ఫ్రెండ్స్‌కి ఈ విషయం చెబితే ‘మరీ, విలనా!’ అన్నారు. | TV Serial Actress Aadya Special Interview | Sakshi
Sakshi News home page

విలనిజం అంటే ఇష్టం

Published Wed, Sep 11 2019 12:54 PM | Last Updated on Wed, Sep 11 2019 12:54 PM

TV Serial Actress Aadya Special Interview - Sakshi

‘ఇప్పుడు నటన అంటే ప్రత్యేకించితరగతులు అక్కర్లేదు. ఏ క్యారెక్టర్‌ అయినా అవలీలగా పరకాయప్రవేశం చేయడమే. స్క్రీన్‌కి నప్పేలా ఉన్నామా..! పాత్రకు తగ్గట్టు మనల్ని మనం మార్చుకోగలుగుతున్నామా!’ అని చూసుకుంటే చాలు అంటోంది ఆద్య. బుల్లితెరపై ఉన్న ఇష్టం బి.టెక్‌ నుంచి సీరియల్‌ వైపుగా అడుగులు వేయించిందని చెబుతోంది.‘ఈ ఫీల్డ్‌కి హీరోయిన్‌గా పరిచయం అవుదామనే వచ్చాను. ఎక్కడ ఏ సీరియల్‌ ఆడిషన్స్‌ జరిగినా అక్కడ నన్ను నేను ప్రూవ్‌ చేసుకోవడానికి వెళ్లాను. మొదట సెలక్ట్‌ కాలేదు. కానీ, నిరుత్సాహపడలేదు. బి.టెక్‌ చేస్తున్నప్పటి నుంచే ట్రయల్స్‌ వేస్తూనే ఉన్నాను. ఈ విషయం ఇంట్లో చెబితే మొదట వద్దన్నారు. ‘చక్కగా చదువుకుంటున్నావ్‌. ఏదైనా జాబ్‌ చూసుకొని సెటిల్‌ అవక ఎందుకా తిప్పలు’ అన్నారు. చదువు వరకు బి.టెక్‌ ఓకే. కానీ, జాబ్‌ అంటే.. ఆ లైఫ్‌ రొటీన్‌ అయిపోతుంది అనిపించింది. క్రియేటివ్‌ వైపు ఉంటే ప్రతీరోజూ కొత్తగా జీవించవచ్చు కదా! అనిపించింది. ఇదే మాట అమ్మనాన్నలకు చెప్పాను. నటన అంటే నాకున్న ఆసక్తి వల్ల అమ్మనాన్న ఓకే అనక తప్పలేదు. అలా మొత్తానికి ‘స్టార్‌ మా’లో వచ్చే ‘అగ్నిసాక్షి’ సీరియల్‌లో అవకాశం వచ్చింది.

మరీ విలనా?!
సీరియల్‌లో హీరోయిన్‌ అవుదామనే ఈ ఫీల్డ్‌కి వచ్చాను. కానీ ఆడిషనల్స్‌లో మాత్రం ‘విలన్‌గా యాక్ట్‌ చేయగలవా?’ అని అడిగారు. వద్దంటే నన్ను నేను ప్రూవ్‌ చేసుకోవడం ఎలాగ?! విలన్‌ క్యారెక్టర్‌ అయితే త్వరగా ప్రేక్షకులు గుర్తించే అవకాశం ఎక్కువ. పాత్ర ప్రేక్షకుల్లోకి త్వరగా వెళుతుంది. కొంత డోలాయమాన పరిస్థితి. మా ఫ్రెండ్స్‌కి ఈ విషయం చెబితే ‘మరీ, విలనా!’ అన్నారు. అలా అన్నవాళ్లే ఆ తర్వాత ‘నటించే అవకాశం ఎక్కువ ఉండేది విలన్‌ క్యారెక్టర్‌కే’ అన్నారు. అమ్మనాన్నకు చెబితే ‘నీ ఇష్టం రా’ అన్నారు. ఇవన్నీ ఆలోచించుకొని ‘నేను నటించడానికి సిద్ధం’ అన్నాను. అలా అగ్నిసాక్షి సీరియల్‌లో విలన్‌గా మీ ముందుకు వచ్చాను.

‘అగ్నిసాక్షి’గా న్యాయం
నా పేరే ఈ సీరియల్‌లో నా క్యారెక్టర్‌కీ పెట్టారు. హీరో శంకర్, హీరోయిన్‌ గౌరి లను విడదీసే క్యారెక్టర్‌ నాది. హీరో శంకర్‌ని ఇష్టపడుతూ ఉంటుంది ఆద్య. గౌరికి ప్రతీవిషయంలో అడ్డు పడుతుంటుంది. గౌరీశంకర్‌ల ప్రేమను చెడగొట్టాలని చూస్తుంటుంది. గౌరిని చెడ్డదానిలా నలుగురిలో నిలబెట్టాలని ప్రయత్నిస్తుంటుంది. నటించడానికి ఎక్కువ స్కోప్‌ విలన్‌పాత్రకే ఎక్కువ ఉందని ఇప్పుడు నాకు అనుభవంలోకి వచ్చింది. అందుకే నా పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేయడానికి కృషి చేస్తున్నాను. ప్రతి సారీ ఇంతకుముందుకన్నా బాగా నటించాలనే ఆలోచనతో చేస్తున్నా. దీంతో వర్క్‌ని ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తున్నాను.

గమనిస్తూ ..
అమ్మనాన్న, అన్నయ్య ఇప్పుడు ఫుల్‌హ్యాపీ నేను కోరుకున్న ఫీల్డ్‌లో ఉన్నందుకు. ముగ్గురూ నన్ను ఎంకరేజ్‌ చేస్తున్నారు. ఇక్కడ ఎంతోమంది సీనియర్‌ నటీనటులు. వారి నటననే కాదు ఖాళీ సమయాన్ని వారు సద్వినియోగం చేసుకునే విధానాన్ని గమనిస్తూ ఉంటాను. ఖాళీ సమయం దొరికితే పుస్తకాలు చదవడం, కాస్ట్యూమ్స్‌ కోసం షాపింగ్‌ చేయడం, ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్పడం నాకున్న ఇష్టాలలో ముఖ్యమైనవి.– నిర్మలారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement