2028.. మే 31..
ఆఫీసు ముగియగానే.. అరవింద్ గబగబా బయల్దేరాడు.. నిన్నటి నుంచి వాళ్లావిడ ఒకటే గోల.. దాన్ని తెమ్మని.. పిల్లలు కూడా మారాం చేస్తున్నారు.. నాన్నా.. ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు తప్పనిసరిగా తీసుకురావాలి అని.. వాళ్లకది ఎంతో ఇష్టం.. చిన్నదానికైతే మరీనూ.. ఈ ఆలోచనలతోనే హడావుడిగా షాపులోకి వెళ్లాడు.. అంతా వెతికాడు.. ఒకచోట రాసి ఉంది.. మిల్క్ అని.. వెళ్లి చూస్తే.. అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డు అతడిని వెక్కిరించింది.. ఇప్పుడింట్లో వాళ్లకి ఏం చెప్పాలిరా దేముడా అంటూ నిట్టూర్చాడు..
రఘు కొడుకు అనురాగ్.. స్కూల్లో ఆ రోజు టీచర్ ఇచ్చిన కొత్త తెలుగు పుస్తకం తీసి.. పద్యాలు చదువుతున్నాడు.. ఎప్పుడూ తాను బెల్టు తీస్తే తప్ప.. పుస్తకం తీయని కొడుకు ఆ రోజు తీసేసరికి ఏం చదువుతున్నాడబ్బా అంటూ రఘు కూడా ఆసక్తిగా వింటున్నాడు.. ‘గరిటెడైనను జాలు బొద్దింక పాలు.. కడివెడైన నేమి గోవు పాలు..’ అంటూ పద్యం.. రఘు ముఖంలో వెయ్యి వోల్టుల కాంతి.. లెస్స పలికితివి నాయనా.. బొద్దింక పాలు ది బెస్టూ అంటూ తన భార్య బొద్దింక పాలతో చేసిన టీని చప్పరిస్తూ.. వాహ్ తాజ్ తరహాలో వాహ్ బొద్దింకా.. అంటూ రఘు మైమరిచాడు..
ఇది ప్రస్తుతానికి ఊహే.. కానీ మరికొన్నేళ్లలో నిజం కానుంది.. రేప్పొద్దున ఈ అరవింద్, రఘు ప్లేసులో మీరుండొచ్చు.. నేనుండొచ్చు.. ఎందుకంటే.. భవిష్యత్ బొద్దింక పాలదే అని శాస్త్రవేత్తలు గట్టిగా చెబుతున్నారు.. ఆవు, గేదె పాలతో పోలిస్తే.. బొద్దింక పాలు అత్యధిక పోషకాలను కలిగి ఉందని.. ఇది సూపర్ ఫుడ్ అని అంటున్నారు. అలాగని ఏ బొద్దింక పడితే.. అది పనికిరాదు. పసిఫిక్ బీటిల్ బొద్దింక.. ఇది ఆస్ట్రేలియా, హవాయి, భారత్, చైనా తదితర దేశాల్లో కనిపిస్తుంది. ఇవి మిగతావాటిల్లాగ గుడ్లను పెట్టవు. మనుషుల్లాగే పిల్లలకు జన్మనిస్తాయి. అయితే, పిండం పెరుగుతున్నప్పుడు ఆడ బొద్దింక గర్భంలోని పిల్లలకు లేత పసుపు రంగులో ఉన్న పాలలాంటి ద్రవాన్ని ఆహారంగా అందిస్తుంది. ఈ పాలలో ఉండే ప్రొటీన్ క్రిస్టల్స్‌లోనే పోషకాల నిధి దాగుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆవు, గేదె పాలతో పోలిస్తే.. ఇందులో మూడు, నాలుగు రెట్లు ఎక్కువ ప్రొటీన్లు ఉన్నాయని ఈ పరిశోధనలో పాలుపంచుకుంటున్న ప్రొఫెసర్ లియోనార్డ్ చవాస్ తెలిపారు.
అన్ని రకాల అమినో యాసిడ్లు, కేలరీలు, లిపిడ్స్ ఉన్నాయని చెప్పారు. దీని వల్లే ఆ రకం బొద్దింక పిల్లల ఎదుగుదల కూడా చాలా వేగంగా ఉంటోందని చెప్పారు. ఇందులో ఉన్నన్ని పోషకాలు ఈ భూమ్మీద మరే పాలలో లేవన్నారు. బెంగళూరు కు చెందిన స్టెమ్ సెల్ బయాలజీ సంస్థ కూడా దీనిపై పరిశోధనలు చేస్తోంది. అయితే.. వాటి నుంచి పాలను సేకరించడం అత్యంత క్లిష్టమైన పని.. ఆడ బొద్దింకకు 40 రోజుల వయసు వచ్చినప్పటి నుంచి ఈ ద్రవాన్ని విడుదల చేయడం ప్రారంభిస్తుంది. అంటే.. ఆ సమయంలో దాన్ని కోసి.. ఆ ప్రొటీన్ క్రిస్టల్స్‌ను సేకరించాల్సి ఉంటుంది. 100 గ్రాముల పాల కోసం వెయ్యి బొద్దింకలు కావాల్సి ఉంటుంది. ఇక పాల పౌడర్, ఐస్‌క్రీం వంటి ఉత్పత్తులను తయారుచేయాలంటే లక్షలాది బొద్దింకలు కావాలి. ఈ నేపథ్యంలో వాటి నుంచి పాలను సేకరించేందుకు సరళమైన పద్ధతులను కనుగొనడంతోపాటు ప్రయోగశాలలో ఇలాంటి పోషకాలున్న పాలనే సృష్టిస్తే ఎలాగుంటుంది అనేదానిపైనా పరిశోధనలు సాగుతున్నాయి. రెండేళ్ల క్రితం తొలిసారిగా ఈ బొద్దింక పాలు విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా మళ్లీ ఇది వార్తల్లోకి ఎక్కింది. ప్రస్తుతం పరిశోధనలు చురుగ్గా సాగుతున్నాయట. అన్నీ కలిసొస్తే.. కొన్నేళ్లలో ఇది మార్కెట్లోకి రావొచ్చని చెబుతున్నారు.
కొసమెరుపు..
ఆవు పాల రుచి తెలుసు.. గేదె పాల రుచీ తెలుసు.. మరి బొద్దింక పాల రుచి ఎలాగుంటుంది.. శాస్త్రవేత్తలు దాన్ని కూడా రుచి చూశారు. అందరూ భయపడినట్లు మరీ అంత ఛండాలంగా ఏమీ లేదట. నిజం చెప్పాలంటే.. దీనికి ఓ ప్రత్యేకమైన రుచి అంటూ ఏదీ లేదని లియోనార్డ్ చెప్పారు. మరి.. బొద్దింక పాలు మార్కెట్లోకి వస్తే.. మీరు దాన్ని రుచి చూస్తారా??? – సాక్షి, తెలంగాణ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment