పద్యానవనం
ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మి పాము పదినూఱేండ్లున్ మడువున కొక్కెర యుండదెకడు నిల పురుషార్థపరుడు కావలె సుమతీ.
ఎన్నేళ్లు బతికామన్నది కాదు, బతికినన్నాళ్లు ఎంత గొప్పగా జీవించామన్నది ముఖ్యమంటారు పెద్దలు. చెరువులో కొంగ సుదీర్ఘకాలం జీవిస్తుంది, ఉడుము నూరేళ్లు బతుకుతుంది, పాము వెయ్యేళ్లు సజీవంగా పడుంటుంది.... ఏం సార్థకం? మనిషై పుట్టాక ధర్మార్థకామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాలు సాధించాలి. ధర్మాన్ని ఆచరించడం. అర్థం సముపార్జించడం. కామం అనుభవించడం. మోక్షం పొందడం. ఇలా ఒకటికొకటి అనుసంధాన పరుస్తూ వాటి సాధనకు కృషి చేయాలి. అలా చేయలేని నాడు ఎన్నాళ్లు జీవిస్తే మాత్రం ఏం సార్థకం, ఇతర అనామక అల్ప జీవుల్లానే బతుకు వ్యర్థం అంటాడు సుమతీ శతక కారుడైన బద్దెనామాత్యుడు.
వీటి గురించి తెలిసి, తగినంత ప్రజ్ఞతో జీవించే వారు కొందరయితే, ఈ చతుర్విధ పురుషార్థాలపై లోతైన అవగాహన లేకుండానే వాటిని ఏదో రూపంలో, కొంచెం అటు ఇటుగా ఆచరిస్తూ జీవితాలు వెళ్లదీసే వారు మరికొందరు. నిండుతనం కొరవడిన కొందరి జీవితాల్లో ఏదో ఒకటో, రెండో, ఎక్కువో ఇవేవీ లేకుండానే జీవితాలు తెల్లారి పోతున్నాయి. అందుకు అనేకానేక కారణాలుంటాయి. తమ పరిధిలోని ప్రభావకాలు కొన్నయితే, తమ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేని అంశాలు కూడా వారి వారి జీవితాల్ని ప్రభావితం చేసినపుడు కోరినా కొన్ని లభించకపోవచ్చు. అది కచ్చితంగా లోపమే, పరిపూర్ణమైన జీవితం కాదు అంటారు లాక్షణికులు.
సృష్టిలోని జీవుల జీవిత కాలాల్ని ఈ అంశంతో ముడిపెట్టి సాపేక్షంగా చెప్పడానికి బద్దెన పద్యం రాసినా, వాటి వాటి ఆయువు వ్యత్యాసాలకు శాస్త్రీయమైన కారణాలున్నాయి. ఉచ్చ్వాస-నిశ్వాస ల నిడివి, ఊపిరితిత్తుల గరిష్ట వినియోగం తదితరాలపై ఆధారపడి జీవుల ఆయుష్షు ఉంటుందన్నది శాస్త్రీయంగా ధృవపడిన విషయం. ఒక నిమిషంలో ఎక్కువ సార్లు ఉచ్ఛ్వాస-నిశ్వాసలు జరిపే కుక్క లాంటి జీవులు స్వల్పకాలమే జీవిస్తాయి. ఊపిరిని నియంత్రించి నిమిషంలో అతి తక్కువ సార్లు ఉచ్ఛ్వాస-నిశ్వాసాలు జరిపే తాబేలు, పాము వంటి జీవులు సుదీర్ఘకాలం జీవిస్తాయి.
ఈ సూత్రం ఆధారంగానే పూర్వ కాలంలో మునులు ప్రాణాయామ ప్రక్రియ ద్వారా ఊపిరిని నియంత్రించి, నిమిషానికి అతి తక్కువ ఉచ్ఛ్వాస-నిశ్వాసలు జరపడం ద్వారా ఆయుర్దాయాన్ని పెంచుకున్నారు. వందల ఏళ్లు, వందకు పైగా ఏళ్లు జీవించారనే కథనాలు మనకు ఆశ్చర్యం కలిగించినా వాస్తవమే అనడానికి ఆధారాలున్నాయి. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు ఇటువంటి విషయాలు చెబితే పుక్కిటి పురాణాలుగా మనం కొట్టిపారేస్తాం. అదే, ఏ రాబిన్ శర్మ వంటి రచయితో ‘ద మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెరారీ’లాంటి నవలలు రాసి, హిమాలయ పర్వత పంక్తుల్లో సన్యాసులు నూరేళ్లకుపైగా బతుకుతున్నారని ఆసక్తికరంగా రాస్తే, నిజమే అయివుంటుంది, అనుకుంటాం! అది మన నైజం.
ఊపిరిని నియంత్రించి శ్వాసను శాసించే ప్రాణాయామంలో ఆ శక్తి ఉందని అష్టాంగయోగ చెప్పిన పతంజలి ఏనాడో స్పష్టం చేశాడు. నిష్టతో ఆచరించడాన్ని, దానికి తోడు ఇతర జీవన శైలి, ప్రక్రియల్ని బట్టి కూడా ఇది ఫలితాల్నివ్వడం ఆధారపడి ఉంటుంది.
ఆయుష్షుతో నిమిత్తం లేకుండా బతికినన్నాళ్లు గొప్పగా, ఆదర్శప్రాయంగా జీవించడం అన్నది మరణానంతరం కూడా మనిషికి బతుకునిస్తుంది. అది కీర్తి, యశస్సు, పేరు ప్రతిష్ఠలకు సంబంధించిన అంశం. అందుకేనేమో, అబ్రహం లింకన్ ‘‘ఎంత కాలం జీవించావన్నది కాదు, జీవిత కాలంలో ఎంత బతుకును ఇమిడ్చావన్నది ముఖ్యం’’ అంటాడు. జగద్గురు శంకరాచార్య, స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్, చెగువెరా, వట్టికోట ఆళ్వార్‌స్వామి వంటి వారు తక్కువ వయసులోనే జీవితాలు ముగించినా తరాలతరబడి జీవించే ఉన్నారు. కీర్తి, యశస్సు అన్నవి అజరామరమైనవై, మనం లెక్కగట్టే ఈ ఆయుష్షు కేవలం శరీరానికి సంబంధించిందే అయితే దాన్ని ఉపయుక్తంగా వాడాలి.
‘పరోపకారార్థమిదం శరీరం’ పరుల సేవ కోసమే ఈ శరీరం అన్న పెద్దల మాట ప్రకారం నడుచుకోవడం వల్ల కూడా మనిషి చిరంజీవి కాగలడు. వేదవ్యాసుడు శ్రీమద్భాగవతంలో, ‘‘ఏతావజ్జన్మ సాఫల్యం దేహినా మిహ దేహిషు! ప్రాణైరర్థైర్ దియా వాచా శ్రేయ ఏవాచరేత్ సదా!!’’ అని ఒక గొప్ప మాట చెప్పాడు. ‘మనిషి తన సంపదలు, బుద్ధి, వాక్కు మొదలైన శక్తుల్ని ఇతరుల సంక్షేమం కోసం ఎంతగా వెచ్చిస్తాడో, అతని జీవితం అంత ఫలప్రదమైనదీ, అర్థవంతమైనదీ అవుతుంది’ అని దానర్థం. వీలయినంత మేర అదుగో, అలా జీవిద్దాం.
- దిలీప్‌రెడ్డి
వీలయినంత మేర, అదుగో అలా జీవిద్దాం!
Published Sun, Nov 16 2014 1:00 AM | Last Updated on Fri, Sep 28 2018 4:15 PM
Advertisement