కాంగ్రెస్‌ గ్యారంటీలపై వ్యాఖ్యలు.. ఖర్గేపై మండిపడ్డ కేటీఆర్‌ | KTR Counter To Mallikarjun Kharge Comments On Congress guarantees | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ గ్యారంటీలపై వ్యాఖ్యలు.. ఖర్గేపై మండిపడ్డ కేటీఆర్‌

Published Fri, Nov 1 2024 8:25 PM | Last Updated on Fri, Nov 1 2024 8:25 PM

KTR Counter To Mallikarjun Kharge Comments On Congress guarantees

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర బడ్జెట్‌ చూసుకొని ఎన్నికల హామీలు ప్రకటించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సెటైర్లు వేశారు. గాలిమాటల గ్యారెంటీలిస్తే.. మొదటికే మోసం వస్తుందని ఇప్పుడు అర్థమైందా అని విమర్శించారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ప్రకటించినప్పుడు ఆ రాష్ట్ర బడ్జెట్ గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను నయవంచన చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

బడ్జెట్‌ను మించి గ్యారంటీలు ఇవ్వొద్దని.. అలా చేస్తే రాష్ట్రం దివాళా  తీసే పరిస్థితి వస్తుందన్న ఖర్గే వ్యాఖ్యలకు కేటీఆర్‌ ‘ఎక్స్’ వేదికగా కౌంటర్‌ ఇచ్చారు. ‘బడ్జెట్ చూసుకోకుండా హామీలిస్తే.. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తప్పదని ఇప్పుడు బోధపడిందా? ఆరు గ్యారంటీలతో వల వేసినప్పుడు తెలంగాణ బడ్జెట్ గురించి తెలియదా? తెలంగాణలో కాంగ్రెస్ ఈ తప్పు చేస్తున్నప్పుడు.. ఈ విషయాలు ఎందుకు గుర్తుకురాలేదు?
చదవండి: కాంగ్రెస్‌ నిజస్వరూపం బయటపడింది: మోదీ 

ఏవీ చూసుకోకుండా.. కేవలం అధికారమే లక్ష్యంగా.. కాంగ్రెస్ ఆడిన గ్యారెంటీల గారడీతో తెలంగాణ రాష్ట్రం ఏడాదిలోనే ఆగమైంది. తెలంగాణ ప్రజలను నమ్మించి, నయవంచన చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నాలుగు కోట్ల ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. పదేళ్లపాటు ప్రగతిపథంలో పరుగులు పెడుతున్న తెలంగాణను అడ్డగోలు హామీలతో మభ్యపెట్టినందుకు తప్పు ఒప్పుకోవాలి.

అనాలోచితంగా ఇచ్చే కాంగ్రెస్ గ్యారెంటీలతో.. భవిష్యత్ తరాలకు కూడా నష్టం జరుగుతుందని ఇప్పటికైనా గుర్తించినందుకు సంతోషం. కానీ.. కాంగ్రెస్ గ్యారెంటీలను నమ్మిన పాపానికి ఏడాదికాలంగా తెలంగాణకు జరిగిన నష్టం పూడ్చలేనిది!. గ్యారెంటీల మాటున కాంగ్రెస్ చేసిన మోసం క్షమించలేనిది’ అని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement