ఫీ‘జులుం’
=అక్షరాలు నేర్వాలంటే లక్షలు కావాల్సిందే
= దరఖాస్తుల విక్రయంతోనే రూ.250 కోట్ల వ్యాపారం
= 40 శాతం పెరిగిన ట్యూషన్ ఫీజులు
= చోద్యం చూస్తున్న ప్రభుత్వ యంత్రాంగం
సాక్షి, సిటీబ్యూరో :‘కొత్త సంవత్సరం’ నగరంలోని విద్యార్థుల తల్లిదండ్రులకు సరి‘కొత్త కష్టాల’ను మోసుకొస్తోంది. ఇప్పటికే నీటిపన్ను, ఆస్తిపన్ను, కరెంటు పన్నుల పెంపు ‘షాక్’తో బేజారవుతున్న జనం నెత్తిన త్వరలో స్కూల్ ఫీజుల బాంబు పేలబోతోంది. ఈ ఏడాది 1 నుంచి 10 వరకు ప్రతి తరగతికి గతేడాది కన్నా 20-40 శాతం ఫీజులు పెంచాలని రికగ్నైజ్డ్ స్కూల్స్ అసోసియేషన్లు నిర్ణయించాయి. ఇప్పటికే పలు కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు తమ స్కూళ్లల్లో ఫీజులను ఇబ్బడి ముబ్బడిగా పెంచేశాయి.
విద్యాహక్కు (ఆర్టీఈ) చట్టాన్ని ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా డిసెంబరులోనే అడ్మిషన్స్‌కు తెరతీశాయి. అకడమిక్ ఇయర్ ప్రారంభంలోనే అడ్మిషన్స్ జరపాలని నిబంధనలు ఉన్నప్పటికీ యాజ మాన్యాలు ఖాతరు చేయడం లేదు. నగర శివారులోని కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో నవంబరు నెలాఖరికే అడ్మిషన్లు అయిపోయినట్లు సమాచారం. కార్పొరేట్ పాఠశాలలు ట్యూషన్ ఫీజులతో పాటు డొనేషన్ల పేరిట తల్లిదండ్రుల నుంచి రూ.లక్షలకు లక్షలు గుంజేస్తున్నాయి. దీంతో మధ్యతరగతి వర్గాలే కాదు.. సంపన్న వర్గాల వార్షిక బడ్జెట్ సైతం కుదుపునకు గురవుతోంది.
దరఖాస్తు ఫారాలకే రూ.250 కోట్లు
నగరంలోని పేరున్న పాఠశాలలు నవంబరు నుంచే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించడంతో.. దరఖాస్తుల అమ్మకాలతో ఇప్పటికే రూ.250 కోట్ల వ్యాపారం జరిగి నట్లు తెలుస్తోంది. వచ్చే విద్యా సంవత్సర ప్రవేశాల కోసం ఈ నెలాఖరుకు అడ్మిషన్లు ముగిస్తున్నామని యాజమాన్యాలు ప్రకటించడంతో అడ్మిషన్ల కోసం తల్లిదండ్రుల్లో మరింత హడావిడి కనిపిస్తోంది. దీంతో తమ నివాసాలకు దగ్గరగా ఉన్న అన్ని పాఠశాలల నుంచి అడ్మిషన్ ఫారాలను కొనుగోలు చేస్తున్నారు. దరఖాస్తు ఫారాలు ఖరీదు రూ.500 నుంచి రూ.1500 (పాఠశాల స్థాయిని బట్టి) పలుకుతుండగా.. ఒక్కొక్కరు కనీసం 10 నుంచి 15 పాఠశాలల్లో అప్లికేషన్లు తీసుకుంటున్నారు.
ఈ రూపంలో ఇంకా సీటు రాకుండానే రూ. 7వేల నుంచి రూ.10వేల వరకు ఖర్చవుతోంది. వాస్తవానికి ఏ పాఠశాలలోనైనా దరఖాస్తు ఫారం ధర రూ.110కి మించకూడదని విద్యాహక్కు చట్టం చెబుతోంది. ఆర్టీఈ చట్టం మేరకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయించాలన్న నిబంధనలను కూడా యాజమాన్యాలు గాలికొదిలేశాయి. ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టాలంటూ హైకోర్టు ఏడాది కిందటే ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. అయితే.. నిబంధనల పమలును పర్యవేక్షిం చాల్సిన పాఠశాల విద్యాశాఖ మాత్రం నిద్రపోతోంది.
తల్లిదండ్రులు పాసైతేనే...
పిల్లవాడికి సీటివ్వాలంటే ముందు తల్లిదండ్రులు తగిన అర్హతలు పొంది ఉండటం తప్పనిసరంటున్నాయి కొన్ని కార్పొరేట్ పాఠశాలలు. తాము నిర్వహించే ప్రవేశ పరీక్షను (ఎంట్రన్స్ టెస్ట్) విద్యార్థి పాసైనప్పటికీ తల్లిదండ్రుల విద్యార్హతలు, ఆర్థిక స్థితిగతులు, నివాస ప్రాంతపు వివరాలను బేరీజు వేశాకే వారి పిల్లలకు కేటాయించేదీ, లేనిదీ చెబుతామంటున్నాయి. అంతేకాదు.. ఆయా పాఠశాలల్లో చేరిన విద్యార్థులు నర్సరీ స్థాయిలోనే ఆప్షనల్స్ కూడా ఎంచుకోవాలట మరి. ఉదాహరణకు పిల్లాడికి చదువుతో పాటు క్రికెట్, వాలీబాల్, టెన్నిస్‌లలో ఒక ఆటను, చిత్రలేఖనం, సంగీతం తదితర అంశాల్లో ఒకదాన్ని ఎంచుకోవాలని నిబంధన పెడుతున్నారు. దీంతో పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలే కాకుండా ఆప్షనల్స్‌కు సంబంధించిన కిట్లను ముందుగానే (పాఠశాలలో ఉన్న దుకాణంలోనే) కొనాల్సి ఉంటుంది. ఒకవేళ వీటన్నింటికీ సరేనన్నా.. బిల్డింగ్ ఫండ్ కింద డొనేషన్ ఎంత కట్టగలరనే అంశంతోనే సీటు ఖరారవుతుందనేది సుస్పష్టం.
అక్రమార్జనకు కళ్లెం ఏదీ?
చట్టాలు, నియమాలు, నిబంధనలు అన్నీ ఉన్నాయి. కొరవడిందల్లా విద్యాశాఖ అధికారుల్లో చిత్తశుద్ధే. అధికారుల పర్యవేక్షణ కరువైన కారణంగా ప్రైవేటు యాజమాన్యాల అక్రమార్జనకు అంతుపంతూ లేకుండా పోయింది. కేవలం దరఖాస్తుల అమ్మకాల ద్వారానే (లక్షలు ఆర్జిస్తూ) తమ పరిపాలనా ఖర్చును రాబట్టుకుంటున్నాయి. ఇక డొనేషన్లు, అధిక ఫీజుల సంగతి సరేసరి. విద్యాహక్కు చట్టం ప్రకారం అడ్మిషన్ టెస్ట్‌లు నిర్వహించడం నేరం. ప్రైవేటు యాజ మాన్యాల అడ్డగోలు వ్యవహారాలపై తల్లిదండ్రుల సంఘాలు పోరాడినా ఫలితం లేకుండా పోయింది.
- రమణకుమార్, హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి
మార్గదర్శకాలు అందాక..
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ విషయమై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందితే ఆ మేరకు చర్యలు చేపడతాం. ఇక అడ్మిషన్ల విషయానికి వస్తే.. ఏ పాఠశాైలైనా విద్యా సంవత్సరం ప్రారంభంలో మాత్రమే అడ్మిషన్స్ ప్రక్రియను చేపట్టాలి. నవంబరు, డిసెంబరుల్లో అడ్మిషన్లు అయిపోయాయనడం నిబంధనలను ఉల్లంఘించడమే. రాత పూర్వకంగా ఏవరైనా ఫిర్యాదు చేస్తే అక్రమాలకు పాల్పడిన పాఠశాలలపై చర్యలు తీసుకుంటాం.
- వీఎన్ మస్తానయ్య, హైదరాబాద్ ఆర్జేడీ
పెంచక తప్పదు..!
ప్రాపర్టీ ట్యాక్స్, నీటి పన్నులు, విద్యుత్ చార్జీలు విపరీంతంగా పెరిగాయి. అంతేకాదు.. అమాంతం పెరిగిన నిత్యావసరాల ధరల కారణంగా, పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ల వేతనాలను కూడా పెంచాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలలు మనుగడ సాగించాలంటే ఫీజుల పెంపు తప్పనిసరి. ఇంటర్నేషల్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్‌లో జరుగుతున్న దోపిడీని చూపిస్తూ, సాధారణ పాఠశాలలపై చర్యలకు ఉపక్రమించడం అధికారులకు భావ్యం కాదు.
-కె. ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి, రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్