టీవీ సీరియళ్లు కొన్ని ఏళ్లకేళ్లు సాగుతుంటాయి. ఆ కథలకు అంతుండదు. ఎక్కడ ప్రారంభమై, ఎక్కడ ముగుస్తాయో నిర్వాహకులే చెప్పలేరు. ప్రేక్షకుల ఆదరణ ఉన్నంత కాలం కొనసాగిస్తూనే ఉంటారు. ఒకవేళ వీక్షకుల్ని ఆకట్టుకోకపోతే, ఉన్నట్టుండి సీరియల్‌ను ముగించేస్తారు. కొన్ని సీరియళ్లు, మాత్రం వీక్షకుల ఆదరణతో ఏళ్ల తరబడి సాగుతుంటాయి. మధ్యలో చిన్న విరామం తీసుకున్నప్పటికీ, అదే కాన్సెప్టుతో కూడిన కొత్త సిరీస్‌ని మళ్లీ మొదలెడతారు. దీంతో అవి దశాబ్దాలపాటు సాగుతుంటాయి. ఇలా టెలివిజన్ చరిత్రలో అత్యధిక కాలం ప్రసారమైన సీరియళ్ల గురించి తెలుసుకుందాం..
ద గైడింగ్ లైట్ (57 ఏళ్లు)..
టెలివిజన్ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రసారమైన సీరియల్ ఇదే. అమెరికాకు చెందిన సీబీఎస్ చానెళ్లో ఈ సీరియల్ దాదాపు 57 ఏళ్ల పాటు ప్రసారమైంది. అత్యంత ఎక్కువ కాలం ప్రసారమైన సీరియల్ కాబట్టి, దీనికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కింది. 1952 జూన్ 30న తొలి ఎపిసోడ్ ప్రసారం కాగా, 2009, సెప్టెంబర్ 18న చివరి ఎపిసోడ్ ప్రసారమైంది. బుల్లితెరపై ప్రసారం కాక ముందు 1937 నుంచి పదిహేనేళ్లపాటు ఇది అమెరికాలోని ఎన్‌బీసీ రేడియోలో టెలికాస్ట్ అయ్యింది. అటు టీవీలో, ఇటు రేడియోలో ప్రసారమైన ధారావాహికగా చూస్తే ఇది 72 ఏళ్లపాటు ప్రేక్షకుల్ని అలరించింది. మొత్తం 18,262 ఎపిసోడ్లుగా ఇది వీక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రారంభంలో రోజూ పదిహేను నిమిషాలు మాత్రమే టెలికాస్ట్ అయ్యేది. అయితే ప్రేక్షకుల ఆదరణ బావుండడంతో క్రమంగా అరగంట, గంటపాటు కూడా ప్రసారమైంది. కానీ క్రమంగా ప్రేక్షకుల ఆదరణ తగ్గడంతో ఈ సీరియల్ 2009లో ఆగిపోయింది.
యాజ్ ద వరల్డ్ టర్న్స్ (54 ఏళ్లు)
టీవీ ప్రేక్షకుల్ని అత్యధిక కాలం అలరించిన రెండో సీరియల్ యాజ్ ద వరల్డ్ టర్న్స్. 54 ఏళ్లపాటు టీవీలో ప్రసారమైన ఈ సీరియల్ తొలి ఎపిసోడ్ 1956 ఏప్రిల్ 2న ప్రారంభమైంది. చివరి ఎపిసోడ్ 2010, సెప్టెంబర్ 17న ప్రసారమైంది. అమెరికాలోని సీబీఎస్ చానెళ్లో ఇది ప్రసారమయ్యేది. ఇర్నా ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన ఈ యాజ్ ద వరల్డ్ టర్న్స్‌ను ‘ద గైడింగ్ లైట్’కి సిస్టర్ షోగా పిలిచేవారు. ఈ సీరియల్ ఎక్కువగా న్యూయార్క్‌లోని మన్‌హట్టన్‌లోనే షూటింగ్ జరుపుకొంది. 1956లో ఇది రోజూ మధ్యాహ్నం పదిహేను నిమిషాలు మాత్రమే ప్రసారమయ్యేది. ఆ తర్వాత రోజూ సాయంత్రం నాలుగున్నర గంటలకు మారి, అరగంట ప్రసారమయ్యేది. పన్నెండేళ్ల ప్రసారమయ్యాక వీక్షకుల ఆదరణ బావుండడంతో గంట పాటు టెలికాస్ట్ చేసేవారు. కుటుంబ కథా నేపథ్యంతో రూపొందిన ఈ సీరియల్ పూర్తయ్యేవరకు దాదాపు 13,000 ఎపిసోడ్లు ప్రసారమైంది.
జనరల్ హాస్పిటల్ (54 ఏళ్లు)..
1963 ఏప్రిల్ 1న తొలిసారిగా ప్రారంభమైన ఈ అమెరికన్ సీరియల్ ఇప్పటికీ ప్రసారమవుతుండడం విశేషం. ఇప్పటివరకు దాదాపు 54 ఏళ్లుగా జనరల్ హాస్పిటల్ వీక్షకుల్ని అలరిస్తూనే ఉంది. మధ్యలో కొన్నిసార్లు విరామం తీసుకుని, తర్వాత కొత్త సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. టీవీ హిస్టరీలో అత్యధిక కాలం ప్రసారమైన మూడో సీరియల్‌గానే కాక, అత్యధిక కాలం నిర్మాణంలో ఉన్న సీరియల్‌గా కూడా ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. ఫ్రాంక్ అండ్ డోరిస్ హర్స్‌లీ అనే దంపతులు దీనికి రచన చేశారు. పోర్ట్ చార్లిస్ అనే ఒక కల్పిత నగరంలోని హాస్పిటల్ నేపథ్యంగా ఈ సీరియల్ సాగుతుంది. 2003లో టీవీ గైడ్ అనే ఓ సంస్థ జనరల్ హాస్పిటల్‌ను సీరియల్ ఆఫ్ ఆల్‌టైమ్‌గా ప్రకటించింది.
ద యంగ్ అండ్ రెస్ట్‌లెస్ (44 ఏళ్లు)..
అమెరికాలోని సీబీఎస్ చానళ్లో ప్రసారమవుతున్న ద యంగ్ అండ్ రెస్ట్‌లెస్ 44 ఏళ్లుగా కొనసాగుతుండడం విశేషం. తొలి ఎపిసోడ్ 1973 మార్చి 26న ప్రసారమైంది. అప్పటినుంచి 1980 వరకు వారానికి ఐదు రోజుల చొప్పున, రోజూ అరగంటపాటు ఇది ప్రసారమయ్యేది. అనంతరం ప్రసార సమయం గంటకు పెరిగింది. గత ఏడాది సెప్టెంబర్ వరకు ఈ సీరియల్ 11 వేల ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. అమెరికాలోనే కాకుండా ఇతర దేశాల్లో సైతం స్థానిక చానళ్లలో ఇది ప్రసారమవుతోంది. విస్కన్సిన్ రాష్ట్రంలోని జినోవా అనే ఒక కల్పిత నగరంలోని వ్యక్తుల జీవితాల ఆధారంగా ఈ సీరియల్ కొనసాగుతోంది.
డేస్ ఆఫ్ అవర్ లైవ్స్ (51 ఏళ్లు)..
1965లో తొలిసారిగా ప్రసారమైన డేస్ ఆఫ్ అవర్ లైవ్స్ ఇప్పటికీ కొనసాగుతుండడం విశేషం. అమెరికాలోని ఎన్‌బీసీ చానళ్లో 1965, నవంబర్ 8న ఈ సీరియల్ ప్రారంభమైంది. 51 ఏళ్లుగా ప్రసారమవుతున్న ఈ సీరియల్ ఈ ఏడాది ఫిబ్రవరి 24 నాటికి 13,032 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. 1965 నుంచి 1975 వరకు తొలుత రోజు అరగంట మాత్రమే ప్రసారమయ్యేది. కానీ ప్రేక్షకాదరణ బావుండడంతో 1975 ఏప్రిల్ 21 నుంచి రోజూ అరగంటపాటు ప్రసారమయ్యేది. సాలెమ్ అనే ఒక కల్పిత నగరంలో ఉండే కొన్ని కుటుంబాలు, వారి మధ్య సంఘర్షణలతో ఈ సీరియల్ రూపొందింది. అమెరికాలోనే కాకుండా ఇతర దేశాల్లో సైతం ఇది ప్రసారమైంది. 2013 వరకు ఆన్‌లైన్‌లో డేస్ ఆఫ్ అవర్ లైవ్స్ రీ టెలికాస్ట్ అయ్యేది.
వన్ లైఫ్ టు లివ్ (45 ఏళ్లు)..
ఇది కూడా అమెరికన్ సీరి యలే. 1968 నుంచి 2012 వరకు దాదాపు 45 ఏళ్లపాటు ఇది ప్రసారమైంది. అమెరికాలోని ఏబీసీ చానళ్లో 1968 జూలై 15న తొలి ఎపిసోడ్ ప్రసారం కాగా, చివరి ఎపిసోడ్ 2012 జనవరి 13న ప్రసారమైంది. కానీ చివరి సిరీస్‌ను 2013 ఏప్రిల్ 29 నుంచి ఆగస్టు 19 వరకు ఆన్‌లైన్‌లో ప్రసారం చేశారు. పెన్సిల్వేనియాలోని లియాన్ వ్యూ అనే ఒక కల్పిత నగరంలోని కొంత మంది వ్యక్తుల జీవితంలోని సంఘటనల ఆధారంగా వన్ లైఫ్ టు లివ్ సాగుతుంది. 45 ఏళ్లపాటు ప్రేక్షకుల్ని అలరించి, అత్యధిక కాలం ప్రసారమైన ఐదో సీరియల్‌గా నిలిచింది. – సాక్షి, స్కూల్ ఎడిషన్
అంతులేని కథలు..
Published Tue, Feb 28 2017 10:51 PM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM
Advertisement
Advertisement