50 ఏళ్లకు పైగా కొనసా...గిన సీరియల్స్
టీవీ సీరియళ్లు దశాబ్దాలుగా ప్రేక్షకుల్ని ఆకట్టు కుంటున్నాయి. ముఖ్యంగా మహిళాలోకం వీటికోసం టీవీలకు అతుక్కుపోతారు. 1950వ
దశకంలో ఇళ్లల్లోకి చొచ్చుకొచ్చిన ఇవి ఇప్పటికీ వీక్షకుల్ని అలరిస్తున్నాయి. ఇంతగా ప్రేక్షకుల మెప్పు పొందుతున్న వీటిపై ఉన్న విమర్శ.. ఇవి ఏళ్లతరబడి సాగుతూనే ఉంటాయని. వీటిని చాలామంది జీడిపాకంతో పోలుస్తారు. నిజమే నాలుగేళ్లో.. అయిదేళ్లో కాదు... నలభై, యాభై ఏళ్లు ప్రసారమైన టీవీ సీరియళ్లు కూడా ఉన్నాయి. దశాబ్దాలపాటు ఇలా ప్రసారమై అనేక రికార్డులు కూడా నెలకొల్పాయి. అలా ప్రపంచంలో అత్యధిక కాలం ప్రసారమైన సీరియళ్ల గురించి తెలుసుకుందాం..
1. ద గైడింగ్ లైట్: (57 ఏళ్లు)
అమెరికాకు చెందిన ఈ టీవీ సీరియల్ అక్కడి సీబీఎస్ ఛానల్లో ప్రసారమైంది. ఇర్నా ఫిలిఫ్ అనే రచయిత దీన్ని రూపొందించింది. ప్రపంచంలో అత్యధిక కాలం (1952-2009) కొనసాగిన సీరియల్‌గా కూడా ద గైడింగ్ లైట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. 18,262 ఎపిసోడ్లకు పైగా ప్రసారమైన సీరియల్‌గా కూడా ఇది ఘనతకెక్కింది. టీవీ మాధ్యమం అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో ‘గైడింగ్‌లైట్’ తొలుత రేడియోలో ధారావాహికగా ప్రారంభమయ్యేది. 1937 నుంచి రేడియోలో ప్రసారమైన ఇది 1952, జూన్ 30 నుంచి టీవీ సీరియల్‌గా ప్రేక్షకుల్ని అలరించింది. ప్రారంభంలో రోజుకు 15 నిమిషాల పాటు ప్రసారమైన గైడింగ్ లైట్, అనంతరం రోజూ అరగంటపాటు ప్రసారమైంది. దాదాపు 57 ఏళ్లపాటు సాగిన గైడింగ లైట్‌కు క్రమంగా రేటింగ్ తగ్గడంతో నిర్వాహకులు ఈ సీరియల్‌ను నిలిపివేస్తున్నట్లు 2009లో ప్రకటించారు.
2. యాజ్ ద వరల్డ్ టర్న్స్: (54 ఏళ్లు)
అత్యధిక కాలం ప్రసారమైన రెండో టీవీ సీరియల్ ఇది. 1956 ఏప్రిల్ 2న తొలిసారిగా ప్రసారమైన యాజ్ ద వరల్డ్ టర్న్స్ సెప్టెంబర్ 17, 2010 వరకు కొనసాగింది. 54 ఏళ్లు ప్రసారమైన ఈ సీరియల్‌ను కూడా అమెరికాకు చెందిన ఇర్నా ఫిలిప్స్ రూపొందించారు. ఆమె రూపొందించిన ‘ద గైడింగ్‌లైట్’కు ఈ సీరియల్‌ను సిస్టర్ సీరియల్‌గా పిలిచేవారు అప్పటి విశ్లేషకులు. ఇది కూడా తొలుత మధ్యాహ్నం పూట రోజుకు పదిహేను నిమిషాలు మాత్రమే ప్రసారమయ్యేది. అనంతరం రోజుకు అరగంటపాటు ప్రసారమైంది. మొదట్లో సాయంత్రం పూట అరగంటపాటు ప్రసారమైనప్పుడు దీనికి పెద్దగా ఆదరణ లభించలేదు. అయితే రెండో సంవత్సరం నుంచి ప్రేక్షకాదరణ లభించింది. దాదాపు 13,000 ఎపిసోడ్లకు పైగా ఇది ప్రేక్షకుల్ని అలరించింది. కుటుంబ నేపథ్యంగా రూపొందిన తొలి సీరియల్ కూడా ఇదే.
3. జనరల్ హాస్పిటల్: (52 ఏళ్లు)
అత్యధిక కాలం ప్రసారమైన మూడో సీరియల్ ఇది. జనరల్ హాస్పిటల్ కూడా అమెరికా టీవీ సీరియలే కావడం గమనార్హం. స్థానిక ఏబీసీ ఛానల్‌లో ఏప్రిల్ 1, 1963న తొలిసారిగా ప్రసారమైన ఇది ఇప్పటికీ (52 ఏళ్లుగా) ప్రసారమవుతోంది. అయితే కొన్ని సిరీస్‌ల తర్వాత మధ్యలో స్వల్ప విరామం తీసుకొని మరో కొత్త సిరీస్‌తో ఇది ప్రేక్షకుల్ని అలరిస్తోంది. దీన్ని 2003లో టీవీ గైడ్ సంస్థ గ్రేటెస్ట్ సీరియల్ ఆఫ్ ఆల్‌టైమ్‌గా ప్రకటించింది. పోర్ట్ చార్లిస్ అనే ఒక నగరంలోని ఆస్పత్రి, అక్కడి సిబ్బంది, వారి సేవలు, ఓ జంటకు సంబంధించిన అంశాల ఆధారంగా ఈ సీరియల్ కొనసాగుతుంది.
4. డేస్ ఆఫ్ అవర్ లైవ్స్: (50 ఏళ్లు..)
ఇది అమెరికాలోని ఎన్‌బీసీ చానల్‌లో ప్రసారమవుతున్న సీరియల్. నవంబర్ 8, 1965న తొలిసారిగా ప్రసారమైన ఈ సీరియల్ ఇప్పటికీ కొనసాగుతోంది. తొలుత ఇది వారానికి ఒక్కసారి మాత్రమే అమెరికాలో ప్రసారమయ్యేది. తర్వాత ఇతర దేశాల్లో కూడా ప్రసారమైంది. ఇది విజయం సాధించడంతో దీన్ని 30 నిమిషాల నుంచి 60 నిమిషాలకు పెంచారు. ఇప్పటికీ అనేక మార్పులకు లోనైన ఈ సీరియల్‌ను వచ్చే జనవరి నుంచి సరికొత్తగా తీర్చిదిద్దనున్నారు.
6. ద యంగ్ అండ్ రెస్ట్‌లెస్: (42 ఏళ్లు..)
మార్చి 26, 1973న ప్రారంభమైన ఈ సీరియల్ ఇప్పటికీ ప్రసారమవుతోంది. అత్యధిక కాలం కొనసాగిన సీరియల్స్‌లో ఇది ఆరో స్థానంలో నిలిచింది. మొత్తం 10,000కు పైగా ఎపిసోడ్లు ఇప్పటిరకు ప్రసారమయ్యాయి. జినోవా అనే నగరంలోని కొందరు యువతకు సంబంధించిన అంశాలతో ఈ సీరియల్ కథ సాగుతుంది. అనేక ఆధునిక భావాలకు ఈ సీరియల్ అద్దం పడుతుంది. ప్రస్తుతం వారాంతాల్లో మాత్రమే ద యంగ్ అండ్ రెస్ట్‌లెస్ వీక్షకుల్ని అలరిస్తోంది.
7. ఆల్ మై చిల్డ్రన్: (41 ఏళ్లు)
అమెరికాలోని ఏబీసీ చానల్‌లో ప్రసారమైన ఈ సీరియల్ దాదాపు 45 ఏళ్లపాటు ప్రేక్షకుల్ని అలరించింది. ప్రపంచంలో అత్యధిక కాలం వీక్షకుల్ని అలరించిన సీరియల్స్‌లో ఇది ఏడో స్థానంలో ఉంది. ఆల్ మై చిల్డ్రన్ జనవరి 5, 1970 నుంచి సెప్టెంబర్ 23, 2011 వరకు టీవీలో ప్రసారమైంది. అయితే ఆన్‌లైన్‌లో మరో రెండేళ్లపాటు అంటే ఏప్రిల్ 23, 2013 వరకు కొనసాగింది. ఇది కల్పిత అంశాల ఆధారంగా రూపొందించినప్పటికీ అనేక విమర్శలను ఎదుర్కొంది. అబార్షన్, అత్యాచారాలు, వియత్నాం యుద్ధం, మత్తు పదార్థాలు తదితర అంశాలకు చోటివ్వడంతో విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇందులో ఇద్దరు నటులు మాత్రం తొలి సిరీస్ నుంచి చివరి సిరీస్ వరకు కొనసాగారు.