నిబంధనల పేరుతో ఆరు గ్యారంటీలకు కోత
మోదీలేని భారత్‌ను ఊహించుకోలేం: బండి సంజయ్
హుజూరాబాద్: కాంగ్రెస్ పార్టీ దోఖేబాజ్ పార్టీ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ మండిపడ్డారు. వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఓట్లు దండుకున్న ఆ పార్టీ.. అధికారంలోకొచ్చాక వాటికి కోతలు పెడుతూ ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఇళ్లకోసం లక్షలాది కుటుంబాలు పదేళ్లుగా అల్లాడుతుంటే నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మాత్రమే ఇస్తామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రజాహితయాత్రలో భాగంగా ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఆయన పాదయాత్ర చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే రూ.5 లక్షల కోట్లు అవసరమని, ఆ నిధులు ఎక్కడి నుంచి తెస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మహిళలకు ప్రతినెలా రూ.2,500, ఆసరా కింద రూ.4 వేలు, రూ.రెండు లక్షల రుణమాఫీ, రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామంటే ప్రజలు ఓట్లేశారని, ఇప్పటివరకు ఒక్కటీ అమలు కాలేదని విమర్శించారు. రాష్ట్రంలో 90 లక్షల తెల్లరేషన్ కార్డులుంటే.. అందులో 40 లక్షల మందికి మాత్రమే రూ.500కు గ్యాస్ సిలిండర్, రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్‌ను అమలు చేస్తామంటున్నారని, మిగిలిన వారి సంగతేంటని ప్రశ్నించారు. నరేంద్రమోదీ లేని భారత్‌ను ఎవరూ ఊహించుకోవడం లేదని, మోదీని మూడోసారి ప్రధానిగా చేసేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారని పేర్కొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తమకు పోటీయే కాదని, గతంలోకంటే భారీ మెజార్టీతో విజయం సాధిస్తాననే నమ్మకం ఉందని బండి చెప్పారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment