long time
-
10 ఏళ్ల క్రితం మాయమై.. బిచ్చగానిగా భర్త కనిపించడంతో..
-
10 ఏళ్ల క్రితం మాయమై.. బిచ్చగానిగా భర్త కనిపించడంతో..
ఉత్తరప్రదేశ్‌లోని బలియాలో హృదయాలను ద్రవింపజేసే ఒక కథ వెలుగుచూసింది. ఈ ప్రాంతానికి చెందిన ఒక మహిళ వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి వెళుతోంది. ఆ సమయంలో ఆమెకు ఆసుపత్రి బయట మానసికంగా కుంగిపోయిన ఒక వ్యక్తి కనిపించాడు. ఆమె ఆతనికి దగ్గరగా వెళ్లి పరిశీలనగా చూడగా, అతను మరెవరో కాదు తన భర్తే అని గుర్తించింది. 10 ఏళ్ల క్రితం ఆమె భర్త కనిపించకుండా పోయాడు. ఇప్పుడు భర్తను ఇటువంటి పరిస్థితిలో చూసిన ఆమె అతనికి తల దువ్వడంతో పాటు శరీరాన్ని శుభ్రపరుస్తూ స్నానం చేయించింది. అలాగే ఆమె ఏడుస్తూ పదేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన తన భర్త ఇతనేనని చుట్టుపక్కల వారికి తెలియజేసింది. ఇన్నాళ్లూ ఎక్కడికి వెళ్లిపోయారు? ఏమైపోయారు? అని అతనిని అడుగుతూ కనిపించింది. అయితే అతను అమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. మౌనంగా ఆమెను అలా చూస్తూనే ఉన్నాడు. ఇంతలో ఆ మహిళ ఇంటిలోని వారికి ఫోను చేసి, తండ్రికి దుస్తులు తీసుకురావాలని కోరింది. కొద్దిసేపటి తరువాత బైక్‌పై వచ్చిన ఒక యువకుడు ఆ మహిళను, అతనిని తనతో పాటు తీసుకువెళ్లిపోయాడు. కాగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 2020లో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. ఒక డీఎస్పీ రోడ్డు పక్కక బిచ్చగాని మాదిరిగా కనిపించాడు. అతని బ్యాచ్‌మేట్ అతనిని గుర్తించారు. ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ ప్రోగ్రాం ఉందని మొహర్రం సెలవు రద్దు..! -
జ్యోతి బసు రికార్డును తిరగరాసిన నవీన్
భువనేశ్వర్: దేశంలో సుదీర్ఘ కాలం కొనసాగిన రెండో ముఖ్యమంత్రిగా పశ్చిమబెంగాల్ సీఎం జ్యోతి బసు పేరిట ఉన్న రికార్డును ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తిరగరాశారు. దేశంలోనే సుదీర్ఘ కాలంపాటు, 24 ఏళ్లకు పైగా అధికారంలో కొనసాగిన సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్‌కుమార్ చామ్లింగ్ మొదటి స్థానంలోనే కొనసాగుతున్నారు. ఆయన తర్వాత కమ్యూనిస్టు యోధుడు జ్యోతి బసు 1977 జూన్ 21 నుంచి 2000 నవంబర్ 5వ తేదీ వరకు 23 ఏళ్ల 137 రోజులు సీఎంగా కొనసాగారు. ఒడిశా సీఎంగా 2000 మార్చి 5న మొదటిసారిగా బాధ్యతలు చేపట్టిన నవీన్ పట్నాయక్ అయిదు పర్యాయాలు ఆ రాష్ట్రానికి సీఎంగా ఎన్నికై శనివారం నాటికి 23 సంవత్సరాల 138 రోజులు పూర్తి చేసుకున్నారు. దీంతో, చామ్లింగ్ తర్వాతి స్థానంలోకి చేరారు. పవన్ కుమార్ చామ్లింగ్, జ్యోతి బసు తర్వాత వరుసగా అయిదు పర్యాయాలు సీఎంగా ఎన్నికైన నేతగానూ నవీన్ పట్నాయక్ మూడో స్థానంలో నిలిచారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేడీ మళ్లీ విజయం సాధించి, సీఎంగా పగ్గాలు చేపట్టిన పక్షంలో నవీన్ పటా్నయక్ దేశంలోనే సుదీర్ఘకాలం సీఎంగా కొనసాగిన నేతగా నిలుస్తారు. -
దీర్ఘకాలంలో స్థిరమైన రాబడులు
గత కొంతకాలంగా మల్టీక్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాలకు ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ పెరుగుతోంది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ ప్రతీ ర్యాలీలో పాల్గొంటాయని చెప్పలేని పరిస్థితి. కానీ, ర్యాలీ మొదలు పెట్టాయా, అధిక రాబడుల దిశగా పరుగులు తీస్తుంటాయి. మరోవైపు బ్లూచిప్ కంపెనీలు మాత్రం మార్కెట్ ర్యాలీ, కరెక్షన్లలోనూ తప్పకుండా ముందుంటాయి. ఈ విధంగా అన్ని రకాల మార్కెట్ క్యాప్‌తో కూడిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు వీలు కల్పించేవే మల్టీక్యాప్ మ్యూచువల్ ఫండ్స్. తద్వారా అన్ని విభాగాల్లోని నాణ్యమైన స్టాక్స్‌లో పెట్టుబడులపై మంచి రాబడులను ఇన్వెస్టర్లకు అందించేందుకు ఫండ్ మేనేజర్లు ఈ పథకాల ద్వారా ప్రయత్నం చేస్తుంటారు. ఈ విభాగంలో మెరుగైన పనితీరు చూపుతున్న పథకాల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీక్యాప్ కూడా ఒకటి. రాబడులు.. ఈ పథకం రాబడుల్లో స్థిరత్వాన్ని గమనించొచ్చు. ఒక్క మూడేళ్ల కాలాన్ని మినహాయిస్తే మిగిలిన అన్ని కాలాల్లోనూ ప్రామాణిక సూచీ కంటే మెరుగైన రాబడులు ఈ పథకంలో ఉన్నాయి. ఈ పథకం రాబడులకు బీఎస్ఈ 500 టీఆర్ఐను ప్రామాణికంగా చూస్తారు. ఏడాది కాలంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మల్టీక్యాప్ ఫండ్ 4.86 శాతం రాబడులను ఇవ్వగా, మూడేళ్ల కాలంలో 12.65 శాతం, ఐదేళ్ల కాలంలో 13.47 శాతం, పదేళ్ల కాలంలో 15.53 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇచ్చింది. బీఎస్ఈ 500 టీఆర్ఐ రాబడులు ఏడాది కాలంలో 1.25 శాతం, మూడేళ్లలో 13.49 శాతం, ఐదేళ్లలో 11.91 శాతం, పదేళ్లలో 14.31 శాతం చొప్పున ఉన్నాయి. పెట్టుబడుల విధానం మల్టీక్యాప్ పథకాల్లో మరో వెసులుబాటు కూడా ఉంది. ఉదాహరణకు ప్రస్తుతం బ్లూచిప్ కంపెనీల వ్యాల్యూషన్లు పదేళ్ల సగటు పీఈ కంటే ఎక్కువే ఉన్నాయి. అదే మిడ్, స్మాల్‌క్యాప్ మాత్రం గత ఏడాదికి పైగా దిద్దుబాటు దశలో ఉండి ఆకర్షణీయమైన వ్యాల్యూషన్లకు చేరాయి. మల్టీక్యాప్ ఫండ్ మేనేజర్లు చౌక వ్యాల్యూషన్లకు చేరిన మిడ్, స్మాల్‌క్యాప్‌లో ఎక్స్పోజర్ పెంచుకుని, లార్జ్‌క్యాప్‌లో తగ్గించుకోవచ్చు. అలాగే, మిడ్, స్మాల్‌క్యాప్ వ్యాల్యూషన్లు అధిక స్థాయిలకు చేరాయని భావించినప్పుడు తిరిగి వాటిల్లో పెట్టుబడులను కుదించుకుని, లార్జ్‌క్యాప్‌లో పెంచుకోవచ్చు. ఐసీఐసీఐ మల్టీక్యాప్ పథకం ప్రధానంగా ప్రముఖ లార్జ్‌క్యాప్‌తోపాటు, మిడ్, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. ఇంటర్నల్ మార్కెట్ క్యాప్ విధానాన్ని పాటిస్తుంది. ఆర్థిక రంగం రికవరీతో ఎక్కువగా ప్రయోజనం పొందే రంగాల స్టాక్స్‌లో ప్రస్తుతం ఎక్కువగా ఇన్వెస్ట్ చేసింది. ప్రధానంగా ప్రభుత్వరంగ కంపెనీల (పీఎస్‌యూ) వ్యాల్యూషన్లు చారిత్రకంగా కనిష్ట స్థాయిలకు చేరాయి. దీంతో ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ స్టాక్స్‌లో ర్యాలీకి అవకాశం ఉంటుందన్న అంచనాతో ప్రభుత్వరంగ కంపెనీలను పోర్ట్‌ఫోలియోకి చేర్చింది. వ్యాల్యూషన్ల పరంగా ఆకర్షణీయంగా ఉన్న కార్పొరేట్ బ్యాంకుల్లోనూ ఇన్వెస్ట్ చేసింది. టెలికంలోనూ ఎక్స్పోజర్ తీసుకుంది. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం 69 స్టాక్స్ ఉన్నాయి. 76 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్‌నకు కేటాయించగా, మిడ్‌క్యాప్ కంపెనీల్లో 19 శాతం, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 5 శాతం వరకు కేటాయింపులు చేసింది. -
34ఏళ్లకు బయటపడ్డ లారీ
సాక్షి, కరీంనగర్‌రూరల్ : మూడు దశాబ్దాల క్రితం.. భారీ వరదల కారణంగా ఇరుకుల్ల వాగులో గల్లంతైన లారీ ఆనవాళ్లు కనిపించాయి. ఇసుక తవ్వకాలతో లారీ విడిభాగాలు బయటపడ్డాయి. గల్లంతైన లారీ కనిపించడంతో చూసేందుకు స్థానికులు ఆసక్తిగా తరలివస్తున్నారు. 1984లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. వారంపాటు కురిసిన భారీవర్షాలకు కరీంనగర్ మండలంలోని ఇరుకుల్ల వాగు పొంగిపొర్లింది. పాత వంతెనపైనుంచి వరద ఉధృతంగా ప్రవహించింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే కరీంనగర్‌కు చెందిన లారీలో డ్రైవర్ సలీం, కటికె శంకర్ (పశువుల వ్యాపారి) వంతెన దాటేందుకు ప్రయత్నిస్తుండగా లారీ వరదనీటిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో లారీతోపాటు డ్రైవర్, పశువుల వ్యాపారి ఇద్దరూ గల్లంతరయ్యారు. అనంతరం రాజీవ్ రహదారి నిర్మాణంలో భాగంగా ఇరుకుల్ల వాగుపై కొత్త వంతెన నిర్మించారు. దీంతో పాతవంతెన మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. కొన్నేళ్లుగా ఇరుకుల్ల వాగునుంచి ఇసుక అక్రమంగా రవాణా అవుతోంది. ప్రతిరోజూ వందలాది ట్రాక్టర్లద్వారా ఇసుక తరలిపోతోంది. పాత వంతెన సమీపంలో మూడురోజుల క్రితం ఇసుక తవ్వుతుండగా.. అప్పుడు గల్లంతయిన లారీ విడి భాగాలు బయటపడ్డాయి. లారీ క్యాబిన్ ఇనుప రేకులు కన్పిస్తున్నాయి. దాదాపు 34ఏళ్ల క్రితం వాగులో గల్లంతైన లారీ విడిభాగాలు ప్రస్తుతం బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. లారీ కనిపిస్తోందనే సమాచారంతో దుర్శేడ్, ఇరుకుల్ల, మొగ్ధుంపూర్ గ్రామస్తులు వచ్చి ఆసక్తిగా పరిశీలిస్తూ అప్పటి సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు. -
30 ఏళ్లుగా తప్పించుకుంటున్న దొంగ అరెస్ట్
పిడుగురాళ్లటౌన్: 30 ఏళ్ల క్రితం పిడుగురాళ్ల పరిసర ప్రాంతాల్లో లారీలు ఆపి దోపిడీ చేయడం ఆ దొంగపని. అప్పుడు ఆ దొంగ వయసు 19 ఏళ్లు. ఇప్పుడు సుమారు 50 ఏళ్లుంటాయి. అయినా ఆ దొంగను గుర్తించి పట్టుకున్న సంఘటన సోమవారం జరిగింది. సీఐ ఎం.హనుమంతరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా అంకిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన అంబటి మల్లికార్జునరెడ్డి బృందం 1988లో పిడుగురాళ్ల పరిసర ప్రాంతాల్లో దారికాచి దొంగతనాలు, లారీలను ఆపి దోపిడీలు చేస్తుండేవారు. అప్పుడే మల్లికార్జునరెడ్డిపై కేసు నమోదైంది. అప్పటినుంచి అతడిని అరెస్ట్‌చేసి కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించే క్రమంలో ఈ దొంగ కేసు బయటపడింది. ఎలాగైనా ఈ దొంగను పట్టుకోవాలని సీఐ నిర్ణయించుకుని ఓ బృందాన్ని పాత ఫొటో ఇచ్చి కర్నూలుకు పంపారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కర్నూలులో దోపిడీదొంగ మల్లికార్జునరెడ్డిని అరెస్ట్ చేసి పిడుగురాళ్లకు తీసుకువచ్చారు. ఈ విషయం సత్తెనపల్లి డీఎస్పీకి తెలియడంతో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసును ఛేదించినందుకు సీఐ హనుమంతరావును, ఎస్ఐ హరిబాబును, పోలీసు బృందాన్ని అభినందించారు. -
అంతులేని కథలు..
టీవీ సీరియళ్లు కొన్ని ఏళ్లకేళ్లు సాగుతుంటాయి. ఆ కథలకు అంతుండదు. ఎక్కడ ప్రారంభమై, ఎక్కడ ముగుస్తాయో నిర్వాహకులే చెప్పలేరు. ప్రేక్షకుల ఆదరణ ఉన్నంత కాలం కొనసాగిస్తూనే ఉంటారు. ఒకవేళ వీక్షకుల్ని ఆకట్టుకోకపోతే, ఉన్నట్టుండి సీరియల్‌ను ముగించేస్తారు. కొన్ని సీరియళ్లు, మాత్రం వీక్షకుల ఆదరణతో ఏళ్ల తరబడి సాగుతుంటాయి. మధ్యలో చిన్న విరామం తీసుకున్నప్పటికీ, అదే కాన్సెప్టుతో కూడిన కొత్త సిరీస్‌ని మళ్లీ మొదలెడతారు. దీంతో అవి దశాబ్దాలపాటు సాగుతుంటాయి. ఇలా టెలివిజన్ చరిత్రలో అత్యధిక కాలం ప్రసారమైన సీరియళ్ల గురించి తెలుసుకుందాం.. ద గైడింగ్ లైట్ (57 ఏళ్లు).. టెలివిజన్ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రసారమైన సీరియల్ ఇదే. అమెరికాకు చెందిన సీబీఎస్ చానెళ్లో ఈ సీరియల్ దాదాపు 57 ఏళ్ల పాటు ప్రసారమైంది. అత్యంత ఎక్కువ కాలం ప్రసారమైన సీరియల్ కాబట్టి, దీనికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కింది. 1952 జూన్ 30న తొలి ఎపిసోడ్ ప్రసారం కాగా, 2009, సెప్టెంబర్ 18న చివరి ఎపిసోడ్ ప్రసారమైంది. బుల్లితెరపై ప్రసారం కాక ముందు 1937 నుంచి పదిహేనేళ్లపాటు ఇది అమెరికాలోని ఎన్బీసీ రేడియోలో టెలికాస్ట్ అయ్యింది. అటు టీవీలో, ఇటు రేడియోలో ప్రసారమైన ధారావాహికగా చూస్తే ఇది 72 ఏళ్లపాటు ప్రేక్షకుల్ని అలరించింది. మొత్తం 18,262 ఎపిసోడ్లుగా ఇది వీక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రారంభంలో రోజూ పదిహేను నిమిషాలు మాత్రమే టెలికాస్ట్ అయ్యేది. అయితే ప్రేక్షకుల ఆదరణ బావుండడంతో క్రమంగా అరగంట, గంటపాటు కూడా ప్రసారమైంది. కానీ క్రమంగా ప్రేక్షకుల ఆదరణ తగ్గడంతో ఈ సీరియల్ 2009లో ఆగిపోయింది. యాజ్ ద వరల్డ్ టర్న్స్ (54 ఏళ్లు) టీవీ ప్రేక్షకుల్ని అత్యధిక కాలం అలరించిన రెండో సీరియల్ యాజ్ ద వరల్డ్ టర్న్స్. 54 ఏళ్లపాటు టీవీలో ప్రసారమైన ఈ సీరియల్ తొలి ఎపిసోడ్ 1956 ఏప్రిల్ 2న ప్రారంభమైంది. చివరి ఎపిసోడ్ 2010, సెప్టెంబర్ 17న ప్రసారమైంది. అమెరికాలోని సీబీఎస్ చానెళ్లో ఇది ప్రసారమయ్యేది. ఇర్నా ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన ఈ యాజ్ ద వరల్డ్ టర్న్స్ను ‘ద గైడింగ్ లైట్’కి సిస్టర్ షోగా పిలిచేవారు. ఈ సీరియల్ ఎక్కువగా న్యూయార్క్‌లోని మన్హట్టన్లోనే షూటింగ్ జరుపుకొంది. 1956లో ఇది రోజూ మధ్యాహ్నం పదిహేను నిమిషాలు మాత్రమే ప్రసారమయ్యేది. ఆ తర్వాత రోజూ సాయంత్రం నాలుగున్నర గంటలకు మారి, అరగంట ప్రసారమయ్యేది. పన్నెండేళ్ల ప్రసారమయ్యాక వీక్షకుల ఆదరణ బావుండడంతో గంట పాటు టెలికాస్ట్ చేసేవారు. కుటుంబ కథా నేపథ్యంతో రూపొందిన ఈ సీరియల్ పూర్తయ్యేవరకు దాదాపు 13,000 ఎపిసోడ్లు ప్రసారమైంది. జనరల్ హాస్పిటల్ (54 ఏళ్లు).. 1963 ఏప్రిల్ 1న తొలిసారిగా ప్రారంభమైన ఈ అమెరికన్ సీరియల్ ఇప్పటికీ ప్రసారమవుతుండడం విశేషం. ఇప్పటివరకు దాదాపు 54 ఏళ్లుగా జనరల్ హాస్పిటల్ వీక్షకుల్ని అలరిస్తూనే ఉంది. మధ్యలో కొన్నిసార్లు విరామం తీసుకుని, తర్వాత కొత్త సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. టీవీ హిస్టరీలో అత్యధిక కాలం ప్రసారమైన మూడో సీరియల్గానే కాక, అత్యధిక కాలం నిర్మాణంలో ఉన్న సీరియల్‌గా కూడా ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. ఫ్రాంక్ అండ్ డోరిస్ హర్స్‌లీ అనే దంపతులు దీనికి రచన చేశారు. పోర్ట్ చార్లిస్ అనే ఒక కల్పిత నగరంలోని హాస్పిటల్ నేపథ్యంగా ఈ సీరియల్ సాగుతుంది. 2003లో టీవీ గైడ్ అనే ఓ సంస్థ జనరల్ హాస్పిటల్‌ను సీరియల్ ఆఫ్ ఆల్‌టైమ్‌గా ప్రకటించింది. ద యంగ్ అండ్ రెస్ట్‌లెస్ (44 ఏళ్లు).. అమెరికాలోని సీబీఎస్ చానళ్లో ప్రసారమవుతున్న ద యంగ్ అండ్ రెస్ట్‌లెస్ 44 ఏళ్లుగా కొనసాగుతుండడం విశేషం. తొలి ఎపిసోడ్ 1973 మార్చి 26న ప్రసారమైంది. అప్పటినుంచి 1980 వరకు వారానికి ఐదు రోజుల చొప్పున, రోజూ అరగంటపాటు ఇది ప్రసారమయ్యేది. అనంతరం ప్రసార సమయం గంటకు పెరిగింది. గత ఏడాది సెప్టెంబర్ వరకు ఈ సీరియల్ 11 వేల ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. అమెరికాలోనే కాకుండా ఇతర దేశాల్లో సైతం స్థానిక చానళ్లలో ఇది ప్రసారమవుతోంది. విస్కన్సిన్ రాష్ట్రంలోని జినోవా అనే ఒక కల్పిత నగరంలోని వ్యక్తుల జీవితాల ఆధారంగా ఈ సీరియల్ కొనసాగుతోంది. డేస్ ఆఫ్ అవర్ లైవ్స్ (51 ఏళ్లు).. 1965లో తొలిసారిగా ప్రసారమైన డేస్ ఆఫ్ అవర్ లైవ్స్ ఇప్పటికీ కొనసాగుతుండడం విశేషం. అమెరికాలోని ఎన్బీసీ చానళ్లో 1965, నవంబర్ 8న ఈ సీరియల్ ప్రారంభమైంది. 51 ఏళ్లుగా ప్రసారమవుతున్న ఈ సీరియల్ ఈ ఏడాది ఫిబ్రవరి 24 నాటికి 13,032 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. 1965 నుంచి 1975 వరకు తొలుత రోజు అరగంట మాత్రమే ప్రసారమయ్యేది. కానీ ప్రేక్షకాదరణ బావుండడంతో 1975 ఏప్రిల్ 21 నుంచి రోజూ అరగంటపాటు ప్రసారమయ్యేది. సాలెమ్ అనే ఒక కల్పిత నగరంలో ఉండే కొన్ని కుటుంబాలు, వారి మధ్య సంఘర్షణలతో ఈ సీరియల్ రూపొందింది. అమెరికాలోనే కాకుండా ఇతర దేశాల్లో సైతం ఇది ప్రసారమైంది. 2013 వరకు ఆన్లైన్లో డేస్ ఆఫ్ అవర్ లైవ్స్ రీ టెలికాస్ట్ అయ్యేది. వన్ లైఫ్ టు లివ్ (45 ఏళ్లు).. ఇది కూడా అమెరికన్ సీరి యలే. 1968 నుంచి 2012 వరకు దాదాపు 45 ఏళ్లపాటు ఇది ప్రసారమైంది. అమెరికాలోని ఏబీసీ చానళ్లో 1968 జూలై 15న తొలి ఎపిసోడ్ ప్రసారం కాగా, చివరి ఎపిసోడ్ 2012 జనవరి 13న ప్రసారమైంది. కానీ చివరి సిరీస్‌ను 2013 ఏప్రిల్ 29 నుంచి ఆగస్టు 19 వరకు ఆన్లైన్లో ప్రసారం చేశారు. పెన్సిల్వేనియాలోని లియాన్ వ్యూ అనే ఒక కల్పిత నగరంలోని కొంత మంది వ్యక్తుల జీవితంలోని సంఘటనల ఆధారంగా వన్ లైఫ్ టు లివ్ సాగుతుంది. 45 ఏళ్లపాటు ప్రేక్షకుల్ని అలరించి, అత్యధిక కాలం ప్రసారమైన ఐదో సీరియల్‌గా నిలిచింది. – సాక్షి, స్కూల్ ఎడిషన్ -
కాలమే సాక్షి... దేవుడు ప్రేమిస్తాడు!
నయా ఔర్ నేక్ కాలం అమూల్యమైనది. అది ఎవరి కోసమూ ఆగదు. పరుగు దాని నైజం. నిరంతరం అది పరుగెడుతూనే ఉంటుంది. దాని వెనుక పరుగెత్తలేని వారు మరుగున పడిపోతారు. అనంతమైన ఈ కాల ప్రవాహంలో మలుపులే తప్ప మజిలీలు లేవు. కాలగతిలో కేలండర్లు మారుతుంటాయి. కొత్త వత్సరాలు వస్తూ ఉంటాయి. వివిధ దేశాల్లో, వివిధ మతాల్లో రకరకాల పేర్లతో ఇవి ప్రాచుర్యం పొందాయి. తెలుగునాట ‘ఉగాది’తో కొత్తసంవత్సరం ప్రారంభమైనట్లుగానే, ఇస్లామీయ కేలండరు ప్రకారం, హి. శ. మొదటి మాసం ‘ముహర్రమ్’తో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అలాగే క్రీస్తుశకంలో ఆంగ్ల సంవత్సరం జనవరితో ఆరంభమవుతుంది. గతానికి వీడ్కోలు పలికి, కొత్త వత్సరానికి స్వాగతం పలికే సమయంలో ఎవరైనా ఆనందానుభూతులకు లోను కావడం సహజం. సంతోషం మానవ నైజంలో ఉన్న సహజ గుణం. అయితే, ఆనంద పారవశ్యంలో హద్దుల్ని అతిక్రమించి, నిషిద్ధకార్యాలకు పాల్పడడం ధార్మికంగానే కాక సామాజికంగా, నైతికంగానూ నేరమే. దీనికి దేవుని ముందు జవాబు చెప్పుకోవాలి. అందుకే కాలాన్ని సాక్షిగా పెట్టి అనేక యథార్థాలు చెప్పాడు దైవం. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే, కాలం చెప్పిన అనేక వాస్తవాలు కళ్ళకు కనిపిస్తాయి. కాలం విలువను గుర్తించినవారు మాత్రమే వాటినుండి గుణపాఠం నేర్చుకుంటారు. అలాకాకుండా గడించిన కాలాన్ని గాలి కొదిలేసి, కొత్త సంవత్సరంలో చైతన్యరహిత చర్యలతో, అర్థంపర్థం లేని కార్యకలాపాలతో కొత్త కాలాన్ని ప్రారంభిస్తే, ప్రయోజనం శూన్యం. రాజులు, రారాజులు, మాన్యులు, సామాన్యులు, పండితులు, పామరులు – అంతా కాలగర్భంలో కలిసిపోయినవారే, కలిసిపోవలసినవారే. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేటప్పుడు ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. గతం నుండి గుణపాఠం గ్రహిస్తూ, భవిష్యత్ కాలానికి స్వాగతం పలకాలి. నిస్సందేహంగా కొత్త సంవత్సరాన్ని సంతోషంగా స్వాగతించాల్సిందే. కానీ మందు, చిందు – ఇతరత్రా అసభ్య, నిషిద్ధకార్యాలతో నూతన సంవత్సరాన్ని ఆహ్వానించడం ఎంతవరకు సమంజసం అన్న స్పృహ జాగృతం కావాలి. లక్ష్యరహితంగా భవిష్యత్తును ప్రారంభిస్తే మిగిలేది నిరాశే. అందుకని గడచిన కాలంలో ఏం చేశామన్నది కొత్త సంవత్సర ప్రారంభాన ఆత్మపరిశీలన చేసుకోవాలి. మంచిపనులు చేసి ఉంటే ఈ కొత్త సంవత్సరంలో అవి ఇంకా ఇంకా ఎక్కువగా చెయ్యాలన్న దృఢసంకల్పం చేసుకోవాలి. ఏమైనా తప్పులు, పొరపాట్లు, పాపాలు జరిగి ఉంటే చిత్తశుద్ధితో పశ్చాత్తాపం చెందుతూ, ఇక ముందు వాటన్నిటినీ కచ్చితంగా విసర్జిస్తామని ప్రతిన బూనాలి. ఇక నుండి ఓ నూతన, మంచి (నయా ఔర్ నేక్) శకానికి నాంది అన్న ఆత్మవిశ్వాసం తొణికిసలాడాలి. చేసిన పాపాల పట్ల సిగ్గుపడి, పశ్చాత్తాపం చెంది, భవిష్యత్తులో వాటి జోలికి పోనని ప్రతిన బూనినవారిని దేవుడు ప్రేమిస్తాడు. వారి పాపాల్ని క్షమిస్తాడు. జీవితం చాలా చిన్నది. ఎవరి జీవితం ఎప్పుడు సమాప్తమో ఎవరికీ తెలియదు. కనుక హద్దుల్ని అతిక్రమించకుండా, విలువలతో కూడిన జీవితం గడపడానికి శాయశక్తులా ప్రయత్నించాలి. నూతన సంవత్సర శుభాకాంక్షలతో.. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
50 ఏళ్లకు పైగా కొనసా...గిన సీరియల్స్
టీవీ సీరియళ్లు దశాబ్దాలుగా ప్రేక్షకుల్ని ఆకట్టు కుంటున్నాయి. ముఖ్యంగా మహిళాలోకం వీటికోసం టీవీలకు అతుక్కుపోతారు. 1950వ దశకంలో ఇళ్లల్లోకి చొచ్చుకొచ్చిన ఇవి ఇప్పటికీ వీక్షకుల్ని అలరిస్తున్నాయి. ఇంతగా ప్రేక్షకుల మెప్పు పొందుతున్న వీటిపై ఉన్న విమర్శ.. ఇవి ఏళ్లతరబడి సాగుతూనే ఉంటాయని. వీటిని చాలామంది జీడిపాకంతో పోలుస్తారు. నిజమే నాలుగేళ్లో.. అయిదేళ్లో కాదు... నలభై, యాభై ఏళ్లు ప్రసారమైన టీవీ సీరియళ్లు కూడా ఉన్నాయి. దశాబ్దాలపాటు ఇలా ప్రసారమై అనేక రికార్డులు కూడా నెలకొల్పాయి. అలా ప్రపంచంలో అత్యధిక కాలం ప్రసారమైన సీరియళ్ల గురించి తెలుసుకుందాం.. 1. ద గైడింగ్ లైట్: (57 ఏళ్లు) అమెరికాకు చెందిన ఈ టీవీ సీరియల్ అక్కడి సీబీఎస్ ఛానల్లో ప్రసారమైంది. ఇర్నా ఫిలిఫ్ అనే రచయిత దీన్ని రూపొందించింది. ప్రపంచంలో అత్యధిక కాలం (1952-2009) కొనసాగిన సీరియల్‌గా కూడా ద గైడింగ్ లైట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. 18,262 ఎపిసోడ్లకు పైగా ప్రసారమైన సీరియల్‌గా కూడా ఇది ఘనతకెక్కింది. టీవీ మాధ్యమం అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో ‘గైడింగ్లైట్’ తొలుత రేడియోలో ధారావాహికగా ప్రారంభమయ్యేది. 1937 నుంచి రేడియోలో ప్రసారమైన ఇది 1952, జూన్ 30 నుంచి టీవీ సీరియల్‌గా ప్రేక్షకుల్ని అలరించింది. ప్రారంభంలో రోజుకు 15 నిమిషాల పాటు ప్రసారమైన గైడింగ్ లైట్, అనంతరం రోజూ అరగంటపాటు ప్రసారమైంది. దాదాపు 57 ఏళ్లపాటు సాగిన గైడింగ లైట్‌కు క్రమంగా రేటింగ్ తగ్గడంతో నిర్వాహకులు ఈ సీరియల్‌ను నిలిపివేస్తున్నట్లు 2009లో ప్రకటించారు. 2. యాజ్ ద వరల్డ్ టర్న్స్: (54 ఏళ్లు) అత్యధిక కాలం ప్రసారమైన రెండో టీవీ సీరియల్ ఇది. 1956 ఏప్రిల్ 2న తొలిసారిగా ప్రసారమైన యాజ్ ద వరల్డ్ టర్న్స్ సెప్టెంబర్ 17, 2010 వరకు కొనసాగింది. 54 ఏళ్లు ప్రసారమైన ఈ సీరియల్‌ను కూడా అమెరికాకు చెందిన ఇర్నా ఫిలిప్స్ రూపొందించారు. ఆమె రూపొందించిన ‘ద గైడింగ్లైట్’కు ఈ సీరియల్‌ను సిస్టర్ సీరియల్‌గా పిలిచేవారు అప్పటి విశ్లేషకులు. ఇది కూడా తొలుత మధ్యాహ్నం పూట రోజుకు పదిహేను నిమిషాలు మాత్రమే ప్రసారమయ్యేది. అనంతరం రోజుకు అరగంటపాటు ప్రసారమైంది. మొదట్లో సాయంత్రం పూట అరగంటపాటు ప్రసారమైనప్పుడు దీనికి పెద్దగా ఆదరణ లభించలేదు. అయితే రెండో సంవత్సరం నుంచి ప్రేక్షకాదరణ లభించింది. దాదాపు 13,000 ఎపిసోడ్లకు పైగా ఇది ప్రేక్షకుల్ని అలరించింది. కుటుంబ నేపథ్యంగా రూపొందిన తొలి సీరియల్ కూడా ఇదే. 3. జనరల్ హాస్పిటల్: (52 ఏళ్లు) అత్యధిక కాలం ప్రసారమైన మూడో సీరియల్ ఇది. జనరల్ హాస్పిటల్ కూడా అమెరికా టీవీ సీరియలే కావడం గమనార్హం. స్థానిక ఏబీసీ ఛానల్లో ఏప్రిల్ 1, 1963న తొలిసారిగా ప్రసారమైన ఇది ఇప్పటికీ (52 ఏళ్లుగా) ప్రసారమవుతోంది. అయితే కొన్ని సిరీస్‌ల తర్వాత మధ్యలో స్వల్ప విరామం తీసుకొని మరో కొత్త సిరీస్‌తో ఇది ప్రేక్షకుల్ని అలరిస్తోంది. దీన్ని 2003లో టీవీ గైడ్ సంస్థ గ్రేటెస్ట్ సీరియల్ ఆఫ్ ఆల్‌టైమ్‌గా ప్రకటించింది. పోర్ట్ చార్లిస్ అనే ఒక నగరంలోని ఆస్పత్రి, అక్కడి సిబ్బంది, వారి సేవలు, ఓ జంటకు సంబంధించిన అంశాల ఆధారంగా ఈ సీరియల్ కొనసాగుతుంది. 4. డేస్ ఆఫ్ అవర్ లైవ్స్: (50 ఏళ్లు..) ఇది అమెరికాలోని ఎన్బీసీ చానల్లో ప్రసారమవుతున్న సీరియల్. నవంబర్ 8, 1965న తొలిసారిగా ప్రసారమైన ఈ సీరియల్ ఇప్పటికీ కొనసాగుతోంది. తొలుత ఇది వారానికి ఒక్కసారి మాత్రమే అమెరికాలో ప్రసారమయ్యేది. తర్వాత ఇతర దేశాల్లో కూడా ప్రసారమైంది. ఇది విజయం సాధించడంతో దీన్ని 30 నిమిషాల నుంచి 60 నిమిషాలకు పెంచారు. ఇప్పటికీ అనేక మార్పులకు లోనైన ఈ సీరియల్‌ను వచ్చే జనవరి నుంచి సరికొత్తగా తీర్చిదిద్దనున్నారు. 6. ద యంగ్ అండ్ రెస్ట్‌లెస్: (42 ఏళ్లు..) మార్చి 26, 1973న ప్రారంభమైన ఈ సీరియల్ ఇప్పటికీ ప్రసారమవుతోంది. అత్యధిక కాలం కొనసాగిన సీరియల్స్‌లో ఇది ఆరో స్థానంలో నిలిచింది. మొత్తం 10,000కు పైగా ఎపిసోడ్లు ఇప్పటిరకు ప్రసారమయ్యాయి. జినోవా అనే నగరంలోని కొందరు యువతకు సంబంధించిన అంశాలతో ఈ సీరియల్ కథ సాగుతుంది. అనేక ఆధునిక భావాలకు ఈ సీరియల్ అద్దం పడుతుంది. ప్రస్తుతం వారాంతాల్లో మాత్రమే ద యంగ్ అండ్ రెస్ట్‌లెస్ వీక్షకుల్ని అలరిస్తోంది. 7. ఆల్ మై చిల్డ్రన్: (41 ఏళ్లు) అమెరికాలోని ఏబీసీ చానల్లో ప్రసారమైన ఈ సీరియల్ దాదాపు 45 ఏళ్లపాటు ప్రేక్షకుల్ని అలరించింది. ప్రపంచంలో అత్యధిక కాలం వీక్షకుల్ని అలరించిన సీరియల్స్‌లో ఇది ఏడో స్థానంలో ఉంది. ఆల్ మై చిల్డ్రన్ జనవరి 5, 1970 నుంచి సెప్టెంబర్ 23, 2011 వరకు టీవీలో ప్రసారమైంది. అయితే ఆన్లైన్లో మరో రెండేళ్లపాటు అంటే ఏప్రిల్ 23, 2013 వరకు కొనసాగింది. ఇది కల్పిత అంశాల ఆధారంగా రూపొందించినప్పటికీ అనేక విమర్శలను ఎదుర్కొంది. అబార్షన్, అత్యాచారాలు, వియత్నాం యుద్ధం, మత్తు పదార్థాలు తదితర అంశాలకు చోటివ్వడంతో విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇందులో ఇద్దరు నటులు మాత్రం తొలి సిరీస్ నుంచి చివరి సిరీస్ వరకు కొనసాగారు. -
వీలయినంత మేర, అదుగో అలా జీవిద్దాం!
పద్యానవనం ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మి పాము పదినూఱేండ్లున్ మడువున కొక్కెర యుండదెకడు నిల పురుషార్థపరుడు కావలె సుమతీ. ఎన్నేళ్లు బతికామన్నది కాదు, బతికినన్నాళ్లు ఎంత గొప్పగా జీవించామన్నది ముఖ్యమంటారు పెద్దలు. చెరువులో కొంగ సుదీర్ఘకాలం జీవిస్తుంది, ఉడుము నూరేళ్లు బతుకుతుంది, పాము వెయ్యేళ్లు సజీవంగా పడుంటుంది.... ఏం సార్థకం? మనిషై పుట్టాక ధర్మార్థకామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాలు సాధించాలి. ధర్మాన్ని ఆచరించడం. అర్థం సముపార్జించడం. కామం అనుభవించడం. మోక్షం పొందడం. ఇలా ఒకటికొకటి అనుసంధాన పరుస్తూ వాటి సాధనకు కృషి చేయాలి. అలా చేయలేని నాడు ఎన్నాళ్లు జీవిస్తే మాత్రం ఏం సార్థకం, ఇతర అనామక అల్ప జీవుల్లానే బతుకు వ్యర్థం అంటాడు సుమతీ శతక కారుడైన బద్దెనామాత్యుడు. వీటి గురించి తెలిసి, తగినంత ప్రజ్ఞతో జీవించే వారు కొందరయితే, ఈ చతుర్విధ పురుషార్థాలపై లోతైన అవగాహన లేకుండానే వాటిని ఏదో రూపంలో, కొంచెం అటు ఇటుగా ఆచరిస్తూ జీవితాలు వెళ్లదీసే వారు మరికొందరు. నిండుతనం కొరవడిన కొందరి జీవితాల్లో ఏదో ఒకటో, రెండో, ఎక్కువో ఇవేవీ లేకుండానే జీవితాలు తెల్లారి పోతున్నాయి. అందుకు అనేకానేక కారణాలుంటాయి. తమ పరిధిలోని ప్రభావకాలు కొన్నయితే, తమ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేని అంశాలు కూడా వారి వారి జీవితాల్ని ప్రభావితం చేసినపుడు కోరినా కొన్ని లభించకపోవచ్చు. అది కచ్చితంగా లోపమే, పరిపూర్ణమైన జీవితం కాదు అంటారు లాక్షణికులు. సృష్టిలోని జీవుల జీవిత కాలాల్ని ఈ అంశంతో ముడిపెట్టి సాపేక్షంగా చెప్పడానికి బద్దెన పద్యం రాసినా, వాటి వాటి ఆయువు వ్యత్యాసాలకు శాస్త్రీయమైన కారణాలున్నాయి. ఉచ్చ్వాస-నిశ్వాస ల నిడివి, ఊపిరితిత్తుల గరిష్ట వినియోగం తదితరాలపై ఆధారపడి జీవుల ఆయుష్షు ఉంటుందన్నది శాస్త్రీయంగా ధృవపడిన విషయం. ఒక నిమిషంలో ఎక్కువ సార్లు ఉచ్ఛ్వాస-నిశ్వాసలు జరిపే కుక్క లాంటి జీవులు స్వల్పకాలమే జీవిస్తాయి. ఊపిరిని నియంత్రించి నిమిషంలో అతి తక్కువ సార్లు ఉచ్ఛ్వాస-నిశ్వాసాలు జరిపే తాబేలు, పాము వంటి జీవులు సుదీర్ఘకాలం జీవిస్తాయి. ఈ సూత్రం ఆధారంగానే పూర్వ కాలంలో మునులు ప్రాణాయామ ప్రక్రియ ద్వారా ఊపిరిని నియంత్రించి, నిమిషానికి అతి తక్కువ ఉచ్ఛ్వాస-నిశ్వాసలు జరపడం ద్వారా ఆయుర్దాయాన్ని పెంచుకున్నారు. వందల ఏళ్లు, వందకు పైగా ఏళ్లు జీవించారనే కథనాలు మనకు ఆశ్చర్యం కలిగించినా వాస్తవమే అనడానికి ఆధారాలున్నాయి. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు ఇటువంటి విషయాలు చెబితే పుక్కిటి పురాణాలుగా మనం కొట్టిపారేస్తాం. అదే, ఏ రాబిన్ శర్మ వంటి రచయితో ‘ద మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెరారీ’లాంటి నవలలు రాసి, హిమాలయ పర్వత పంక్తుల్లో సన్యాసులు నూరేళ్లకుపైగా బతుకుతున్నారని ఆసక్తికరంగా రాస్తే, నిజమే అయివుంటుంది, అనుకుంటాం! అది మన నైజం. ఊపిరిని నియంత్రించి శ్వాసను శాసించే ప్రాణాయామంలో ఆ శక్తి ఉందని అష్టాంగయోగ చెప్పిన పతంజలి ఏనాడో స్పష్టం చేశాడు. నిష్టతో ఆచరించడాన్ని, దానికి తోడు ఇతర జీవన శైలి, ప్రక్రియల్ని బట్టి కూడా ఇది ఫలితాల్నివ్వడం ఆధారపడి ఉంటుంది. ఆయుష్షుతో నిమిత్తం లేకుండా బతికినన్నాళ్లు గొప్పగా, ఆదర్శప్రాయంగా జీవించడం అన్నది మరణానంతరం కూడా మనిషికి బతుకునిస్తుంది. అది కీర్తి, యశస్సు, పేరు ప్రతిష్ఠలకు సంబంధించిన అంశం. అందుకేనేమో, అబ్రహం లింకన్ ‘‘ఎంత కాలం జీవించావన్నది కాదు, జీవిత కాలంలో ఎంత బతుకును ఇమిడ్చావన్నది ముఖ్యం’’ అంటాడు. జగద్గురు శంకరాచార్య, స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్, చెగువెరా, వట్టికోట ఆళ్వార్‌స్వామి వంటి వారు తక్కువ వయసులోనే జీవితాలు ముగించినా తరాలతరబడి జీవించే ఉన్నారు. కీర్తి, యశస్సు అన్నవి అజరామరమైనవై, మనం లెక్కగట్టే ఈ ఆయుష్షు కేవలం శరీరానికి సంబంధించిందే అయితే దాన్ని ఉపయుక్తంగా వాడాలి. ‘పరోపకారార్థమిదం శరీరం’ పరుల సేవ కోసమే ఈ శరీరం అన్న పెద్దల మాట ప్రకారం నడుచుకోవడం వల్ల కూడా మనిషి చిరంజీవి కాగలడు. వేదవ్యాసుడు శ్రీమద్భాగవతంలో, ‘‘ఏతావజ్జన్మ సాఫల్యం దేహినా మిహ దేహిషు! ప్రాణైరర్థైర్ దియా వాచా శ్రేయ ఏవాచరేత్ సదా!!’’ అని ఒక గొప్ప మాట చెప్పాడు. ‘మనిషి తన సంపదలు, బుద్ధి, వాక్కు మొదలైన శక్తుల్ని ఇతరుల సంక్షేమం కోసం ఎంతగా వెచ్చిస్తాడో, అతని జీవితం అంత ఫలప్రదమైనదీ, అర్థవంతమైనదీ అవుతుంది’ అని దానర్థం. వీలయినంత మేర అదుగో, అలా జీవిద్దాం. - దిలీప్‌రెడ్డి