![Special Story About Chahat Khanna - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/23/Chahat.jpg.webp?itok=k_U3DoxI)
టీవీ సీరియళ్లు ఆసక్తిగా చూస్తాం. ఆ సీరియళ్లలో నటించే హీరోయిన్‌లన్నా కూడా ఆసక్తే కానీ, వాళ్ల గురించి మనకు పెద్దగా తెలిసే అవకాశం లేదు. ఎప్పుడైనా వాళ్లంతట వాళ్లు చెప్పుకుంటే తప్ప! హిందీ సీరియళ్లు ఇష్టపడేవారు చాహత్ ఖన్నాను కూడా ఇష్టపడే ఉంటారు. 2011 నుంచి 2014 వరకు సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ప్రసారం అయిన ‘బడే అచ్చే లగ్తే హై’ తో ఆమె బాగా పాపులర్ అయ్యారు. అలాగే జీటీవీలో నాలుగేళ్ల క్రితం వచ్చిన ‘ఖుబూల్ హై’ అమెను గుర్తుంచుకునేలా చేస్తుంది. చాహత్ ఇప్పటికీ కొన్ని టీవీ సీరియళ్లలో నటిస్తున్నారు. కొన్ని సినిమాల్లో కూడా కనిపించారు. ఈమధ్య .. ఓ నాలుగు రోజుల క్రితం.. ఏమైందంటే ఏదో ఈవెంట్ ఉంటే ముంబై నుంచి ఢిల్లీ వెళ్లారు చాహత్. తిరుగు ప్రయాణంలో ముంబై ఫ్లయిట్ ఎక్కడానికి తెల్లవారుజామునే క్యాబ్ బుక్ చేసుకుని ఎక్కారు.
విమానాశ్రయంలో చాహత్ (ఫైల్ ఫొటో)
ఆ చీకట్లో కొంచెం దూరం వెళ్లాక క్యాబ్ డ్రైవర్ ఆమెను అసభ్యకరమైన మాటలతో వేధించడం మొదలు పెట్టాడు. వేధింపులే కాదు.. క్యాబ్‌ని దారి కూడా మళ్లించే ప్రయత్నం చేశాడు. చాహత్‌కి అనుమానం వచ్చి వెంటనే ఫోన్ యాప్‌లోంచి పోలీసులకు సమాచారం ఇవ్వబోతుంటే దారికొచ్చాడు. ఆ గండం గట్టెక్కిందీ అనుకుంటే.. ఫ్లయిట్ ఎక్కాక.. రన్ వే మీద విమానం ఎందుకో సడెన్ బ్రేక్‌లతో ఆగి కదలినట్లనిపించింది. ఆ కుదుపునకు కడుపులో తిప్పి, వాంతి కాబోయి, గుండె ఆగిపోయినంత పనైందట చాహత్‌కు. ఈ వివరాలు ఒక తాజా ఇంటర్వ్యూలో చెబితే బయటికి ప్రపంచానికి తెలిశాయి. ‘‘ఒక్కోసారి ఇంతే. అన్నీ ఒకేసారి వచ్చిపడతాయి’’ అని నవ్వుతూ అంటున్నారు చాహత్.
Comments
Please login to add a commentAdd a comment