
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటి, నిర్మాత కృష్ణవేణి తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 102 సంవత్సరాలు కాగా.. వయోభారంతో కన్నుమూశారు. కృష్ణవేణి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో ఉన్నారు. ఆదివారం ఉదయమే తమ మాతృమూర్తి తుది శ్వాస విడిచినట్లు ఆమె కూమార్తె అనురాధ తెలిపారు.
ఎన్టీఆర్‌ను పరిచయం చేసిన కృష్ణవేణి
1949 నవంబరు 24వ తేదీన మనదేశం చిత్రం విడుదలైంది. ఆ చిత్రంలో ఎన్టీఆర్ ఓ చిన్న పాత్ర పోషించారు. ఆ తర్వాత తెలుగు చలన చిత్ర చరిత్రలో ఆయన నటన విశ్వరూపంతో ఓ అసమాన చరిత్రను లిఖించాడు. రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్న కృష్ణవేణి నందమూరి తారక రామారావును సినిమా రంగానికి పరిచయం చేశారు.
కృష్ణవేణి సినీ ప్రస్థానం..
శ్రీమతి కృష్ణవేణి డిసెంబర్ 24, 1924 కృష్ణజిల్లాలోని పంగిడిగూడంలో డా. ఎర్రంశెట్టి లక్ష్మణరావు, నాగరాజమ్మకు జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆమెకు నటన అన్నా, నృత్యం అన్నా అభిమానంతో సినిమాల్లోకి అడుగుపెట్టారు. చిన్న వయసులోనే నాటకాలలో నటించటం మొదలుపెట్టారు. ఆమె నటనను చూసిన దర్శకుడు సి. పుల్లయ్య కృష్ణని బాలనటిగా ‘సతీ అనసూయ’ అనే సినిమాలో 1936లో సినిమా రంగానికి పరిచయం చేశారు. ఆ తర్వాత బాల నటిగా కొనసాగుతూనే తెలుగు, తమిళ భాషా చిత్రాలలో నటించారు. కథానాయికగా నటిస్తున్న సమయంలోనే ఆమెకు మీర్జాపురం రాజా వారితో పరిచయమైంది.
ఆ చిత్రం తర్వాత మళ్లీ నాటకాల్లో నటించారు. ఆ సమయంలో తండ్రి కృష్ణారావు మృతి చెందడంతో అమ్మమ్మ, బాబాయిల వద్ద పెరిగారు కృష్ణవేణి. ఆ తర్వాత ‘తుకారాం’ (1937) సినిమా కోసం చెన్నైలో అడుగుపెట్టారు. ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. కృష్ణవేణి హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం ‘కచదేవయాని’ (1938) విజయం సాధించడంతో మంచి గుర్తింపు, పేరు వచ్చాయి. ఆ తర్వాత ‘మహానంద’ చిత్రంలో నటించేందుకు చెన్నైలోనే స్థిరపడ్డారు.
ఆ సమయంలోనే ప్రముఖ దర్శక–నిర్మాత, మీర్జాపురం రాజాతో (మేకా రంగయ్య) కృష్ణవేణి వివాహం 1940లో విజయవాడలో జరిగింది. వివాహం తర్వాత బయటి సంస్థల్లో పని చేయడం ఇష్టం లేక సొంత ప్రోడక్షన్ జయా పిక్చర్స్–శోభనాచల స్టూడియోస్ నిర్మించిన చిత్రాల్లో నటించారామె. మీర్జాపురం రాజా నిర్మించిన తొలి సాంఘిక చిత్రం ‘జీవన జ్యోతి’లో (1940) హీరోయిన్‌గా చేశారు. ఆ చిత్రంతో సీహెచ్ నారాయణరావు హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు కృష్ణవేణి.
Comments
Please login to add a commentAdd a comment