రుచి కేవలం నాలుక మీద మాత్రమే తెలుస్తుంది అని చాలామంది అనుకుంటారు. ఒక రకం తిండి మనకు ఇష్టమా లేదా అని తెలియడానికి నాలుక ఒక్కటే ఆధారం కాదు. ఉదాహరణకు మనం ఏదో ఒక పండును కొరుకుతాము. ఒక్కసారిగా మెదడుకు రకరకాల నాడీ రసాయన స్పందనలు అందుతాయి. వాటి కారణంగా ఆ పండును మరొక సారి మనం కొరుకుతామా లేదా అన్నది నిర్ణయం అవుతుంది. నాలుక మీద ఉండే రుచిని గుర్తించే కణాలను ‘టేస్ట్ బడ్స్’ అంటారు. అంగిలి అంటే నోటిలో పైభాగం, గొంతు లోపలి పక్క, ఇంకొంచెం కిందకు ఉండే ఈసోఫేగస్ లాంటివన్నీ తిండి గురించిన సమాచారాన్ని మెదడుకు చకచకా పంపిస్తాయి. దానితో నోటిలోకి అందిన తిండి రుచి తెలుస్తుంది.
మనకు కలకాలంగా ఆరు రుచులు అన్న సంగతి గురించి చెబుతున్నారు. శాస్త్రజ్ఞులు ఇంకొక పక్కన ఉన్నది ఐదు రుచులు మాత్రమే అంటున్నారు. తీపి, పులుపు, ఉప్పు, చేదులతోపాటు ఉమామి అనే ఒక కొత్త రుచిని కూడా ఈ మధ్యన చెబుతున్నారు. మనిషి వయసు పెరుగుతున్న కొద్దీ ఈ రుచులు తెలుసుకొని ఇష్టపడే లక్షణాలు మారుతూ ఉంటాయట.
‘రుచులు తెలిసేది మెదడు కారణంగానే! ఈ మెదడు మొండిగా ఉండదు. మారుతూ ఉంటుంది. కనుకనే వయస్సుతో పాటు రుచి, వాసనలను గ్రహించే తీరు మారుతూ పోతుంది’ అంటున్నారు ఫిలడెల్ఫియా పరిశోధకురాలు జూలీ మెనెల్లా. ముఖ్యంగా బాల్యంలో అంటే మరీ చిన్న వయసులో రుచులను ఇష్టపడడంలో చాలా మార్పులు వస్తాయి అంటారావిడ. మరీ చిన్న వయసులో రుచి గురించిన తీరు చాలా వేరుగా ఉంటుంది. అయితే ఆ ప్రభావం మాత్రం చాలా కాలంగా కొనసాగుతుంది అని ఆమె వివరించారు.
తీపి, ఉప్పు రుచిగల తిండి పదార్థాలను ఇష్టపడడం అన్నది బాల్యంలో మెదడులో గట్టిగా పాతుకుపోయి ఉంటుంది. మానవ పరిణామం దృష్ట్యా చూస్తే తీపి అన్నది ఎక్కువ శక్తి గల ఆహార పదార్థాలతో సంబంధం కలిగిన విషయం. ఇక శరీరానికి ఎంతో అవసరమైన ఖనిజలవణాలు ఉప్పగా ఉండే తిండితో అందు తాయి. చిన్న వయసులో ఉన్న వారికి శరీరం పెరుగుదల కారణంగా చాలా శక్తి అవసరం ఉంటుంది అన్నది తెలుసు.
‘అందుకే ఆ వయసులో ఎక్కువ శక్తిని అందించగల తీయని పదార్థాల వైపు దృష్టి ఉంటుంది. ఈ లక్షణం శరీరంలోనే సహజంగా ఉంటుంది. శరీరానికి శక్తి ఆ రకంగా అందుతుంది’ అంటారు మెనెల్లా. ఇక చేదు రుచి గురించి చూస్తే, చేదు రుచి మనకు ఇష్టం లేని పదార్థాలతో గట్టిగా ముడిపడి ఉంటుంది. అయినప్పటికీ వాటిని తిన్నందువల్ల నష్టం జరగదు, మంచి జరగవచ్చు అని అర్థమైతే అప్పుడు వాటిని అంగీకరించే మానసిక పరిస్థితి వస్తుంది.
బిడ్డలు తల్లి కడుపులో ఉండగానే ఆహార పదార్థాల రుచి అలవాటు అవుతుంది అని గమనించారు. గర్భంతో ఉన్న స్త్రీలకు చేదు రుచి పట్ల ఏవగింపు ఉంటుంది. తల్లి తీసుకుంటున్న ఆహారం ప్రభావం కడుపులోని బిడ్డ మీద కూడా పడుతుంది. తల్లి ఏదో మందు మింగితే కడుపులోని పాప ముఖం ముడుచుకుంటున్నట్టు అల్ట్రాసౌండ్ పరీక్షలలో కనిపించింది.
బాల్యం, యవ్వనం గడుస్తున్న కొద్దీ ఆ మేర రుచులకు స్పందించడం తగ్గుతుంది. చేదును అంగీకరించడం మొదలైన కొద్దీ, తీపి, ఉప్పుల మీద కొంత ఆసక్తి తగ్గినా తగ్గవచ్చు. కనుకనే యుక్త వయసు దాటిన తరువాత తిండి విషయంగా అంతగా పట్టింపు ఉండకపోవచ్చు. అప్పుడిక అంతకు ముందు ఏవగించు కున్న తిండి పదార్థాలను కూడా తినే పద్ధతి మొదలవుతుంది.
50వ పడిలో పడిన తరువాత నాలుక మీద అంతవరకు ఉన్న పదివేల రుచి కణాల సంఖ్య రాను రాను తగ్గుతుంది. అవి మళ్లీ తిరిగి పెరగవు. అంతకు ముందు మాత్రం అవి పది రోజులకు ఒకసారి సమసిపోయి తిరిగి పుడుతుంటాయి. పాడయిన కణాల స్థానంలో కొత్తవి రాకపోవడంతో రుచి తెలియడం తగ్గుతుంది. వాసన విషయంగా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది.
అయితే ఈ మార్పులు అంతగా గుర్తించగలిగే స్థాయిలో ఉండకపోవచ్చు. ఏదో ఒక్క రుచీ, ఒక్క వాసనకే పరిమితం కాకపోవచ్చు. అంటే అన్ని వాసనలూ తెలియకుండా పోయే పరిస్థితి ఉండదు. ఏవో కొన్ని రకాలు, ఉదాహరణకు మల్లెల వాసన తెలియకపోవచ్చు, ఉల్లివాసన మాత్రం బాగా తెలియ వచ్చు.
రుచులు తెలియకుండా పోవడానికి వయసు ఒకటే కారణం కాదు. రక్తపు పోటును తగ్గించడానికి వాడే కొన్ని మందులు కూడా ఈ రకం ప్రభావాన్ని చూపిస్తాయి. శ్వాస మండలంలోని పైభాగంలో వచ్చే ఆరోగ్య సమస్యల చికిత్సకు ఇచ్చే మందులు కూడా రుచి, వాసనలు తెలియకుండా చేస్తాయి. ఈ విషయం కోవిడ్ వల్ల తెలిసింది. అసలు కోవిడ్ గురించి మొదటి సూచన లుగా ఈ లక్షణాలను ఎంచుకున్నారు. ప్రభావం తగ్గిన తర్వాత చాలామందికి రుచి, వాసనలు తెలియడం తిరిగి మొదలయింది. కొందరికి మాత్రం ఆ రకంగా జరగలేదు.
కె.బి. గోపాలం
వ్యాసకర్త సైన్స్ రచయిత ‘ 98490 62055
పెరిగే వయసుతో... నచ్చే రుచుల మార్పు
Published Sun, Feb 25 2024 12:25 AM | Last Updated on Sun, Feb 25 2024 12:25 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment