్దిమందికే. ‘వేలెడంత లేవు? ఏమిటీ అల్లరి?’ అంటూ చిన్నప్పుడు చుట్టుపక్కలవాళ్ళు పిలవడంతో ‘వేలు’ అనే ముద్దుపేరుతోనే ప్రసిద్ధుడైన బక్కపల్చటి మనిషి ఆయన. అయితే, ఆకారానికి ఆంగికాభినయ ప్రతిభ తోడై, దర్శక - రచయిత జంధ్యాల ‘నాలుగు స్థంభాలాట’లోని పాపులర్ ఊతపదం ‘సుత్తి’తో ఆయన క్రమంగా ‘సుత్తి’వేలుగా జనంలో స్థిరపడ్డారు. తోటి నటుడు ‘సుత్తి’ వీరభద్రరావుతో కలసి ‘సుత్తి’ జంటగా 1980 - ‘90లలో సినీసీమను కొన్నేళ్ళు ఏలారు. కృష్ణాజిల్లా చల్లపల్లి దగ్గరలోని భోగిరెడ్డిపల్లెలో 1947 ఆగస్టు 7న పుట్టిన సుత్తివేలు నటనలో అంత సద్యస్ఫూర్తి, సహజత్వం పలకడానికి కారణం - రంగస్థల అనుభవమే. చదువుకొనే రోజుల నుంచి వేసిన నాటకాలు ఆయనకు పేరు తెచ్చాయి. చిన్నతనమంతా మచిలీపట్నంలో గడిపిన ఆయన నాటకాల దెబ్బకు చదువు అటకెక్కి, ఎలాగోలా మెట్రిక్ అయిందనిపించి, హైదరాబాద్, బాపట్ల సహా ఎన్నోచోట్ల ఎన్నెన్నో చిరుద్యోగాల తరువాత ఆఖరుకు విశాఖపట్నం ‘నావల్ డాక్ యార్డ్’లో స్టోర్ కీపర్‌గా తేలారు. ‘మనిషి నూతిలో పడితే’ నాటకంలోని అభినయ ప్రతిభ దర్శకుడు జంధ్యాల ద్వారా తొలి సినీ అవకాశమూ ఇప్పించింది. అలా ‘ముద్దమందారం’గా మొదలైన ప్రస్థానం ‘నాలుగు స్థంభాలాట’ నాటి ‘సుత్తి’తో జోరందుకుంది. కొన్ని పదుల చిత్రాల్లో ‘సుత్తి’ జంట ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తితే, మరెన్నో చిత్రాల్లో వేలు - నటి శ్రీలక్ష్మి కాంబినేషన్ సూపర్‌హిట్టయింది. ‘‘అనుక్షణం వీరభద్రరావు వెన్నంటి ఉంటూ, పరిశీలించడం ద్వారా ఎంతో నేర్చుకున్నా’’ అని వేలే అంగీకరించారు. వీరభద్రరావు అందించిన సలహాలు, సూచనలు తనకెంతో ఉపకరించాయని అప్పట్లోనే చెప్పిన వేలు, తమ కాంబినేషన్ సన్నివేశాలు పండడం కోసం ఇద్దరం కలిసే డబ్బింగ్ చెప్పేవాళ్ళమని వెల్లడించారు. అప్పట్లో ‘నాలుగుస్థంభాలాట’లోని వారి డైలాగులు క్యాసెట్‌గా వచ్చి, బాగా అమ్ముడయ్యాయి. కానీ, వేలును హాస్యానికే పరిమితం చేసి చూడడం ఆయనలోని నటుణ్ణి అవమానించడమే అవుతుంది. కావాలంటే, ‘ప్రతిఘటన’లోని పిచ్చివాడైన కానిస్టేబుల్ పాత్ర చూడండి. ‘వందేమాతరం’లోని ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డును అందించిన పాత్రను గమనించండి. 1980లలో జనాన్ని ఆలోచనల్లోకి నెట్టిన ‘ఈ పిల్లకు పెళ్ళవుతుందా?’, ‘ఈ చదువులు మాకొద్దు’ లాంటి సినిమాలు ఏ టీవీలోనో వస్తే ఇంకొక్కసారి పరిశీలించండి. ‘కలికాలం’లో మధ్యతరగతి తాతయ్య పాత్రను పరికించండి. ‘ఒసేయ్ రాములమ్మ’లో రాములమ్మ తండ్రి పాత్రను మరోసారి చూడండి. క్యారెక్టర్ నటుడిగా ఆయనలోని వైవిధ్యం అర్థమవుతుంది. కరుణరసాన్ని కూడా కంటి చూపులతోనే ఆయన ఎలా పలికించేవాడో అనుభవంలోకి వస్తుంది. గుండె గదుల్లో వేదాంతం, ఒకింత విషాదం, జీవిత విచారం గూడుకట్టుకున్నవారే హాస్యాన్ని అలవోకగా పలికించగలరనడానికి సుత్తివేలు మరో ఉదాహరణ. వీరభద్రరావు మరణం (1988), ఆ తరువాత జంధ్యాల జోరు తగ్గడం, చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు మారడంతో క్రమంగా వెనుకబడ్డ వేలు ఆ తరువాత మునుపటి ప్రాభవాన్ని సంపాదించడానికి చాలానే కష్టపడ్డారు. కానీ, మళ్ళీ ఆ వెలుగు రాలేదు. తొలి రోజుల్లో దూరదర్శన్‌లో ‘ఆనందోబ్రహ్మ’లో వెలిగిన వేలు చరమాంకంలో భార్య, ముగ్గురమ్మాయిలు, ఒక అబ్బాయితో సంసారాన్ని ఈదడం కోసం టీవీ సీరియల్స్‌ను ఆశ్రయించారు. 2012 సెప్టెంబర్ 16న తన 66వ ఏట కన్నుమూసే దాకా పాత్రల కోసం ఆయన జీవన పోరాటం ఆగలేదు. ఆంగ్ల రచయిత షేక్స్పియర్ అంటే అభిమానం, మద్రాసులో ఆంతరంగికులతో ఏ సాయంత్రమో కలిసినప్పుడు రాగయుక్తంగా పద్యాలు, పాటల గానం, ఆగని ఛలోక్తుల జడివానతో సందర్భాన్ని రసభరితం చేయడం వేలు ప్రత్యేకత. ఇవాళ్టికీ ‘రెండు జెళ్ళ సీత’, ‘శ్రీవారికి ప్రేమలేఖ’, ‘ఆనందభైరవి’, ‘రెండు రెళ్ళు ఆరు’, ‘సీతారామ కల్యాణం’, ‘చంటబ్బాయ్’ లాంటి సినిమాలు చూస్తే, తెలుగు తెరను ఆయన చిరస్మరణీయం చేసిన ఘట్టాలెన్నో కనిపిస్తాయి. ఆ సన్నివేశాల్లో ఇవాళ్టికీ ఆయన ప్రేక్షకుల వేలు విడవని అభినయ చిరంజీవే! -
టీవీ సీరియల్స్ తో వైవాహిక జీవితం నాశనం!
న్యూయార్క్: ఆనందంగా సాగుతున్న మీ వైవాహిక జీవితంలో లేనిపోని వివాదాలు సతమతం చేస్తున్నాయా? ఒకవేళ అలాంటి పరిస్థితులతో తరుచు చోటు చేసుకుంటూ ఉంటే దానిపై ఎప్పుడైనా దృష్టి పెట్టారా?అలా కాకుండా భార్యా భర్తలు ఎవరు వాదన వారిదే అన్నట్లుగానే ఎడమొహం-పెడమొహంగా ఉంటున్నారా? వైవాహిక జీవితంలో ఘర్షణలు చోటు చేసుకునే పరిస్థితులపై ఒకసారి ఆలోచించమంటున్నారు పరిశోధకులు. దీనికి అసలు కారణం టీవీ సీరియల్సేనట. మీ జీవితంలో ప్రేమపూర్వక వాతావరణాన్ని చెడగొట్టడానికి టీవీ సీరియల్స్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. మీ జీవితభాగస్వామి ప్రతీరోజూ సాయంత్రం క్రమం తప్పకుండా సీరియల్స్ ను చూస్తే మాత్రం అది ఖచ్చితంగా వారి వైవాహిక జీవితంపై చూపుతుందని మిచిగాన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో తేలింది. భార్యా భర్తల మధ్య విద్వేషాలు లేకుండా ఉండాలంటే సీరియల్స్ కు దూరంగా ఉండమంటున్నారు. దైనందిన జీవితంలో టీవీ అనేది కీలకపాత్ర పోషిస్తున్నా.. మీ భాగస్వామి అదే పనిగా సీరియల్స్ చూస్తూ ఉంటే మాత్రం వైవాహిక జీవితాన్నినాశనం చేసే అవకాశం అధికంగా ఉంటుందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. కాగా, రియాల్టీ షోలను చూస్తే మాత్రం జీవిత భాగస్వాముల మధ్య మంచి వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుందని వీరు అభిప్రాయపడుతున్నారు. -
నేటి నుంచి ‘పది’ పరీక్షలు
భానుగుడి (కాకినాడ), న్యూస్‌లైన్ : అర్ధరాత్రి దాటినా ఇంట్లో దీపాలు వెలుగుతూనే ఉంటాయి. ఏ టీవీ సీరియలో చూడడానికి కాదు- మర్నాడు జరగబోయే పరీక్షను ఎదుర్కోవడానికి! అందుకోసం కనీసం ఇద్దరు కచ్చితంగా మేలుకుని ఉంటారు. ఒకరు పరీక్ష రాయబోయే విద్యార్థి. మరొకరు- ఆ విద్యార్థిని కన్నతల్లి. గురువారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులున్న ప్రతి ఇంట్లో.. కొంచెం ఇంచుమించుగా ఇలాంటి దృశ్యాలే చోటు చేసుకుంటాయంటే అతిశయోక్తి కాదు. ఆ తరగతి అనగానే ఆ తరహా ప్రాధాన్యం, ఆ పరీక్షలు అనగానే ఆ స్థాయి ఆదుర్దా స్థిరపడిపోయింది, మరి. జిల్లాలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు డీఈఓ కేవీ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. జిల్లాలో రెగ్యులర్, ప్రైవేట్ కేటగిరీల్లో మొత్తం 68,489 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నట్టు వివరించారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 30,291 మంది బాలురు, 30,462 మంది బాలికలు కాగా ప్రైవేట్ విద్యార్థుల్లో 4,180 మంది బాలురు, 3,756 మంది బాలికలు అని తెలిపారు. రెగ్యులర్ విద్యార్థుల కోసం 271 పరీక్షా కేంద్రాలను, ప్రైవేట్ విద్యార్థుల కోసం 41 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లావ్యాప్తంగా పరీక్షా పత్రాలను భద్రపరిచేందుకు 3 ట్రెజరీలను, 66 పోలీస్ స్టేషన్లను స్టోరేజ్ కేంద్రాలుగా వాడుతున్నట్టు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో కేటగిరీ -ఎలో 13, కేటగిరీ-బిలో 212, కేటగిరీ -సిలో 87 ఉన్నాయన్నారు. 36 మంది రూట్ ఆఫీసర్లను, 15 స్క్వాడ్లను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లూ చేశామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని శాఖల సహాయసహకారాలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. -
టీవీ సీరియళ్ల మాయకు విద్యార్థి బలి
బాలుడిని హత్య చేసిన ఐదుగురు విద్యార్థులు మాల్దా: టీవీ సీరియళ్ల ప్రభావం వారి జీవితాలను నాశనం చేసింది. సీరియల్‌ను చూసి అందులో చూపించినట్టుగా చేయడంవల్ల ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు విద్యార్థులు ఊచలు లెక్కపెడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాజిల్లా బామన్‌గోలా ప్రాంతంలో తొమ్మిదినుంచి పన్నెండో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు తమ స్కూల్‌కే చెందిన ఏడో తరగతి విద్యార్థిని కిడ్నాప్ చేసి అనంతరం హత్య చేశారని శుక్రవారం పోలీసులు తెలిపారు. గత మంగళవారం వీరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని, మర్నాడు ఆ విద్యార్థి తండ్రికి ఫోన్‌చేసి రూ. 10 లక్షలు తీసుకురావాల్సిందిగా డిమాండ్ చేశారని చెప్పారు. విద్యార్థి తండ్రి తమకు ఈ విషయం తెలపడంతో వారు చెప్పిన ప్రదేశానికి వెళ్లి ఇద్దరిని అరెస్టు చేశామని, అక్కడే ఆ విద్యార్థి మృతదేహాన్ని కనుగొన్నామని పోలీసులు వెల్లడించారు. ఓ టీవీ సీరియల్‌ను చూసి తాము ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వారు చెప్పారని పోలీసులు వివరించారు. అరెస్టయిన విద్యార్థులకు కోర్టు రిమాండ్ విధించింది. -
చిత్ర విశాఖ
విస్తరిస్తున్న శిక్షణ తరగతులు నటన, దర్శకత్వ శాఖల్లో నిపుణత కోరుతున్న ఔత్సాహికులు ఏయూ క్యాంపస్, న్యూస్‌లైన్: లఘు చిత్రాల హవా.. టీవీ సీరియల్స్ జోరు.. సినీ నిర్మాణ కేంద్రంగా విశాఖ ఎదుగుతున్న తీరు.. ఇవీ ప్రస్తుతం ఔత్సాహిక కళాకారులను ఊరిస్తున్న అంశాలు. ఇటీవల కాలంలో నగరంలో శిక్షణ తరగతులు విరివిగా జరుగుతున్నాయి. తమలో దాగివున్న కళాకారుడిని బయటి ప్రపంచానికి పరిచయం చెయ్యాలని, సృజనాత్మకతను ప్రదర్శించాలని, వెండి తెరపై వెలిగిపోవాలని ఎందరో తపన పడుతున్నారు. ఈ కలలు నెరవేరాలంటే ఒక్క చాన్స్ కావాలి. ఇందుకోసం ఎంతో నిపుణత, పరిణతి సాధించాలి. బంగారానికి మెరుగుపెట్టినట్టు వీరి ప్రతిభకు శిక్షణ కూడా తోడైతే మరింతగా రాణించడానికి అవకాశం ఉంటుంది. సహజసిద్ధమైన ప్రకృతి సోయగాలు, ఎత్తయిన పచ్చని కొండలు, లోయలు, అందాలొలికే అనంత సాగరం.. విశాఖ జిల్లాకు దేవుడిచ్చిన వరాలు. చూడచక్కని లొకేషన్లతో అనేక ప్రాంతాలు చిత్ర నిర్మాణానికి అనువుగా ఉంటాయి. చిత్ర పరిశ్రమకు రాజధానిగా ఎదుగుతున్న ఈ సుందర నగరంపై వర్ధమాన నటీనటుల ఆశలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. అందుకే ఇటీవలి కాలంలో దర్శకత్వం, నటన తదితర అంశాలలో శిక్షణ అందించే ప్రత్యేక శిబిరాలు ఏర్పాటవుతున్నాయి. నగరం నుంచే కాకుండా గిరిజన ప్రాంతమైన పాడేరు, శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలవాసులు సైతం ఇక్కడ జరుగుతున్న శిక్షణ తరగతులకు హాజరవుతున్నారు. కాలానుగుణంగా కోర్సులు ప్రారంభిస్తాం పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నిపుణులను తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే డిజిటల్ ఫిల్మ్ మేకింగ్‌పై సర్టిఫికేట్ కోర్సును అందిస్తున్నాము. త్వరలో దర్శకత్వం, నటన అంశాలపై కూడా కోర్సులను ప్రారంభించే ఆలోచన ఉంది. - ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు, ఉప కులపతి ప్రొడక్షన్ రంగంలో అడుగుపెడతా.. భవిష్యత్తులో ప్రొడక్షన్ రంగంలో రాణిం చాలని ఆశిస్తున్నాను. ప్రస్తుతం ఏయూలో ఇంజనీరింగ్ చదువుతున్నాను. అవగాహన కోసం శిక్షణ శిబిరానికి హాజరయ్యాను. ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. - ఎం.చేతన్ వారధిగా నిలిచే సంస్థలు కావాలి విశాఖ కేంద్రంగా నిపుణులను తీర్చిదిద్దే కేంద్రాలు ఏర్పాటు చేయాలి. సినీ అవకాశాల గురించి ఆర్టిస్టులకు, స్థానిక కళాకారుల ప్రతిభ గురించి చిత్ర పరిశ్రమకు సమాచారం అందిస్తూ వారధిగా నిలిచే సంస్థలు ఏర్పాటు కావాలి. - మీగడ శివశ్రీ, దర్శకుడు అవగాహన మాత్రమే అందించగలుగుతున్నాం.. భాగ్యనగరంలో మూడు సంవత్సరాల శిక్షణలో చెప్పే విషయాలను ఇలాంటి శిబిరాల్లో కేవలం ఐదారు రోజులలో వివరించాల్సి వస్తోం ది. దీంతో వీరికి స్థూలంగా అవగాహన మాత్రమే అందించగలుగుతున్నాం. ఇది పునాదిగా ప్రతిభను మెరుగుపరచుకోవాలి. - నటరాజమూర్తి, ప్రిన్సిపాల్, మధు ఫిలిం ఇనిస్టిట్యూట్, హైదరాబాద్ నటన, దర్శకత్వ శాఖల్లో శిక్షణ ఈ శిబిరాల్లో పాల్గొంటున్న ఔత్సాహికులు నటన, దర్శకత్వ శాఖల్లో శిక్షణ తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి శిబిరాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగడానికి, లోతైన అధ్యయనానికి శిక్షణ సంస్థలు శాస్వత ప్రాతిపదికన ఏర్పాటైతే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రముఖ శిక్షకుడు సత్యానంద్ ఒక్కరే చాలాకాలంగా విశాఖలో నటులను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా పూర్తిస్థాయిలో శిక్షణ అందించే కేంద్రాలు నగరంలో ఏర్పడలేదు. మినీ థియేటర్ నిర్మించాలి ప్రభుత్వం తరపున లఘు చిత్రాలను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలి. మినీ థియేటర్ నిర్మించి, నగరంలో చిత్రీకరించిన షార్ట్ ఫిల్మ్స్‌ను ప్రదర్శించాలి. తద్వారా మంచి చిత్రాలకు ఆదరణ లభిస్తుంది. - ఆచార్య పి.బాబీవర్ధన్, ఏయూ జర్నలిజం విభాగం -
ఇంద్రనీలాద్రిపై గుజరాతీ మేఘమాల
గలగలా మాట్లాడటం మేఘన నైజం. వింటూ ఉండటం ఇంద్రనీల్‌కి ఇష్టం. స్టార్ కావాలని టీవీలోకి వచ్చారు మేఘన. ఇష్టం లేకుండానే టీవీ స్టార్ అయ్యారు ఇంద్రనీల్. విజాతి ధ్రువాలు ఎట్రాక్ట్ అవుతాయంటారు కదా... అలా... అభిరుచులు, అభిప్రాయాలు వేరైనా ఇద్దరూ దగ్గరయ్యారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరి దాంపత్యంలోని కొన్ని ఎపిసోడ్లే... ఈవారం ‘మనసే జతగా!’ ఇంద్రనీల్, మేఘనల ఇంటి గడపలో అడుగుపెడితే అపార్ట్మెంట్లో కూడా పొదరిల్లు ఉంటుందా... అనుకోకుండా ఉండలేం. ‘‘మేం ఎక్కడికి వెళ్లినా ఇంటికి నప్పేవి తెచ్చుకుని ఇలా అలంకరించుకుంటాం. ఇల్లంటే ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉండి, మనసులను రంజింపజేయాలి. ఇంటికి కావలసిన ప్రతి వస్తువూ మా కష్టార్జితంతోనే కొనుక్కున్నాం!’’ అని వారు చెబుతుంటే కలిసికట్టుగా పంచుకునే ఆనందం తాలూకు గర్వం వారి కళ్లలో తొణికిసలాడింది. మేఘన గుజరాతీ అమ్మాయి. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగారు. చెల్లెలు, తను, అమ్మ, నాన్న ఇదే ఆమె ప్రపంచం. ఇంద్రనీల్ విజయవాడలో పుట్టి పెరిగి, తండ్రి ఇష్టంమేరకు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తమ్ముడు, చెల్లెలు, అమ్మ, నాన్న... వీరితో పాటు డ్యాన్స్, మ్యూజిక్ అంటే ప్రాణం. డిగ్రీ వరకు చదివిన ఈ ఇద్దరినీ కలిపింది బుల్లితెరే! యూక్టింగ్లోకి రాకవుుందు ఇంద్రనీల్ పేరు రాజేష్, మేఘన పేరు అనుపవు. సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి పేర్లు మార్చుకున్నా మని చెప్పారిద్దరూ! తొలి పరిచయం తవు ఇద్దరి పరిచయుం గురించి ఇంద్రనీల్ చెబుతూ- ‘‘కాలచక్రం సీరియల్లో నటిస్తున్నప్పుడు షూటింగ్ స్పాట్లో ఒకమ్మాయిని చూసి, ‘బొద్దుగా బొమ్మలా ఉందే’ అనుకున్నాను. అదే సవుయుంలో ఇలాంటి అవ్మూరుుని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని కూడా అనుకున్నాను. కాని ఈ అమ్మాయే నాకు అమ్మలా నటించడానికి వచ్చిందని తెలిసి ఆశ్చర్య పోయాను. సీరియల్స్‌లో కలిసి నటించేవాళ్లం. కలిసి డబ్బింగ్ చెప్పేవాళ్లం. కలిసి సినిమాలకు వెళ్లేవాళ్లం. నాలుగేళ్లు స్నేహితులుగానే ఉన్నాం. ఓసారి నేను ‘యూక్టింగ్ నాకు ఇష్టం లేదు. నాన్న బలవంతం మీద వచ్చాను. ఊరెళ్లిపోతాను’ అని చెప్పినప్పుడు మేఘన నన్ను ఫ్రెండ్‌లా గైడ్ చేసింది. ఆమె గెడైన్స్‌లో తర్వాత నటనే వృత్తిగా వూరింది. కొన్నిరోజుల తరవాత మా మధ్య స్నేహానికి మించి ఏదో ఉందని అర్థమైంది...’’ అన్నారు. ఇంద్రనీల్ మాటలను మేఘన కొనసాగిస్తూ - ‘‘ఈయన మొదటిసారి నాకు ప్రపోజ్ చేసినప్పుడు నామీద సింపతీ చూపిస్తున్నట్టు అనిపించింది. అందుకే వద్దనడమే కాకుండా పెద్ద లెక్చర్ ఇచ్చేశాను. ఒకసారి నాన్న ఆరోగ్యరీత్యా అందరూ చెన్నైలో, నేను ఇక్కడ ఆరునెలలపాటు ఇంట్లో ఒక్కదాన్నే ఉండవలసి వచ్చింది. అప్పుడు ఈయన నా విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. నా పైన చూపే కన్సర్న్ నన్ను ఆలోచింపజేసింది. తీరా నేను ప్రపోజ్ చేస్తే ‘ఫ్రెండ్స్‌గా ఉండిపోదాం’ అన్నాడు. కాని చివరకు తనే వాళ్ల తల్లిదండ్రులను ఒప్పించడానికి కష్టపడ్డాడు. ఒక సమయంలో అరుుతే ఈ పెళ్లి జరగదేమోనన్న అనుమానంతో పేరెంట్స్‌ను భయుపెట్టడానికి స్లీపింగ్ ట్యాబ్లెట్లు మింగేశానన్నాడు! అదంతా యాక్టింగే అని తర్వాత తెలిసి ‘హమ్మయ్య’ అనుకున్నాను’’ అని చెప్పారు. మలుచుకున్న దాంపత్యం సీరియల్స్‌లో ఇంద్రనీల్‌కి అత్తగా, అమ్మగా నటించేవారు మేఘన. ‘‘పెళ్లైన కొత్తలో కలిసి బయుటకు వెళితే దారినపోయేవారు ‘మీ అబ్బాయా?’ అని అడుగుతుండేవారు. ఎంత ఇబ్బంది పడేదాన్నో! ఇప్పటికీ ఎవరైనా అడుగుతున్నా పట్టించుకోను. నిజానికి నేను ఈయనకన్నా ఆరునెలలు పెద్ద’’ అన్నారు మేఘన. ‘‘మా పెళ్లప్పుడు మా నాన్నగారు మేఘనతో ‘వాడికేమీ తెలియదు. నీ చేతిలో పెడుతున్నాను. జాగ్రత్తగా చూసుకోవ్మూ!’ అని చెప్పారు. మేఘన బాధ్యత గల అవ్మూయని నాన్నగారు అప్పుడే కనిపెట్టేశారన్నవూట. నేనీ రోజు ఇలా ఉన్నానంటే అది మేఘన వల్లే. అందుకే ఉదయం లేస్తూనే ఈవిడకు ‘గుడ్‌మార్నింగ్ టీచర్’ అని చెబుతుంటాను’’ అని నవ్వేశారు ఇంద్రనీల్! మేఘన తమ దాంపత్యాన్ని మార్చుకున్న విధానం గురించి చెబుతూ -‘‘పెళ్లయ్యాక మొదటి ఆరునెలలు మా మధ్య చాలా గొడవలు వచ్చేవి. అప్పట్లో ఇద్దరం వర్క్ చేసేవాళ్లం. ఇద్దరికీ డబ్బు వచ్చేది. ఇంటి ఖర్చులకు ‘నీ డబ్బు, నా డబ్బు’ అనే తేడాలు వచ్చేవి. ఒక దశలో నేనే రియలైజ్ అయ్యి, నా పద్ధతులు మార్చుకున్నాను. తర్వాత ఈయున్ని వూర్చుకున్నాను. ఇప్పుడు మా పెళ్లై ఎనిమిదేళ్లయింది(26 మే, 2005). అంతకుముందు మేం స్నేహంగా ఉన్నది నాలుగేళ్లు. ఇన్నేళ్లు సంతోషంగా ఉన్నామనే ఆలోచనే బలాన్నిస్తుంటుంది’’ అన్నారు. ‘నీ, నా’ నుంచి ‘వున’ వరకు... అంతా సాఫీగా సాగినా వునసులు కలవడానికి సవుయుం పడుతుందేమో! అందుకే కలిసి పంచుకోవడానికి చిటికెడు కష్టాలు దాంపత్యబంధంలో కలుపుతుంటాడు దేవుడు -‘‘మేం పెళ్లి చేసుకోవాలనే ఆలోచనను మా అమ్మ వుుందుంచినప్పుడు ‘ఉద్యోగస్తుడిని చేసుకుంటే బాగుండేది. ‘చక్రవాకం’ సీరియుల్ తర్వాత మీ పరిస్థితి ఏంటి?’ అంది. సంపాదిస్తున్నాం కదా అనే ధైర్యం ఉండేది ఇద్దరికీ! పెళ్లయిన ఆరునెలల తర్వాత ఓ రోజు మాకు సీరియల్లో కంటిన్యూ అయ్యే అవకాశం లేదని తెలిసింది. ఏడాదిపాటు చేతిలో పని లేదు. ఇంటి అద్దె కట్టడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఈయన చెన్నైలో కొన్ని సీరియల్స్‌లో యాక్ట్ చేయడంతో సంసారం గాడిలో పడింది. తర్వాత ‘మొగలిరేకులు’ ఆఫర్ వచ్చింది. ఓ రోజు ఫోన్ చేసి ‘నేను వర్క్ మానేసి ఇంటికి వచ్చేస్తే రేపు మన పరిస్థితి ఏంటి?’ అని అడిగాడు. ‘ఏం పర్వాలేదు ఎలాగోలా బతికేద్దాం’ అన్నాను’’ అంటూ తవు ఆర్థికస్థితి కన్నా భర్త వూనసిక స్థితే వుుఖ్యంగా భావించానని పరోక్షంగా చెప్పారు మేఘన. ‘‘వచ్చిన సీరియుల్స్లో యూక్ట్ చేస్తున్నాం. వూ డ్యాన్స్ అకాడెమీ పనులు చూసుకుంటున్నాం. మేమిద్దరం కలిసి ఎప్పటికైనా స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని ఉంది’’ అని తెలిపారు ఇంద్రనీల్! ఒకరికొకరుగా... ‘‘వునిషి జీవితంలో భార్యాభర్తల అనుబంధం సుదీర్ఘమైనది. జీవన ప్రయాణంలో తల్లిదండ్రులు, పిల్లల కంటే ఎక్కువ ఏళ్లు జీవితభాగస్వామితోనే గడుపుతాం. కష్టసుఖాలలో కలిసిమెలిసి ఉండేది దంపతులు మాత్రమే! అందుకే ఇద్దరి మధ్య బంధం పటిష్టంగా చేసుకోవడానికి ఇరువురూ ఎల్లకాలమూ ప్రయత్నించాలి ’’ అని చెప్పింది ఈ జంట. ఇద్దరి మాటల్లోనూ భాగస్వామి మనసు నొచ్చుకునే ఏ సందర్భమైనా సానుకూలంగా స్పందించడం, సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించాలనే తపన కనిపించింది. - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి మా పెళ్లయ్యాక నా మొదటి పుట్టినరోజున మేఘన నాకో పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. షామిర్‌పేట దగ్గర రిసార్ట్‌లో రూమ్ బుక్ చేసి, అందంగా అలంకరించి నాతో మాట మాత్రం చెప్పకుండా ఎటో వెళ్లాలని తీసుకెళ్లింది. ఆ సెటప్ చూసి చాలా థ్రిల్ అయ్యూను. - ఇంద్రనీల్ పెళ్లయిన మొదటి ఏడాది ప్రతి నెలా వూ వ్యూరేజ్ డేట్‌ని సెలబ్రేట్ చేసేవారు. ఒక సంవత్సరం ఫిబ్రవరి 14న నేను ఊరు నుంచి వచ్చేసరికి ఇల్లంతా అలంకరించి, దిండు కింద నాకు నచ్చిన రంగు కొత్త చీర, జాకెట్టు, చెవికమ్మలు పెట్టి సర్ప్రైజ్ చేశారు. - మేఘన