గృహజ్యోతి లబి్ధదారులతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సీతక్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి, కోమటిరెడ్డి, కొండా సురేఖ, స్పీకర్ ప్రసాద్‌కుమార్, సీఎస్ శాంతికుమారి తదితరులు
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేసి తీరుతాం: సీఎం
6 గ్యారంటీల వల్లే కాంగ్రెస్ గెలుపు..సవాళ్లెదురైనా హామీలు నెరవేరుస్తాం
అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణను తీర్చిదిద్దుతాం
ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి ఉచిత విద్యుత్: డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా ఎన్నికల సమయంలో అభయహస్తం కింద ఇచ్చిన హామీలు అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని శంకించవద్దని అన్నారు. ఆర్థిక నియంత్రణ పాటిస్తూ, దుబారా ఖర్చులు తగ్గించుకుని సంక్షేమ పథకాలను ఆర్థిక వెసులు బాటు మేరకు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం సచివాలయంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తదితరులతో కలిసి సీఎం ప్రారంభించిన అనంతరం రేవంత్ మాట్లాడారు.
సంక్షేమ పథకాలు ఆపం
‘డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. ఇప్పుడు మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తున్నాం. తెలంగాణ ఇచ్చిన విధంగానే, 2023 సెపె్టంబర్ 17న సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించారు. ఈ ఆరు గ్యారంటీల వల్లే అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. అందువల్ల ఆర్థికంగా ఎన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం.
కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగతో మహిళల జీవితాలు దుర్భరంగా ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం దీపం పథకం తెచ్చింది. అప్పుడు రూ.400 ఉన్న సిలిండర్‌ను మోదీ ప్రధాని అయ్యాక రూ.1200కు పెంచారు. అలా ధర పెరిగిన సిలిండర్‌పై రాయితీ ఇవ్వాలన్న ఆలోచన కేసీఆర్ ప్రభుత్వం చేయలేదు. కానీ ఎన్నికల సందర్భంగా మేం ఈ హామీ ఇచ్చాం. ఆ మేరకు లక్ష మంది మహిళల సమక్షంలో ఈ పథకాన్ని ప్రారంభించాలనుకున్నాం. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అడ్డు రావడంతో సచివాలయంలోనే ప్రారంభిస్తున్నాం. ఇతర సంక్షేమ పథకాలు కూడా అపం. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశానికే రోల్‌మోడల్‌గా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దుతాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు.
ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు: భట్టి
‘గత ప్రభుత్వానికి అధికారం అప్పగించే సమయానికి తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉంది. కానీ గత పదేళ్లలో అప్పుల కుప్పగా మార్చారు. ఉద్యోగులకు వేతనాలు కూడా అప్పులు తెచ్చి చెల్లించేవారు. ప్రస్తుతం ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారని దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది. కాంగ్రెస్ హమీలు అమలు సాధ్యం కానివంటూ బీఆర్‌ఎస్ దుష్ప్రచారం చేస్తోంది. కానీ మేం హామీలన్నీ కచ్చితంగా అమలు చేసి చూపిస్తాం.
అర్హత ఉన్న వారందరికీ మార్చిలో వచ్చే విద్యుత్ బిల్లు జీరో (200 యూనిట్లలోపు వినియోగిస్తే) బిల్లుగా వస్తుంది. ఇందులో ఎలాంటి ఆంక్షలూ లేవు. అయితే వారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలి. అర్హత ఉండి దరఖాస్తు చేసుకోని వారు ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తాం..’అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారందరికీ రూ.500 కే సిలిండర్: ఉత్తమ్
‘ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని, తెల్లరేషన్ కార్డు ఉన్నవారందరికీ రూ.500 సిలిండర్ అందిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఆయిల్ కంపెనీలకు ముందస్తుగా డబ్బు చెల్లిస్తామని, వారు ఆ తర్వాత లబ్ధిదారుల అకౌంట్లలో వేస్తారని తెలిపారు. మూడేళ్ల సగటు వినియోగం ఆధారంగా ఒక్కో సిలిండర్‌ను రూ.500కు ఇస్తామని వివరించారు. త్వరలోనే కేవలం రూ.500 చెల్లిస్తే.. గ్యాస్ సిలిండర్ అందించేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు.
ఎల్‌పీజీ కనెక్షన్ యాక్టివ్‌గా ఉండాలి
రూ.500కే సిలిండర్ పొందాలంటే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలి. తెల్ల రేషన్‌కార్డు ఉండాలి. మూడేళ్ల సగటు వినియోగం ఆధారంగా రూ.500కు సిలిండర్లు అందజేస్తారు. దరఖాస్తు చేసుకున్న వారి పేరిట ఎల్‌పీజీ కనెక్షన్ యాక్టివ్‌గా (కనెక్షన్ వినియోగంలో ఉండాలి) ఉండాలి. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.
ఒక సర్వీస్ కనెక్షన్‌కే వర్తింపు
200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందడానికి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలి. తెల్ల రేషన్‌కార్డు కలిగి, ఆధార్‌కార్డు విద్యుత్ సర్వీసు కనెక్షన్‌తో అనుసంధానమై ఉండాలి. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించిన వారికి జీరో బిల్లు వస్తుంది. రేషన్‌కార్డులోని యజమాని పేరు ఉన్న విధంగా ఈ పథకం కోసం విద్యుత్ సర్వీసు కనెక్షన్ పేరును డిస్కమ్‌లు మార్చవు. అలాంటి సర్వీసు ఉన్న వారికి యథావిధిగా బిల్లులు వస్తాయి. ఈ పథకం కింద విద్యుత్‌ను వాణిజ్య అవసరాలకు వాడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటారు.
గృహజ్యోతి పథకం పొందడానికి అన్ని అర్హతలున్నా.. ప్రస్తుత పద్ధతిలోనే విద్యుత్ బిల్లు వస్తే..ఎంపీడీవో/మునిసిపల్ కార్యాలయాన్ని సందర్శించి తెల్ల రేషన్‌కార్డు, విద్యుత్ కనెక్షన్ సర్వీసు నంబర్ (యూనిక్ సర్వీస్ కనెక్షన్)తో అనుసంధానమైన ఆధార్ కార్డును జోడించి దరఖాస్తు ఇవ్వాలి. వినియోగదారులు ఎంపీడీవో/మునిసిపల్ కార్యాలయం లేదా ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తు అక్‌నాలెడ్జ్‌మెంట్‌ను చూపిస్తే చాలు..వారి దగ్గర నుంచి బిల్లును బలవంతంగా వసూలు చేయడం జరగదు. ఈ మేరకు ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment