మామిడికుదురు: ‘మాటీవీ’లో ప్రచారమవుతున్న ‘సుందరకాండ’, ‘శ్రీనివాస కల్యాణం’తో పాటు గతంలో ప్రచారమైన ‘సీతామహలక్ష్మి’ తదితర టీవీ సీరియల్స్‌లో బాల నటుడిగా మెప్పించి, పలువురి ప్రశంసలు అందుకున్న ఆరేళ్ల ‘నేహాంత్’ ప్రస్తుతం ఒకటవ తరగతి చదువుతున్నాడు. అప్పనపల్లిలో జరుగుతున్న ‘నిన్నే చూస్తూ’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న నేహాంత్ గురువారం కొద్ది సేపు స్థానిక విలేకర్లతో ముచ్చటించాడు. నాన్న కృష్ణమూర్తి, అమ్మ లక్ష్మి ఆశీస్సులతో చిత్ర రంగంలో ప్రవేశించానన్నాడు. మొదటి నుంచి తనకు నటన అంటే ఎంతో ఇష్టమని, తన ఇష్టానికి అనుగుణంగా తల్లిదండ్రులు ప్రోత్సహించారని చెప్పాడు. మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఇంటి దగ్గర తీరిక సమయంలో వారినే అనుకరిస్తూ ఉంటానని అన్నాడు.
తన ఇష్టదైవం ఆంజనేయస్వామి పాత్రను ‘సుందరకాండ’ టీవీ సీరియల్‌లో నటించడం ఆనందంగా ఉందన్నాడు. టీవీల్లో సీరియల్స్‌లో హాస్యాన్ని పండించే వివిధ పాత్రల్లో ఇంత వరకు మూడొందలకు పైగా ఎపిసోడ్స్‌లో నటించానని చెప్పాడు. ‘నిన్నుకోరి’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’, ‘అజ్ఞాతవాసి’ చిత్రాల్లో నటించానని, ‘నిన్నే చూస్తూ’ తనకు అయిదవ చిత్రమని తెలిపాడు. తమది హైదరాబాద్ అని, కోనసీమ ప్రాంతానికి రావడం ఇదే మొదటిసారన్నాడు. పచ్చని కొబ్బరి చెట్లు, గోదావరి అందాలు, ఇక్కడి ప్రజలు చూపే ఆదరణ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment