కలకాలం కవలల జీవితం...!
ఒక్కరుగా పుట్టినవాళ్ల కంటే కవల పిల్లలైతే దీర్ఘాయుష్షు ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. వాళ్లు ఆడపిల్లలైనా కూడా మామూలు వాళ్ల కంటే జీవితకాలం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలో తెలిసింది. సాధారణంగా కవల పిల్లల మధ్య సామాజిక సంబంధాలు చాలా బలంగా ఉంటాయని, ఇది కూడా అందుకు ఓ కారణం కావచ్చని అంటున్నారు. అందులోనూ.. పోలికలు కలవని వాళ్ల కంటే బాగా కలిసిపోయే కవలలైతే మరింత ఎక్కువ కాలం బతుకుతున్నట్లు తేలిందని పరిశోధనకు నేతృత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ప్రొఫెసర్ డేవిడ్ షారో తెలిపారు.
డెన్మార్క్‌లో 1870, 1900 సంవత్సరాల మధ్య పుట్టిన 2,932 మంది కవల పిల్లల జీవన స్థితిగతులను పరిశీలించిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు. తర్వాత మొత్తం డేనిష్ ప్రజలు ఏ వయసులో మరణించారో అనే సమాచారంతో దీన్ని పోల్చిచూశారు. బాధలో ఉన్నప్పుడు ఓదార్చేందుకు ఎవరో ఒకరు తోడు ఉండటం.. ఆరోగ్యం బాగోలేనపుడు దగ్గరుండి చూసుకోవడం.. ఇలాంటి వాటివల్ల కవలలు ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా ఉంటారట. ఈ పరిశోధన వివరాలు ప్లస్ వన్ అనే జర్నల్‌లో ప్రచురితం అయ్యాయి.