సాక్షి, హైదరాబాద్: ఆరు గ్యారంటీలు సమర్థవంతంగా అమలు...క్షేత్రస్థాయిలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు నాలుగునెలలకోసారి ప్రభుత్వం ‘ప్రజాపాలన’ కార్యక్రమం నిర్వహించనుంది. అయితే ఈ కార్యక్రమాన్ని ఐదు పథకాలకు మాత్రమే వర్తింపజేస్తామని ప్రభుత్వవర్గాలు స్పష్టం చేశాయి.
ఈ మేరకు ఆదివారం జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ప్రజాపాలన కార్యక్రమ అమలు విధివిధానాలపై మార్గదర్శకాలు విడుదల చేశారు. దీని ప్రకారం ప్రజాపాలన కార్యక్రమాన్ని ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు ఎనిమిది పనిదినాల్లో (డిసెంబర్31, జనవరి1 మినహాయించి) నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతి రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామపంచాయతీలోనూ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి మున్సిపల్ వార్డులోనూ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
షెడ్యూల్, నిబంధనలు
►ఈ నెల 25వ తేదీలోపు అధికారుల బృందాల ఏర్పాటు, గ్రామాల వారీగా విజిట్ షెడ్యూల్ త యారీ (మంగళవారం సాయంత్రం ఆరు గంట లకల్లా ఈ వివరాలు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది)
►ఈ నెల 26న అధికారుల బృందాలకు శిక్షణ, అవగాహన
►ఈ నెల 26,27 తేదీల్లో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రుల ఆధ్వర్యంలో జిల్లాస్థాయి, నియోజకవర్గ స్థాయిలో అధికారులకు అవగాహన కార్యక్రమం, పథకం ఉద్దేశాల వివరణ
►ఈ నెల 28న గ్రామ, వార్డు సదస్సులు ప్రారంభం..సాయంత్రం 8 గంటల కల్లా డైలీ రిపోర్టు ఆన్‌లైన్‌లో పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి.
►సదస్సు ఏర్పాటుకు ఒక రోజు ముందే గ్రామాలు, వార్డుల్లో టాంటాం వేయించడంతో పాటు కౌంటర్లు, ఇతర ఏర్పాట్లు చేసుకోవాలి.
►రాష్ట్ర స్థాయిలో ఒక ఉమ్మడి దరఖాస్తు ఫారం రూపొందించి కలెక్టర్లకు పంపిస్తారు. వీటిని ఈ నెల 27వ తేదీ రాత్రికల్లా గ్రామాలు, వార్డులకు పంపించాలి. ముందు రోజే గ్రామాలు, వార్డుల్లో దరఖాస్తులు పంపిణీ చేసి వాటిని ప్రజలతో నింపించాలి.
►సభలు సజావుగా నిర్వహించడానికి తాగునీరు, టెంట్లు, కౌంటర్ల కోసం టేబుళ్లు, క్యూలైన్ల కోసం బారికేడ్లు ఏర్పాటు చేయాలి.
►గ్యారంటీల అమలుతో సంబంధం ఉన్న అన్ని శాఖల అధికారులు ఈ సభలకు హాజరు కావాలి. నియోజకవర్గస్థాయిలో నోడల్ అధికా రులను నియమించి కార్యక్ర మాన్ని పర్యవేక్షించాలి. ప్రతి గ్రామపంచాయతీ / వార్డుకు ప్రత్యేక అధికారిని ఇన్‌చార్జ్‌గా నియమించాలి.
►ఇతర గ్రామ స్థాయి అధికా రులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశ వర్కర్లతో సమన్వయం చేసుకొని కార్యక్రమం నిర్వ హించాలి.
►గ్రామ పంచాయతీ సర్పంచ్/కౌన్సిలర్/కార్పొరేటర్, ఇతర ప్రజాప్రతినిధులను సదస్సులకు ఆహ్వానించాలి.
►సభ ప్రారంభానికి ముందు ప్రభుత్వ సందేశాన్ని చదివి వినిపించాలి.
►దరఖాస్తులతో పాటు అవసరమైన ఆధార్, తెల్లరేషన్ కార్డు సమర్పించేలా కౌంటర్లలో ఉండే సిబ్బంది జాగ్రత్త తీసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణకు మహిళలకు ప్రత్యేక కౌంటర్లు, స్త్రీ, పురుషులకు విడివిడిగా క్యూలైన్లు ఏర్పాట్లు చేయాలి. దరఖాస్తుదారులు భారీ సంఖ్యలో ఉంటే టోకెన్ విధాననం అమలు చేయాలి.
►దరఖాస్తుకు రశీదు తప్పనిసరిగా ఇవ్వాలి.
► స్వీకరించిన ప్రతి దరఖాస్తు వివరాన్ని పంచాయతీరాజ్ శాఖ రూపొందించిన ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయాలి. ప్రతి దరఖాస్తుకు ఒక ప్రత్యేక సంఖ్య కేటాయించాలి.
► పట్టణ ప్రాంతాల్లో ఈ కార్య క్రమాన్ని జీహెచ్‌ఎంసీ కమిష నర్ లేదా సంబంధిత మున్సి పల్ కమిషనర్లు పర్యవే క్షిస్తారు.
► స్వీకరించిన అన్ని దర ఖాస్తులు టీం లీడర్ అధీనంలో ఉంచాలి. వాటిని భద్రపర్చడంతో పాటు కంప్యూటరీకరించేందుకు అవస రమైన కార్యాలా యాన్ని జిల్లా కలెక్టర్ కేటాయించాలి.
►ప్రతి అధికారుల బృందం రోజుకు రెండు గ్రామాల్లో సభలు నిర్వహించాలి. జనవరి ఆరో తేదీ నాటికి పూర్తి చేసుకోవాలి. ప్రతి 100 కుటుంబాలకు కనీసం ఒక కౌంటర్ ఉండేలా చూసుకోవాలి.
►దరఖాస్తుల వెరిఫికేషన్/ప్రాసెసింగ్‌కు సూచన లు ప్రభుత్వం త్వరలోనే జారీ చేస్తుంది.
►అధికారుల బృందాలు విజిట్ షెడ్యూల్‌కు 10 అంశాలతో, డైలీ రిపోర్టు కోసం 11 అంశాలతో ప్రత్యేక ఫార్మాట్ రూపొందించారు.
గ్రామాలు లేదా వార్డులకు వచ్చే అధికారులు వీరే
►తహసీల్దారు లేదా రెవెన్యూ శాఖ ప్రతినిధి
►ఎంపీడీఓ లేదా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతినిధి
►మండల పంచాయతీ అధికారి లేదా పంచాయతీరాజ్ ప్రతినిధి
►మండల వ్యవసాయ అధికారి లేదా వ్యవసాయ శాఖ ప్రతినిధి
►పౌరసరఫరాల శాఖ ప్రతినిధి
► పీహెచ్‌సీలోని వైద్యాధికారి లేదా వైద్య శాఖ ప్రతినిధి
►మండల విద్యాధికారి లేదా విద్యాశాఖ ప్రతినిధి
►ఏఈ (డిస్కం) లేదా విద్యుత్‌శాఖ ప్రతినిధి
►సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి
►ఇతర సంబంధిత అధికారులు. (వీరిలో అవసరమైన అధికారులను గ్రామాల వారీ గా నియమించుకోవాల్సి ఉంటుంది.)
దరఖాస్తులు స్వీకరించే పథకాలు: మహాలక్ష్మి రైతుభరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇళ్లు చేయూత
Comments
Please login to add a commentAdd a comment