Public Administration
-
పండుగ వాతావరణం వెల్లివిరిసేలా..
సాక్షి, హైదరాబాద్: డిసెంబర్ 1 నుంచి 9 వరకు రాష్ట్రమంతటా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఉత్సవాల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు ఈ ఉత్సవాల్లో భాగస్వామ్యం పంచుకోవాలని చెప్పారు. రాష్ట్రమంతటా అన్ని పాఠశాలలు, కాలేజీలు, హాస్టళ్లలోనూ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉత్సవ వాతావరణం ఉట్టిపడాలని చెప్పారు.తొలి ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలతోపాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల ప్రణాళికను శాఖల వారీగా ప్రజలకు వివరించాలని సూచించారు. విజయోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై సీఎం శనివారం సచివాలయంలో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమావేశ మయ్యారు. విజయోత్సవాల్లో భాగంగా వరంగల్‌లో ఈ నెల 19న మహిళా శక్తి సంఘాలతో ఏర్పాటు చేసిన సభ విజయవంతమైందని అధికారులను అభినందించారు. రుణమాఫీ, పంట బీమా, రైతు భరోసాతోపాటు సన్న వడ్లకు బోనస్ ఇలా తొలి ఏడాదిలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పెద్దపల్లిలో నిరుద్యోగ యువతతో సభ డిసెంబర్ 4న పెద్దపల్లి జిల్లాలో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభ జరపాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. అదే వేదికగా గ్రూప్–4తో పాటు వివిధ రిక్రూట్మెంట్ల ద్వారా ఎంపికైన 9 వేల మందికి నియామక పత్రాలు అందించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. డిసెంబర్ 1 నుంచి శాఖల వారీగా నిర్దేశించిన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలతోపాటు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలన్నీ ఈ వారం రోజుల్లో జరిగేలా ప్రణాళికను రూపొందించుకోవాలని పేర్కొన్నారు. లక్ష మంది తెలంగాణ తల్లుల సమక్షంలో.. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో రాష్ట్రమంతటా పండుగ వాతావరణం ఉండేలా ఉత్సవాలు నిర్వహించాలని సీఎం రేవంత్ సూచించారు. ఈ మూడు రోజులపాటు హైదరాబాద్‌లో సచివాలయం పరిసరాలు, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతమంతా తెలంగాణ వైభవం వెల్లివిరిసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ ప్రాంతమంతా ఎగ్జిబిషన్ లాంటి వాతావరణం ఉండేలా స్టాళ్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. తెలంగాణ సంస్కృతి, కళారూపాలు ఉట్టి పడే కార్యక్రమాలతోపాటు మ్యూజికల్ షో, ఎయిర్ షో, డ్రోన్ షోలను నిర్వహించాలన్నారు.అన్ని వర్గాల ప్రజలను ఈ సంబరాల్లో భాగస్వాములను చేయాలని చెప్పారు. డిసెంబర్ 9న సచివాలయం ముఖద్వారం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలన్నారు. ఆ రోజు సాయంత్రం జరిగే ఈ వేడుకలకు ఉద్యమకారులు, మేధావులు, విద్యావంతులు, వివిధ రంగాల్లో ప్రతిభ సాధించిన వారందరినీ ఆహా్వనించాలని చెప్పారు. నియోజకవర్గానికో వెయ్యి మంది చొప్పున మహిళా శక్తి ప్రతినిధులను ఆహా్వనించి... లక్ష మంది తెలంగాణ తల్లుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయం, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్‌పై ఉత్సవాలు జరిగేందుకు వీలుగా వాహనాలను దారి మళ్లించాలని సూచించారు. సమీక్షలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ పాల్గొన్నారు. -
గడపగడపకూ ‘ఏడాది విజయోత్సవాలు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలో అమలు చేసిన విప్లవాత్మక పథకాలు, సంక్షేమ కార్యక్రమాల వివరాలను గడపగడపకూ చేర్చాలని ప్రజాపాలన విజయోత్సవాల మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఈ విజయోత్సవాల్లో అన్ని శాఖలు భాగస్వాములు కావాలని అధికారులను ఆదేశించింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ భేటీలో ఉపసంఘం సభ్యులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితోపాటు సీఎస్ శాంతికుమారి, వివిధ శాఖల కార్యదర్శులు, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. వచ్చే నెల 9వ తేదీ వరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేసింది. అన్ని మాధ్యమాల ద్వారా ప్రచారం: భట్టి డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ వివిధ శాఖల పరిధిలో అమలైన పథకాలు, కార్యక్రమాల గురించి ఆయా శాఖలు ప్రజలకు వివరించాలని సూచించారు. ఇందుకోసం సోషల్ మీడియా సహా అన్ని మాధ్యమాలను ఉపయోగించుకోవాలని కోరారు. విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 30న మహబూబ్‌నగర్‌లో రైతు దినోత్సవంతోపాటు సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్ వేదికగా లేజర్ షో, కార్నివాల్తోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించాలన్నారు. మహిళలను చైతన్యవంతులను చేయాలి: మంత్రి ఉత్తమ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మహిళల అభ్యున్నతి కోసం చేపట్టిన 70 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు సున్నా వడ్డీ పథకం, బ్యాంకు లింకేజీల కల్పన, సన్న ధాన్యానికి రూ. 500 బోనస్ తదితర పథకాల గురించి మహిళలందరికీ తెలియజేయాలని మంత్రి ఉత్తమ్ అధికారులకు సూచించారు.మంత్రి పొంగులేటి మాట్లాడుతూ అన్ని ఆర్టీసీ బస్సులపై ప్రజా ప్రభుత్వ పాలన విజయాలను తెలియజేసేలా ప్రకటనలు తయారు చేయాలన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ పరిధి పెంపు, ఇందిరమ్మ ఇళ్లు, ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థల ఏర్పాటుపై పాఠశాల స్థాయి విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలన్నారు. సీఎం చేతుల మీదుగా ఆరు పాలసీల విడుదలకు ఏర్పాట్లు: సీఎస్ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నర్సింగ్, పారా మెడికల్ కళాశాలలు, 200 విద్యుత్ సబ్స్టేషన్లు ప్రారంభిస్తున్నామని.. 9,007 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామని సీఎస్ శాంతికుమారి తెలిపారు. అలాగే సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆరు ప్రధాన పాలసీలను విడుదల చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. -
200 యూనిట్ల ఫ్రీ విద్యుత్, రూ.500కు సిలిండర్ షురూ.. 'పథకాలు ఆగవు'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా ఎన్నికల సమయంలో అభయహస్తం కింద ఇచ్చిన హామీలు అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని శంకించవద్దని అన్నారు. ఆర్థిక నియంత్రణ పాటిస్తూ, దుబారా ఖర్చులు తగ్గించుకుని సంక్షేమ పథకాలను ఆర్థిక వెసులు బాటు మేరకు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం సచివాలయంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తదితరులతో కలిసి సీఎం ప్రారంభించిన అనంతరం రేవంత్ మాట్లాడారు. సంక్షేమ పథకాలు ఆపం ‘డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. ఇప్పుడు మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తున్నాం. తెలంగాణ ఇచ్చిన విధంగానే, 2023 సెపె్టంబర్ 17న సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించారు. ఈ ఆరు గ్యారంటీల వల్లే అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. అందువల్ల ఆర్థికంగా ఎన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగతో మహిళల జీవితాలు దుర్భరంగా ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం దీపం పథకం తెచ్చింది. అప్పుడు రూ.400 ఉన్న సిలిండర్‌ను మోదీ ప్రధాని అయ్యాక రూ.1200కు పెంచారు. అలా ధర పెరిగిన సిలిండర్‌పై రాయితీ ఇవ్వాలన్న ఆలోచన కేసీఆర్ ప్రభుత్వం చేయలేదు. కానీ ఎన్నికల సందర్భంగా మేం ఈ హామీ ఇచ్చాం. ఆ మేరకు లక్ష మంది మహిళల సమక్షంలో ఈ పథకాన్ని ప్రారంభించాలనుకున్నాం. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అడ్డు రావడంతో సచివాలయంలోనే ప్రారంభిస్తున్నాం. ఇతర సంక్షేమ పథకాలు కూడా అపం. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశానికే రోల్‌మోడల్‌గా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దుతాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు: భట్టి ‘గత ప్రభుత్వానికి అధికారం అప్పగించే సమయానికి తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉంది. కానీ గత పదేళ్లలో అప్పుల కుప్పగా మార్చారు. ఉద్యోగులకు వేతనాలు కూడా అప్పులు తెచ్చి చెల్లించేవారు. ప్రస్తుతం ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారని దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది. కాంగ్రెస్ హమీలు అమలు సాధ్యం కానివంటూ బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోంది. కానీ మేం హామీలన్నీ కచ్చితంగా అమలు చేసి చూపిస్తాం. అర్హత ఉన్న వారందరికీ మార్చిలో వచ్చే విద్యుత్ బిల్లు జీరో (200 యూనిట్లలోపు వినియోగిస్తే) బిల్లుగా వస్తుంది. ఇందులో ఎలాంటి ఆంక్షలూ లేవు. అయితే వారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలి. అర్హత ఉండి దరఖాస్తు చేసుకోని వారు ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తాం..’అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారందరికీ రూ.500 కే సిలిండర్: ఉత్తమ్ ‘ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని, తెల్లరేషన్ కార్డు ఉన్నవారందరికీ రూ.500 సిలిండర్ అందిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఆయిల్ కంపెనీలకు ముందస్తుగా డబ్బు చెల్లిస్తామని, వారు ఆ తర్వాత లబ్ధిదారుల అకౌంట్లలో వేస్తారని తెలిపారు. మూడేళ్ల సగటు వినియోగం ఆధారంగా ఒక్కో సిలిండర్‌ను రూ.500కు ఇస్తామని వివరించారు. త్వరలోనే కేవలం రూ.500 చెల్లిస్తే.. గ్యాస్ సిలిండర్ అందించేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు. ఎల్పీజీ కనెక్షన్ యాక్టివ్‌గా ఉండాలి రూ.500కే సిలిండర్ పొందాలంటే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలి. తెల్ల రేషన్‌కార్డు ఉండాలి. మూడేళ్ల సగటు వినియోగం ఆధారంగా రూ.500కు సిలిండర్లు అందజేస్తారు. దరఖాస్తు చేసుకున్న వారి పేరిట ఎల్పీజీ కనెక్షన్ యాక్టివ్‌గా (కనెక్షన్ వినియోగంలో ఉండాలి) ఉండాలి. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక సర్వీస్ కనెక్షన్‌కే వర్తింపు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందడానికి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలి. తెల్ల రేషన్‌కార్డు కలిగి, ఆధార్‌కార్డు విద్యుత్ సర్వీసు కనెక్షన్‌తో అనుసంధానమై ఉండాలి. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించిన వారికి జీరో బిల్లు వస్తుంది. రేషన్‌కార్డులోని యజమాని పేరు ఉన్న విధంగా ఈ పథకం కోసం విద్యుత్ సర్వీసు కనెక్షన్ పేరును డిస్కమ్‌లు మార్చవు. అలాంటి సర్వీసు ఉన్న వారికి యథావిధిగా బిల్లులు వస్తాయి. ఈ పథకం కింద విద్యుత్‌ను వాణిజ్య అవసరాలకు వాడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటారు. గృహజ్యోతి పథకం పొందడానికి అన్ని అర్హతలున్నా.. ప్రస్తుత పద్ధతిలోనే విద్యుత్ బిల్లు వస్తే..ఎంపీడీవో/మునిసిపల్ కార్యాలయాన్ని సందర్శించి తెల్ల రేషన్‌కార్డు, విద్యుత్ కనెక్షన్ సర్వీసు నంబర్ (యూనిక్ సర్వీస్ కనెక్షన్)తో అనుసంధానమైన ఆధార్ కార్డును జోడించి దరఖాస్తు ఇవ్వాలి. వినియోగదారులు ఎంపీడీవో/మునిసిపల్ కార్యాలయం లేదా ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తు అక్నాలెడ్జ్మెంట్ను చూపిస్తే చాలు..వారి దగ్గర నుంచి బిల్లును బలవంతంగా వసూలు చేయడం జరగదు. ఈ మేరకు ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
మరో 2 గ్యారంటీలు అమలు చేద్దాం
సాక్షి, హైదరాబాద్: మరో రెండు గ్యారంటీల అమలుకు సన్నాహాలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తులపై సీఎం కేబినెట్ సబ్‌కమిటీ మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సబ్‌కమిటీలో ఉన్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల హామీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. రూ.500లకు సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేస్తే ఎంత వ్యయం అవుతుంది? ఎంత మందికి లబ్ధి చేకూరుతుందనే వివరాలు ఇవ్వాలని, ఈ మూడు గ్యారంటీల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. వీటిలో రెండింటిని తక్షణమే అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ బడ్జెట్లోనే వాటికి అవసరమైన నిధులు కేటాయించాలని సీఎం ఆర్థిక శాఖకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లోపు మరోసారి కేబినెట్ సబ్‌కమిటీతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మొత్తం డేటా ఎంట్రీ రాష్ట్రవ్యాప్తంగా గత డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమంలో ఐదు గ్యారంటీలకు అర్హులైన వారి నుంచి గ్రామసభలు, వార్డు సభల ద్వారా దరఖాస్తులు స్వీకరించిన విషయం విదితమే. ఐదు గ్యారంటీలకు మొత్తంగా 1,09,01,255 దరఖాస్తులు వచ్చాయి. జనవరి 12వ తేదీ నాటికే వీటికి సంబంధించిన డేటా ఎంట్రీ రికార్డు సమయంలో పూర్తి చేసినట్టు అధికారులు సీఎంకు వివరించారు. ఒకే పేరుతో రెండు మూడు ఒకే పేరుతో రెండు మూడు దరఖాస్తులు కొందరు ఇచ్చారని, కొన్నింటికి ఆధార్, రేషన్‌కార్డు నంబర్లు లేవని అధికారులు చెప్పారు. అలాంటి దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని, అవసరమైతే క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన జరపాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అర్హులైన వారెవరూ నష్టపోకుండా ఒకటికి రెండుసార్లు సరి చూడాలని చెప్పారు. దరఖాస్తుల్లో తప్పులుంటే వాటిని సరిదిద్దుకునేందుకు ఎంపీడీఓ ఆఫీసుల్లో లేదా తదుపరి నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమంలో మరోసారి అవకాశమిచ్చే ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. గ్యారంటీల అమలుకు లేని పోని నిబంధనలు పెట్టి ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని చెప్పారు. దరఖాస్తు చేసిన వారిలో అర్హులైన వారందరూ లబ్ధి పొందేలా చూడాలన్నారు. దరఖాస్తు చేయని వారుంటే.. నిరంతర ప్రక్రియగా మళ్లీ దరఖాస్తు చేసే అవకాశం కల్పించాలని సీఎం ఆదేశించారు. సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్.చౌహాన్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రోస్, హోంశాఖ సెక్రటరీ జితేందర్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
5 పథకాలు.. 4 నెలలకోసారి
సాక్షి, హైదరాబాద్: ఆరు గ్యారంటీలు సమర్థవంతంగా అమలు...క్షేత్రస్థాయిలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు నాలుగునెలలకోసారి ప్రభుత్వం ‘ప్రజాపాలన’ కార్యక్రమం నిర్వహించనుంది. అయితే ఈ కార్యక్రమాన్ని ఐదు పథకాలకు మాత్రమే వర్తింపజేస్తామని ప్రభుత్వవర్గాలు స్పష్టం చేశాయి. ఈ మేరకు ఆదివారం జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ప్రజాపాలన కార్యక్రమ అమలు విధివిధానాలపై మార్గదర్శకాలు విడుదల చేశారు. దీని ప్రకారం ప్రజాపాలన కార్యక్రమాన్ని ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు ఎనిమిది పనిదినాల్లో (డిసెంబర్31, జనవరి1 మినహాయించి) నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతి రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామపంచాయతీలోనూ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి మున్సిపల్ వార్డులోనూ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. షెడ్యూల్, నిబంధనలు ►ఈ నెల 25వ తేదీలోపు అధికారుల బృందాల ఏర్పాటు, గ్రామాల వారీగా విజిట్ షెడ్యూల్ త యారీ (మంగళవారం సాయంత్రం ఆరు గంట లకల్లా ఈ వివరాలు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది) ►ఈ నెల 26న అధికారుల బృందాలకు శిక్షణ, అవగాహన ►ఈ నెల 26,27 తేదీల్లో జిల్లా ఇన్చార్జ్ మంత్రుల ఆధ్వర్యంలో జిల్లాస్థాయి, నియోజకవర్గ స్థాయిలో అధికారులకు అవగాహన కార్యక్రమం, పథకం ఉద్దేశాల వివరణ ►ఈ నెల 28న గ్రామ, వార్డు సదస్సులు ప్రారంభం..సాయంత్రం 8 గంటల కల్లా డైలీ రిపోర్టు ఆన్లైన్లో పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి. ►సదస్సు ఏర్పాటుకు ఒక రోజు ముందే గ్రామాలు, వార్డుల్లో టాంటాం వేయించడంతో పాటు కౌంటర్లు, ఇతర ఏర్పాట్లు చేసుకోవాలి. ►రాష్ట్ర స్థాయిలో ఒక ఉమ్మడి దరఖాస్తు ఫారం రూపొందించి కలెక్టర్లకు పంపిస్తారు. వీటిని ఈ నెల 27వ తేదీ రాత్రికల్లా గ్రామాలు, వార్డులకు పంపించాలి. ముందు రోజే గ్రామాలు, వార్డుల్లో దరఖాస్తులు పంపిణీ చేసి వాటిని ప్రజలతో నింపించాలి. ►సభలు సజావుగా నిర్వహించడానికి తాగునీరు, టెంట్లు, కౌంటర్ల కోసం టేబుళ్లు, క్యూలైన్ల కోసం బారికేడ్లు ఏర్పాటు చేయాలి. ►గ్యారంటీల అమలుతో సంబంధం ఉన్న అన్ని శాఖల అధికారులు ఈ సభలకు హాజరు కావాలి. నియోజకవర్గస్థాయిలో నోడల్ అధికా రులను నియమించి కార్యక్ర మాన్ని పర్యవేక్షించాలి. ప్రతి గ్రామపంచాయతీ / వార్డుకు ప్రత్యేక అధికారిని ఇన్చార్జ్గా నియమించాలి. ►ఇతర గ్రామ స్థాయి అధికా రులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లతో సమన్వయం చేసుకొని కార్యక్రమం నిర్వ హించాలి. ►గ్రామ పంచాయతీ సర్పంచ్/కౌన్సిలర్/కార్పొరేటర్, ఇతర ప్రజాప్రతినిధులను సదస్సులకు ఆహ్వానించాలి. ►సభ ప్రారంభానికి ముందు ప్రభుత్వ సందేశాన్ని చదివి వినిపించాలి. ►దరఖాస్తులతో పాటు అవసరమైన ఆధార్, తెల్లరేషన్ కార్డు సమర్పించేలా కౌంటర్లలో ఉండే సిబ్బంది జాగ్రత్త తీసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణకు మహిళలకు ప్రత్యేక కౌంటర్లు, స్త్రీ, పురుషులకు విడివిడిగా క్యూలైన్లు ఏర్పాట్లు చేయాలి. దరఖాస్తుదారులు భారీ సంఖ్యలో ఉంటే టోకెన్ విధాననం అమలు చేయాలి. ►దరఖాస్తుకు రశీదు తప్పనిసరిగా ఇవ్వాలి. ► స్వీకరించిన ప్రతి దరఖాస్తు వివరాన్ని పంచాయతీరాజ్ శాఖ రూపొందించిన ఆన్లైన్ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయాలి. ప్రతి దరఖాస్తుకు ఒక ప్రత్యేక సంఖ్య కేటాయించాలి. ► పట్టణ ప్రాంతాల్లో ఈ కార్య క్రమాన్ని జీహెచ్ఎంసీ కమిష నర్ లేదా సంబంధిత మున్సి పల్ కమిషనర్లు పర్యవే క్షిస్తారు. ► స్వీకరించిన అన్ని దర ఖాస్తులు టీం లీడర్ అధీనంలో ఉంచాలి. వాటిని భద్రపర్చడంతో పాటు కంప్యూటరీకరించేందుకు అవస రమైన కార్యాలా యాన్ని జిల్లా కలెక్టర్ కేటాయించాలి. ►ప్రతి అధికారుల బృందం రోజుకు రెండు గ్రామాల్లో సభలు నిర్వహించాలి. జనవరి ఆరో తేదీ నాటికి పూర్తి చేసుకోవాలి. ప్రతి 100 కుటుంబాలకు కనీసం ఒక కౌంటర్ ఉండేలా చూసుకోవాలి. ►దరఖాస్తుల వెరిఫికేషన్/ప్రాసెసింగ్‌కు సూచన లు ప్రభుత్వం త్వరలోనే జారీ చేస్తుంది. ►అధికారుల బృందాలు విజిట్ షెడ్యూల్‌కు 10 అంశాలతో, డైలీ రిపోర్టు కోసం 11 అంశాలతో ప్రత్యేక ఫార్మాట్ రూపొందించారు. గ్రామాలు లేదా వార్డులకు వచ్చే అధికారులు వీరే ►తహసీల్దారు లేదా రెవెన్యూ శాఖ ప్రతినిధి ►ఎంపీడీఓ లేదా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతినిధి ►మండల పంచాయతీ అధికారి లేదా పంచాయతీరాజ్ ప్రతినిధి ►మండల వ్యవసాయ అధికారి లేదా వ్యవసాయ శాఖ ప్రతినిధి ►పౌరసరఫరాల శాఖ ప్రతినిధి ► పీహెచ్‌సీలోని వైద్యాధికారి లేదా వైద్య శాఖ ప్రతినిధి ►మండల విద్యాధికారి లేదా విద్యాశాఖ ప్రతినిధి ►ఏఈ (డిస్కం) లేదా విద్యుత్‌శాఖ ప్రతినిధి ►సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి ►ఇతర సంబంధిత అధికారులు. (వీరిలో అవసరమైన అధికారులను గ్రామాల వారీ గా నియమించుకోవాల్సి ఉంటుంది.) దరఖాస్తులు స్వీకరించే పథకాలు: మహాలక్ష్మి రైతుభరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇళ్లు చేయూత -
వైవాకు హాజరైన మేయర్ రాంమ్మోహన్
ఉస్మానియా యూనివర్సిటీ: నగర మేయర్ బొంతు రామ్మోహన్ శనివారం ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పీహెచ్డీ చేస్తున్న ఆయన తన ఫైనల్ వైవా నిమిత్తం ఓయూకు వచ్చినట్లు సమాచారం. అనంతరం రీసెర్చ్ సెంటర్ ఫర్ అర్భన్ అండ్ రూరల్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ భవనం ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొ. రామ్‌చంద్రం, గోపాల్‌రెడ్డి, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
సర్కారు వారి ‘భజన భూమి’
గాడి తప్పిన ‘జన్మభూమి-మా ఊరు’ ♦ ప్రజా సమస్యలను ప్రస్తావించిన వారిపై దాడులు, దౌర్జన్యం ♦ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు ఆహ్వానమే లేదు ♦ గత 2 జన్మభూమి కార్యక్రమాల్లో అందిన దరఖాస్తులు 33.27 లక్షలు ♦ వీటిలో ఇంకా పెండింగ్‌లో మగ్గుతున్న దరఖాస్తులు 28.52 లక్షలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమ లక్ష్యం పూర్తిగా గాడితప్పింది. ముఖ్యమంత్రి చంద్రబాబు భజన కే పరిమితమైంది. ఓవైపు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని చెబుతూ రూ.కోట్ల ఖర్చుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం నిర్దేశిత లక్ష్యానికి ఆమడ దూరంలో కొనసాగుతోంది. ప్రచారం పొందడమే ఏకైక లక్ష్యంగా ముఖ్యమంత్రి ఈ నెల 2న మూడో విడత జన్మభూమి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమం నిర్వహణకు అధికారికంగా రూ.13 కోట్లు ఖర్చు చేస్తున్నా, అనధికారికంగా అది రెండింతలుంటుందని అధికారవర్గాలే పేర్కొంటున్నాయి. జరగాల్సిందేమిటి?: వివిధ శాఖల అధికారులు ఎక్కడికక్కడ ప్రజల తో సమావేశమై ఆయా గ్రామాలు, వార్డుల అభివృద్ధి ప్రణాళికలకు రూపకల్పన చేయాలన్నది జన్మభూమి ఉద్దేశం. ఇందుకోసం జన్మభూమి కార్యక్రమ ప్రారంభానికి నెల రోజుల ముందు నుంచే ప్రభుత్వ యంత్రాంగం గ్రామాలు, వార్డుల్లో పర్యటించి, నివేదికలు రూపొందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ నివేదికలను జన్మభూమి గ్రామసభల ముం దుంచి.. ప్రజల అవసరాలపై చర్చించాలి. ఈ అవసరాలను తీర్చడానికి ఆయా శాఖలు ఎంత మేరకు ఆర్థిక తోడ్పాటు అందించగలవన్న దానిపై సమీక్ష జరపాలి. స్మార్ట్ విలేజీ- స్మార్ట్ వార్డు కార్యక్రమాల్లో గ్రామాలు, వార్డులను దత్తత తీసుకున్న వారిని జన్మభూమి గ్రామసభల్లో భాగస్వాములను చేయడంతో పాటు వారు గ్రామాభివృద్ధికి ఏ విధంగా తోడ్పడగలరన్న దానిపై చర్చించాలి. చివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోపాటు పంచాయతీల సొంత ఆదాయ వనరులు, దాతల విరాళాలతో గ్రామ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను రూపొందించాలి. జరుగుతున్నదేమిటి?: రాష్ట్రంలో 12,918 గ్రామ పంచాయితీలు ఉండగా, శనివారం సాయంత్రానికి 11,674 గ్రామాల్లో జన్మభూమి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ 11,674 గ్రామాల్లో 59 గ్రామాల్లో మాత్రమే గ్రామ అభివృద్ధి ప్రణాళికలపై చర్చ, వాటి రూపకల్పన జరిగింది. 4 వేల గ్రామాల్లో ప్రభుత్వ సిబ్బంది జన్మభూమికి ముందస్తుగా చేపట్టాల్సిన సర్వే నివేదిక ల రూపకల్పనే పూర్తి చేయలేదు. జన్మభూమి సభల్లో పింఛన్లు, రేషన్ సరకులు మా త్రమే పంపిణీ చేస్తున్నారు. జన్మభూమి కార్యక్రమం ఉన్నా లేకపోయినా ప్రతి నెలా వీటిని పంపిణీ చేయడం పరిపాటే. గతంలో అధికార ంలో ఉన్నపుడు తాను మాత్రమే సమర్థంగా పనిచేస్తున్నానని, అధికారులు ప్రజలను, వారి సమస్యలను పట్టించుకోవటం లేదన్నట్లుగా చిత్రీకరించిన చంద్రబాబు ఈసారి కూడా అదే తంతు కొనసాగిస్తున్నారు. రోజూ ఏదో ఒక చోట ప్రజల సమక్షంలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారంతో మూడో విడత జన్మభూమి ముగియనుంది. విపక్ష నేతల నిర్భంధం: జన్మభూమి కార్యక్రమంలో భాగంగా సీఎం జిల్లాల్లో పర్యటించే సమయంలో విపక్ష నేతల నిర్బంధం రోజూ కొనసాగుతోంది. మంచినీటి సమస్య, ఇళ్లు, ఇంటి స్థలాలు, ఫించన్లు, రేషన్‌కార్డులు మంజూరు చేయాలని, నిత్యావసరాల ధరలు తగ్గించాలని కోరుతూ ప్రజలు వినతిపత్రాలు అందించడంతోపాటు ఎక్కడికక్కడ నిరసన తెలియచేస్తున్నారు. రైతులు తమ రుణాలు మాఫీ కాలేదని నిలదీయటంతోపాటు ఆత్మహత్యాయత్నాలు చేసుకుంటున్నారు. దీంతో చంద్రబాబు పర్యటనల సందర్భంగా ముందుగానే పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు, గృహ నిర్బంధాలు కొనసాగిస్తున్నారు. తాజాగా శనివారం చంద్రబాబు వైఎస్సార్ జిల్లా పర్యటన సందర్భంగా కడప వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంజాద్‌బాషా, మేయర్ సురేష్లను గృహ నిర్బంధం చేశారు. విజయనగరం జిల్లాలో పర్యటన సందర్భంగా వామపక్ష నేతలను అరెస్టు చేశారు. కృష్ణా జిల్లాలో వైఎస్సార్సీపీ నేత సామినేని ఉదయభాను జన్మభూమి సభలో నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా అరెస్టు చేశారు. జోగి రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్యాష్ బోర్డు నుంచి సమాచారం మాయం జన్మభూమి ద్వారా సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెబుతున్న చంద్రబాబు వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గత రెండు జన్మభూమి కార్యక్రమాల్లో వచ్చిన లక్షలాది వినతులను పరిష్కరించని ప్రభుత్వం ఒక్క రోజులో వాటన్నింటినీ పరిష్కరించామని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. సీఎం కోర్ డ్యాష్ బోర్డులో ఈ నెల ఒకటో తేదీ నాటికి గత రెండు జన్మభూముల్లో రేషన్‌కార్డులు, ఫించన్లు, ఇళ్లు కావాలని వచ్చిన 33.27 లక్షల దరఖాస్తుల్లో 28.52 లక్షల దరఖాస్తులను పరిష్కరించలేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ ప్రచురించింది. దీంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని ఆందోళన చెందిన ప్రభుత్వం ఆ రోజు సాయంత్రానికి సీఎం కోర్ డ్యాష్ బోర్డు నుంచి ఆ సమాచారాన్ని మాయం చేసింది. -
ప్రభుత్వాలకు శిక్ష తగ్గింపు అధికారం లేదు!
♦ రాజీవ్ హంతకుల కేసులో సుప్రీం కీలక వ్యాఖ్య ♦ శిక్షల విధింపులో ఔదార్యం సమాజానికి నష్టం న్యూఢిల్లీ: సీఆర్పీసీలోని 432(1) నిబంధన కింద దోషులకు శిక్షను తగ్గించడం లేదా శిక్షను రద్దు చేసే అధికారాన్ని కేంద్రం కానీ, రాష్ట్రాలు కానీ తమకు తాము తీసుకోకూడదని బుధవారం సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. దోషులు పెట్టుకున్న దరఖాస్తుల ఆధారంగానే సీఆర్పీసీ సెక్షన్ 432(2)లో పేర్కొన్న ప్రకారం ఆ ప్రక్రియ చేపట్టాలని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే, సంబంధిత కోర్టు అభిప్రాయం ప్రకారం శిక్ష తగ్గింపు, లేదా రద్దుపై నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకులను విడుదల చేస్తూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. అయితే, ధర్మాసనంలోని ఐదుగురు జడ్జీల్లో ఇద్దరు న్యాయమూర్తులు ఆ తీర్పుతో విభేదించడం విశేషం. దోషులకు శిక్ష తగ్గింపు విషయంలో ప్రభుత్వాలకు ఉన్న చట్టబద్ధ అధికారాలను కోర్టులు తప్పించలేవని జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఏఎం సాప్రే అభిప్రాయపడ్డారు. ఈ కేసులో జస్టిస్ లలిత్ ప్రత్యేకంగా 80 పేజీల తీర్పును రాశారు. ధర్మాసనం తీర్పులోని ఇతర ముఖ్యాంశాలు, కీలక వ్యాఖ్యలు.. ► తీవ్రమైన నేరాలకు పాల్పడినవారికి శిక్షలు విధించడంలో ఔదార్యం చూపితే.. అది సమాజంలో అస్తవ్యస్తతకు, శాంతిభద్రతల క్షీణతకు దారితీస్తుంది. దానివల్ల వేలాది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ► సామాన్యుల ప్రాణాలకు, స్వేచ్ఛకు ప్రభుత్వ యంత్రాంగం రక్షణ కల్పించలేకపోతోందనేది కఠిన వాస్తవం. అందువల్ల తీవ్ర స్థాయి నేరాల్లో శిక్షల విధింపులో ఔదార్యం కూడదు. ► అక్రమ సంపాదనతో, అధికార కాంక్షతో ఉన్న అత్యున్నత స్థాయి వ్యక్తుల సహకారంతో ఇలాంటి చట్టవ్యతిరేక శక్తులు సామాన్యుల ప్రాణాలతో ఆడుకుంటున్నాయి. ఆ వ్యక్తుల చేతిలో వీరు గూండాలుగా, డబ్బులు తీసుకుని హత్యలు చేసేవారిగా మారుతున్నారు. ► చట్టం ప్రకారం నడుచుకోకపోవడం ఇప్పుడు సాధారణం అయింది. ► ఈ ప్రొఫెషనల్ క్రిమినల్స్, గ్యాంగ్స్టర్స్, గూండాల బెదిరింపులతో కుటుంబ సభ్యులు, ఇతర దగ్గరి వారు కూడా సాక్ష్యం చెప్పడానికి ముందుకురాని పరిస్థితిని చాలా కేసుల్లో చూశాం. ► కేసుల విచారణలో జాప్యం వల్ల అండర్‌ట్రయల్స్‌గా ఉన్న నేరస్తులు మరిన్ని తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నారు. కేసుల సంఖ్యకు సరిపోయే స్థాయిలో జడ్జీలు లేకపోవడం దీనికి ఓ కారణం. ► శిక్ష రద్దుకు సంబంధించిన ఆశా కిరణాన్ని రాజీవ్‌గాంధీ హంతకులు ఆశించకూడదు. నేర ఘటన తరువాత ఎలాంటి ఉపశమనం పొందని బాధితులు, వారి బంధువులకే అది వర్తిస్తుంది. సంక్షిప్తంగా... ’పెషావర్’ముష్కరుల ఉరితీత: పెషావర్ ఆర్మీ స్కూలులో గతేడాది డిసెంబర్లో 150 మందికిపైగా చిన్నారులు, ఇతరులను చంపిన ఘటనలో పాలుపంచుకున్న నలుగురు తాలిబాన్ ఉగ్రవాదులను పాక్ ప్రభుత్వం బుధవారం ఉరితీసింది. తృణమూల్ నేతను విచారించిన సీబీఐ: శారదా స్కాంలో తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్ ప్రధాన కార్యదర్శి శంకుదేబ్ పాండాను సీబీఐ విచారించింది.. మరో ఐఎస్ఐ ఏజెంట్ అరెస్టు: పాస్‌పోర్టు ఏజెంటుగా పనిచేస్తూ.. పాక్‌కు సహకారం అందిస్తున్న షేక్ బాదల్(59) అనే మరో ఐఎస్ఐ ఏజెంటును కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. -
కేయూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి ‘అధిపతి’ కావలెను
బాధ్యతలు వద్దంటూ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ యాదగిరిరావు రిజిస్ట్రార్‌కు లేఖ సుజాతకుమారికి అవకాశం? కేయూక్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మానవనరుల విభాగానికి విభాగ అధిపతిగా ఆవిభాగం ప్రొఫెసర్ యాదగిరిరావును ఈనెల 7వ తేదీన నియమాకం చే స్తూ కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈనెల 19వ తేదీ వరకు కూడా ఆయన బాధ్యతలను స్వీకరంచ లేదు. అంతేగాకుండా తాను విభాగం అధిపతిగా బాధ్యతలను స్వీకరించబోనని కూడా రెండు రోజుల క్రితం కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్‌కు లేఖను అందజేశారు. విభాగం అధిపతిగా ఉన్న ప్రొఫెసర్ ఎం. విద్యాసాగర్‌రెడ్డి ఈనెల 4వతేదీతో పదవీకాలం ముగిసింది. రొటేషన్ ప్రకారం విభాగం అధిపతిగా ప్రొఫెసర్ సత్యనారాయణ నియమాకం కావాల్సి ఉండగా తాను విభాగం అధిపతిగా బాధ్యతలను చేపట్టబోనని సత్యనారాయణ బీవోఎస్గానే కొనసాగుతానని ఇన్చార్జి రిజిస్ట్రార్‌కు లేఖ అందజే యటంతో కేయూ యూజీసీ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్ యాదగిరిరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ఆయన కూడా బాధ్యతలను స్వీకరించనని నాట్ విల్లింగ్ ఇస్తూ లేఖ అందజేశారు. దీంతో15 రోజులుగా విభాగంనకు అధిపతి లేకపోవటంతో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మానవవనరుల విభాగం‘హెడ్’లేని విభాగంగా కొనసాగుతుంది. ప్రొఫెసర్ యాదగిరిరావు వెనుకంజకు కారణమేమిటీ కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మానవనరుల విభాగం విభాగం అధిపతిగా నియామకం అయ్యాక ఈనెల 12వతేదీన ప్రొఫెసర్ యాదగిరిరావు విభాగం అధిపతిగా బాధ్యతలను స్వీకరించేందుకు విభాగానికి వెళ్లగగా పీహెచ్‌డీలో సీట్లు రాని అభ్యర్థులు వచ్చి ప్రవేశాల ఎంపికలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ యాదగిరిరావుతో వాగ్వాదాలకు దిగారు. అనంతరం వెళ్లిపోయిన ప్రొఫెసర్ యాదగిరిరావు బాధ్యతలను స్వీకరించటం లేదు. చివరికి యాదగిరిరావు రెండు రోజుల క్రితం తాను ఆవిభాగం అధిపతిగా ఉండబోనని ఇన్చార్జి రిజిస్ట్రార్‌కు లేఖ అందజేశారు. గత 15రోజులుగా విభాగం అధిపతి ఎవరు లేకపోవటం వలన విద్యార్థులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. అయితే విభాగం అధిపతిగా ఎవరిని నియమించినా వారికి చార్జీ ఇచ్చేందుకు విద్యాసాగర్‌రెడ్డి నిరీక్షిస్తున్నారు. ప్రస్తుతం యాదగిరిరావు యూజీసీ కో ఆర్డినేటర్‌గా కొనసాగుతున్నారు. ఇక సుజాతకుమారి వంతు ? కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మానవ వనరుల విభాగం అధిపతిగా ఇద్దరు ప్రొఫెసర్లు నాట్ విల్లింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ సుజాతకుమారిని విభాగ అధిపతిగా నియమించే అవకాశాలున్నాయి. ఈమేరకు ఒకటి రెండురోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశాలుంటాయని సర్వత్రా భావిస్తున్నారు. సమస్య కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ దృష్టికి వెళ్లినా త్వరతగతిన సమస్యను పరిష్కరించి విభాగం అధిపతిని నియమించటంలో జాప్యం చేయటం పట్ల పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
కదలాల్సిందే..
- 28లోపు బదిలీ ఆప్షన్లకు అవకాశం - 29న కౌన్సెలింగ్ - 30న ఉత్తర్వులు జారీ - 1 నుంచి కొత్త పోస్టింగ్‌ల్లో చేరిక - ఉద్యోగ వర్గాల్లో ఉత్కంఠ సాక్షి, విశాఖపట్నం : బదిలీల గడువు దగ్గర పడే కొద్ది ప్రభుత్వ యంత్రాంగంలో టెన్షన్ మొదలైంది. ఒకటి రెండు శాఖలు మినహా దాదాపు అన్ని శాఖల్లోనూ బదిలీలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. నెలాఖరుకల్లా బదిలీల ప్రక్రియ పూర్తి చేసేందుకు జిల్లా యం త్రాంగం కసరత్తు చేస్తోంది. ప్రక్రియను 29కల్లా పూర్తి చేసి, 30న జిల్లాకు వస్తున్న ఇన్చార్జి మంత్రితో ఆమోద ముద్ర వేయించి పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేయాలని భావిస్తున్నారు. జిల్లా పరిధిలో 46 ప్రభుత్వ శాఖల పరిధిలో 491 క్యాడర్లలో పనిచేస్తున్న 8,402 మంది ఉద్యోగుల్లో 3,094 మంది బదిలీకి అర్హులుగా లెక్కతేల్చారు. అన్ని క్యాడర్లలో మూడో వంతు అధికారులు, ఉద్యోగులు బదిలీ అయ్యే అవకాశం ఉంది. శాఖల వారీగా తయారు చేసిన జాబితాలపై కలెక్టర్ ఆమోద ముద్ర వేశారు. వీటిపై కలెక్టర్, మంత్రుల స్థాయిలో సమీక్షలు కూడా జరిగాయి. పారదర్శకంగా పూర్తిచేసే బాధ్యతను కలెక్టర్‌కు అప్పగించారు. టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిల సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకుని ఏ ఒక్కరికి రాజకీయంగా ఇబ్బందులు తలెత్తకుండా బదిలీలు పూర్తిచేయాలని మంత్రులు ఆదేశించారు. దీంతో శాఖల వారీగా అర్హులైన వారి నుంచి మూడు ఆప్షన్లు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియ 27, 28 తేదీల్లో పూర్తవుతుంది. ఆప్షన్లను బట్టి 29వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. తుది జాబితాలపై 30న జిల్లాకు రానున్న ఇన్చార్జి మంత్రి యనమల రామకృష్ణుడుతో ఆమోద ముద్ర వేయించి అదే రోజు పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వనున్నారు. 1వ తేదీన విధుల్లో చేరాల్సి ఉంటుంది. జాబితాలో ఉన్న వారితో పాటు మూడేళ్ల లోపు సర్వీసు ఉన్న వారిలో కూడా చాలా మందికి స్థానచలనం తప్పేటట్టు కన్పించడం లేదు. ఈ జాబితాను స్థానిక ప్రజా ప్రతినిధులు శాఖల వారీగా అందజేశారు. మరొక పక్క తమ నియోజకవర్గాల్లో కావాలని కోరుకునే అధికాారులు, ఉద్యోగుల కోసం సిఫార్సు లేఖల జారీలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బిజిగా ఉన్నారు. ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తయిన తర్వాత జులై మొదటి వారంలో జిల్లా స్థాయి క్యాడర్లో పనిచేసే వారి బదిలీలు జరగనున్నాయి. స్థానచలనం తప్పదని భావిస్తున్న ఏళ్ల తరబడి పాతుకుపోయిన వారు ఇప్పటికే బదిలీలను ఆపుకునేందుకు మంత్రుల చుట్టూ ప్రదక్షిణ లు చేస్తున్నారు. -
దెబ్బ మీద దెబ్బ !
విజయనగరం కంటోన్మెంట్: ఇంటిని పోషించే యజమాని వడదెబ్బతో చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం అందజేసే సాయం విషయంలో బాధితులకు మరో దెబ్బ తగులుతోంది. జిల్లాలో వడదెబ్బ మృతులకు సాయం అందించడంలో ప్రభుత్వ సూచనల ప్రకారం కోత తప్పదన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది మే 20 నుంచి వడదెబ్బ మృతులను ప్రభుత్వం గుర్తిస్తున్నది. వడదెబ్బకు ఎంత మంది మృతి చెందారన్న వివరాలను సేకరించింది. గ్రామస్థాయిలో మృతిచెందిన వారి వివరాలను మండల కేంద్రంలోని తహశీల్దార్, ఎస్సై,వైద్యాధికారులున్న త్రిసభ్య కమిటీ గుర్తించి పంపించాల్సి ఉంది. అయితే వీరి ద్వారానే కాకుండా ముందుగా తహశీల్దార్ కార్యాలయాల నుంచి వడదెబ్బ మృతుల సంఖ్యను ప్రతిరోజూ నమోదు చేసుకుని కలెక్టరేట్లోని సెక్షన్ కార్యాలయానికి పంపించారు. దీని ప్రకారం జిల్లావ్యాప్తంగా మే20 నుంచి మే 31 వరకూ జిల్లా వ్యాప్తంగా వడదెబ్బల కారణంగా మృతి చెందిన వారిని గుర్తించారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తం గా ఈ ఏడాది మే20 నుంచి నెలాఖరు వరకూ 214 మంది మృతి చెందారు. అయితే జిల్లా అధికారులకు త్రిసభ్య కమిటీ నుంచి వచ్చిన నివేదికల ప్రకారం 18 మంది మాత్రమే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. ఇది మంగళవారం వరకూ నమోదైన వడదెబ్బ మృతుల సంఖ్య. అయితే మిగతా వారి సంగతేంటనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. మిగతా వారి వివరాలు ఎప్పటికి పంపిస్తారో! అవి ఎప్పటికి సీసీఎల్ఏకు వెళతాయో? వాటిని గుర్తించి నిధులు ఎప్పుడు మంజూరు చేస్తారోనని బాధిత కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. ఎటువంటి ఆదాయ వనరు లేక సంపాదన పరులు ఎండ దెబ్బకు మృతి చెందితే ఆ కుటుంబాలు ఎలా జీవిస్తాయనే ఆలోచనతో ప్రభుత్వం విపత్తుల నిర్వహణ కింద కుటుంబానికి లక్ష రూపాయలు ప్రకటించింది. మరి వాటిని అర్హులైన అందరికీ అందజేయాల్సి ఉన్నా అర్హుల ఎంపికలో పూర్తిగా న్యాయం జరగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత ఏడాది కూడా ఇదే దారుణం జిల్లాలో గత ఏడాది వాస్తవానికి 140 కన్నా ఎక్కువ మందే వడదెబ్బకు మృతి చెందారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇందులో అందరినీ గుర్తించి 44 మందికి మొదటి విడతగా నిధులు మంజూరు చేసింది. ఆ తరువాత మిగతా వారికి మంజూరు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అర్హులను కుదించే చర్యలు తీసుకుంది. దీంతో వడదెబ్బ కారణంగా మృతిచెందిన వారిని గుర్తించేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది. దీని ప్రకారం ఆ కమిటీలోని అధికారులు వడదెబ్బకు మృతిచెందిన వారు కేవలం 28 మంది ఉన్నారని గుర్తించారు. దీని ప్రకారమే నిధులు విడుదల చేసి ఇటీవలే వాటిని పంపిణీ చేశారు. వడదెబ్బ వల్ల మృతి చెందిన వారి మృతదేహాలకు ఆయా కుటుంబ సభ్యులు ముందుగా పోస్టుమార్టం చేయించుకుని ఉంటే త్రిసభ్య కమిటీ ఆమోదం అవసరం లేదు. అసలు త్రిసభ్య కమిటీ గ్రామంలోని పెద్దల సమక్షంలో విచారణ చేసి వడదెబ్బ మృతులను ధ్రువీకరించాల్సి ఉంది. అయితే గ్రామాల్లో విచారణ సక్రమంగా జరిపి నివేదిక పంపిస్తున్నారా లేదా అన్న విషయం అధికారులకే తెలియాలి. -
సర్కారే అసలు దోషి...
అడ్డగోలుగా బాణసంచా తయారీ కళ్లుమూసుకున్న యంత్రాంగం ► వాకతిప్ప విస్ఫోటంలో మరో నలుగురు మృతి.. 17కి పెరిగిన మృతుల సంఖ్య ► మృతుల్లో 15 మంది బడుగు మహిళలే..ఆచూకీ లేకుండా పోయిన మరో బాలిక ► లెసైన్సు రద్దయిన తర్వాతా బాణసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తున్న వైనం ► తనిఖీలు చేయకుండానే లెసైన్సు పునరుద్ధరించాలంటూ సిఫారసులు ► cయు.కొత్తపల్లి తహశీల్దార్ సస్పెన్షన్.. నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు కాకినాడ: ప్రభుత్వ యంత్రాంగం అలసత్వానికీ, నిర్లక్ష్యానికీ అమాయకులు మూల్యం చెల్లించాల్సి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం వాకతిప్పలో బాణసంచా తయారీ కేంద్రంలో సోమవారం సంభవించిన పెను విస్ఫోటంలో మృతుల సంఖ్య 17కి చేరింది. వీరిలో 15 మంది బడుగువర్గాల మహిళలే. ఈ దుర్ఘటనలో మరో బాలిక ఆచూకీ లేకుండా పోయింది. వాకతిప్ప ఎస్సీ కాలనీకి చెందిన 11 మంది దుర్మరణం పాలు కాగా.. మిగిలిన వారు మరో రెండు గ్రామాలకు చెందినవారు. దీంతో మూడు గ్రామాల్లో విషాదం అలముకుంది. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న’ సామెత చందంగా ఇన్ని ప్రాణాలు బలయ్యాక.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం కాకినాడలో ప్రకటించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రయత్నం ఇంతకు ముందే జరిగి ఉంటే బడుగు, బలహీనవర్గాలకు చెందిన ఇన్ని ప్రాణాలు బలయ్యేవి కావని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 17కు పెరిగిన మృతుల సంఖ్య... వాకతిప్పలో ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహిస్తున్న మణికంఠ ఫైర్వర్క్స్లో సంభవించిన భారీ విస్ఫోటంలో సోమవారం 12 మంది మృతి చెందగా.. మంగళవారం తెల్లవారుజామున మరో నలుగురు మృతి చెందారు. ఉల్లంపర్తి కామరాజు (30), మేడిశెట్టి నూకరత్నం (20), దమ్ము గురవయ్య (45), తుట్టా నాగమణి (35) కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మరోవైపు.. సంఘటనా స్థలానికి అరకిలోమీటర్ దూరంలో పంటకాలువలో వాసంశెట్టి రాఘవ (50) అనే మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఆచూకీ లేకుండా పోయిన 12 ఏళ్ల ఉండ్రాజపు కీర్తి కూడా మృతిచెంది ఉంటుందని అధికారులు ప్రాధమికంగా నిర్థారణకు వచ్చారు. పరిసరాల్లో లభించిన తెగిపడ్డ ఓ కాలు ఆ బాలికదేనని భావిస్తున్నారు. అవసరమైతే లభించిన కాలికి డీఎన్ఏ పరీక్ష నిర్వహిస్తామని చెప్తున్నారు. ఫైర్వర్క్స్ నిర్వాహకుడు కొప్పిశెట్టి అప్పారావు, అతడి తల్లి లక్ష్మి, కుక్కల శ్రీనివాసరావు అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. లెసైన్సు రద్దయినా ఆగని తయారీ... వాకతిప్పలో మరణమృదంగానికి కారణమైన మణికంఠ ఫైర్‌వర్క్స్‌కు 2015 వరకు లెసైన్సు ఉన్నప్పటికీ పెరిగిన వ్యాపారానికి తగ్గట్టు ఫీజు చెల్లించని కారణంగా గత నెలలో లెసైన్సు రద్దు చేశారు. నిర్వాహకుడు కొప్పిశెట్టి అప్పారావు కొత్తగా లెసైన్సు కోసం గతవారం పెట్టుకున్న దరఖాస్తు కాకినాడ ఆర్డీఓ కార్యాలయంలో పెండింగ్‌లో ఉంది. అయినా బాణసంచా తయారీని ఆపలేదు. దరఖాస్తు చేయడానికి ముందు నుంచే (గత నెలన్నర రోజులుగా) బాణసంచా తయారుచేయిస్తూనే ఉన్నాడు. ఈ కేంద్రం నుంచి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు పశ్చిమగోదావరి జిల్లాకు కూడా పెద్ద ఎత్తున హోల్‌సేల్‌గా బాణసంచా సరఫరా చేస్తున్నారు. దీపావళి సందర్భంగా అమ్మకాల కోసం సుమారు రూ. 50 లక్షల విలువైన సరుకును కూడా శివకాశి నుంచి కొని, తెచ్చినట్టు సమాచారం. ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగానే జరుగుతున్నాయి. కళ్లు మూసుకున్న అధికారులు... బాణసంచా తయారీ, నిల్వ, అమ్మకాలకు విడివిడిగా అనుమతులు తీసుకోవాల్సి ఉంది. కానీ ఇక్కడ బాణసంచా తయారు చేసేందుకు ప్రస్తుతం లెసైన్సు లేదు. గతంలో ఉన్న లెసైన్సు రద్దయింది. అన్ని కార్యకలాపాలూ నిబంధనలకు విరుద్ధంగా కళ్లెదుటే చేస్తున్నా అధికారుల కళ్లకు కనిపించనే లేదు. నెల రోజులు ముందుగానే దుకాణాలను తనిఖీ చేసి సరుకు నిల్వలు, తయారీ విధానం, పనిచేస్తున్న వారికి బీమా చేయించారా లేదా అనే వివరాలు స్వయంగా పరిశీలించాల్సిన అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నారు. ఎంపీడీఓ కార్యాలయం, విద్యుత్ కార్యాలయం, నివాస ప్రాంతాలు, నిత్యం జనసమ్మర్థం ఉండే ప్రాంతానికి సమీపాన అడ్డగోలుగా ఈ కేంద్రం నిర్వహిస్తున్నా.. క్షేత్రస్థాయిలో తహశీల్దార్, అగ్నిమాపక అధికారులు, పోలీసులు.. ఎటువంటి తనిఖీలు లేకుండానే సర్టిఫై చేసి జిల్లా కేంద్రానికి లెసైన్సు పునరుద్ధరణకు సిఫారసు చేశారు. పర్యవసానంగా జరిగిన ఘోరం 17 నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. అధికారుల నిర్లక్ష్యానికి, ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా నిలిచింది. దుర్ఘటనకు బాధ్యుడిగా యు.కొత్తపల్లి తహశీల్దార్ పినిపే సత్యనారాయణను సస్పెండ్ చేశారు. బాణసంచా కేంద్రం యాజమాన్యంపై ఐపీసీ 286, 337, 338, 304(2), 1884 ఎక్స్‌ప్లోజివ్ సబ్స్టాండ్స్ చట్టం సెక్షన్ 9బి ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేశారు. మృతదేహాల కోసం రాత్రి వరకూ పడిగాపులు... కాకినాడ జీజీహెచ్ ఫోరెన్సిక్ విభాగ వైద్యుడు డాక్టర్ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం 15 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. తెగిపడ్డ కాలినీ పరీక్షించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించడంలో మానవత్వం లోపించింది. కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకూ జీజీహెచ్‌లో పడిగాపులు పడాల్సి వచ్చింది. సీఎం వచ్చే వరకు మృతదేహాలను జీజీహెచ్‌లోనే ఉంచేయడం కుటుంబ సభ్యులను కలచివేసింది. ఉదయం 10.30 గంటలకు సీఎం వస్తున్నారని హైరానా పడ్డ అధికారులు హుటాహుటిన పోస్టుమార్టం పూర్తి చేసినా సీఎం మధ్యాహ్నం 3.30 గంటలవరకు రాకపోవడంతో అంతవరకు వేచి చూడాల్సి వచ్చింది. సీఎం వెళ్లిపోయాక మృతదేహాలను తరలించేందుకు ఏర్పాటుచేసిన అంబులెన్స్‌లకు డీజిల్ పోసే బాధ్యతను రెవెన్యూ అధికారులు ఒకరిపై మరొకరు నెట్టుకోవడంతో బంధువులు రాత్రి వరకూ నిరీక్షించాల్సి వచ్చింది. పేలుడులో మృతుల వివరాలు... మసకపల్లి అప్పయమ్మ (55), మసకపల్లి గంగ (23), మసకపల్లి విజయకుమారి అలియాస్ బుజ్జి (28), ద్రాక్షారపు కాంతమ్మ (50), మసకపల్లి కుమారి (24), ద్రాక్షారపు చిన్నతల్లి (46), అద్దంకి నూకరత్నం (25), మసకపల్లి పుష్ప (35), ఉల్లంపర్తి కామరాజు (30), పిల్లి మణికంఠస్వామి (35), తుట్టా మంగ (40), తుట్టా సత్తిబాబు (20), మేడిశెట్టి నూకరత్నం (20), దమ్ము గురవయ్య (45), తుట్టా నాగమణి (35), రాయుడు రాఘవ (40), వాసంశెట్టి రాఘవ (50). ఈ 17 మంది మృతి చెందగా.. ఉండ్రాజపు కీర్తి (12) అనే బాలిక ఆచూకీ లభ్యంకాలేదు. ఇక ఆస్పత్రిలో కుక్కల శ్రీనివాసరావు, కొప్పిశెట్టి లక్ష్మి, కొప్పిశెట్టి అప్పారావులు చికిత్సపొందుతున్నారు. -
పెను గండం
81 కేంద్రాలకు 30,395 మంది తరలింపు ఇంకా తరలించాల్సింది 59,197 మందిని పెనుగాలులకు నేలకొరిగిన చెట్లు ఎగసిపడుతున్న సముద్రపు అలలు కెరటాల ధాటికి హార్బర్లో కూలిన గోడ జిల్లాకు మరో ఆరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జాతీయ రహదారిపై రాకపోకలు బంద్ నిలిచిపోయిన రవాణా వ్యవస్థ హుదూద్ గుప్పెట్లో విశాఖ విలవిల్లాడుతోంది. పెను తుఫాన్ ప్రభావంతో ఉవ్వెత్తున విరుచుకుపడుతున్న కడలి కెరటాలు చెలియలి కట్టదాటి తీరం వెంబడి ఉన్న కట్టడాల్ని పొట్టనపెట్టుకుంటున్నాయి. ముందుకు దూసుకువచ్చిన సముద్రంతో బీచ్ అల్లకల్లోలమైంది. సాగర భీకర గర్జనకు మత్స్యకార గ్రామాలన్నీ ఖాళీ అయిపోయి బిక్కుబిక్కుమంటున్నాయి. బలమైన గాలులు వీస్తూ భయకంపితులను చేస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం నుంచి గాలుల తీవ్రత హెచ్చడంతో పలుచోట్ల కరెంటు స్తంభాలుపడిపోయాయి. విద్యుత్ సరఫరాకు విఘాతం ఏర్పడింది. హుదూద్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ముందస్తు జాగ్రత్తగా హైవేలో దాదాపు వాహనాల రాకపోకలను నిషేధించారు. రైలు, బస్సు, విమాన సర్వీసులన్నీ రద్దు చేశారు. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ ఎఫ్, ఫైర్‌మెన్, పోలీసులు, జిల్లా యంత్రాంగం అనుక్షణం జిల్లా అంతటిని కంటికి రెప్పలా కాపాడుతున్నాయి. విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. ఆదివారం ఉదయం గతంలో ఎన్నడూ లేని విధంగా విశాఖపట్నం సమీపంలో తీరం దాటే వేళ పెనుతుఫాన్ మరింత ఉధృత రూపం దాల్చే ముప్పు ఉండడంతో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని భయాందోళనలతో ఉన్నారు. ఈ పెనుగండం దాటేలా చూడాలని గంగమ్మను వేడుకుంటున్నారు. గరిష్ట స్థాయిలో పదో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. విశాఖ రూరల్: పడగెత్తిన పెను తుపాను సాగర కెరటాల మాటు నుంచి భీకరంగా బుస కొడుతూ హుదూద్ విశాఖపైకి దూసుకువస్తోంది. అత్యంత శక్తివంతంగా ‘అల’జడి రేపుతూ గంటకు 11 కిలోమీటర్ల వేగంతో ఉప్పెనను మోసుకొస్తోంది. ముప్పుకు ముందస్తు సంకేతంగా శనివారం పెనుగాల వర్షంతో అస్తవ్యస్థ పరిస్థితి నెలకొంది. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కోడానికి త్రివిధ దళాలతో పాటు జిల్లా యంత్రాంగం సర్వ సన్నద్ధంగా ఉంది. పాఠశాలు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. పరిశ్రమల్లో రాత్రి విధులను నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది. రవాణా వ్యవస్థను నిలిపివేసింది. తుపాను హెచ్చరికలతో తీర ప్రాంత గ్రామాల్లో ఆందోళన ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అధికారులు, పోలీసులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పోటెత్తిన సముద్రం తుపాను నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కెరటాలు రెండు మీటర్ల ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. కెరటాల ధాటికి ఫిషింగ్ హార్బర్లో గోడ నేలకూలింది. జిల్లాలో చోలా చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. ప్రధానంగా నక్కపల్లి మండలంలో రాజయ్యపేట, బోయపాడు, బంగారంపేట గ్రామాల వద్ద సముద్రం పోటెత్తుతోంది. ఇక్కడ సముద్రం దాదాపు 60 అడుగుల మేర ముందుకొచ్చింది. మత్స్యకారులందరూ ముందు జాగ్రత్తగా తెప్పలు, వలలను సురక్షిత ప్రాంతాలకు చేర్చుకుంటున్నారు. సముద్రం పోటు మీద ఉండడంతో ప్రత్యేక పోలీసు బలగాలు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా గ స్తీ నిర్వహిస్తున్నారు. బీచ్ రోడ్డు మూసివేత పర్యాటకులను పోలీసులు బీచ్‌లోకి అనుమతించడం లేదు. శనివారం ఉదయం నుంచే సందర్శకులను సముద్ర తీరం నుంచి వెనక్కు పంపించారు. శనివారం సాయంత్రం నుంచి ఫిషింగ్ హార్బర్ నుంచి తీర ప్రాంత రోడ్డులో రాకపోకలను పోలీసులు నిషేధించారు. సముద్ర తీవ్రతను చూసేందుకు భారీగా సందర్శకులు బీచ్‌కు వచ్చినప్పటికీ పోలీసులు వారిని అనుమతించలేదు. నేలకొరిగిన చెట్లు శుక్రవారం రాత్రి నుంచి వీచిన గాలుల ధాటికి జిల్లాలో అనేక చోట్లు చెట్లు, హోర్డింగ్‌లు నేలకొరిగాయి. విశాఖకు మరిన్ని బలగాలు హుదూద్ తుపాను విశాఖ పరిసర ప్రాంతాల నుంచి తీరం దాటనుండడంతో ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచే కాకుండా కేంద్రం నుంచి భారీగా రక్షణ దళాలు విశాఖకు చేరుకున్నాయి. నేవీ, ఎయిర్‌ఫోర్స్ హెలీకాఫ్టర్లను సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం రెండు ఆర్మీ బృందాలు అచ్యుతాపురంలో ఒక పాలిటెక్నిల్ కళాశాలలో మకాం వేశాయి. ఇప్పటికే జిల్లాకు చేరుకున్న ఆరు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తీర, తుపాను ప్రభావ మండలాలకు చేరుకున్నాయి. పాయకరావుపేట, ఎస్.రాయవరం, నక్కపల్లి, రాంబిల్లి, అచ్యుతాపురం, పరవాడ, గాజువాక, పెదగంట్యాడ, విశాఖ అర్బన్, విశాఖ రూరల్, భీమిలి, అనకాపల్లి, కశింకోట, మునగపాక, కె.కోటపాడు, దేవరాపల్లి, చోడవరం, మాడుగుల, చీడికాడ, బుచ్చయ్యపేట, రావికమతం, కోటవురట్ల, నాతవరం, మాకవరపాలెం, నర్సీపట్నం, గొలుగొండ, రోలుగుంట మండలాల్లో ఈ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. వీటికి అధనంగా గజియాబాద్ నుంచి మరో 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జిల్లాకు రానున్నాయి. తుపాను ప్రభావం విశాఖపైనే అధికంగా ఉంటుందని నిపుణలు అంచనాల మేరకు ఒరిస్సాలో ఉన్న మరో 3 బృందాలు విశాఖకు వస్తున్నారు. మొత్తంగా 12 బృందాలను జిల్లాలో అన్ని మండలాలోను సిద్ధంగా ఉంచుతున్నారు. వీటితో పాటు 30 నేవీ టీమ్‌లు కూడా మండలాలకు చేరుకున్నాయి. మండలాలకు బోట్లు ముంపు ప్రభావిత మండలాలకు ఎన్డీఆర్ఎఫ్, నేవీ బోట్లను తరలించారు. పాయకరావుపేట మండలంలో గజపతినగరం, పెంటకోట గ్రామాలకు ఒక్కో బోటు, నక్కపల్లి మండలంలో రాజయ్యపేట, పెదతీనార్లకు, ఎస్.రాయవరం మండలం బంగారమ్మపేట, రేవుపోలవరం గ్రామాలకు, అనకాపల్లి, రాంబిల్లి మండలం దిమిలి, నారాయణపురం, మునగపాక మండలం చూచుకొండ, చోడవరం మండలం పి.ఎస్.పేట, యలమంచిలి, కశింకోట మండలం తాళ్లపాలెం గ్రామాలకు ఒక్కో బోటను సిద్ధం చేశారు. అలాగే శ్రీకాకుళం జిల్లాకు మరో 10 బోట్లు పంపించారు. నిలిచిపోయిన రవాణా వ్యవస్థ తుపాను కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోనుంది. అతి భారీ వర్షాలు, పెనుగాలులు హెచ్చరికలతో ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. విశాఖ నుంచి నడిచే అన్ని రైళ్లను రద్దు చేశారు. విమాన సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడింది. బస్సు సర్వీసులను కూడా నిలిపివేయాలని నిర్ణయించారు. జాతీయ రహదారి బంద్ అతిభారీ వర్ష సూచనలతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఇచ్చాపురం నుంచి పాయకరావుపేట వరకు శనివారం సాయంత్రం 7 నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు వాహనాలను అనుమతించరు. అత్యవసర వాహనాలు, అంబులెన్సులను మాత్రమే అనుమతిస్తున్నారు. పునరావాస కేంద్రాలకు తరలింపు తీర ప్రాంత, తుపాను ప్రభావిత మండలాల్లో ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అర్బన్‌లో 26, రూరల్‌లో 43 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొన్ని మండలాల్లో ప్రజలు ఈ కేంద్రాలకు వెళ్లడానికి అంగీకరించడం లేదు. దీంతో పోలీసులు వారి బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పంపిస్తున్నారు. అక్కడకు వెళ్లిన వారు సైతం తిరిగి కొంత మంది వెనక్కు వచ్చేస్తుండడం అధికారులకు తలనొప్పిగా మారింది. శనివారం రాత్రికి 40 వేల మందిని తరలించారు. ప్రతి పునరావాస కేంద్రానికి డిప్యూటీ తహశీల్దార్‌ను ఇన్చార్జ్గా నియమించారు. వంటలు చేసి కేంద్రాల్లో ప్రజలకు అందజే స్తున్నారు. సింహాచలం దేవస్థానం వారు 5 వేల ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో స్టాక్ పాయింట్ల వద్ద బియ్యం, పప్పు, గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్, కిరోసిన్‌లను సిద్ధంగా ఉంచారు. -
మిల్లర్ల సంచిలో సర్కారు బియ్యం
►గాడి తప్పిన కస్టమ్ మిల్లింగ్ ►2,47,429 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వని మిల్లర్లు ► ప్రభుత్వ ధర ప్రకారం రూ.408 కోట్ల పైమాటే ►గడువు పొడిగింపునకు పౌరసరఫరాల శాఖ వినతి ముకరంపుర : జిల్లాలో 2013-14 ఖరీఫ్, రబీ సీజన్లో కలిపి ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్), గిరిజన సహకార సంఘాలు (జీసీసీ) ద్వారా ప్రభుత్వ యంత్రాంగం 10,16,312 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. కస్టమ్ మిల్లింగ్ కోసం 600 మంది మిల్లర్లకు అప్పగించింది. 6,89,021 మెట్రిక్ టన్నుల బియ్యం మరపట్టించి రైస్‌మిల్లర్లు ప్రభుత్వానికి అందజేయూల్సి ఉంది. కానీ.. 4,41,595 మెట్రిక్ టన్నులు మాత్రమే అప్పగించారు. ఇంకా 2,47,429 మెట్రిక్ టన్నులు మిల్లర్ల సంచుల్లోనే ఉన్నాయి. వాస్తవానికి ఇప్పటికే సేకరణ పూర్తికావల్సి ఉండగా... జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులేమో మిల్లర్ల నుంచి బియ్యం సేకరణ కోసం మరో రెండు నెలల గడువు కావాలని గురువారం ప్రభుత్వాన్ని కోరడం విశేషం. దాచిన బియ్యం విలువ రూ.408 కోట్లు వరిసాగు విస్తీర్ణం మన జిల్లాలో ఎక్కువ. అన్నదాతలు పండించే ధాన్యం ఆధారంగా అభివృద్ధి చెందాల్సిన రైస్‌మిల్లింగ్ పరిశ్రమ కొందరి లాభపేక్షతో పక్కదారిపడుతోంది. జిల్లాలో ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లు తమ సొంత ఆస్తిగా భావిస్తున్నారు. మూడేళ్లుగా సర్కార్ ధాన్యాన్ని మిల్లర్లు పక్కదారిపట్టిస్తున్నారు. 2013-14 సీజన్లో ప్రభుత్వ సంస్థల ద్వారా సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇచ్చేందుకు ఖరీఫ్‌లో 357 మంది మిల్లర్లకు, రబీలో 253 మంది మిల్లర్లకు ఇచ్చారు. నిబంధనల ప్రకారం రెండు సీజన్లలో కలిపి ధాన్యం తీసుకున్న మిల్లర్లు 6,89,021 టన్నుల బియ్యాన్ని సెప్టెంబర్ 30వ తేదీలోగా పౌర సరఫరాల శాఖకు అప్పగించాలి. మిల్లర్ల జాప్యంపై ఇటీవలే పౌరసరఫరాల కమిషనర్ పార్థసారధి సమీక్షించారు. గడువులోగా బియ్యూన్ని అప్పగించాలని మిల్లర్లను ఆదేశించారు. అరుునా లాభం లేకుండా పోరుుంది. రాజకీయ ఒత్తిడుల నేపథ్యంలో సంబంధిత అధికారులూ వారికే వత్తాసు పలుకుతుండడంతో ఈ ప్రక్రియ మరింత జాప్యం జరుగుతోంది. భారత ఆహార సంస్థ మిల్లర్లకు ఇచ్చే బియ్యం ధర ప్రస్తుతం సగటున క్వింటాల్‌కు రూ.1600 ఉంది. ఈ ధర లెక్కన పరిశీలిస్తే మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వకుండా దాచిపెట్టుకున్న బియ్యం విలువ దాదాపు రూ. 408 కోట్ల పైమాటే. మిల్లర్ల ‘ప్రైవేటు’ వ్యాపారం...:మిల్లర్లు తమ వద్ద దాచుకున్న బియ్యంతో ప్రైవేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపణలున్నారుు. గత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతుల నుంచి కొనుగోలు చేసిన 3.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లర్లకు అప్పగించారు. ఇందులో 2.56 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇప్పటివరకు 2.53 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యూన్ని అప్పగించగా మిగిలిన 3,000 టన్నులు (30 వేల క్వింటాళ్లు) బియ్యాన్ని 10 మంది మిల్లర్లు తమ వద్దే ఉంచుకున్నారు. గత సీజన్లో రైతుల నుంచి 6.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్లకు అప్పగించారు. మిల్లర్లు 4.32 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం 1.94 లక్షల టన్నుల బియ్యాన్ని మాత్రమే అందజేశారు. ఇంకా 272 మంది మిల్లర్లు 2,47,429 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సర్కార్‌కు ఇవ్వలేదు. పౌరసరఫరాల శాఖ రుణం తీసుకుని ధాన్యం కొనుగోలు చేస్తే మిల్లర్లు వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సివిల్సప్లై సంస్థకు వడ్డీ భారం తప్పడంలేదు. -
ఫీ‘జులుం’
=అక్షరాలు నేర్వాలంటే లక్షలు కావాల్సిందే = దరఖాస్తుల విక్రయంతోనే రూ.250 కోట్ల వ్యాపారం = 40 శాతం పెరిగిన ట్యూషన్ ఫీజులు = చోద్యం చూస్తున్న ప్రభుత్వ యంత్రాంగం సాక్షి, సిటీబ్యూరో :‘కొత్త సంవత్సరం’ నగరంలోని విద్యార్థుల తల్లిదండ్రులకు సరి‘కొత్త కష్టాల’ను మోసుకొస్తోంది. ఇప్పటికే నీటిపన్ను, ఆస్తిపన్ను, కరెంటు పన్నుల పెంపు ‘షాక్’తో బేజారవుతున్న జనం నెత్తిన త్వరలో స్కూల్ ఫీజుల బాంబు పేలబోతోంది. ఈ ఏడాది 1 నుంచి 10 వరకు ప్రతి తరగతికి గతేడాది కన్నా 20-40 శాతం ఫీజులు పెంచాలని రికగ్నైజ్డ్ స్కూల్స్ అసోసియేషన్లు నిర్ణయించాయి. ఇప్పటికే పలు కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు తమ స్కూళ్లల్లో ఫీజులను ఇబ్బడి ముబ్బడిగా పెంచేశాయి. విద్యాహక్కు (ఆర్టీఈ) చట్టాన్ని ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా డిసెంబరులోనే అడ్మిషన్స్‌కు తెరతీశాయి. అకడమిక్ ఇయర్ ప్రారంభంలోనే అడ్మిషన్స్ జరపాలని నిబంధనలు ఉన్నప్పటికీ యాజ మాన్యాలు ఖాతరు చేయడం లేదు. నగర శివారులోని కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో నవంబరు నెలాఖరికే అడ్మిషన్లు అయిపోయినట్లు సమాచారం. కార్పొరేట్ పాఠశాలలు ట్యూషన్ ఫీజులతో పాటు డొనేషన్ల పేరిట తల్లిదండ్రుల నుంచి రూ.లక్షలకు లక్షలు గుంజేస్తున్నాయి. దీంతో మధ్యతరగతి వర్గాలే కాదు.. సంపన్న వర్గాల వార్షిక బడ్జెట్ సైతం కుదుపునకు గురవుతోంది. దరఖాస్తు ఫారాలకే రూ.250 కోట్లు నగరంలోని పేరున్న పాఠశాలలు నవంబరు నుంచే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించడంతో.. దరఖాస్తుల అమ్మకాలతో ఇప్పటికే రూ.250 కోట్ల వ్యాపారం జరిగి నట్లు తెలుస్తోంది. వచ్చే విద్యా సంవత్సర ప్రవేశాల కోసం ఈ నెలాఖరుకు అడ్మిషన్లు ముగిస్తున్నామని యాజమాన్యాలు ప్రకటించడంతో అడ్మిషన్ల కోసం తల్లిదండ్రుల్లో మరింత హడావిడి కనిపిస్తోంది. దీంతో తమ నివాసాలకు దగ్గరగా ఉన్న అన్ని పాఠశాలల నుంచి అడ్మిషన్ ఫారాలను కొనుగోలు చేస్తున్నారు. దరఖాస్తు ఫారాలు ఖరీదు రూ.500 నుంచి రూ.1500 (పాఠశాల స్థాయిని బట్టి) పలుకుతుండగా.. ఒక్కొక్కరు కనీసం 10 నుంచి 15 పాఠశాలల్లో అప్లికేషన్లు తీసుకుంటున్నారు. ఈ రూపంలో ఇంకా సీటు రాకుండానే రూ. 7వేల నుంచి రూ.10వేల వరకు ఖర్చవుతోంది. వాస్తవానికి ఏ పాఠశాలలోనైనా దరఖాస్తు ఫారం ధర రూ.110కి మించకూడదని విద్యాహక్కు చట్టం చెబుతోంది. ఆర్టీఈ చట్టం మేరకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయించాలన్న నిబంధనలను కూడా యాజమాన్యాలు గాలికొదిలేశాయి. ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టాలంటూ హైకోర్టు ఏడాది కిందటే ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. అయితే.. నిబంధనల పమలును పర్యవేక్షిం చాల్సిన పాఠశాల విద్యాశాఖ మాత్రం నిద్రపోతోంది. తల్లిదండ్రులు పాసైతేనే... పిల్లవాడికి సీటివ్వాలంటే ముందు తల్లిదండ్రులు తగిన అర్హతలు పొంది ఉండటం తప్పనిసరంటున్నాయి కొన్ని కార్పొరేట్ పాఠశాలలు. తాము నిర్వహించే ప్రవేశ పరీక్షను (ఎంట్రన్స్ టెస్ట్) విద్యార్థి పాసైనప్పటికీ తల్లిదండ్రుల విద్యార్హతలు, ఆర్థిక స్థితిగతులు, నివాస ప్రాంతపు వివరాలను బేరీజు వేశాకే వారి పిల్లలకు కేటాయించేదీ, లేనిదీ చెబుతామంటున్నాయి. అంతేకాదు.. ఆయా పాఠశాలల్లో చేరిన విద్యార్థులు నర్సరీ స్థాయిలోనే ఆప్షనల్స్ కూడా ఎంచుకోవాలట మరి. ఉదాహరణకు పిల్లాడికి చదువుతో పాటు క్రికెట్, వాలీబాల్, టెన్నిస్‌లలో ఒక ఆటను, చిత్రలేఖనం, సంగీతం తదితర అంశాల్లో ఒకదాన్ని ఎంచుకోవాలని నిబంధన పెడుతున్నారు. దీంతో పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలే కాకుండా ఆప్షనల్స్‌కు సంబంధించిన కిట్లను ముందుగానే (పాఠశాలలో ఉన్న దుకాణంలోనే) కొనాల్సి ఉంటుంది. ఒకవేళ వీటన్నింటికీ సరేనన్నా.. బిల్డింగ్ ఫండ్ కింద డొనేషన్ ఎంత కట్టగలరనే అంశంతోనే సీటు ఖరారవుతుందనేది సుస్పష్టం. అక్రమార్జనకు కళ్లెం ఏదీ? చట్టాలు, నియమాలు, నిబంధనలు అన్నీ ఉన్నాయి. కొరవడిందల్లా విద్యాశాఖ అధికారుల్లో చిత్తశుద్ధే. అధికారుల పర్యవేక్షణ కరువైన కారణంగా ప్రైవేటు యాజమాన్యాల అక్రమార్జనకు అంతుపంతూ లేకుండా పోయింది. కేవలం దరఖాస్తుల అమ్మకాల ద్వారానే (లక్షలు ఆర్జిస్తూ) తమ పరిపాలనా ఖర్చును రాబట్టుకుంటున్నాయి. ఇక డొనేషన్లు, అధిక ఫీజుల సంగతి సరేసరి. విద్యాహక్కు చట్టం ప్రకారం అడ్మిషన్ టెస్ట్‌లు నిర్వహించడం నేరం. ప్రైవేటు యాజ మాన్యాల అడ్డగోలు వ్యవహారాలపై తల్లిదండ్రుల సంఘాలు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. - రమణకుమార్, హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి మార్గదర్శకాలు అందాక.. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ విషయమై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందితే ఆ మేరకు చర్యలు చేపడతాం. ఇక అడ్మిషన్ల విషయానికి వస్తే.. ఏ పాఠశాైలైనా విద్యా సంవత్సరం ప్రారంభంలో మాత్రమే అడ్మిషన్స్ ప్రక్రియను చేపట్టాలి. నవంబరు, డిసెంబరుల్లో అడ్మిషన్లు అయిపోయాయనడం నిబంధనలను ఉల్లంఘించడమే. రాత పూర్వకంగా ఏవరైనా ఫిర్యాదు చేస్తే అక్రమాలకు పాల్పడిన పాఠశాలలపై చర్యలు తీసుకుంటాం. - వీఎన్ మస్తానయ్య, హైదరాబాద్ ఆర్జేడీ పెంచక తప్పదు..! ప్రాపర్టీ ట్యాక్స్, నీటి పన్నులు, విద్యుత్ చార్జీలు విపరీంతంగా పెరిగాయి. అంతేకాదు.. అమాంతం పెరిగిన నిత్యావసరాల ధరల కారణంగా, పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల వేతనాలను కూడా పెంచాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలలు మనుగడ సాగించాలంటే ఫీజుల పెంపు తప్పనిసరి. ఇంటర్నేషల్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్‌లో జరుగుతున్న దోపిడీని చూపిస్తూ, సాధారణ పాఠశాలలపై చర్యలకు ఉపక్రమించడం అధికారులకు భావ్యం కాదు. -కె. ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి, రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ -
ఉద్యమం ఉగ్రరూపం
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర కాంక్షిస్తూ ప్రజానీకం చేస్తున్న ఉద్యమం రోజు రోజుకీ మహోగ్రరూపం దాలుస్తోంది. ఈ పోరులో తుది గెలుపు సాధించే వరకూ విశ్రమించే లేదని ఉద్యమ వీరులు సైనికుల్లా సాగుతున్నారు. ప్రభుత్వ పాలనతో పాటు ప్రజా జీవనం కూడా స్తంభించే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వచ్చి తమ నిరసనలు వ్యక్తం చేస్తూ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. ఆందోళనలు, నిరసనలతో ఇప్పటికే జిల్లా హోరెత్తుతుంటే తాజాగా ఏపీఎన్జీవోలు మరింత ఉధృతానికి నిర్ణయించారు. ఈ నెల19న అన్ని ఉద్యోగ సంఘాలతో దాదాపుగా 10 వేల మందితో మహా ర్యాలీకి సిద్ధమవుతున్నారు. ఈ నెల 24 నుంచి 31 వరకు రిలే నిరాహారదీక్షలు చేయనున్నారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది విధులను బహిష్కరించారు. తాజాగా విద్యుత్ ఉద్యోగులు కూడా వచ్చే నెల 2 తరువాత ఏ క్షణానైనా సమ్మెకు వెళ్లే అవకాశముంది. వారు సమ్మెకు దిగితే జిల్లా అంధకారంలోకి వెళ్లిపోనుంది. విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది. మరోవైపు ఎంసెట్ కౌన్సింగ్పై కూడా ఈ సమ్మె ప్రభావం చూపుతోంది. ఇప్పటికే కౌన్సెలింగ్ ప్రక్రియకు జాప్యం జరిగింది. తాజాగా కౌన్సెలింగ్‌కు మార్గం సుగమమైనప్పటికీ విద్యార్థులకు ధ్రువపత్రాలు మంజూరు చేసే తహశీల్దార్ కార్యాలయాలు మూతపడ్డాయి. సబ్బవరంలో విద్యార్థులు శనివారం భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మూడురోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మకు దహన సంస్కారాలు చేపట్టారు. ఉద్యమానికి సంఘీభావంగా పాయకరావుపేటలో ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు, కార్మికులు, తుని ఆర్టీసీ డిపో ఉద్యోగులు బస్సులతో భారీ ర్యాలీతో వినూత్న రీతిలో నిరసన తెలిపారు.