గాయపడ్డ కామేశ్వరరావు చేతికి ప్రథమ చికిత్స చేస్తున్న ఆస్పత్రి సిబ్బంది
తూర్పుగోదావరి, అనపర్తి: వివాహితతో ఏర్పడ్డ పరిచయం హత్యా యత్నానికి దారితీసింది. స్థానిక రైల్వే స్టేషన్‌లో మంగళవారం రాత్రి వివాహిత సీహెచ్ శేషారత్నంతో కలిసి ప్రియుడు కె.మణికంఠను పట్టుకునేందుకు ప్రయత్నించిన ఆమె తండ్రి, బంధువుపై.. ప్రియుడు కత్తితో దాడి చేసి పరారయ్యాడు. బుధవారం ఉదయం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్‌పీఎఫ్ సీఐ మధుసూదన్‌రెడ్డి కథనం ప్రకారం అనపర్తి పాతవూరికి చెందిన శేషారత్నం తన కుమార్తెను రోజూ పాఠశాల బస్సు ఎక్కించేందుకు వెళుతుంది. బస్సు క్లీనర్ మణికంఠరెడ్డితో పరిచయం పెంచుకున్న ఆమె ఇంటికి రప్పించుకుని అతనితో మాట్లాడుతుంటే.. ఆమెను కుటుంబ సభ్యులు మందలించారు.
ప్రియుడి ఒత్తిడితో ఆమె పరారయ్యేందుకు స్థానిక రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అనుమానం వచ్చిన ఆమె తండ్రి వెంకటేశ్వర్లు, బంధువు కామేశ్వరరావుతో కలిసి వెతుకుతూ రైల్వే స్టేషనులో వారిని గమనించారు. ప్రియుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడు వారిపై దాడి చేసి పరారయ్యాడు. ఈ దాడిలో తండ్రి కంఠానికి, బంధువుకు ఎడమ చేతికి గాయాలయ్యాయి. వారిని కుటుంబ సభ్యులు స్థానికుల సహకారంతో స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. హత్యాయత్నానికి పాల్పడిన ప్రియుడు పోలీస్టేషన్‌కు చేరుకుని లొంగిపోయాడు. ఈ ఘటన రైల్వే స్టేషన్‌లో జరగడంతో అనపర్తి పోలీసులు ఈ కేసును సామర్లకోట రైల్వే పోలీసులకు అప్పగించారు. సామర్లకోట జీఆర్‌పీ సిబ్బంది అతడిని సామర్లకోట తీసుకువెళ్లారు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు జీఆర్‌పీ సీఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment