జపాన్‌లో వందేళ్లకు పైబడిన వాళ్లు ఎక్కువ.. గ్రీస్‌లో సగటు ఆయుష్షు 90 ఏళ్ల పైమాటే.. కోస్టారికాలోనూ దీర్ఘకాలం జీవించే వారు బోలెడు మంది..! పత్రికల్లో అప్పుడప్పుడూ కనిపించే ఈ వార్తలు చూస్తే ఏమనిపిస్తుంది? బ్లూ జోన్‌లుగా పిలిచే ఈ ప్రాంతాల్లోనే మనుషులు ఎక్కువ కాలం ఎలా బతకగలుగుతున్నారనేగా? ఈ విషయం తెలుసుకోడానికే డాక్టర్ డాన్ బుట్‌నెర్ నేతృత్వంలోని ఓ బృందం ఇటీవల అధ్యయనం చేసింది. వైద్యులు, మానవ పరిణామ శాస్త్రవేత్తలు, జనాభా, పౌష్టికాహార, వ్యాధి వ్యాప్తి నిపుణులున్న ఈ బృందం.. అన్ని బ్లూ జోన్ ప్రాంతాల్లో తిరిగి అక్కడి వారి జీవన విధానాలు పరిశీలించింది.
దీర్ఘాయుష్షుకు తొమ్మిది కారణాలు ఉన్నాయని సూత్రీకరించింది. అవేంటంటే..
- 1. రోజువారీ పనుల్లో భాగంగా శరీరానికి శ్రమనిచ్చే పనులు చేయడం.. టీవీ, కంప్యూటర్లకు అతుక్కుపోవడమన్నది ఇక్కడి వారికి తెలియదు.
- 2. జీవితానికి పరమార్థం వెతుక్కోవడం.. జపానీస్ భాషలో దీన్ని ఇకగాయి అంటారట.
- 3. వృద్ధాప్య సమస్యలకు ప్రధాన కారణమైన ఒత్తిడిని దూరంగా ఉంచడం. అలవాటుపడిన వేగంతో కాకుండా భిన్నంగా రోజువారీ పనులు చేసి మరిన్ని పనులకు సమయం సృష్టించుకుంటే ఒత్తిడిని దూరంగా ఉంచడం సాధ్యమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదనంగా చేసే పనులు ఏవైనా కావచ్చు.. ఓ కునుకు తీయడం మధ్యధరా ప్రాంత వృద్ధులకు అలవాటైతే.. జపాన్‌లోని ఒకినావా ద్వీపవాసులు తేనీటి ఉత్సవాల్లో మునిగి తేలతారు. కొంతమంది ప్రార్థనలు చేసి ఒత్తిడి తగ్గించుకుంటారు.
- 4. పొట్టకు పట్టేంత కాకుండా కొంచెం ఖాళీ ఉండేలా తినడమనే సూత్రాన్ని దీర్ఘాయుష్షు ఎక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాల ప్రజలు ఆచరిస్తున్నారు.
- 5. శాఖాహారం ఎక్కువగా.. మాంసాహారం, చేపలు, పాల ఉత్పత్తులు మితంగా తీసుకోవడం ఎక్కువ కాలం బతికేందుకు సాయపడతాయి.
- 6. మద్యపానం చేయని వారి కంటే ఓ పరిమితికి లోబడి తాగే వారు ఎక్కువ కాలం బతుకుతారు.
- 7. ఆరోగ్యకర అలవాట్లను ఆచరించే, ప్రోత్సహించే వారితో సంబంధాలు కలిగి ఉండటం.
- 8. మతపరమైన గ్రూపుల్లో భాగస్వామి కావడం.
- 9. భార్య, పిల్లలే కాకుండా తల్లిదండ్రులు, దగ్గరి బంధువులతో మంచి సంబంధాలు ఉండటం.
స్థూలంగా రెండే..
దీర్ఘాయుష్షు సూత్రాలు పేరుకు తొమ్మిదేగానీ.. నిశితంగా పరిశీలిస్తే వీటిని రెండుగా విభజించవచ్చు. ఒకటి ఆహారం.. రెండు జీవనశైలి. ఆహారం విషయానికొస్తే.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పనులకు అప్పడప్పుడూ విరామమిచ్చి ఒత్తిడి దూరం చేసుకునే ప్రయత్నం చేయడంతోపాటు మితాహారం, అదికూడా ఆకుకూరలు, పండ్లు తినడం.. కడుపు నిండా తినడం, తాగడం పరిహరించడం లాంటివన్నీ ఓ వర్గం. మంచి అలవాట్లు ప్రోత్సహించే వారితో ఉండటం, బంధుమిత్రులతో మంచి సంబంధాలు ఉండటం, ఏదైనా లక్ష్యం పెట్టుకుని సాధించేందుకు ప్రయత్నించడం (ఇకగాయి) రెండో వర్గం సూత్రాలుగా చెప్పొచ్చు. ఎక్కువ కాలం బతకడం మనలోని జన్యువులకు సంబంధించిన విషయమే అయినా ఈ అలవాట్లతో వాటిని అనుకూలంగా మార్చుకోవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
- వందేళ్లు పైబడిన వారు ఎక్కువగా ఉన్న ప్రాంతం బార్బాగ్లియా. మధ్యధరాలోని ద్వీపప్రాంతమిది. కోస్టారికాలోని నికోయా రెండో స్థానంలో ఉంది.
- అత్యంత వయోవృద్ధులైన మహిళలున్న ప్రాంతం జపాన్‌లోని ఒకినావా ద్వీపం.
- వయోవృద్ధులైనా తక్కువ మతిమరపు లక్షణాలున్న వారు ఇకారియాలో ఎక్కువగా ఉన్నారు. గ్రీస్, టర్కీల మధ్య సముద్రంలోని చిన్న ద్వీపం ఇది.
- అమెరికాలో లాస్ ఏంజిలెస్ తూర్పున లోమాలిండ అనే ప్రాంతం ఉంది. సెవెన్త్ డే అడ్వెంటిస్ట్ చర్చి విధానాలు అనుసరించే ఇక్కడి ప్రజల సగటు ఆయుష్షు ఆ దేశంలోని ఇతర ప్రాంతాల వారి కన్నా పదేళ్లు ఎక్కువ!
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
దీర్ఘాయుష్షుకు తొమ్మిది సూత్రాలు
Published Mon, Dec 25 2017 2:53 AM | Last Updated on Mon, Dec 25 2017 8:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment