టీవీ సీరియల్స్‌ మీద కూడా సెన్సార్‌ బోర్డు నిఘా ఉండాలి | Crime Rates Hikes In East Godavari | Sakshi
Sakshi News home page

మంటగలుస్తున్న మానవ సంబంధాలు

Published Mon, Aug 27 2018 1:19 PM | Last Updated on Mon, Aug 27 2018 1:19 PM

Crime Rates Hikes In East Godavari - Sakshi

తూర్పు గోదావరి : 'మద్యం తాగించి.. పాఠశాలలోనే పూడ్చివేత' ఈ సంఘటనను చూస్తుంటే ఇటీవల వచ్చిన ‘దృశ్యం’ సినిమా గుర్తురాక మానదు. అయితే ఇందులో ప్రియురాలి భర్తను హత్య చేసి అతనిని కొత్తగా నిర్మించిన పాఠశాలలో పూడ్చిపెట్టారు. వివరాల్లోకి వెళితే.. కిర్లంపూడి మండలం ముక్కొల్లు గ్రామానికి చెందిన మచ్చా సత్తిబాబు, జ్యోతి దంపతులు. జ్యోతికి చంద్రమాంపల్లికి చెందిన చెక్కిడాల రాజాతో అక్రమ సంబంధం ఉంది. ఆ నేపథ్యంలో జూన్‌ 19న సత్తిబాబు అదృశ్యమయ్యాడు. అతని ఆచూకీ లభించకపోవడంతో అదృశ్యమైనట్టు జూన్‌ 26న బంధువులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో  రాజా సత్తిబాబును చంద్రమాంపల్లి ఆహ్వానించాడు. అక్కడ మరో ఇద్దరితో కలసి  గ్రామంలో నూతనంగా నిర్మించిన స్కూల్‌ కాంప్లెక్స్‌లో మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న సత్తిబాబును హత్య చేసి అదే పాఠశాలలో పూడ్చిపెట్టారు. హత్యకు ఉపయోగించిన రాడ్‌ను దివిలి గ్రామ శివారులో చెత్త కుప్పలలో పడవేశారు. బైక్‌ను జి. రాగంపేటలోని ఒక యువకుడి ఇంట్లో ఉంచారు.

మంచానికి కట్టేసి..
రంగంపేట మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన వాసంశెట్టి వీర వెంకట సత్యనారాయణ కల్లు గీత కార్మికుడు. అతను వ్యవసాయం కూడా చేస్తుంటాడు. జగ్గంపేట మండలం, కాట్రావుల పల్లికి చెందిన భవానితో 9 ఏళ్ల క్రితం అతనికి వివాహం అయింది. వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అతనిపొలంలో కోటపాడు గ్రామానికి చెందిన రాజా శ్రీను రెండేళ్లుగా పని చేస్తున్నాడు. రాజా శ్రీనుతో సత్యనారాయణ భార్య భవానికి వివాహేతర సంబంధం ఏర్పడింది. జూలై 25వ తేదీ రాత్రి 10 గంటలకు సత్యనారాయణ ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఇద్దరూ కనిపించారు. దాంతో వారి మధ్య ఘర్షణ జరిగింది. ప్రియుడితో కలసి భవాని సత్యనారాయణను మంచానికి కట్టి వేసి దాడి చేశారు. సత్యనారాయణ అరుపులు విని పొరుగువారు బాధితుడి తల్లిని తీసుకొనివచ్చే సరికి ఇంటి తలుపులు వేసి ఉన్నాయి. సత్యనారాయణ చంపేస్తున్నారు బాబోయ్‌ అని అరుస్తుండడంతో గ్రామస్తులు తలుపులు పగుల గొట్టుకొని లోనికి ప్రవేశిస్తుండగా వారిని నెట్టుకుంటూ భవాని, ఆమె ప్రియుడు రాజా శ్రీను పరారయ్యారు. కొన ఊపిరితో ఉన్న సత్యనారాయణను బయటకు తీసుకువచ్చే సరికి మృతి చెందాడు.

మద్యం తాగించి చున్నీతో పీక నులిమి..
రాజమహేంద్రవరం రూరల్, హుక్కుంపేట కు చెందిన వడ్డి ఇమ్మానియేలు తాపీపని చేసుకుని జీవిస్తుంటాడు. ఇమ్మానియేలుకు దేవితో వివాహం అయింది. వారికి ఇద్దరు పిల్లలు. ఇమ్మానియేలుకు

పిడింగొయ్యి గ్రామానికి చెందిన గండ్రోతు శివ
కుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ స్నేహంగా ఉండేవారు. శివ దేవితో పరిచయం పెంచుకొని వివాహేతర సంబంధం కొనసాగించసాగాడు. వీరి అక్రమ సంబంధం తెలుసుకున్న ఇమ్మానియేలు గొడవ చేశాడు. ఆనేపథ్యంలో జూలై 26వ తేదీన సీతపల్లిలోని గండి బాపనమ్మ గుడికి వెళ్దామని ఇమ్మానియేలును శివ ఒప్పించాడు. ఇద్దరూ 26వ తేదీ మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై వెళ్లారు. ప్రియుడి సూచన మేరకు దేవి బస్సులో బయల్దేరింది. స్నేహితులు ఇద్దరూ గోకవరంలో ఒక మద్యం షాపులో మద్యం కొనుగోలు చేసి సీతపల్లి వచ్చి సమీపంలోని పోలవరం ప్రాంతంలో ఇద్దరూ మద్యం సేవించారు. ఇమ్మానియేలుతో శివ అతిగా మద్యం తాగించాడు. ఇంతలో అక్కడకు దేవి చేరుకుంది. శివ, దేవి కలసి ఇమ్మానియేలు పీకను చున్నీతో బిగించి హత్య చేసి అతనిని పెట్రోల్‌ పోసి కాల్చారు. సెల్‌ ఫోన్‌లో సిమ్‌ కార్డు తీసి అక్కడే పడవేశారు. మద్యం సీసా, సెల్‌ ఫోన్‌ ఆధారంగా నిందితులను పోలీసు అరెస్ట్‌ చేశారు. ఇమ్మానియేలు, దేవికి పుట్టిన ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.మమతానురాగాలకు పుట్టిల్లు కుటుంబం. ఆ కుటుంబం.. దాంతోపాటు మానవసంబంధాలు మంటగలుస్తున్నాయి.  వివాహేతర సంబంధాల ప్రభావంతో కుటుంబాలు ధ్వంసమవుతున్నాయి. భర్తలను భార్యలు, భార్యలను భర్తలు తమ ప్రియులు లేదా ప్రియురాళ్ల సహాయంతో హతమార్చేస్తున్నారు. కన్నబిడ్డలని కనికరం కూడా చూపకుండా పసివాళ్లను సైతం మట్టుబెట్టేస్తున్నారు. జిల్లాలో జరిగిన ఇలాంటి సంఘటనలు మానవత్వానికి మచ్చగా నిలిచాయి.     –రాజమహేంద్రవరం క్రైం

టీవీ సీరియల్స్‌ మీద కూడా సెన్సార్‌ బోర్డు నిఘా ఉండాలి
దేశంలో విదేశీ సంస్కృతి పెరిగిపోయింది. టీవీ సీరియల్స్‌ , సినిమా ప్రభావం మహిళలపై పడుతోంది. దీంతో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి.   పూర్వం ఉమ్మడి కుటుంబ వ్యవస్ధ ఉండేటప్పుడు తప్పు చేస్తే పెద్దవారు దండించే వారు. ఆభయంతోనైనా సక్రమమైన మార్గంలో నడిచే వారు. ప్రస్తుతం తప్పులను సరిదిద్దే వారు లేకపోవడంతో విచ్చలవిడితనం వచ్చేసింది. అక్రమ సంబం«ధాలతోనే సుఖంగా ఉంటుందనే అపోహతో హత్యలు చేస్తూ తమ జీవితాలను చేజేతులారా సర్వనాశనం చేసుకుంటున్నారు. టీవీ సీరియల్స్‌ మీద కూడా సెన్సార్‌ బోర్డు నిఘా ఏర్పాటు చేయాలి. టీవీ సీరియల్స్‌లో అక్రమ సంబంధాల పాత్రలు నిరోధించకపోతే సమాజంలో మరిన్ని ప్రమాదకర ధోరణులు పెచ్చరిల్లుతాయి.   తల్లిదండ్రులు తమ పిల్లలు వాట్సప్, ఫేస్‌ బుక్‌లలో ఏవిధమైన మెసెజ్‌లు చూస్తున్నారో గమనించాలి. టెక్నాలజీని దుర్వినియోగం చేస్తే జీవితాలు నాశనం అవుతాయి.–ముప్పాళ్ల సుబ్బారావు, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు

నైతిక విలువలు నేర్పించాలి
విద్యార్థి దశ నుంచే నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలి.  ఆధునిక కాలంలో విలువలు పడిపోయాయి. మోడరన్‌ కల్చర్‌లో విచ్చలవిడితనం పెరిగిపోయింది. పురుషులలో 90 మంది పరాయి స్త్రీతో మానసిక వ్యభిచారం చేయడం, అలాగే  స్త్రీలలో 75 మంది పరాయి పురుషుడిని ఊహించుకోవడం జరుగుతుంది. 20 నుంచి 30 శాతం తప్పటడుగు వేస్తున్నారు.  కొంత మందిలో వ్యక్తిత్వలోపం, చంచలత్వం ఉంటుంది. ఇలాంటి వారు ఒకరి కంటే ఎక్కువ మందితో సంబంధాలు కొనసాగిస్తారు. తమను అడ్డుంటే వారిని తొలగించుకోవడానికి కూడా వెనుకాడరు. ఇంట్లో మనుషులు చూపించే ప్రేమ కంటే  బయటవారు చూపే ప్రేమలో ఎక్కువ విలువ ఉన్నట్టు అనిపిస్తుంది.  చిన్నప్పటి నుంచి పెంచి పోషించిన తల్లిదండ్రులు కంటే పార్కులో పరిచయమైన ప్రేమికుడు చెప్పినదే ఎక్కువగా ఆకర్షణగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య చక్కటి ఆనుబంధం పెరగకపోతే  పరాయివారి అకర్షణకు లోనవుతారు. సాధారణంగా 10 ఏళ్ల సంసార జీవితం జరిగిన తరువాత, 40 ఏళ్లు వచ్చాక వంకర  చూపులు చూస్తారు. సీరియల్స్‌లో మహిళలను విలన్‌గా చూపించే సంస్కృతి పోవాలి.  విదేశాలలో మాదిరిగా కఠినమైన శిక్షలు ఉండాలి. అప్పుడే నేరాల శాతం తగ్గుతుంది.–డాక్టర్‌ కర్రి రామారెడ్డి, మానసిక వైద్యుడు, రాజమహేంద్రవరం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement