గంటల కొద్దీ కూర్చోవడం వల్లే లేనిపోని రోగాలన్నీ వస్తుంటాయని చాలా మంది అభిప్రాయం. ఒక వేళ అది నిజమే కావచ్చు. కానీ ఆ కూర్చునే సమయంలో పుస్తకాలను చదివితే మనిషి జీవిత కాలం పెరుగుతుందని ఒక అధ్యయనంలో తేలింది. అమెరికాలోని యాలే యూనివర్సిటీ ప్రజారోగ్య బృందం చేసిన పరిశోధనలో వెల్లడైన అంశాలు గతనెల ప్రచురితమయ్యాయి.
ఈ బృందం అమెరికాలో 50 ఏళ్లు పైబడిన 3,635 మంది నుంచి 1992 నుంచి 2012 మధ్యకాలంలో సమాచారం సేకరించింది. వయసు, లింగము, జాతి, విద్య, వివాహ స్థితి తదితరాల వారిగా విభజించి పరిశోధన చేయగా పుస్తక పఠనం చేసినవారు దీర్ఘకాలం జీవించడానికి అవకాశం ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 12 సంవత్సరాల పరిశీలనలో పుస్తకాలు చదవనివారికంటే చదివేవారు చనిపోయే స్థితి 20 శాతం తగ్గింది. మొత్తంగా పుస్తక పఠనం వల్ల 23 నెలల జీవితకాలం పెరిగింది. అలాగే మంచి జ్ఞాన సముపార్జన కలిగి ఉండి, సానుకూల దృక్పథంతో జీవిస్తున్నారు. పుస్తకంలోని కథనం, ఆ కథలోని పాత్రలతో పూర్తిగా లీనమవడంపై కూడా మనిషి జీవిత కాలం పెరుగుదల ఆధారపడి ఉంటుందని పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. అదేసమయంలో వార్తాపత్రికలు, మేగజైన్స్ చదివేవారిలో ఎలాంటి మార్పు కనబడలేదు.