ఒక్క తుమ్ము చాలు! | funday Laughing fun | Sakshi
Sakshi News home page

ఒక్క తుమ్ము చాలు!

Published Sun, Jul 15 2018 12:08 AM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

funday Laughing fun - Sakshi

ఏ వ్యాపారం కలిసిరాని యెంకటరత్నం దిక్కుతోచక ‘అంతులేని స్టోరీ’ అనే టీవీ సీరియల్‌ తీశాడు. ఏ నక్క తోక తొక్కాడోగానీ ఈ సీరియల్‌ ఫస్ట్‌ ఎపిసోడ్‌తోనే ప్రేక్షకులను ఎడాపెడా ఆకట్టుకోవడం మొదలైంది. రాత్రి పది దాటిన తరువాత ఎప్పుడో ప్రసారమయ్యే ఈ సీరియల్‌ను నిద్ర మానుకొని మరీ చూసేవారు. చూసేవారు ఏం ఖర్మ! ఆ రాత్రి బిగ్గరగా ఏడ్చేవారు. అంతకంటే బిగ్గరగా నవ్వేవారు. ఆందోళనతో అరిచేవారు. ఒక్కటా రెండా... ఆ సీరియల్‌ ప్రసారమవుతున్నంతసేపూ ప్రేక్షకులు నవరసాల్లో గజ ఈత కొట్టేవాళ్లు. కేవలం ఈ సీరియల్‌ పుణ్యమా అని పాతాళంలో ఎక్కడో ఉన్న ఆ టీవీ రేటింగ్, ఎక్కడో ఆకాశంలోకి వెళ్లిపోయింది. మరి అలాంటి సీరియల్‌కు ‘కథ’ అనే ఇంధనం అయిపోయింది. బండి ముందుకు వెళ్లడానికి మొరాయిస్తోంది. ఎలాగైనా సరే మరో పాతిక వారాలైనా సీరియల్‌ను సీరియస్‌గా ముందుకు లాగాలని డిసైడైపోయాడు నిర్మాత యెంకటరత్నం. టాలీవుడ్‌లో భయంకరంగా చేయి తిరిగిన రచయిత సీడీ భయంకర్‌ దగ్గరిగికి వెళ్లాడు.

‘‘మీరు ఎంత డబ్బు  అడిగినా కళ్లు మూసుకొని ఇస్తాను. నా సీరియల్‌ను సాగతీయండి ప్లీజ్‌’’ అని వినయంగా వేడుకున్నాడు.‘‘డబ్బుల సంగతి తరువాత, ముందు మీ సీరియల్‌ మూల కథ ఏంటో చెప్పండి’’ అని సిగరెట్‌ ముట్టించాడు భయంకర్‌. అప్పుడు ఆ నిర్మాత ఇలా చెప్పాడు:‘అనగనగా ఒక కుటుంబరావు. ఆయనకు ఆరుగురు తమ్ముళ్లు. ముగ్గురు చెల్లెళ్లు. ఈ ఆరుగురు తమ్ముళ్లు బలాదూరుగా తిరుగుతుంటారు. ఇంటి భారమంతా కుటుంబరావే మోస్తుంటాడు. తమ్ముళ్లకు ఎన్ని మంచి మాటలు చెప్పినా పెడ చెవిన పెడుతూ అన్నను ఇబ్బందుల పాలు చేస్తూనే ఉంటారు. కానీ, ఒక సంఘటనతో వారికి అన్న అంటే విపరీతమైన అభిమానం ఏర్పడుతుంది.

ఒకరోజు...
కుటుంబరావు ఇంటి ముందు పడవలాంటి కారు ఆగింది. అందులో నుంచి ఆరున్నర అడుగుల ఖరీదైన వ్యక్తి బయటికి వచ్చాడు. ఆయన కుటుంబరావు పనిచేసే  కంపెనీ అధిపతి ఆనందరావు.  టైమ్‌ వేస్ట్‌ చేయడం ఆయనకు అట్టే ఇష్టం ఉండదు. ఇంట్లోకి రావడంతోనే చెప్పదల్చుకున్నది ఇలా సూటిగా చెప్పాడు...‘‘నీ సిన్సియారిటీ నాకు నచ్చిందయ్యా! నీ అందం మా అమ్మాయికి నచ్చిందయ్యా! టోటల్‌గా నిన్ను మా ఇంటి అల్లుడిని చేసుకోవాలనుకుంటున్నామయ్యా. అయితే ఒక షరతు. పెళ్లి తరువాత నువ్వు మా ఇంట్లోనే ఉండాలయ్యా. ఈ ఇంట్లో వాళ్లను టోటల్‌గా మరిచిపోవాలయ్యా. ఆలోచించుకోవయ్యా...’’  ఈ మాటలు వినడంతోనే కుటుంబరావు కళ్లు  తెలుగు సినిమాల్లోలాగా మండుతున్న అగ్నిగోళాలయ్యాయి. తెలుగు నవలల్లో మాదిరిగా పిడికిళ్లు బలంగా బిగుసుకున్నాయి.

తన యజమాని కూర్చున్న కుర్చీని బలంగా తన్ని....‘‘ఇంకోసారి నీ ముఖం నాకు కనిపించనీయకు. ఎంత మాటన్నావ్‌? తుచ్ఛమైన నీ ఆస్తికోసం... అచ్చమైన నా కుటుంబాన్ని వదులుకోవాలా!స్వచ్ఛమైన భారత్‌లో పుట్టిన అచ్చమైన మగాడినిరా. ఖబడ్దార్‌’’ అని అరిచాడు.ఆనందరావు వెనక్కి తిరిగి చూడకుండా  పారిపోయాడు. అన్న ఔదార్యాన్ని చూసి చలించిపోయిన తమ్ముళ్లు ఆ క్షణమే మారిపోయారు. కష్టపడ్డారు. వ్యాపారాలు పెట్టారు. లక్షలు సంపాదించారు. అన్న పెళ్లిఘనంగా చేశారు.  సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో పెద్ద ఇల్లు తీసుకుని అందరూ హాయిగా ఉండటంతో  శుభం కార్డు పడిపోయింది. నాకు దిక్కుతోచకుండా అయింది’’‘‘కథ సుఖాంతం అయింది కదా! ఇంకా దీనిలో సాగతీయడానికి ఏముంది?’’ అని ‘ఇక మీరు వెళ్లవచ్చు’ అన్నట్లు చూశాడు భయంకర్‌. చేసేదేమీ లేక వచ్చిన దారినే వెనక్కి వెళ్లిపోయాడు నిర్మాత యెంకటరత్నం.

విక్రమార్కుడి భుజం మీద ఉన్న భేతాళుడు గొంతు విప్పి....‘‘రాజా! కాసేపు నువ్వు రాజువి కాదు రైటర్‌వి అనుకుందాం. ఇదిగో... ఈ బుట్టలో కొన్ని చీటీలు ఉన్నాయి. ఆ చీటిలలో కొన్ని పదాలు రాసి ఉన్నాయి.  ఈ బుట్టలో నుంచి ఒక చీటి తియ్యి. ఆ చీటీలో ఏ  పదం ఉందో... కేవలం ఆ ఒక్క  పదంతో  ‘అంతులేని స్టోరీ’ సీరియల్‌ను పాతిక వారాల వరకు సాగతీయాలి. సారీ... నావల్ల కాదు అన్నావో నీతల వెయ్యి వక్కలవుతుంది’’ అని వార్నింగ్‌ ఇచ్చాడు బేతాళుడు.‘‘అలాగే’’ అంటూ ఆ బుట్టలో నుంచి ఒక చీటీ తీశాడు విక్రమార్కుడు.‘తుమ్ము’ అని వచ్చింది. విక్రమార్కుడు  స్టోరీని మొదలు పెట్టాడు....

‘‘సుఖసంతోషాలతో జీవిస్తున్న కుటుంబరావు ఇంటికి ఒకరోజు ఆయన అత్త ఆండాళమ్మ  వచ్చింది. ఒక వారం రోజులు ఉండి తిరిగివెళ్లిపోతున్న సమయంలో కుటుంబరావు చిన్న తమ్ముడు హాచ్‌ అనితుమ్మాడు. కొంచెం సేపు ఆగి వెళ్లమ్మా... అంది కూతురు. లోపల భయంగా ఉన్నా... నాకు అలాంటి పట్టింపులేమీ లేవమ్మా... అంటూ బయటకు అడుగు వేసిన ఆండాళ్లమ్మ... ఒక అరటి తొక్క మీద కాలు వేసి సర్రున జారి పడింది. ఈ క్రమంలో ఆమె తలకు బలమైన దెబ్బతగలడం వల్ల మతిచలించింది. ‘నీ తుమ్ముతో బంగారంలాంటి మా అమ్మను పిచ్చిదాన్ని చేస్తావా?’ అని కుటుంబరావు తమ్ముడి కాలరు పట్టుకున్నాడు  ఆయన బామ్మర్ది బాలరాజు.

నా తమ్ముడి కాలర్‌ పట్టుకుంటావా? అని కన్నెర్ర  చేస్తూ... అప్పడాల కర్రతో బాలరాజు తల మీద ఒక్కటిచ్చుకుంది కుటుంబరావు పెద్దచెల్లె. ఈ దెబ్బతో బాలరాజుకు పట్టపగలే చుక్కలు కనిపించి మతిచలించింది. రెండు రోజుల తరువాత కుటుంబరావు మామ గుర్నాథం వచ్చి...‘‘జరిగింది పీడకల అనుకుందాం. అందరం మునపటిలా కలిసి ఉందాం’’ అన్నాడు. అలా అన్నాడో లేదో ‘హాచ్‌’ అని బలంగా తుమ్మింది  కుటుంబరావు తమ్ముడి భార్య పంకజం. ఆమె తుమ్ము ధాటికి పైన ఉన్న పెద్ద పాత గడియారం ఊడి గుర్నాథం తల మీద పడింది. ఆ దెబ్బకు ఆయన మతిచలించింది.

 ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడని కుటుంబరావు భార్య అప్పుడు గొంతులో నిప్పులు పోసుకొని ఆవేశంగా  ఇలా మాట్లాడింది...‘‘నాకుంది ఒకే ఒక అమ్మ. ఆమెను పిచ్చిదాన్ని చేశారు. నాకుంది ఒకే ఒక తమ్ముడు. వాడ్ని పిచ్చివాడిని చేశారు. నాకుంది ఒకే ఒక నాన్న. ఆయన్ని పిచ్చివాడ్ని చేశారు. ఇక్కడ ఉంటే నాకు కూడా పిచ్చెక్కించేలా ఉన్నారు. ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండలేను’’ అంటూ ఇంటిని విడిచి పుట్టింటికి వెళ్లిపోయింది కుటుంబరావు భార్య.పుట్టింటికి వెళ్లిన కుటుంబరావు భార్య తన సొంతకాళ్ల మీద ఎలా నిలబడింది అనేదాన్ని పది ఎపిసోడ్‌లు లాగించవచ్చు. పిచ్చి వాళ్లయిన అమ్మ, నాన్న, తమ్ముళ్లను  మళ్లీ మూమూలు స్థితికి ఎలా తీసుకువచ్చిందనేది  మరో పది ఎపిసోడ్‌లు లాగించవచ్చు.‘విలన్‌ మీరు కాదు. మేము కాదు. విధి లిఖితమైన తుమ్ము మాత్రమే’ అని ఇరువర్గాలు ఒక  అండర్‌స్టాండింగ్‌కు వచ్చిన పరిస్థితి గురించి మరో పది ఎపిసోడ్‌లు లాగించవచ్చు’’ అని ముగించాడు విక్రమార్కుడు. ‘శబ్బాష్‌ రాజా!’ అంటూ విక్రమార్కుడి భుజంపై నుంచి ఎగిరిపోయాడు బేతాళుడు.
– యాకుబ్‌ పాషా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement