longevity
-
ఆయుష్షులో సెంచరీ కొట్టి.. గిన్నిస్ రికార్డు కెక్కిన వృద్ధుడు!
ఓ వ్యక్తి వందేళ్లు జీవించడమే ఓ కల అన్నట్లుంది ఇప్పటి పరిస్థితి. బతకడం మాటా అటుంచి అసలు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా బతుకు ఈడ్చగలమా అన్నదే సందేహం. ఎందుకంటే ఇప్పుడున్న కాలుష్యం, కల్తీల మధ్య క్షణ క్షణం మృత్యు గండంలా ఉంది జీవితం. కానీ ఈ వృద్ధుడు ఆయుష్షులో సెంచరీని దాటేశాడు. ఎవరా వ్యక్తి..? అతడి ఆరోగ్యం రహస్యం ఏంటో చూద్దామా..! బ్రిటన్‌కి చెందిన టిన్నిస్వుడ్ అనే వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు. అతడు ఉత్తర ఇంగ్లాండ్‌లో మెర్సీసైడ్‌లో 1912లో జన్మించాడు. అతని వయసు ప్రస్తుతం 111 ఏళ్ల 222 రోజులు. ఆయన పోస్టల్లో రిటైర్డ్ అకౌంటెంట్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యిన వ్యక్తి. దీర్ఘాఆయుష్షులో సెంచరీని దాటేశాడు. దీంతో గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కి టైటిల్‌ని గెలుచుకున్నాడు. ఈ రికార్డు ఇంతకుమునుపు వెనిజులా జువాన్ విసెంట్ పెరెజ్ మోరా మీద ఉంది. ఆమె 114 ఏళ్ల జీవించి సుదీర్ఘకాలం జీవించిన వ్యక్తి గిన్నిస్ రికార్డు టైటిల్‌ని పొందింది. ఆమె తర్వాత ఈ టైటిల్‌ని టిన్నిస్వుడ్ గెలుచుకోవడం విశేషం. అయితే ఇంతలా సుదీర్ఘకాలం ఆరోగ్యకరంగా జీవించేందుకు మీరు ఏ డైట్ ఫాలో అయ్యేవారు, ఎలాంటి ఆహారం తీసుకుంటారని ప్రశ్నించగా..ఆయన చిరునవ్వు చిందిస్తూ తన డైట్‌కి సంబంధించిన సీక్రేట్ అంటూ ఏం లేదని, సాధారణంగానే తీసుకునే వాడినని చెప్పారు. తాను ప్రత్యేకమైన ఫుడ్ అంటూ ఏం తీసుకోలేదని అన్నారు. ఇప్పటికీ ప్రతి శుక్రవారం ఇష్టమైన చేపలు, చిప్స్ తింటానని అన్నారు. ఇంతలా సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించడమనేది కేవలం అదృష్టమని అని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా సుదీర్ఘకాలం జీవించిన వ్యక్తుల గురించి జెరొంటాలజీ రీసెర్చ్ గ్రూప్ శోధించి మరీ ఇలా గిన్నిస్ టైటిల్‌ని అందిస్తోంది. అంతేగాదు ప్రపంచంలోనే ఎక్కువకాలం జీవించిన సూపర్ సెంటెనరియన్స్ జాబితాను లిస్ట్ చేస్తుంది. ఇందులో 116 ఏళ్ల 54 రోజుల వరకు జీవించిన జపాన్‌కు చెందిన జిరోమాన్ కిమురా అత్యంత వృద్ధుడు. కాగా, 117 సంవత్సరాల వయస్సు గల స్పెయిన్‌కు చెందిన మరియా బ్రన్యాస్ మోరేరా జీవించి ఉన్న అత్యంత వృద్ధ మహిళ ఈ జాబితాను చూస్తే కొంచెం మనిషి ఆయుష్షు మెరుగుపడుతుందనాలో, తగ్గుతుందనాలో.. తెయని పరిస్థితి నెలకొందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది నిరంతరం మారుతూ ఉంటోందని అన్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: సిక్సర్ల బ్యాటర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!) -
పెట్టుబడులకు నైపుణ్యం తప్పనిసరి
స్టాక్స్‌లో పెట్టుబడులు ఎప్పుడూ కూడా దీర్ఘకాలం కోసమే అయి ఉండాలి. ఎందుకంటే స్వల్పకాలంలో ఎటువంటి పరిణామాలు అయినా మార్కెట్లను ప్రభావితం చేయవచ్చు. సంక్షోభాలు ఎన్ని వచి్చనా.. దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థలు పునరుద్ధానంతో ముందుకే ప్రయాణిస్తుంటాయి. స్టాక్ మార్కెట్లు కూడా అంతే. ఆర్థిక వ్యవస్థతోనే అనుసంధానమై ఉంటాయి కనుక స్టాక్స్‌లో పెట్టుబడులు స్వల్పకాల దృష్టితో చేయకూడదు. స్టాక్స్‌లో పెట్టుబడులకు సంబంధించి కచి్చతంగా నైపుణ్యాలు అవసరం. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే ప్రతీ పెట్టుబడి కూడా తార్కికంగా, పూర్తిస్థాయి విశ్లేషణతో, అవగాహనతో కూడుకుని ఉండాలి. అంతేకానీ, స్టాక్స్ వెంట పరుగులు పెట్టకూడదు. అవసరమైతే కొన్ని సందర్భాల్లో పెట్టుబడి నిర్ణయాలను రోజులు, వారాలు, నెలలపాటు వాయిదా వేసుకున్నా నష్టం లేదు. ఈ పెట్టుబడి కచి్చతంగా మార్పును తీసుకొస్తుందన్న నమ్మకం ఏర్పడే వరకు వేచి చూడొచ్చు. వాయిదా వేయడం వల్ల ఫలానా స్టాక్‌లో పెట్టుబడి పెట్టలేకపోయామన్న విచారం అక్కర్లేదు. ఆ వివరాలే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనంలో తెలుసుకుందాం. ఇదంతా మొబైల్ యుగం. ఇంటి నుంచే నిమిషాల్లో ట్రేడింగ్ ఖాతాను తెరిచేసి, మొబైల్‌యాప్స్ నుంచే స్టాక్స్‌ను కొనుగోలు చేయడం ఎంతో సులభంగా మారిపోయింది. అయితే నష్టాలు రాకుండా ఎలా వ్యవహరించాలన్నది చాలా మందికి అంతగా తెలిసిన విషయం కాదు. లాభాలు తర్వాత ముందు పెట్టుబడిని కాపాడుకోవాలనే ప్రాథమిక సూత్రం ఈక్విటీ పెట్టుబడులకు వర్తిస్తుంది. ఎందుకంటే పెట్టుబడిని నష్టపోయామంటే.. ఆ నష్టాలు పూడ్చుకుని, లాభాలు పొందేందుకు సుదీర్ఘ సమయం శ్రమించాల్సి వస్తుంది. నష్టాలపాలు కాకూడదనుకుంటే.. పెట్టుబడుల నిర్ణయాల విషయంలో ఎన్నో ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నిజానికి అధిక శాతం ఇన్వెస్టర్లకు తమ రిస్క్ సామర్థ్యంపై అవగాహన ఉండదు. నష్టాలు వచి్చన తర్వాతే స్టాక్ మార్కెట్లో ఆటుపోట్ల గురించి అర్థం చేసుకోవడం మొదలు పెడుతుంటారు. లాభాలు వచ్చినప్పుడు కలిగే ఆనందంతో పోలిస్తే.. నష్టాలు వచ్చినప్పుడు కలిగే బాధ రెట్టింపు స్థాయిలో ఉంటుంది. కనుక పూర్తి స్పష్టత లేని సమయాల్లో ఆచితూచి అడుగు వేయడమే శ్రేయస్కరం. నష్టం వస్తే ఎంత వరకు సర్దుబాటు చేసుకోగలరన్న స్పష్టత ఉండాలి. ఫలానా పెట్టుబడిలో ఇంత లాభం వస్తే విక్రయిస్తామని అనుకున్నట్టే.. నష్టం వస్తే వ్యూహం ఏంటన్నది మీ రిస్క్ సామర్థ్యం ఆధారంగా నిర్ణయించుకోవాలి. ఈ విషయాల్లో స్పష్టత లేకపోతే నిపుణులు నిర్వహించే మ్యూచువల్ ఫండ్స్ మార్గాన్ని ఆశ్రయించడం మంచిది. కారణాలు తెలియాల్సిందే.. ఇన్వెస్ట్ చేస్తున్న ప్రతీ సందర్భంలోనూ.. ఫలానా స్టాక్‌లో పెట్టుబడి పెట్టడానికి గల కారణాలు, ఆ కంపెనీపై మీకున్న అంచనాలను ఓ జాబితాగా రాసుకోవాలి. ఆ పెట్టుబడిని సమీక్షించే ప్రతిసారీ ఆ జాబితాను ముందేసుకుని మీ అంచనాలకు తగినట్టే కంపెనీ పనితీరు, నిర్ణయాలు ఉన్నాయా అన్నది పరిశీలించాలి. దీనివల్ల ఆయా రంగం/స్టాక్‌ను మీరు విశ్లేíÙంచగలరా? లేదా అన్నది తెలుస్తుంది. అంతేకాదు కొనుగోలు తర్వాత మరింత పడిపోతే.. ఆ స్టాక్‌లో అదనపు పెట్టుబడులతో వాటాలు పెంచుకోవడం లేదా యావరేజ్ (సగటు ధరను తగ్గించుకోవడం) చేసుకోవచ్చా అన్న విషయమై అవగాహన ఉంటుంది. ఒకవేళ మీ అంచనాలకు అనుగుణంగా కంపెనీ పనితీరు లేకపోయినా లేదా అంచనాలు తప్పిన తర్వాత కూడా ఆయా స్టాక్ పడిపోయిందని యావరేజ్ చేయాలనుకుంటుంటే.. అది పెద్ద తప్పిదమే అవుతుంది. అంటువంటి సందర్భాల్లో మీరు మీ నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకోవాలి. దీనివల్ల ఆ తర్వాతి నిర్ణయాల్లో అయినా కచి్చతంగా వ్యవహరించడం సాధ్యపడుతుంది. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసే వారు రోజువారీ మార్కెట్ల గమనాలను పట్టించుకోవక్కర్లేదు. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉందని చెప్పి అదే పనిగా స్టాక్ ధరలను గమనిస్తున్నట్టయితే.. మార్కెట్‌కు సంబంధించి వచ్చే ఎన్నో వార్తలు మీ కొనుగోలు, అమ్మకాల నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. ప్రతీ సెకన్‌కు స్టాక్ ధరలు అటూ, ఇటూ కదలాడుతూనే ఉంటాయి. కొన్ని ఉన్నట్టుండి అనూహ్యంగా లాభపడడం, పడిపోవడం కూడా సర్వసాధారణమే. అందుకే వీటిని అదేపనిగా గమనిస్తూ భావోద్వేగాలకు గురికావడానికి దూరంగా ఉండాలి. మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీలకు సంబంధించి వారానికోసారి తాజా సమాచారం, విశ్లేషణలను చూడడం తప్పుకాదు. నెలవారీ, త్రైమాసికం వారీగా పెట్టుబడుల పనితీరును సమీక్షించుకుంటే సరిపోతుంది. సూత్రాలను పాటించడమే మంచిది విజయవంతమైన ఇన్వెస్టర్ అవ్వాలంటే వారికి ఉండాల్సిన ముఖ్యమైన గుణం భావోద్వేగాలపై నియంత్రణేనని అంతర్జాతీయ ఇన్వెస్టర్ గురుగా పేరుగాంచిన వారెన్ బఫెట్ అనుభవసారం చెబుతోంది. దురదృష్టవశాత్తూ చాలా మందికి స్టాక్స్‌లో పెట్టుబడుల విషయంలో ఇదే లోపిస్తోంది. ఒక స్టాక్‌ను కొన్న తర్వాత అది మంచి షేరయినా కొన్న దానికి కొంచెం ధర తగ్గినా ఎంతో భయపడిపోతుంటారు. అలాంటి పరిస్థితిలో కొంచెం లాభం వచ్చినా అమ్మేసేవారు కొందరైతే, ఇంకా పడిపోతుందన్న భయంతో నష్టంలోనైనా వదిలించుకుందామనుకునేవారు మరి కొందరు. వెంటనే యావరేజ్ మంత్రం జపించేవారూ ఉంటారు. ఇలాంటి మానసిక స్థితిని అధిగమించాలంటే పెట్టుబడులకు సంబంధించి కచి్చతంగా సూత్రాలను అనుసరించాల్సిందే. ఇలాంటివి మీ రిస్క్ సామర్థ్యం ఆధారంగా మీకు మీరే నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు ఒక్క కంపెనీలో పెట్టుబడులు.. తమ మొత్తం పెట్టుబడుల్లో 20 శాతం మించకూడదన్నది ఒక సూత్రం. అలాగే, ఒక స్టాక్‌లో పెట్టుబడి పెట్టిన తర్వాత.. అది మరింత పతనం అయితే, కనీసం 30–50 శాతం పడిపోయిన తర్వాతే మరింత పెట్టుబడులతో యావరేజ్ చేయడం కూడా ఒకటి. అలాగే, నెలలో ఒక్కసారే ఇన్వెస్ట్ చేయడం. మార్కెట్లు 10–20 శాతం పడిపోయిన సందర్భాల్లోనే పెట్టుబడులు పెట్టుకోవడం.. ఇలాంటివన్నీ కూడా స్టాక్స్ పెట్టుబడులకు సంబంధించి అనుసరణీయ సూత్రాలు. వీటిని అనుసరించడం వల్ల క్రమశిక్షణ అలవడుతుంది. భావోద్వేగాల కారణంగా పెట్టుబడుల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి దూరంగా ఉండొచ్చు. మార్కెట్ పండితులు అనుభవం నుంచి చెబుతున్న సూత్రాలు.. మీరు స్వయంగా పెట్టుబడుల విషయంలో నేర్చుకున్న పాఠాలు, అనుభవాల ఆధారంగా మీకు అనుకూలంగా ఉండే నిబంధనలను రూపొందించుకుని.. వాటిని కచి్చతంగా అనుసరించాలి. ఆచరణ లేకపోతే ఎంత అనుభవం ఉన్నా అనుకున్న ప్రయోజనం నెరవేరదు. ఉదాహరణకు కొనుగోలు ధర నుంచి స్టాక్ 50 శాతం పడిపోతేనే యావరేజ్ చేయాలని మీరు ఒక నిబంధన పెట్టుకున్నారనుకోండి. 30 శాతం పడిపోయిన వెంటనే ఆకర్షణీయంగా భావించి పెట్టుబడులకు తొందరపడితే అది ఆచరణ తప్పుతున్నట్టే అవుతుంది. భావోద్వేగాలపై నియంత్రణ లేనప్పుడే ఇలాంటివి చోటు చేసుకుంటాయి. కనుక ఆచరణ పక్కాగా ఉండేలా ప్రణాళికలు, నియమావళి పాటించాలి. ప్రతిఫలం ఎంత..? పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే ప్రతీ సందర్భంలోనూ ప్రతిఫలం విషయమై విశ్లేషణ కూడా చేసుకోవాలి. మార్కెట్లు భిన్న సమయాల్లో విభిన్నమైన పెట్టుబడుల అవకాశాలను తీసుకొస్తుంటాయి. 10 శాతం పెరుగుతుందని అంచనా వేసుకుంటే.. 50 శాతం పడిపోవచ్చు. లేదా 20 శాతం వరకు పడిపోతుందని అంచనాతో ఉంటే.. 50 శాతం వరకు పెరగొచ్చు. వడ్డీ రేట్లు చాలా తక్కువ స్థాయిలో ఉన్నందున 10 శాతం లాభం వచ్చినా చాలనుకునే వారూ ఉన్నారు. కొన్న ధర నుంచి 50 శాతం పెరిగిన తర్వాత విక్రయించాలని నిర్ణయించుకుని.. 50 శాతం పెరిగిన తర్వాత మరో 50 శాతం పెరిగితేనే విక్రయించాలని నిర్ణయం మార్చుకోకూడదు. ఒకవేళ ఆ స్టాక్ ధర తిరిగి పడిపోతుంటే ఆందోళనతో సరైన నిర్ణయాన్ని అమలు చేయని సందిగ్ధతను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే పెట్టుబడులపై ఎంత ప్రతిఫలం ఆశిస్తున్నదీ ముందుగానే ఒక అంచనాతో ఉండాలి. దానివల్ల ఏకపక్షంగా వ్యవహరించకుండా సరైన నిర్ణయం తీసుకునేందుకు వీలుంటుంది. ఎంత లాభం ఆశిస్తున్నదీ తెలియకపోతే పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. మార్కెట్లు ఎప్పుడూ ముందుకే వెళతాయన్న అంచనాలతో ఉంటే అది కూడా పెద్ద తప్పిదమే అవుతుంది. కనుక నేరుగా స్టాక్స్‌లో పెట్టుబడులకు తగినన్ని నైపుణ్యాలు ఉండాలి. అవి లేకపోతే.. నేర్చుకునే వరకు అయినా మ్యూచువల్ ఫండ్స్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది. -
మద్యం సేవిస్తే ఎక్కువకాలం బతుకుతారు
జపాన్‌లో వందేళ్లకు పైబడిన వాళ్లు ఎక్కువ.. గ్రీస్‌లో సగటు ఆయుష్షు 90 ఏళ్ల పైమాటే.. కోస్టారికాలోనూ దీర్ఘకాలం జీవించే వారు బోలెడు మంది..! పత్రికల్లో అప్పుడప్పుడూ కనిపించే ఈ వార్తలు చూస్తే ఏమనిపిస్తుంది? బ్లూ జోన్లుగా పిలిచే ఈ ప్రాంతాల్లోనే మనుషులు ఎక్కువ కాలం ఎలా బతకగలుగుతున్నారనేగా? ఈ విషయం తెలుసుకోడానికే డాక్టర్ డాన్ బుట్నెర్ నేతృత్వంలోని ఓ బృందం ఇటీవల అధ్యయనం చేసింది. వైద్యులు, మానవ పరిణామ శాస్త్రవేత్తలు, జనాభా, పౌష్టికాహార, వ్యాధి వ్యాప్తి నిపుణులున్న ఈ బృందం.. అన్ని బ్లూ జోన్ ప్రాంతాల్లో తిరిగి అక్కడి వారి జీవన విధానాలు పరిశీలించింది. దీర్ఘాయుష్షుకు తొమ్మిది కారణాలు ఉన్నాయని సూత్రీకరించింది. అవేంటంటే.. - 1. రోజువారీ పనుల్లో భాగంగా శరీరానికి శ్రమనిచ్చే పనులు చేయడం.. టీవీ, కంప్యూటర్లకు అతుక్కుపోవడమన్నది ఇక్కడి వారికి తెలియదు. - 2. జీవితానికి పరమార్థం వెతుక్కోవడం.. జపానీస్ భాషలో దీన్ని ఇకగాయి అంటారట. - 3. వృద్ధాప్య సమస్యలకు ప్రధాన కారణమైన ఒత్తిడిని దూరంగా ఉంచడం. అలవాటుపడిన వేగంతో కాకుండా భిన్నంగా రోజువారీ పనులు చేసి మరిన్ని పనులకు సమయం సృష్టించుకుంటే ఒత్తిడిని దూరంగా ఉంచడం సాధ్యమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదనంగా చేసే పనులు ఏవైనా కావచ్చు.. ఓ కునుకు తీయడం మధ్యధరా ప్రాంత వృద్ధులకు అలవాటైతే.. జపాన్‌లోని ఒకినావా ద్వీపవాసులు తేనీటి ఉత్సవాల్లో మునిగి తేలతారు. కొంతమంది ప్రార్థనలు చేసి ఒత్తిడి తగ్గించుకుంటారు. - 4. పొట్టకు పట్టేంత కాకుండా కొంచెం ఖాళీ ఉండేలా తినడమనే సూత్రాన్ని దీర్ఘాయుష్షు ఎక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాల ప్రజలు ఆచరిస్తున్నారు. - 5. శాఖాహారం ఎక్కువగా.. మాంసాహారం, చేపలు, పాల ఉత్పత్తులు మితంగా తీసుకోవడం ఎక్కువ కాలం బతికేందుకు సాయపడతాయి. - 6. మద్యపానం చేయని వారి కంటే ఓ పరిమితికి లోబడి తాగే వారు ఎక్కువ కాలం బతుకుతారు. - 7. ఆరోగ్యకర అలవాట్లను ఆచరించే, ప్రోత్సహించే వారితో సంబంధాలు కలిగి ఉండటం. - 8. మతపరమైన గ్రూపుల్లో భాగస్వామి కావడం. - 9. భార్య, పిల్లలే కాకుండా తల్లిదండ్రులు, దగ్గరి బంధువులతో మంచి సంబంధాలు ఉండటం. స్థూలంగా రెండే.. దీర్ఘాయుష్షు సూత్రాలు పేరుకు తొమ్మిదేగానీ.. నిశితంగా పరిశీలిస్తే వీటిని రెండుగా విభజించవచ్చు. ఒకటి ఆహారం.. రెండు జీవనశైలి. ఆహారం విషయానికొస్తే.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పనులకు అప్పడప్పుడూ విరామమిచ్చి ఒత్తిడి దూరం చేసుకునే ప్రయత్నం చేయడంతోపాటు మితాహారం, అదికూడా ఆకుకూరలు, పండ్లు తినడం.. కడుపు నిండా తినడం, తాగడం పరిహరించడం లాంటివన్నీ ఓ వర్గం. మంచి అలవాట్లు ప్రోత్సహించే వారితో ఉండటం, బంధుమిత్రులతో మంచి సంబంధాలు ఉండటం, ఏదైనా లక్ష్యం పెట్టుకుని సాధించేందుకు ప్రయత్నించడం (ఇకగాయి) రెండో వర్గం సూత్రాలుగా చెప్పొచ్చు. ఎక్కువ కాలం బతకడం మనలోని జన్యువులకు సంబంధించిన విషయమే అయినా ఈ అలవాట్లతో వాటిని అనుకూలంగా మార్చుకోవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. - వందేళ్లు పైబడిన వారు ఎక్కువగా ఉన్న ప్రాంతం బార్బాగ్లియా. మధ్యధరాలోని ద్వీపప్రాంతమిది. కోస్టారికాలోని నికోయా రెండో స్థానంలో ఉంది. - అత్యంత వయోవృద్ధులైన మహిళలున్న ప్రాంతం జపాన్‌లోని ఒకినావా ద్వీపం. - వయోవృద్ధులైనా తక్కువ మతిమరపు లక్షణాలున్న వారు ఇకారియాలో ఎక్కువగా ఉన్నారు. గ్రీస్, టర్కీల మధ్య సముద్రంలోని చిన్న ద్వీపం ఇది. - అమెరికాలో లాస్ ఏంజిలెస్ తూర్పున లోమాలిండ అనే ప్రాంతం ఉంది. సెవెన్త్ డే అడ్వెంటిస్ట్ చర్చి విధానాలు అనుసరించే ఇక్కడి ప్రజల సగటు ఆయుష్షు ఆ దేశంలోని ఇతర ప్రాంతాల వారి కన్నా పదేళ్లు ఎక్కువ! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సన్నగా ఉంటే.. దీర్ఘాయువు!
నిండు నూరేళ్లూ బతకాలనుకుంటున్నారా? అయితే బరువు పెరగకుండా చూసుకోవడంతోపాటు ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉండండి అంటున్నారు బ్రిటన్‌లోని ఎడిన్‌బరో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. దాదాపు 6 లక్షల మంది జన్యు సమాచారంతో పాటు వారి తల్లిదండ్రుల ఆయుర్ ప్రమాణాలను విశ్లేషించడం ద్వారా ప్రొఫెసర్ జిమ్ విల్సన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ అంచనాకొచ్చింది. ప్రతి అదనపు కేజీ బరువుకు ఆయువు 2 నెలల వరకు తగ్గుతుందని.. అలాగే దీర్ఘాయువుకు సంబంధించిన జన్యువులకు జ్ఞాన సముపార్జనకు మధ్య సంబంధమున్నట్లు తమ పరిశోధనల ద్వారా స్పష్టమైందని జిమ్ చెబుతున్నారు. కొన్ని రకాల అలవాట్లకు జన్యువులు కారణమని ఇప్పటికే తెలిసిన నేపథ్యంలో జిమ్ బృందం ఆయువును ఎక్కువగా ప్రభావితం చేయగల అలవాట్లను స్పష్టంగా గుర్తించగలిగింది. ధూమపానం, ఊపిరితిత్తుల కేన్సర్ లక్షణాలు ఆయువుపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నట్లు స్పష్టమైంది. -
కలకాలం కవలల జీవితం...!
ఒక్కరుగా పుట్టినవాళ్ల కంటే కవల పిల్లలైతే దీర్ఘాయుష్షు ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. వాళ్లు ఆడపిల్లలైనా కూడా మామూలు వాళ్ల కంటే జీవితకాలం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలో తెలిసింది. సాధారణంగా కవల పిల్లల మధ్య సామాజిక సంబంధాలు చాలా బలంగా ఉంటాయని, ఇది కూడా అందుకు ఓ కారణం కావచ్చని అంటున్నారు. అందులోనూ.. పోలికలు కలవని వాళ్ల కంటే బాగా కలిసిపోయే కవలలైతే మరింత ఎక్కువ కాలం బతుకుతున్నట్లు తేలిందని పరిశోధనకు నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ప్రొఫెసర్ డేవిడ్ షారో తెలిపారు. డెన్మార్క్‌లో 1870, 1900 సంవత్సరాల మధ్య పుట్టిన 2,932 మంది కవల పిల్లల జీవన స్థితిగతులను పరిశీలించిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు. తర్వాత మొత్తం డేనిష్ ప్రజలు ఏ వయసులో మరణించారో అనే సమాచారంతో దీన్ని పోల్చిచూశారు. బాధలో ఉన్నప్పుడు ఓదార్చేందుకు ఎవరో ఒకరు తోడు ఉండటం.. ఆరోగ్యం బాగోలేనపుడు దగ్గరుండి చూసుకోవడం.. ఇలాంటి వాటివల్ల కవలలు ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా ఉంటారట. ఈ పరిశోధన వివరాలు ప్లస్ వన్ అనే జర్నల్‌లో ప్రచురితం అయ్యాయి. -
పుస్తక పఠనంతో దీర్ఘాయుష్షు
గంటల కొద్దీ కూర్చోవడం వల్లే లేనిపోని రోగాలన్నీ వస్తుంటాయని చాలా మంది అభిప్రాయం. ఒక వేళ అది నిజమే కావచ్చు. కానీ ఆ కూర్చునే సమయంలో పుస్తకాలను చదివితే మనిషి జీవిత కాలం పెరుగుతుందని ఒక అధ్యయనంలో తేలింది. అమెరికాలోని యాలే యూనివర్సిటీ ప్రజారోగ్య బృందం చేసిన పరిశోధనలో వెల్లడైన అంశాలు గతనెల ప్రచురితమయ్యాయి. ఈ బృందం అమెరికాలో 50 ఏళ్లు పైబడిన 3,635 మంది నుంచి 1992 నుంచి 2012 మధ్యకాలంలో సమాచారం సేకరించింది. వయసు, లింగము, జాతి, విద్య, వివాహ స్థితి తదితరాల వారిగా విభజించి పరిశోధన చేయగా పుస్తక పఠనం చేసినవారు దీర్ఘకాలం జీవించడానికి అవకాశం ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 12 సంవత్సరాల పరిశీలనలో పుస్తకాలు చదవనివారికంటే చదివేవారు చనిపోయే స్థితి 20 శాతం తగ్గింది. మొత్తంగా పుస్తక పఠనం వల్ల 23 నెలల జీవితకాలం పెరిగింది. అలాగే మంచి జ్ఞాన సముపార్జన కలిగి ఉండి, సానుకూల దృక్పథంతో జీవిస్తున్నారు. పుస్తకంలోని కథనం, ఆ కథలోని పాత్రలతో పూర్తిగా లీనమవడంపై కూడా మనిషి జీవిత కాలం పెరుగుదల ఆధారపడి ఉంటుందని పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. అదేసమయంలో వార్తాపత్రికలు, మేగజైన్స్ చదివేవారిలో ఎలాంటి మార్పు కనబడలేదు. -
అరగంట వ్యాయామంతో దీర్ఘాయువు..
మూడు ముచ్చట్లు రోజుకు అరగంట వ్యాయామం చేస్తే చాలు, దీర్ఘాయువు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. వయసు మళ్లిన వారు సైతం అరగంట సేపు వ్యాయామానికి కేటాయిస్తే, వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు. క్రమం తప్పకుండా రోజూ కనీసం అరగంట సేపు వ్యాయామం చేసే వృద్ధులు, బద్ధకస్తులైన తమ తోటి వారి కంటే ఎక్కువకాలం బతుకుతారని ఒక తాజా అధ్యయనంలో తేలింది. అరవయ్యేళ్ల వయసు దాటిన పురుషులపై నిర్వహించిన ఈ అధ్యయనంలో వ్యాయామం చేసే వారు తర్వాతి పన్నెండేళ్లలో అకాల మరణానికి గురయ్యే ముప్పు 40 శాతం మేరకు తగ్గుతుందని ఓస్లో పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలినట్లు బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ వెల్లడించింది. -
వీలయినంత మేర, అదుగో అలా జీవిద్దాం!
పద్యానవనం ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మి పాము పదినూఱేండ్లున్ మడువున కొక్కెర యుండదెకడు నిల పురుషార్థపరుడు కావలె సుమతీ. ఎన్నేళ్లు బతికామన్నది కాదు, బతికినన్నాళ్లు ఎంత గొప్పగా జీవించామన్నది ముఖ్యమంటారు పెద్దలు. చెరువులో కొంగ సుదీర్ఘకాలం జీవిస్తుంది, ఉడుము నూరేళ్లు బతుకుతుంది, పాము వెయ్యేళ్లు సజీవంగా పడుంటుంది.... ఏం సార్థకం? మనిషై పుట్టాక ధర్మార్థకామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాలు సాధించాలి. ధర్మాన్ని ఆచరించడం. అర్థం సముపార్జించడం. కామం అనుభవించడం. మోక్షం పొందడం. ఇలా ఒకటికొకటి అనుసంధాన పరుస్తూ వాటి సాధనకు కృషి చేయాలి. అలా చేయలేని నాడు ఎన్నాళ్లు జీవిస్తే మాత్రం ఏం సార్థకం, ఇతర అనామక అల్ప జీవుల్లానే బతుకు వ్యర్థం అంటాడు సుమతీ శతక కారుడైన బద్దెనామాత్యుడు. వీటి గురించి తెలిసి, తగినంత ప్రజ్ఞతో జీవించే వారు కొందరయితే, ఈ చతుర్విధ పురుషార్థాలపై లోతైన అవగాహన లేకుండానే వాటిని ఏదో రూపంలో, కొంచెం అటు ఇటుగా ఆచరిస్తూ జీవితాలు వెళ్లదీసే వారు మరికొందరు. నిండుతనం కొరవడిన కొందరి జీవితాల్లో ఏదో ఒకటో, రెండో, ఎక్కువో ఇవేవీ లేకుండానే జీవితాలు తెల్లారి పోతున్నాయి. అందుకు అనేకానేక కారణాలుంటాయి. తమ పరిధిలోని ప్రభావకాలు కొన్నయితే, తమ ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేని అంశాలు కూడా వారి వారి జీవితాల్ని ప్రభావితం చేసినపుడు కోరినా కొన్ని లభించకపోవచ్చు. అది కచ్చితంగా లోపమే, పరిపూర్ణమైన జీవితం కాదు అంటారు లాక్షణికులు. సృష్టిలోని జీవుల జీవిత కాలాల్ని ఈ అంశంతో ముడిపెట్టి సాపేక్షంగా చెప్పడానికి బద్దెన పద్యం రాసినా, వాటి వాటి ఆయువు వ్యత్యాసాలకు శాస్త్రీయమైన కారణాలున్నాయి. ఉచ్చ్వాస-నిశ్వాస ల నిడివి, ఊపిరితిత్తుల గరిష్ట వినియోగం తదితరాలపై ఆధారపడి జీవుల ఆయుష్షు ఉంటుందన్నది శాస్త్రీయంగా ధృవపడిన విషయం. ఒక నిమిషంలో ఎక్కువ సార్లు ఉచ్ఛ్వాస-నిశ్వాసలు జరిపే కుక్క లాంటి జీవులు స్వల్పకాలమే జీవిస్తాయి. ఊపిరిని నియంత్రించి నిమిషంలో అతి తక్కువ సార్లు ఉచ్ఛ్వాస-నిశ్వాసాలు జరిపే తాబేలు, పాము వంటి జీవులు సుదీర్ఘకాలం జీవిస్తాయి. ఈ సూత్రం ఆధారంగానే పూర్వ కాలంలో మునులు ప్రాణాయామ ప్రక్రియ ద్వారా ఊపిరిని నియంత్రించి, నిమిషానికి అతి తక్కువ ఉచ్ఛ్వాస-నిశ్వాసలు జరపడం ద్వారా ఆయుర్దాయాన్ని పెంచుకున్నారు. వందల ఏళ్లు, వందకు పైగా ఏళ్లు జీవించారనే కథనాలు మనకు ఆశ్చర్యం కలిగించినా వాస్తవమే అనడానికి ఆధారాలున్నాయి. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు ఇటువంటి విషయాలు చెబితే పుక్కిటి పురాణాలుగా మనం కొట్టిపారేస్తాం. అదే, ఏ రాబిన్ శర్మ వంటి రచయితో ‘ద మాంక్ హూ సోల్డ్ హిజ్ ఫెరారీ’లాంటి నవలలు రాసి, హిమాలయ పర్వత పంక్తుల్లో సన్యాసులు నూరేళ్లకుపైగా బతుకుతున్నారని ఆసక్తికరంగా రాస్తే, నిజమే అయివుంటుంది, అనుకుంటాం! అది మన నైజం. ఊపిరిని నియంత్రించి శ్వాసను శాసించే ప్రాణాయామంలో ఆ శక్తి ఉందని అష్టాంగయోగ చెప్పిన పతంజలి ఏనాడో స్పష్టం చేశాడు. నిష్టతో ఆచరించడాన్ని, దానికి తోడు ఇతర జీవన శైలి, ప్రక్రియల్ని బట్టి కూడా ఇది ఫలితాల్నివ్వడం ఆధారపడి ఉంటుంది. ఆయుష్షుతో నిమిత్తం లేకుండా బతికినన్నాళ్లు గొప్పగా, ఆదర్శప్రాయంగా జీవించడం అన్నది మరణానంతరం కూడా మనిషికి బతుకునిస్తుంది. అది కీర్తి, యశస్సు, పేరు ప్రతిష్ఠలకు సంబంధించిన అంశం. అందుకేనేమో, అబ్రహం లింకన్ ‘‘ఎంత కాలం జీవించావన్నది కాదు, జీవిత కాలంలో ఎంత బతుకును ఇమిడ్చావన్నది ముఖ్యం’’ అంటాడు. జగద్గురు శంకరాచార్య, స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్, చెగువెరా, వట్టికోట ఆళ్వార్‌స్వామి వంటి వారు తక్కువ వయసులోనే జీవితాలు ముగించినా తరాలతరబడి జీవించే ఉన్నారు. కీర్తి, యశస్సు అన్నవి అజరామరమైనవై, మనం లెక్కగట్టే ఈ ఆయుష్షు కేవలం శరీరానికి సంబంధించిందే అయితే దాన్ని ఉపయుక్తంగా వాడాలి. ‘పరోపకారార్థమిదం శరీరం’ పరుల సేవ కోసమే ఈ శరీరం అన్న పెద్దల మాట ప్రకారం నడుచుకోవడం వల్ల కూడా మనిషి చిరంజీవి కాగలడు. వేదవ్యాసుడు శ్రీమద్భాగవతంలో, ‘‘ఏతావజ్జన్మ సాఫల్యం దేహినా మిహ దేహిషు! ప్రాణైరర్థైర్ దియా వాచా శ్రేయ ఏవాచరేత్ సదా!!’’ అని ఒక గొప్ప మాట చెప్పాడు. ‘మనిషి తన సంపదలు, బుద్ధి, వాక్కు మొదలైన శక్తుల్ని ఇతరుల సంక్షేమం కోసం ఎంతగా వెచ్చిస్తాడో, అతని జీవితం అంత ఫలప్రదమైనదీ, అర్థవంతమైనదీ అవుతుంది’ అని దానర్థం. వీలయినంత మేర అదుగో, అలా జీవిద్దాం. - దిలీప్‌రెడ్డి