
నాన్న నమ్మకాన్ని నిలబెడతా
నాన్న నమ్మకాన్ని నిలబెడతానంటున్నారు నటి శ్రుతి హాసన్. ఈ క్రేజీ నాయకి మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సంగీతం, నృత్యం, సాహిత్యంలో కూడా మంచి ప్రమేయం ఉన్న నటి. ఈమె ప్రతిభ అందరికంటే ఆమె తండ్రి కమలహాసన్‌కు బాగా తెలుసు. ఇటీవల శ్రుతిహాసన్ పుట్టినరోజు సందర్భంగా కమల్ స్క్రీన్‌ప్లే రైటింగ్ శక్తిని మెరుగు పరచుకునేందుకు కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ సామగ్రిని బహుమతిగా అందించారట. దీనిగురించి శ్రుతిహాసన్ మాట్లాడుతూ తనలో మంచి రచనా శక్తి ఉందని నాన్నకు నమ్మకం అన్నారు.
దాన్ని మరింత మెరుగు పరచాలని సలహా ఇచ్చారని తెలిపారు. తన 15వ ఏట నుంచే రచనా శక్తిని పెంచుకుంటూ వస్తున్నానని చెప్పారు. ఇప్పటికే పలు పాటలు, రచనలు, లఘు చిత్ర కథలు రాసినట్లు వెల్లడించారు. వాటికిప్పుడు మరింత మెరుగు దిద్దాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. మరిన్ని లఘు చిత్ర కథలను తయారు చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు.
తన జీవితంలో ఎదుర్కోని.. అంటే ప్రేమ, ఇత్యాది అంశాలను పొందుపరుస్తూ ఆ కథలు ఉంటాయని అన్నారు. అంతర్జాతీయ చిత్రాలను, టీవీ సీరియళ్లను ఎక్కువగా చూడమని నాన్న చెబుతుంటారని తెలిపా రు. తానిప్పుడు ఆయన సలహా పాటించనున్నట్లు చెప్పారు.