white ration card
-
డెంగీకి రూ. 2 లక్షలు!
సాక్షి, హైదరాబాద్: కొన్నాళ్ల క్రితం వరకు కరోనా బాధితులను పీల్చిపిప్పి చేసిన అనేక ప్రైవేట్ ఆసుపత్రులు... ఇప్పుడు డెంగీ రోగులను దోచుకుంటున్నాయి. ప్లేట్లెట్లు అవసరం లేకపోయినా ఎక్కిస్తూ డబ్బులు గుంజుతున్నాయి. ప్లేట్లెట్ సంఖ్యను కూడా తప్పుగా చూపిస్తూ బాధితులను ఏమార్చుతున్నాయి. దీంతో బాధితులు అప్పుసప్పూ చేసి అడిగినంత ఫీజులు చెల్లిస్తున్నారు. ఇంత జరుగుతున్నా వైద్య ఆరోగ్యశాఖ మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. ప్రైవేట్ ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని గతంలో వాట్సాప్ నంబర్ ఇచ్చారు. కానీ ఇప్పుడు అలాంటి చర్యలేమీ చేపట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ కింద డెంగీ, చికున్‌గున్యా వంటి వాటికి తెల్ల రేషన్‌కార్డుదారులకు, ఆరోగ్యశ్రీ కార్డుదారులకు ఉచిత వైద్యం అందించాలి. కానీ ప్రభుత్వం దాన్ని కేవలం సర్కారు ఆసుపత్రులకే పరిమితం చేసింది. దీనివల్ల బాధితులకు ఎలాంటి ప్రయోజనం ఉండట్లేదు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోని డెంగీ, చికున్‌గున్యా కేసులకు ఆరోగ్యశ్రీని వర్తింపచేయకపోవడం వల్ల బాధితులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ డెంగీకి ఆరోగ్యశ్రీని వర్తింప చేయొచ్చని, అది తమ చేతుల్లో లేదని ఆరోగ్యశ్రీ వర్గాలు చెప్పాయి. హడలిపోతున్న జనం రాష్ట్రంలో సాధారణ జ్వరం వస్తేనే ప్రజలు హడలి పోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జ్వరం రాగానే డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, టైఫాయిడ్ పరీక్షలన్నీ చేయించుకుంటున్నారు. ఈసారి అత్యధికంగా కేసులు నమోదవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరించిన సంగతి తెలిసిందే. వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 3,357 డెంగీ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 1,276 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత అధికంగా మేడ్చల్ జిల్లాలో 312, ఖమ్మం జిల్లాలో 305 డెంగీ కేసులు రికార్డు అయ్యాయి. అనేక ప్రైవేటు ఆసుపత్రులు 50 వేలకు పైగా ప్లేట్లెట్లు ఉన్నా ఐసీయూలో ఉంచి అదనంగా ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. నాలు గైదు రోజులు ఉంచుకొని రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు కూడా ఫీజులు వసూలు చేసిన ఉదంతాలున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా చికున్‌గున్యా కేసులు 75, మలేరియా కేసులు 175 నమోదయ్యాయి. ఆయా జిల్లాల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో నమోదయ్యే డెంగీ, చికున్ గున్యా కేసుల వివరాలను సంబంధిత యాజమాన్యాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు పంపడం లేదు. మరోవైపు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఆదిలాబాద్ ప్రాంతంలో జికా వైరస్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. వివిధ జిల్లాల్లో పరిస్థితి ఇలా... ⇒ హైదరాబాద్ పరిధిలోని ఆసుపత్రులపై పేషెంట్ల లోడ్ పెరిగింది. ఇన్పేòట్లలోనూ 20 శాతం పెరిగారని డాక్టర్లు చెబుతున్నారు. గాం«దీ, ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్ ఆసుపత్రులకు రద్దీ ఎక్కువైంది. ⇒ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో వైద్యుల కొరత పట్టిపీడిస్తోంది. ఆదిలాబాద్, ఉట్నూరు, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో వైద్యులు పని చేసేందుకు విముఖత చూపుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రుల్లో 44 మంది వైద్యులకుగాను 24 మందే ఉన్నారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో పది మంది వైద్యులు ఉండాల్సిన చోట ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. ఆ వైద్యుడు సైతం డిప్యూటేషన్‌పై ఉన్నారు. ⇒ కరీంనగర్ జిల్లాలో జూలై మొదటి వారం నుంచే ఇంటింటి జ్వర సర్వే చేస్తున్నారు. 7,24,135 మందిని సర్వే చేశారు. ఇందులో 3,711 మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ⇒ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ ఏడాది 115 డెంగీ కేసులు నమోదయ్యాయి. 25 చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి. ⇒ ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్లు కూడా సరిపోని పరిస్థితి. డెంగీ, మలేరియా, చికున్‌గున్యా కేసులతో ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే బాధితులను యాజమాన్యాలు దోపిడీ చేస్తున్నాయి. చిన్న పిల్లలైతే రోజుకు రూ.5 వేల నుంచి 10 వేల వరకు, పెద్దలకు రోజుకు రూ.10 వేలకు పైగా వసూలు చేస్తున్నారు. ⇒ సిరిసిల్ల జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో డెంగీ చికిత్సకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. సీరియస్ కేసుల్లోనే అధిక ఫీజుగతేడాది కంటే డెంగీ, చికున్‌గున్యా వంటి వైరల్ జ్వరాలు పెరిగాయి. దీంతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య కూడా ఆ స్థాయిలోనే ఉంటోంది. డెంగీలో ప్లేట్లెట్లు పడిపోయినప్పుడు వాటిని ఎక్కించాల్సి ఉంటుంది. అలాగే డెంగీ సీరియస్‌గా మారి ఇతర అవయవాలపై ప్రభావం చూపినప్పుడు వైద్యం చేయాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మాత్రమే అధిక ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.. అంతే తప్ప సాధారణ డెంగీకి సాధారణ ఫీజే చెల్లిస్తే సరిపోతుంది. ప్లేట్లెట్ కౌంట్ 30 వేల కంటే తక్కువైతేనే వాటిని ఎక్కించాల్సి ఉంటుంది. – డాక్టర్ కృష్ణ ప్రభాకర్, టీఎక్స్ ఆసుపత్రి, హైదరాబాద్ -
దరఖాస్తులు 66.30 లక్షలు.. కట్టేవి 4.16 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారనుంది. ఈ పథకం కింద ప్రస్తుత సంవత్సరం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే జరిగితే రాష్ట్రవ్యాప్తంగా 4.16 లక్షల ఇళ్లను నిర్మిస్తారు. కానీ ఇళ్ల కోసం ప్రజలు సమర్పించిన దరఖాస్తులు పేరుకుపోయి ఉన్నాయి. ఏకంగా 66.30 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. భారీ కోత ఎలా? రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధి కోసం కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు వచ్చిపడ్డాయి. రకరకాల పథకాలకు దరఖాస్తు చేసిన ప్రజలు ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కూడా టిక్ చేశారు. ఈ విధంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన మొత్తం దరఖాస్తులు ఏకంగా 80 లక్షలు దాటాయి. వాటిని ప్రాథమికంగా పరిశీలించిన అధికారులు, గతంలో ఇందిరమ్మ ఇళ్లు పొందిన 14.75 లక్షల మంది కూడా మళ్లీ దరఖాస్తు చేసినట్టు గుర్తించారు. దీంతో మొదటి వడపోతలో భాగంగా ఆ దరఖాస్తులను పక్కన పెట్టేశారు. దీంతో 66.30 లక్షల దరఖాస్తులు మిగిలాయి. వాటి నుంచి లబ్ధిదారుల ఎంపిక ఎలా అన్న ఆందోళన అధికారుల్లో నెలకొంది. మొదటి ఏడాదిలో 4.16 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి సంవత్సరం ఎలాంటి ఆటంకాలు లేకుండా మంజూరు చేస్తూ వెళ్లినా, వచ్చే ఐదేళ్లలో అటుఇటుగా 20 లక్షల ఇళ్లను మాత్రమే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇవి ఏమూలకూ చాలవు. దీంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదముందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తులను రకరకాల అంశాల ఆధారంగా వడపోసి వీలైనంత మేర తగ్గించే కసరత్తు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇల్లు లేని నిరుపేదలు 30 – 35 లక్షల మంది ఉంటారన్న అంచనా ఉంది. ఒకవేళ దీన్ని పరిగణనలోకి తీసుకుని తగ్గించినా.. దరఖాస్తుల్లో ఆ సంఖ్య మేరకు పోను మిగిలినవారు అంటే సుమారు 30 లక్షల మంది తప్పకుండా అనర్హులే అవుతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్సీసీ కప్పు ఉంటే ఔటే.. ప్రాథమికంగా రూపొందించుకున్న నిబంధనల ప్రకారం.. ఆర్సీసీ పైకప్పు ఉన్న సొంత ఇల్లు ఉంటే ఇందిరమ్మ పథకానికి అర్హత ఉండదు. చుట్టూ కాంక్రీట్ గోడలు ఉండి, కప్పు భాగంలో రేకులు, తడకలు, పెంకులు లాంటివి ఉంటే అర్హత వస్తుంది. దీంతో ఇప్పుడు గుట్టలాగా పేరుకుపోయి ఉన్న దరఖాస్తుల్లో.. అలా ఆర్సీసీ పైకప్పుతో ఉన్న సొంతింటిదారులు ఎవరున్నారని వెతికి పట్టుకునే పనిలో అధికారులున్నారు. తెల్ల రేషన్‌కార్డు ఉంటేనే.. ఇందిరమ్మ ఇల్లు పొందాలంటే కచ్చితంగా నిరుపేదలై ఉండాలి. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారినే ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. దీంతో ఈ దరఖాస్తుదారుల్లో ఎంతమందికి తెల్ల రేషన్ కార్డు ఉందో, ఎంతమంది తప్పుడు రేషన్‌కార్డు నంబర్లు నమోదు చేశారో అన్న వివరాలను కూడా వాకబు చేస్తున్నారు. ఈ సంవత్సరం సొంత జాగా ఉన్నవారికే! సొంత జాగా ఉన్నవారికే ఈ సంవత్సరం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. సొంత జాగా లేని అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం స్థలం కేటాయించి మరీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా మొదటి సంవత్సరం మాత్రం సొంత జాగా లేని వారిని పరిగణనలోకి తీసుకోకూడదని నిర్ణయించినట్లు సమాచారం. -
200 యూనిట్ల ఫ్రీ విద్యుత్, రూ.500కు సిలిండర్ షురూ.. 'పథకాలు ఆగవు'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా ఎన్నికల సమయంలో అభయహస్తం కింద ఇచ్చిన హామీలు అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని శంకించవద్దని అన్నారు. ఆర్థిక నియంత్రణ పాటిస్తూ, దుబారా ఖర్చులు తగ్గించుకుని సంక్షేమ పథకాలను ఆర్థిక వెసులు బాటు మేరకు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం సచివాలయంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తదితరులతో కలిసి సీఎం ప్రారంభించిన అనంతరం రేవంత్ మాట్లాడారు. సంక్షేమ పథకాలు ఆపం ‘డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. ఇప్పుడు మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తున్నాం. తెలంగాణ ఇచ్చిన విధంగానే, 2023 సెపె్టంబర్ 17న సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించారు. ఈ ఆరు గ్యారంటీల వల్లే అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. అందువల్ల ఆర్థికంగా ఎన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం. కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగతో మహిళల జీవితాలు దుర్భరంగా ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం దీపం పథకం తెచ్చింది. అప్పుడు రూ.400 ఉన్న సిలిండర్‌ను మోదీ ప్రధాని అయ్యాక రూ.1200కు పెంచారు. అలా ధర పెరిగిన సిలిండర్‌పై రాయితీ ఇవ్వాలన్న ఆలోచన కేసీఆర్ ప్రభుత్వం చేయలేదు. కానీ ఎన్నికల సందర్భంగా మేం ఈ హామీ ఇచ్చాం. ఆ మేరకు లక్ష మంది మహిళల సమక్షంలో ఈ పథకాన్ని ప్రారంభించాలనుకున్నాం. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అడ్డు రావడంతో సచివాలయంలోనే ప్రారంభిస్తున్నాం. ఇతర సంక్షేమ పథకాలు కూడా అపం. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశానికే రోల్‌మోడల్‌గా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దుతాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు: భట్టి ‘గత ప్రభుత్వానికి అధికారం అప్పగించే సమయానికి తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉంది. కానీ గత పదేళ్లలో అప్పుల కుప్పగా మార్చారు. ఉద్యోగులకు వేతనాలు కూడా అప్పులు తెచ్చి చెల్లించేవారు. ప్రస్తుతం ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారని దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది. కాంగ్రెస్ హమీలు అమలు సాధ్యం కానివంటూ బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోంది. కానీ మేం హామీలన్నీ కచ్చితంగా అమలు చేసి చూపిస్తాం. అర్హత ఉన్న వారందరికీ మార్చిలో వచ్చే విద్యుత్ బిల్లు జీరో (200 యూనిట్లలోపు వినియోగిస్తే) బిల్లుగా వస్తుంది. ఇందులో ఎలాంటి ఆంక్షలూ లేవు. అయితే వారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలి. అర్హత ఉండి దరఖాస్తు చేసుకోని వారు ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తాం..’అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారందరికీ రూ.500 కే సిలిండర్: ఉత్తమ్ ‘ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని, తెల్లరేషన్ కార్డు ఉన్నవారందరికీ రూ.500 సిలిండర్ అందిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఆయిల్ కంపెనీలకు ముందస్తుగా డబ్బు చెల్లిస్తామని, వారు ఆ తర్వాత లబ్ధిదారుల అకౌంట్లలో వేస్తారని తెలిపారు. మూడేళ్ల సగటు వినియోగం ఆధారంగా ఒక్కో సిలిండర్‌ను రూ.500కు ఇస్తామని వివరించారు. త్వరలోనే కేవలం రూ.500 చెల్లిస్తే.. గ్యాస్ సిలిండర్ అందించేందుకు యత్నిస్తున్నామని చెప్పారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, సీతక్క, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు. ఎల్పీజీ కనెక్షన్ యాక్టివ్‌గా ఉండాలి రూ.500కే సిలిండర్ పొందాలంటే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలి. తెల్ల రేషన్‌కార్డు ఉండాలి. మూడేళ్ల సగటు వినియోగం ఆధారంగా రూ.500కు సిలిండర్లు అందజేస్తారు. దరఖాస్తు చేసుకున్న వారి పేరిట ఎల్పీజీ కనెక్షన్ యాక్టివ్‌గా (కనెక్షన్ వినియోగంలో ఉండాలి) ఉండాలి. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక సర్వీస్ కనెక్షన్‌కే వర్తింపు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందడానికి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలి. తెల్ల రేషన్‌కార్డు కలిగి, ఆధార్‌కార్డు విద్యుత్ సర్వీసు కనెక్షన్‌తో అనుసంధానమై ఉండాలి. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించిన వారికి జీరో బిల్లు వస్తుంది. రేషన్‌కార్డులోని యజమాని పేరు ఉన్న విధంగా ఈ పథకం కోసం విద్యుత్ సర్వీసు కనెక్షన్ పేరును డిస్కమ్‌లు మార్చవు. అలాంటి సర్వీసు ఉన్న వారికి యథావిధిగా బిల్లులు వస్తాయి. ఈ పథకం కింద విద్యుత్‌ను వాణిజ్య అవసరాలకు వాడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటారు. గృహజ్యోతి పథకం పొందడానికి అన్ని అర్హతలున్నా.. ప్రస్తుత పద్ధతిలోనే విద్యుత్ బిల్లు వస్తే..ఎంపీడీవో/మునిసిపల్ కార్యాలయాన్ని సందర్శించి తెల్ల రేషన్‌కార్డు, విద్యుత్ కనెక్షన్ సర్వీసు నంబర్ (యూనిక్ సర్వీస్ కనెక్షన్)తో అనుసంధానమైన ఆధార్ కార్డును జోడించి దరఖాస్తు ఇవ్వాలి. వినియోగదారులు ఎంపీడీవో/మునిసిపల్ కార్యాలయం లేదా ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తు అక్నాలెడ్జ్మెంట్ను చూపిస్తే చాలు..వారి దగ్గర నుంచి బిల్లును బలవంతంగా వసూలు చేయడం జరగదు. ఈ మేరకు ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
గృహలక్ష్మీ: సిలిండర్‌కు పూర్తి డబ్బులు చెల్లించాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినప్పుడు ఆ మొత్తాన్ని వినియోగదారుల ఖాతాల్లో జమ చేసిన విధంగానే గృహలక్ష్మి పథకం(రూ.500కే గ్యాస్ సిలిండర్) కింద ఎంపికైన లబ్ధిదారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పద్ధతిలో రీయింబర్స్ చేయనుంది. లబ్ధిదారులకు ఇచ్చే సబ్సిడీని లెక్క కట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ)లకు అందజేస్తే, సిలిండర్ రీఫిల్ సమయంలో లబ్ధిదారులు డబ్బులు మొత్తం చెల్లించిన తర్వాత.. ఆయిల్ కంపెనీలు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా డేటాబేస్ ప్రకారం రూ.500 పోను మిగిలిన మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాయి. అలాగే తెల్ల రేషన్‌కార్డు ఉండి, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. దీనికి నిబంధనలతో కూడిన మార్గదర్శకాలను ఖరారు చేసింది. దీని ఆధారంగా లబ్ధిదారు లను గుర్తిస్తారు. అర్హత గల కుటుంబం గత మూడేళ్లలో వినియోగించిన సిలిండర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటారు. దాని ఆధారంగానే లెక్క కట్టి ఆ మేరకు సబ్సిడీ ఇస్తారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు, తెల్లరేషన్‌కార్డుల ఆధారంగా ప్రభుత్వం 40 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించింది. వీరు మూడేళ్లలో వినియోగించిన సిలిండర్ల సగటు ఆధారంగా ఏటా మూడు నుంచి ఐదు సిలిండర్లకు ఈ పథకం వర్తించనుంది. కాగా రాష్ట్రంలో కోటి 20 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. రాష్ట్రంలో ఉజ్వల పథకం కింద ఇప్పటికే సుమారు 10 లక్షల కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వం నెలకు సుమారు రూ.300లకు పైగా సబ్సిడీ అందిస్తోంది. ఇప్పుడు వీరిని కూడా మహాలక్ష్మి పథకం కిందికి తీసుకురానున్నట్టు సమాచారం. -
Telangana: ఉచిత కరెంట్‌లో మెలిక?!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు ‘గృహజ్యోతి’ పథకం కింద ప్రతి కుటుంబానికి కచ్చితంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా జరగదా? అర్హత గల ప్రతి కుటుంబం నిర్దిష్ట యూనిట్ల మేరకే ఉచిత విద్యుత్‌ను పొందుతుందా? గత ఏడాది విద్యుత్ వినియోగాన్ని ఇందుకోసం పరిగణనలోకి తీసుకుంటున్నారా? పథకం అమలుకు ఇంధన శాఖ సిద్ధం చేసిన మార్గదర్శకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయా? అంటే.. అవుననే సమాధానమే లభిస్తోంది. నెలవారీ ఉచితంగా అనుమతించే వినియోగం (ఫ్రీ మంత్లీ ఎలిజిబుల్ కన్జంప్షన్ (ఎంఈసీ) పేరిట ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. మార్చి 1 నుంచి గృహజ్యోతి పథకం అమల్లోకి రానుంది. దీంతో ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు రెడీ అయ్యాయి. అధికంగా వాడితే వాతలే!: ఈ మార్గదర్శకాల ప్రకారం..200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరాకు షరతులు వర్తించనున్నాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తుందని భావించి గతానికి భిన్నంగా ఇష్టారాజ్యంగా వినియోగాన్ని పెంచేసుకుంటే, ఆ మేరకు అదనపు వాడకానికి బిల్లులు చెల్లించక తప్పదు. గత ఆర్థిక సంవత్సరం అంటే 2022–23లో నెలకు సగటున వాడిన విద్యుత్‌కు అదనంగా 10 శాతం విద్యుత్‌ను మాత్రమే గృహ జ్యోతి పథకం కింద ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయనుంది. నెలకు 200 యూనిట్ల గరిష్ట పరిమితికి లోబడి ఈ పథకం అమలు కానుంది. ఉదాహరణకు 2022–23లో ఒక కుటుంబ వార్షిక విద్యుత్ వినియోగం 960 యూనిట్లు అయితే, సగటున నెలకు 80 యూనిట్లు వాడినట్టు నిర్ధారిస్తారు. అదనంగా మరో 10 శాతం అంటే 8 యూనిట్లను కలిపి నెలకు గరిష్టంగా 88 యూనిట్ల విద్యుత్‌ను మాత్రమే ఆ కుటుంబానికి ఉచితంగా సరఫరా చేయనున్నారు. 88 యూనిట్లకు మించి వాడిన విద్యుత్‌కు సంబంధిత టారిఫ్ శ్లాబులోని రేట్ల ప్రకారం బిల్లులు జారీ చేయనున్నారు. గతేడాది 2,400 యూనిట్లు మించితే అనర్హులే ఒక వేళ 2022–23లో సగటున నెలకు 200 యూనిట్లకు మించి విద్యుత్ వాడినట్టైతే ఈ పథకం వర్తించదు. వార్షిక విద్యుత్ వినియోగం 2,400 యూనిట్లు మించిన వినియోగదారులు ఈ పథకానికి అర్హులు కారు. ఇక నెలకు అనుమతించిన పరిమితి (ఎంఈసీ) మేరకు ఉచిత విద్యుత్‌ను వాడిన వినియోగదారులకు ‘జీరో’ బిల్లును జారీ చేయనున్నారు. అంటే వీరు ఎలాంటి చెల్లింపులూ చేయాల్సిన అవసరం ఉండదు. 200 యూనిట్లు దాటితే ఉచితం వర్తించదు ఒక వేళ వినియోగం అనుమతించిన పరిమితికి మించినా, గరిష్ట పరిమితి 200 యూనిట్లలోపే వాడకం ఉండాలి. ఇప్పుడు కూడా అదనంగా వాడిన విద్యుత్‌కు సంబంధించిన బిల్లును సంబంధిత టారిఫ్ శ్లాబు ప్రకారం జారీ చేస్తారు. ఒక వేళ నెల వినియోగం 200 యూనిట్లకు మించితే మాత్రం వాడిన మొత్తం కరెంట్‌కు బిల్లును యథాతథంగా జారీ చేస్తారు. ఎలాంటి ఉచితం వర్తించదు. బిల్లులు బకాయిపడినా నో విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించాల్సిన వినియోగదారులకు గృహజ్యోతి పథకం వర్తించదు. బకాయిలన్నీ చెల్లించిన తర్వాతే పథకాన్ని వర్తింపజేస్తారు. గృహజ్యోతి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బిల్లులను చెల్లించకుండా బకాయి పడిన వారికి సైతం పథకాన్ని నిలుపుదల చేస్తారు. బిల్లులు చెల్లించాకే మళ్లీ పథకాన్ని పునరుద్ధరిస్తారు. తెల్లకార్డు ఉంటేనే అర్హులు ఈ పథకం కింద తెల్లరేషన్‌కార్డు కలిగిన ప్రతి కుటుంబం గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వాడుకోవడానికి అర్హత కలిగి ఉంటుంది. రేషన్‌కార్డు ఆధార్‌తో అనుసంధానమై ఉండాలి. లబ్ధిదారులు దరఖాస్తులో పొందుపరిచిన గృహ విద్యుత్ సర్వీస్ కనెక్షన్ నంబర్‌ను రేషన్‌కార్డుతో అనుసంధానం చేస్తారు. రేషన్‌కార్డుతో విద్యుత్ కనెక్షన్‌ను అనుసంధానం చేసినా, విద్యుత్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో వారి పేరు మీదే బిల్లింగ్ జరుగుతుంది. ఇప్పటికే నెలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లబ్ధి పొందుతున్న ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు కూడా గృహజ్యోతి వర్తించనుంది. గృహజ్యోతి పథకం కింద ఒక నెలకు సంబంధించిన సబ్సిడీలను తదుపరి నెలలోని 20వ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుంది. తొలి విడతలో 34 లక్షల గృహాలకు.. ప్రజాపాలన కార్యక్రమం కింద గృహజ్యోతి పథకం అమలు కోసం 1,09,01,255 దరఖాస్తులు రాగా, అందులో 64,57,891 దరఖాస్తుదారులు ఆధార్‌తో అనుసంధానమై ఉన్న తెల్ల రేషన్‌కార్డును కలిగి ఉన్నారని రాష్ట్ర ఐటీ శాఖ నిర్ధారించింది. వీరిలో 34,59,585 మంది దరఖాస్తుదారులు మాత్రమే గృహ విద్యుత్ కనెక్షన్ కలిగి ఉండడంతో తొలి విడత కింద వీరికే గృహజ్యోతి వర్తింపజేయనున్నారు. ప్రస్తుత విద్యుత్ టారిఫ్ ప్రకారం..గృహజ్యోతి పథకం అమలుకు ఏటా రూ.4,164.29 కోట్ల వ్యయం కానుందని రాష్ట్ర ఇంధన శాఖ అంచనా వేసింది. -
అలిగిన కోడళ్లకు గెలవగానే శుభవార్త: కేటీఆర్
వికారాబాద్, మొయినాబాద్: ‘అందరికీ ఏదో ఒకటి ఇచ్చిండ్రు.. మాకే ఏమీ ఇవ్వలేదని కోడళ్లు కొంచం మా మీద అలిగిండ్రు.. గెలవగానే కోడళ్లకు శుభ వార్త చెప్తాం. తెల్ల రేషన్‌కార్డు ఉన్న కోడళ్లందరికీ నెలకు రూ.3 వేల పెన్షన్ ఇస్తాం. కోడళ్లకు, అత్తలకు అంతేనా అని అలగొద్దు.. అత్తలకు ఇస్తున్న పింఛన్‌ను రూ.5 వేలకు పెంచుతాం..’అని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రచారంలో భాగంగా గురువారం ఆయన వికారాబాద్, మర్పల్లి, మొయినాబాద్‌లో రోడ్ షోలు నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేసి కాలె యాదయ్య(చేవెళ్ల)ను, ఆనంద్ (వికారా బాద్)ను మరోసారి గెలిపించాలని కోరారు. ‘మన జుట్టు ఢిల్లీ వాని చేతికివ్వొద్దు.. ఇన్నాళ్లు పాలించింది వారే.. మళ్లీ ఒక్క చాన్స్ అని వస్తున్నరు. స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్‌కు 11 చాన్స్‌లు ఇచ్చిండ్రు.. అప్పుడేమీ చేయని పార్టీ ఇప్పుడేం చేస్తుంది..?’అని కేటీఆర్ ప్రశ్నించారు. 52కిలోల బక్క కేసీఆర్‌ను కొట్టనీకి ఢిల్లీతో పాటు పక్క రాష్ట్రాల నుంచి గుంపులుగా వస్తున్నా రని ధ్వజమెత్తారు. బీజేపీ నుంచి మోదీ, అమిత్‌షాతో పాటు 15 మంది సీఎంలు, 15 మంది కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నుంచి పక్క రా ష్ట్రాల పెద్ద మనుషులు బయలుదేరానని తెలిపారు. అయినా ఏమీ చేయలేరని, తెలంగాణ బిడ్డ కేసీఆర్ సింహం లాంటోడని, సింహం సింగిల్‌గానే వస్తద ని, గుంపులు గుంపులుగా వచ్చేటోళ్లను ఏమంటా రో మీకే తెలుసంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భూములు లేని పేదలకు కేసీఆర్ బీమా.. ‘స్వతంత్ర భారత చరిత్రలో కేసీఆర్‌ను మించిన నేత లేడు. 75 ఏళ్ల చర్రితలో రైతుబంధు, రైతు బీమా ఇచ్చిన సీఎం, పీఎం ఎవరైనా ఉన్నారా..? రాష్ట్రంలో 46 లక్షల మందికి పింఛన్లు, 75 లక్షల మంది రైతులకు రైతుబంధు, 13.5 లక్షల మందికి కల్యాణలక్ష్మి, 15 లక్షల మందికి కేసీఆర్ కిట్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది కాదా?..’అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దు.. ఆనంద్ మళ్లీ సీఎం అవుతారు..’(వెంటనే సవరించు కుని మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారు) అని అన్నారు. మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే భూములు లేని పేదలకు కేసీఆర్ బీమా అమలు చేస్తామన్నారు. తెల్లకార్డున్న వారందరికీ సన్న బియ్యం ఇస్తామని తెలిపారు. రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించారు. మైనార్టీ సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ.. బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్‌లో ఒక్కసారి కూడా గొడ వలు కాలేదన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 111 జీఓను ఎత్తేశామని కేటీఆర్ చెప్పారు. గంగిగోవు లాంటి ఎమ్మెల్యే కాలె యాదయ్య కావాలా.. ఆయుధాలు సరఫరా చేసే కాంగ్రెస్ అభ్యర్థి కావాలా..? ప్రజలు తేల్చుకోవా లని సూచించారు. కార్యక్రమంలో మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి పాల్గొన్నారు. కరెంటు కావాలా.. కాంగ్రెస్ కావాలా..? ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు చేవ లేదు, సత్తాలేదని మంత్రి విమర్శించారు. అందుకే ఢిల్లీతో పాటు పక్క రాష్ట్రాల నుంచి నాయకులను తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఊర్లల్ల ఎవరైనా చచ్చిపోతే స్నానాలు చేయడానికి ఓ అరగంట కరెంటు వదలండని కరెంటోళ్ల కాళ్లు మొక్కిన రోజులు ఇంకా మనం మ ర్చిపోలేదన్నారు. కరెంటు కావాలా.. కాంగ్రెస్ కావాలా..? ప్రజలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. గులిగితే మామీద గులగండి.. ఓట్లు కూడా మాకే గుద్దండి అని కోరారు. -
కేంద్రం కీలక నిర్ణయం.. రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్!
టెక్నాలజీ పెరడగడంతో ప్రతిదీ డిజిటలైజేషేన్ అవుతున్నాయి. ఇలా చేయడం ద్వారా అవినీతితో పాటు అక్రమాలకు చెక్ పెట్టవచ్చని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అందుకే సర్కారు అందించే సేవలను ఆన్లైన్ వైపు తీసుకెళ్లడంతో పాటు అనుసంధానం ప్రక్రియను మొదలుపెట్టారు. ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్ వంటి ఎంతో ముఖ్యమో చెప్పక్కర్లేదు. అందుకే వీటిని అనుసంధానం ప్రక్రియకు శ్రీకారం చుట్టింది కేంద్రం ప్రభుత్వం. తాజాగా రేషన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి ఉన్న గుడువును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం రేషన్ కార్డుదారులకు ఊరటనిస్తూ ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి గతంలో ఉన్న జూన్ 30 గడువును పెంచుతూ కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా ఈ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. అంతోదయ అన్న యోజన, ప్రాధాన్య గృహ పథకం కింద లబ్ధిదారులకు రేషన్ కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానించడం తప్పనిసరి. తెల్లకార్డు ఉన్నవారు ముందుగా తమ రేషన్‌కార్డును డిజిటలైజ్ చేసి, ఆ తర్వాతే ఆధార్ కార్డుకు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం “వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్” విధానాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి రేషన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయడంపై దృష్టి సారిస్తోంది. రేషన్ కార్డుకు సంబంధించి జరుగుతున్న అక్రమాలను అరికట్టడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ కార్డును దుర్వినియోగం చేసి వివిధ చోట్ల 2-3 రేషన్‌కార్డులు పొందిన వారు చాలా మంది ఉన్నారు. రేషన్ కార్డుకు ఆధార్ కార్డును లింక్ చేయడానికి సమీపంలోని ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాలి. లేదా ఆన్లైన్లో కూడా రేషన్ కార్డుకి ఆధార్ కార్డును లింక్ చేయడానికి ఈ కింది పాటిస్తే సరిపోతుంది. ►మీ రాష్ట్రానికి చెందిన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పోర్టల్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. ►రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ లింక్ చేయాలని ఉన్న లింక్ పైన క్లిక్ చేయాలి. ►ఆ తర్వాత మీ రేషన్ కార్డ్ నెంబర్, ఆధార్ నెంబర్, నమోదిత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ►అనంతరం మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ►ఓటీపీ ఎంటర్ చేయగానే మీ రేషన్ కార్డుకు ఆధార్ కార్డ్ లింక్ ప్రక్రియ పూర్తవుతుంది. చదవండి: ఈ వీడియో చూస్తే.. రెస్టారెంట్లో చికెన్ కర్రీ ఆర్డర్ చేయరు! -
మహిళలకే గృహలక్ష్మి అవకాశం... రూ. 3 లక్షల వరకు సాయం
మోర్తాడ్(బాల్కొండ) : సొంతంగా జాగా ఉండి ఇంటి నిర్మాణం చేపట్టాలనుకునే వారికి వందశాతం రాయితీపై రూ. 3 లక్షల సాయం అందించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ‘గృహలక్ష్మి’ పథకం కింద మహిళా లబ్ధిదారులకే అవకాశం కల్పించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కేటాయింపులను తక్కువ సంఖ్యలో కొనసాగిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఇళ్లను నిర్మించుకునే పేద, మధ్య తరగతి కుటుంబాల వారికి రూ. 1.50 లక్షల వరకు సాయం అందించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత గృహ నిర్మాణ సంస్థను ప్రభుత్వం ఎత్తివేసింది. హౌసింగ్ కార్పొరేషన్లో పనిచేసిన ఉద్యోగులను వివిధ శాఖల్లో విలీనం చేశారు. ఆర్అండ్బీ ఆధ్వర్యంలోనే డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంను కొనసాగించారు. తాజాగా ఇంటి నిర్మాణానికి ఆర్థికసాయం అందించే పథకం తొమ్మిదేళ్ల తర్వాత పునరుద్ధరణకు నోచుకుంది. ప్రతి నియోజకవర్గం పరిధిలో మొదటి విడతలో 3 వేల చొప్పున ఇళ్ల నిర్మాణానికి ఆర్థికసాయం అందించనున్నారు. అంటే ఒక్కో నియోజకవర్గానికి రూ. 30 కోట్ల నిధులు అవసరం కానున్నాయి. జిల్లాలో ఐదు నియోజకవర్గాలతో పాటు బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాలు ఉన్నాయి. అంటే జిల్లాకు గృహలక్ష్మి పథకం కింద రూ.165 కోట్ల వరకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఇంటి నిర్మాణానికి సాయం కోసం దరఖాస్తు చేసుకునేవారు స్థానికులై ఉండటమే కాకుండా తెల్ల రేషన్‌కార్డును కలిగి ఉండటంతో పాటు ఓటరై ఉండాలనే నిబంధన విధించారు. ఓటరు కార్డును దరఖాస్తు ఫారంతో జత చేయాల్సి ఉంది. ఓటరు కాని వారికి గృహలక్ష్మి పథకం వర్తించే అవకాశం లేదని తెలుస్తోంది. వరం కాదు భారమే.. గృహలక్ష్మి పథకం కింద అందే సాయం తక్కువగానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఇనుము, ఇటుకలు, ఇసుక ఇతరత్రా సామగ్రి ధరలు విపరీతంగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి నిర్మాణం పేదలకు భారం అవుతుంది. రూ. మూడు లక్షలతో ఇంటిని నిర్మించుకోవడం కష్టమని అందువల్ల సాయం విలువను పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. రెండు గదులు, బాత్రూం, టాయ్లెట్లను నిర్మించాలంటే కనీసం రూ. 8 లక్షల వరకు ఖర్చవుతుందని నిపుణులు చెబుతున్నారు. -
బతుకమ్మ చీరలు @ రూ.330 కోట్లు
సిరిసిల్ల: రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఏటా అందించే బతుకమ్మ పండుగ కానుక చీరల రంగులను, డిజైన్లను తెలంగాణ పవర్లూమ్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీపీటీడీసీఎల్) ఖరారు చేసింది. 21 రంగుల్లో 25 డిజైన్లలో బతుక మ్మ చీరలను ఆర్డర్ చేసింది. రాష్ట్రంలోని కోటి మందికి బతుకమ్మ పండగ కానుకగా ప్రభుత్వం చీరలను అందిస్తున్న సంగతి తెలిసిందే. సిరిసిల్ల నేత కార్మికులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో 2017 నుంచి బతుకమ్మ పండుగకు చీరలను సారెగా అందిస్తున్నారు. గతంలో రాష్ట్ర చేనేత సహకార సంస్థ (టెక్సో) ద్వారా ఈ చీరల ఆర్డర్లు ఇవ్వగా.. ఈసారి తెలంగాణ పవర్లూమ్, టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీపీటీడీసీఎల్) ద్వారా ఆర్డర్లు ఇచ్చారు. సిరిసిల్లలోని 139 మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ (మ్యాక్స్)లకు 3.70 కోట్ల మీటర్ల బట్టను (64.03 లక్షల చీరలు), 126 చిన్న తరహా పరిశ్రమల (ఎస్ఎస్ఐ)కు 1.84 కోట్ల మీటర్ల బట్టను (31.87 లక్షల చీరలు) ఆర్డర్లు ఇచ్చారు. జాకెట్ పీసుల కోసం మరో 68 లక్షల మీటర్ల బట్టను సిరిసిల్ల శివారు టెక్స్టైల్ పార్క్‌లోని ఆధునిక మగ్గాలకు ఇచ్చారు. మొత్తంగా 6.22 కోట్ల మీటర్ల బట్టను బతుకమ్మ చీరల ఉత్పత్తి లక్ష్యంగా ఈ ఏడాది నిర్ణయించారు. చీరలకు ఉత్పత్తి రవాణా, ప్రాసెసింగ్ ఇతర ఖర్చులకు మొత్తం రూ.330 కోట్లు కేటాయించారు. సెపె్టంబరు నెలాఖరులోగా ఈ చీరలను సిరిసిల్ల నేతన్నలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. మగ్గాల సంఖ్య ఆధారంగా ఆర్డర్లు ఇస్తాం సిరిసిల్ల నేతన్నలకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చాము. 21 రంగుల్లో 25 డిజైన్లలో చీరలను ఉత్పత్తి చేయాలని స్పష్టం చేశాము. మ్యాక్స్ సంఘాలు, ఎస్ఎస్ఐ యూనిట్లలోని మరమగ్గాల సంఖ్య ఆధారంగా వస్త్రోత్పత్తిదారులకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తాం. గడువులోగా చీరలను ఉత్పత్తి చేసి అందించాల్సి ఉంటుంది. – సాగర్, జౌళిశాఖ, ఏడీ -
"తెల్ల" దొరలపై కొరడా
సాక్షి,కడప: పేదల పేరుతో తెల్ల రేషన్ కార్డులు పొంది చౌక దుకాణాలలో బియ్యం, ఇతర నిత్యావసరాలు తీసుకుంటున్న అక్రమార్కులపై ప్రభుత్వం దృష్టి సారించింది. నిబంధనలను కాదని పేదలకు దక్కాల్సిన సౌకర్యాలను పొందుతున్న ఉద్యోగుల నుంచి కార్డులను స్వాదీనం చేసుకునే చర్యలను ముమ్మరం చేసింది. కార్డును అడ్డం పెట్టుకుని సరుకులతో పాటు సంక్షేమ పథకాలను పొందుతున్న వేతనదారులపై కొరడా ఝుళిపించేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. గతంలో కొంతమంది చిరుద్యోగులు రేషన్ కార్డు పొంది ఉన్నా.. వారు పదోన్నతి పొందిన తరువాత కూడా కార్డును ప్రభుత్వానికి అప్పజెప్పకుండా అలాగే కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి రేషన్ కార్డులు పొందిన వైనంపై ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పౌరసరఫరాల శాఖ అధికారులు వివరాలు సేకరించారు. నిబంధనలకు విరుద్ధం జమ్మలమడుగు, కడప, రాజంపేట రెవెన్యూ డివిజన్ల పరిధిలో వందల సంఖ్యలో కార్డులను గుర్తించి స్వాదీనం చేసుకుంటున్నారు. ఉద్యోగులకు సంబంధించిన కార్డులను వీఆర్ఓలు తనిఖీ చేయాల్సి ఉంది. జిల్లాలోని అనేక మండలాల్లో పలువురు ఉద్యోగులు రైస్ కార్డులు పొందారు. జిల్లా వ్యాప్తంగా 7600 మందికి పైగా ఉద్యోగుల వద్ద తెల్లరేషన్ కార్డులు ఉన్నట్లు గుర్తించారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు రైస్ కార్డులు పొందడానికి అనర్హులు. కానీ పలువురు వీటిని తమ పలుకుబడితో సొంతం చేసుకున్నారు. బయోమెట్రిక్, ఆధార్ నంబర్ లాంటివి కార్డులకు జత చేసినా వారి వివరాలు బయటపడలేదు. ఆదాయపు పన్ను, పాన్ కార్డుల అనుసంధానంతో ఇటీవల ఈ అక్రమాలు వెలుగు చూశాయి. ప్రభుత్వ ఉద్యోగులు రేషన్ కార్డులు కలిగి ఉండకూడదంటూ ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేసింది. కార్డులు మాత్రమే జిల్లా వ్యాప్తంగా వీఆర్ఓలు, సచివాలయ ఉద్యోగులు, ఇతర శాఖలకు చెందిన ఉద్యోగుల వద్ద తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూనే వీరు అమ్మఒడి, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ పథకాలను పొందుతున్నారు. ప్రస్తుతానికి కార్డులను మాత్రమే స్వాధీనం చేసుకోనున్నారు. వీరి వివరాలను పూర్తిస్థాయిలో వారం రోజుల్లో ఇవ్వాలనే ఆదేశాలు మండలస్థాయి అధికారులకు జారీ అయ్యాయి. ఆ మేరకు నివేదికలు తయారు అవుతున్నాయి. విచారణ జరుపుతున్నాం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యోగుల నుంచి తెల్లరేషన్ కార్డులు స్వా«దీనం చేసుకునేందుకు అవసరమైన విచారణ చేస్తున్నాం. ఇప్పటికే కార్డులున్న ఉద్యోగులను గుర్తించాం. గ్రామ, పట్టణ స్థాయిలో కచ్చితంగా ఉద్యోగుల వద్ద ఉన్న రేషన్‌కార్డులను స్వాధీనం చేసుకుంటాం. త్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం. – సౌభాగ్యలక్షి, డీఎస్ఓ, కడప చదవండి: CM KCR Review On Heavy Rains: భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష -
27న దుర్గమ్మ సన్నిధిలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై ఈ నెల 27వ తేదీన సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించేందుకు దేవస్థాన వైదిక కమిటీ నిర్ణయించింది. 27వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మహామండపం ఆరో అంతస్తులో వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహిస్తారు. టికెట్ ధరను రూ.1,500గా దేవస్థానం నిర్ణయించింది. టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు దేవస్థానమే పూజా సామాగ్రిని సమకూర్చుతుంది. భక్తులు టికెట్లను దేవదాయ ధర్మాదాయ శాఖ వెబ్సైట్ https://tms.ap.gov.in ద్వారా, దేవస్థాన ఆర్జిత సేవా టికెట్ల కౌంటర్లలో కొనుగోలు చేయవచ్చునని ఆలయ అధికారులు పేర్కొన్నారు. అలాగే, 27వ తేదీ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరిగే ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే అవకాశాన్ని భక్తులకు దేవస్థానం కల్పించింది. ఇందుకోసం తెల్లరేషన్ కార్డు ఉన్న భక్తులు ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 23వ తేదీ నుంచి దేవస్థానం దరఖాస్తులను పంపిణీ చేస్తుంది. దరఖాస్తులను మహా మండపం గ్రౌండ్ ఫ్లోర్‌లోని టోల్ ఫ్రీ కౌంటర్లో ఉచితంగా పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులతో పాటు తెల్లరేషన్ కార్డు జిరాక్స్ కాపీని జత చేసి 25వ తేదీ సాయంత్రం 4 గంటల లోపుగా అందజేయాలి. సామూహిక వరలక్ష్మీ వ్రతాల్లో పాల్గొనే భక్తులు తప్పని సరిగా మాస్కులు ధరించాలని దేవస్థానం సూచించింది. పవిత్రోత్సవాల సందర్భంగా దర్శన వేళల్లో మార్పు దుర్గ గుడిలో ఈ నెల 21వ తేదీ నుంచి పవిత్రోత్సవాల నేపథ్యంలో అమ్మవారి దర్శన వేళల్లో మార్పు చేశారు. 21 నుంచి పవిత్రోత్సవాలు ముగిసే 23వ తేదీ వరకు ఉదయం 9 గంటల తర్వాతే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అలాగే, ఆ మూడు రోజులపాటు అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. -
బియ్యం కార్డులకే సరుకులు
సాక్షి, అమరావతి: ప్రజాపంపిణీ వ్యవస్థలో సబ్సిడీ బియ్యం పొందడానికి మరింత మెరుగైన విధానం అమల్లోకి రానుంది. డిసెంబర్ నుంచి బియ్యం కార్డులున్నవారికి మాత్రమే సబ్సిడీపై సరుకులు పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న బియ్యాన్ని కొందరు తీసుకోవడం లేదు. తీసుకున్న మరికొందరు పక్కదారి పట్టిస్తున్నారు. బియ్యం నాణ్యత తక్కువగా ఉండడంతో తినలేక అమ్ముకుంటున్న పరిస్థితి ఇక ఉండకూడదనే ఉద్దేశంతో జనవరి నుంచి నాణ్యమైన బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తెల్ల రేషన్ కార్డుల స్థానంలో ప్రభుత్వం బియ్యం కార్డులు తీసుకొచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం తెల్ల కార్డులు, బియ్యం కార్డులు కలిపి 1.52 కోట్లకుపైగా ఉన్నాయి. రాష్ట్రంలో ఎనిమిది లక్షలకు పైగా తెల్ల కార్డులు అనర్హుల చేతుల్లో ఉన్నట్లు గ్రామ, వార్డు వలంటీర్ల తనిఖీలో వెల్లడైంది. వలంటీర్లు ప్రతి ఇంటికీ వెళ్లి అర్హతల పత్రాన్ని వారికి అందించి, వారి నుంచి వివరాలు తీసుకున్నారు. అనర్హతకు సంబంధించి ఆయా కుటుంబాలు అంగీకారం కూడా తెలిపాయి. ఈమేరకు సిద్ధం చేసిన అర్హులు, అనర్హుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించి సోషల్ ఆడిట్ జరిపారు. ఒకవేళ అర్హత ఉండి జాబితాలో పేరు లేకపోయినా ఎవరికి దరఖాస్తు చేయాలన్న వివరాలు కూడా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. సచివాలయాల్లో ప్రదర్శించిన జాబితాలపై దాదాపు రెండులక్షల మంది నుంచి అభ్యంతరాలు, విజ్ఞాపనలు వచ్చాయి. వాటిని పరిశీలించి అర్హత ఉన్న వారికి బియ్యం కార్డులు మంజూరు చేశారు. బియ్యం కార్డుకు అర్హత ఉన్నప్పటికీ తెల్ల కార్డులున్న మరో ఆరులక్షల కుటుంబాలకు సంబంధించి చిరునామాలు ఇప్పటికీ లభించలేదు. (చదవండి: 1.52 కోట్లు దాటిన బియ్యం కార్డులు) బియ్యం కార్డుతో ఇతర పథకాలకు సంబంధం లేదు... బియ్యం కార్డులతో పెన్షన్లు, ఆరోగ్యశ్రీ పథకం, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలకు ముడిపెట్టలేదు. రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన, తినగలిగే బియ్యాన్ని జనవరి నుంచి ఇంటింటికీ పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే బియ్యం కార్డు పొందేందుకు ప్రస్తుతం అర్హతలను సడలించి మరింతమందికి ప్రయోజనం కలిగించేలా చర్యలు తీసుకున్నారు. ఇన్ని బియ్యం కార్డుల సంఖ్యకు పరిమితి విధించలేదు. అర్హులందరికీ కార్డులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలుమార్లు అధికారులకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. బియ్యం కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. ప్రస్తుతం తెల్ల కార్డులు, బియ్యం కార్డులు కలిపి 1,52,70,217 ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న తెల్ల రేషన్ కార్డులు, బియ్యం కార్డుల మొత్తం జిల్లాల వారీగా.. --------------------------------------------------------- జిల్లా రేషన్ కార్డులు --------------------------------------------------------- తూర్పు గోదావరి 17,03,597 గుంటూరు 15,47,127 కృష్ణా 13,47,292 విశాఖపట్నం 13,20,321 పశ్చిమ గోదావరి 12,93,075 అనంతపురం 12,73,601 కర్నూలు 12,43,324 చిత్తూరు 11,88,779 ప్రకాశం 10,25,455 నెల్లూరు 9,33,193 శ్రీకాకుళం 8,41,047 వైఎస్సార్ కడప 8,37,057 విజయనగరం 7,16,349 --------------------------------------------------------- మొత్తం 1,52,70,217 --------------------------------------------------------- అర్హులు దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తాం డిసెంబర్ కోటా నుంచి బియ్యం కార్డులున్న వారికే సబ్సిడీ సరుకులు పంపిణీ చేస్తాం. గతంలో తెల్ల రేషన్ కార్డులు తీసుకున్న వారిలో చాలామంది అనర్హులున్నారు. కరోనా కారణంగా ఉపాధి పనులు దొరకడం లేదనే ఉద్దేశంతో అందరికీ ఉచితంగా సరుకులు పంపిణీ చేశాం. అర్హత ఉండి బియ్యం కార్డు లేనివారు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి చర్యలు తీసుకుంటాం.- కోన శశిధర్, ఎక్స్ అఫిషియో కార్యదర్శి, పౌరసరఫరాలశాఖ -
1.52 కోట్లు దాటిన బియ్యం కార్డులు
సాక్షి, అమరావతి: పదెకరాలున్నా వారు కూడా బియ్యం కార్డు పొందేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంతో ప్రతినెలా కొత్తగా లక్షలాది మందికి లబ్ధి చేకూరుతోంది. గతంలో 2.5 ఎకరాల మాగాణి లేదా ఐదు ఎకరాల్లోపు మెట్ట భూమి ఉన్నవారే బియ్యం కార్డు పొందేందుకు అర్హులుగా ఉండేవారు. ప్రస్తుతం మూడు ఎకరాల మాగాణి లేదా పది ఎకరాల్లోపు మెట్ట భూమి ఉన్నవారు లేదా రెండూ కలిపి పది ఎకరాలున్నా కార్డు తీసుకునేందుకు అర్హులే. దీంతో నానాటికీ బియ్యం కార్డుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సంక్షేమ పథకాలు పేదల హక్కుగా భావిస్తున్న ప్రభుత్వం.. వారికి బియ్యం కార్డులు కూడా ఎప్పటికప్పుడు మంజూరు చేస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,52,70,217 బియ్యం కార్డులున్నాయి. ఇందులో 4,47,45,668 కుటుంబ సభ్యుల (యూనిట్లు) పేర్లు నమోదై ఉన్నాయి. జూన్‌లో 1,47,25,348 కార్డులు ఉండగా, జూలైలో 1,49,38,211, ఆగస్టులో 1,50,15,765, సెప్టెంబర్‌లో 1,50,80,690 కార్డులు ఉండగా.. ఆ సంఖ్య ప్రస్తుతం 1,52,70,217కి చేరింది. దీనివల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతున్నప్పటికీ వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో దరఖాస్తు చేసిన తర్వాత అర్హత ఉంటే చాలు గడువులోగా కార్డులను మంజూరు చేస్తున్నారు. త్వరలో ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యం పేదల ఇళ్లకే వెళ్లి నాణ్యమైన బియ్యం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జనవరి నుంచి ఈ విధానాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ. 3,100 కోట్లు కేటాయించింది. అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే అవసరమైన మినీ ట్రక్కులను కొనుగోలు చేసేందుకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. ప్రభుత్వం భారంగా భావించడం లేదు అర్హులందరికీ బియ్యం కార్డులు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అందుకే దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లోపే సంబంధిత కుటుంబ సభ్యుల చేతికి కార్డు ఇస్తున్నాం. దీనిని ప్రభుత్వం భారంగా భావించడం లేదు. ఎంత ఖర్చయినా పేదలకు సంక్షేమ పథకాలు అందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్యేయం. కార్డులు మంజూరు చేయడం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. - కోన శశిధర్, ఎక్స్-అఫీషియో కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ జిల్లాలవారీగా ఇప్పటివరకు జారీ చేసిన బియ్యం కార్డులు, వాటిలోని కుటుంబ సభ్యుల వివరాలిలా.. జిల్లా కార్డులు కుటుంబ సభ్యులు (యూనిట్లు) అనంతపురం 12,73,601 39,34,160 చిత్తూరు 11,88,779 37,04,862 తూర్పు గోదావరి 17,03,597 48,21,556 గుంటూరు 15,47,127 43,39,371 వైఎస్సార్ 8,37,057 25,29,877 కృష్ణా 13,47,292 38,28,203 కర్నూలు 12,43,324 39,25,629 నెల్లూరు 9,33,193 25,54,168 ప్రకాశం 10,25,455 30,17,497 శ్రీకాకుళం 8,41,047 24,93,119 విశాఖపట్నం 13,20,321 38,73,231 విజయనగరం 7,16,349 21,10,628 పశ్చిమ గోదావరి 12,93,075 36,13,367 మొత్తం 1,52,70,217 4,47,45,668 -
పకడ్బందీగా ‘పంపిణీ’ వ్యవస్థను అమలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: విపత్కర పరిస్థితుల్లో పేదలను ఆదుకోవడం ప్రభుత్వాల బాధ్యతని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాపంపిణీ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేయడం ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం కావాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సూచించారు. తెల్లరేషన్ కార్డు ఉన్న కుటుంబంలో ప్రతీ మనిషికి 12 కిలోల బియ్యం ఇవ్వాలనే నిర్ణయం అభినంద నీయమని, అయితే పంపిణీలో సమస్యలు ఎదురుకావడం సరి కాదని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. షాపుల ఎదుట భారీ క్యూలు ఉండటం, భౌతిక దూరం పాటించకపోవడం దుష్పరిణామాలకు దారితీయకూడదని అభిప్రాయపడ్డారు. -
రేపటి నుంచి రేషన్ బియ్యం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ప్రకటించిన 12 కిలోల రేషన్ బియ్యాన్ని గురువారం నుంచి లబ్ధిదారులకు అందించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 1.57 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని చౌక ధరల దుకాణాలకు సరఫరా చేయగా, మరో 1.60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇప్పటికే సరఫరా మొదలుపెట్టారు. ఈ ప్రక్రియ బుధ, గురువారం సైతం కొనసాగనుంది. గురువారం నుంచి గ్రామాల్లో సరఫరా చేసిన బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. అయితే చౌక ధరల దుకాణాల వద్ద ఇబ్బంది రాకుండా, జనాలు ఎగబడకుండా చర్యలు తీసుకోనున్నారు. గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా టోకెన్లు జారీ చేసి రేషన్ సరఫరా చేయనున్నారు. టోకెన్‌లో పేర్కొన్న తేదీనే లబ్ధిదారులు రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బాధ్యతను గ్రామాల కార్యదర్శులు, మున్సిపల్ శాఖ అధికారులు తీసుకోనున్నారు. ఇక రాష్ట్రంలోని 87.59 లక్షల రేషన్ కుటుంబాల వారికి నిత్యావసర సరుకుల కొనుగోళ్లకై రూ.1,500 లబ్ధిదారుల ఖాతాల్లోనే వేయనున్నారు. దీనికి సంబంధించి లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను ఇప్పటికే పౌర సరఫరాల శాఖ ఆరంభించింది. నా లుగైదు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తికానుంది. ఆధార్ అధికారులతో సమన్వయం చేసుకుం టూ బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నారు. ఈ–కుబేర్ యాప్‌ను వాడనున్నారు. -
అమరావతిలో పరిటాల బంధువుల పాగా
సాక్షి, కనగానపల్లి: రాజధాని ప్రాంతంగా గుర్తించిన అమరావతి సీఆర్డీఏ పరిధిలోని భూముల కొనుగోలుపై సీఐడీ కన్నేసింది. రూ.కోట్ల విలువైన భూములను తెల్లరేషన్‌కార్డు కలిగిన వారు కొనుగోలు చేసినట్లు తెలుసుకున్న అధికారులు తీగ లాగుతున్నారు. కనగానపల్లికి చెందిన నిర్మలాదేవి, బద్దలాపురం గ్రామానికి చెందిన జయరాంచౌదరిలు అమరావతి పరిధిలోని తాడికొండ వద్ద ఒక్కొక్కరు అర ఎకరం చొప్పున భూమి కొనుగోలు చేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్న వీరు రాజధాని ప్రాంతంలో భూములు కొనే పరిస్థితి లేదని, ఈ ప్రాంతంలోని ప్రజాప్రతినిధికి బినామీలుగా వీరు ఉన్నట్లు సీఐడీ అధికారులు భావిస్తున్నారు. చదవండి: పరిటాల కుటుంబ దోపిడీకి అడ్డుకట్ట.. ఇద్దరూ తెల్లరేషన్‌కార్డుదారులే... సీఐడీ సీఐ ఎస్ఎం గౌస్, ఎస్ఐ సుధాకర్ మంగళవారం కనగానపల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి నిర్మలాదేవి, జయరాంచౌదరిల వివరాలను సేకరించారు. నిర్మలాదేవి(రేషన్ కార్డు నంబర్: డబ్ల్యూఏపీ1233001200252) స్థానికంగానే ఉండటంతో ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులను కార్యాలయానికి పిలిపించి విచారణ చేశారు. చిల్లర దుకాణం నడుపుకొంటూ జీవిస్తూ రూ.కోట్ల విలువ చేసే భూమి ఎలా కొన్నారు..? అని సీఐడీ అధికారులు వారిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నిర్మలాదేవి మాత్రం తమ సమీప బంధువులు, వ్యక్తుల సహకారంతో భూమి కొన్నట్లు చెప్పారు. వీరు మాజీ మంత్రి పరిటాల సునీతకు దూరపు బంధువులుగా తెలుస్తోంది. తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేస్తున్న సీఐడీ అధికారులు ఇక బద్దలాపురం గ్రామానికి చెందిన జయరాం చౌదరి(రేషన్ కార్డు నంబర్: ఆర్ఏపీ123300300110) అమరాపురంలోని సొసైటీ బ్యాంకులో సీఈఓగా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. దీంతో సీఐడీ అధికారులు ఆయన్ను నేరుగా విచారించలేకపోయారు. అయితే ఆయన వ్యక్తిగత ఆదాయ వివరాలు, కుటుంబ వివరాలను తహసీల్దార్ కార్యాలయ అధికారుల ద్వారా తెలుసుకున్నారు. జయరాంచౌదరి కూడా పరిటాల కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబంధాలతోనే భూమి కొనుగోలు చేశాడా? లేక అతని సమీప బంధువుల్లోని ప్రభుత్వ ఉద్యోగులు బినామీగా భూములు కొన్నాడా? అనే దానిపై సీఐడీ అధికారులు విచారణ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా అమరావతి ప్రాంతంలోని భూముల కొనుగోలు వ్యవహారంలో బినామీల బాగోతం ఒక్కొక్కటిగా వెలికితీసేందుకు అధికారులు విచారణ వేగవంతం చేశారు. తాడిపత్రిలోనూ విచారణ... తాడిపత్రి రూరల్: సీఐడీ అధికారులు తాడిపత్రి విజయలక్ష్మి థియేటర్ ఎదురుగా ఉన్న శ్రీ చైతన్యపాఠశాల నిర్వాహకుడు కె.చంద్రశేఖర్‌రెడ్డిని కూడా విచారించారు. 2014లో ఆయన కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని ఘని ఆత్మకూరులో కొనుగోలు చేసిన 4 ఎకరాలపై ఆరా తీశారు. ముందుగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన సీఐడీ సీఐ ఎస్సీ గౌస్ తహసీల్దార్ నయాజ్‌అహ్మద్‌తో మాట్లాడారు. చంద్రశేఖర్‌రెడ్డి పేరున ఉన్న తెల్లరేషన్ కార్డుపై ఆరా తీశారు. అనంతరం ఈ నెల 20న కర్నూలులోని తమ కార్యాలయంలో విచారణ నిమిత్తం హాజరు కావాల్సిందిగా చంద్రశేఖర్‌రెడ్డికి నోటీస్ అందజేశారు. చదవండి: పరిటాల హత్య కేసులో సంచలన విషయాలు -
ఈవేయింగ్ మెషీన్లు ఉన్నా.. లేనట్టే!
సాక్షి, బొబ్బిలి: జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏడు లక్షలకు పైగా ఉన్న తెలుపు రంగు రేషన్ కార్డు లబ్ధిదారులకు పంపిణీ చేసే సరుకులను ఈ వెయింగ్‌లో ఇచ్చి జిల్లాలోని 1428 రేషన్ షాపులకు తరలిస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం జరగడం లేదు. అలాగే వాహనాలకు జీపీఎస్ సిస్టమ్‌ను అమర్చామ ని చెబుతున్నా ఆ విధానం ఎక్కడా అమలు కాలేదు. మొత్తంగా అంతా సాదా సీదాగా పాత పద్ధతిలోనే నడుస్తున్నది. ప్రజాపంపిణీ రవాణాను జీపీఎస్‌లో పెట్టాక ఇక రూట్ ఆఫీసర్లతో పనేముందని వారిని కూడా తొలగించారు. జిల్లా వ్యాప్తంగా టన్నుల కొద్దీ బియ్యం, పంచదార, కందిపప్పుతో పాటు అంగన్వాడీ కేంద్రాలకివ్వాల్సిన సరుకులను కూడా ఇలానే తరలిస్తున్నారు. ఈవెయింగ్ అన్న ఊసే లేదు. రేషన్ దుకాణాల విధానమే రేషన్ దుకాణాలకు ఇచ్చే సరుకులు తూకం తక్కువ వస్తున్నాయని డీలర్లు పలుమార్లు ఫిర్యాదు చేశారు. వారు కూడా ఈ వేయింగ్ విధానాన్ని కేవలం ఒకే సరకును పెట్టి అన్ని కార్డులకూ దానినే సరుకుగా చూపిస్తున్నారు. పదే పదే డీలర్లు గోదాముల్లో ఈ వెయింగ్ కోరుతున్నారని ప్రవేశ పెట్టినా అమలు మాత్రం జరగడం లేదు. దీంతో రేషన్ షాపుల్లో ఏ విధంగా అమలు చేస్తున్నారో గోదాముల్లోనూ ఇదే పద్ధతిని అమలు చేస్తున్నారు. డమ్మీ ఈ వేయింగ్ చేపట్టినా ఆ విధానం కూడా డీలర్లతోనే చేయించడం విశేషం. ఆ రోజుకు లారీల్లో ఎంత మంది డీలర్లకు సరుకులు వెళితే వారే ఈ వేయింగ్ బిల్లు తీసుకుని సరుకులు పట్టుకుపోతున్నారు. కానరాని వివరాలు ఎంఎల్ఎస్ గోదాముల్లో సరుకుల వివరాలను పట్టికల్లో నమోదు చేయడం లేదు. ఎక్కడి బోర్డులక్కడే ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కానీ పట్టించుకునే నాథుడే లేడు. దీనిపై అధికారులు కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీనిపై సాక్షి వారిని ప్రశ్నించగా వారినుంచి మౌనమే సమాధానమవుతోంది. -
తెల్ల రేషన్‌కార్డుదారులకు ఓ పథకం
సాక్షి, హైదరాబాద్: తెల్లరేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ వర్తించేలా ఓ కొత్త పథకాన్ని టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చబోతున్నామని ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావు (కేకే) వెల్లడించారు. ఆలేరు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు కేకే సమక్షంలో తెలంగాణభవన్‌లో బుధవారం టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఒకప్పుడు ఇందిరాగాంధీని అమ్మ అని పిలిచేవారని ఇప్పుడు కేసీఆర్ అందరికీ పెద్దకొడుకయ్యారని చెప్పారు. శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచి మనిషి మరణించేదాకా అందరికీ సంక్షేమ పథకాలను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. పేదల డబ్బు పేదలకే పథకాల రూపంలో చేరాలన్నది సీఎం కేసీఆర్ తపనని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంటుందని భరోసా ఇచ్చారు. కొన్ని కారణాలతో జనగామలో చేరిన గుండాల మండలాన్ని తిరిగి యాదాద్రిలో చేరుస్తామని హామీ ఇచ్చారు. ఆలేరు టీఆర్ఎస్ అభ్యర్థి గొంగడి సునీత మాట్లాడుతూ... యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి గుండాల మండలాన్ని వేరు చేసి జనగామలో కలపడం బాధగానే ఉందన్నారు. గుండాల మండలాన్ని. -
ఇదేమి పెళ్లి కానుక!
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన పేద కుటుంబాల్లో పుట్టిన ఆడపిల్లల పెళ్లిళ్లు ఆయా కుటుంబాల వారికి భారం కాకుండా ‘చంద్రన్న పెళ్లి కానుక’ పథకం కింద ఆదుకుంటామంటూ ఆర్భాటం చేస్తున్న ప్రభుత్వం.. ఆచరణకు వచ్చేసరికి పలు షరతులు, పరిమితులు విధిస్తూ ఈ పథకాన్ని నీరుగారుస్తోంది. ఇంతకుముందు పెళ్లికుమార్తెకు తెల్లరేషన్ కార్డు ఉంటే పెళ్లికానుక వర్తింపజేసేవారు కాగా.. ఇప్పుడు వధూవరులిద్దరికీ తెల్ల రేషన్‌కార్డు ఉంటేనే పెళ్లి కానుక వర్తిస్తుందని నిబంధన పెట్టడం ఇందుకు నిదర్శనం. దీంతో వధూవరుల్లో ఏ ఒక్కరికి తెల్ల కార్డు లేకపోయినా కానుక రాదన్నమాట. పెళ్లికానుకను పెళ్లికుమార్తె అకౌంట్‌కు జమ చేస్తామని చెబుతున్న ప్రభుత్వం.. ఇందుకోసం పెళ్లికి 15 రోజులు ముందుగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని నిబంధన పెట్టింది. దీన్నిబట్టి పెళ్లయ్యాక పెళ్లికానుక కోసం దరఖాస్తు చేసుకుంటే ఉపయోగం ఉండబోదు. అంతేకాదు.. పది రోజుల్లో పెళ్లి కుదుర్చుకుని లగ్నాలు పెట్టుకున్నా ఉపయోగం ఉండదు. నిబంధనల ప్రకారం 15రోజుల ముందు మాత్రమే పెళ్లి ఏర్పాట్లు పూర్తి కావాలి. దరఖాస్తు చేసుకునే సమయానికి పెళ్లి పత్రిక కూడా రెడీగా ఉండాలి. అప్పుడే ఈ కానుక వర్తిస్తుంది. దీనినిబట్టి పేద కుటుంబాలలోని వారికి ఆడపిల్లల పెళ్లి పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందనేది స్పష్టమవుతోంది. గతంలో ఎలా ఉండేది... గతంలో దుల్హన్ పథకం కింద ముస్లిం మైనార్టీలకు, గిరిపుత్రిక కళ్యాణ పథకం కింద గిరిజనులకు ఆర్థిక సాయం అందేది. వీరి పెళ్లికార్యానికి రూ.50 వేలు చొప్పున ప్రభుత్వం అందించేది. ఆ మేరకు గిరిజన వధువు, ముస్లిం వధువు అకౌంట్‌కు డబ్బులు జమయ్యేవి. పెళ్లికుమార్తెకు తెల్ల రేషన్‌కార్డు ఉంటే సరిపోయేది. పైగా పెళ్లికి నెలరోజుల ముందు నుంచి పెళ్లిరోజు వరకు కానీ, పెళ్లయిన రెండు నెలల వరకు ఎప్పుడైనా పెళ్లి కానుకకోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలుండేది. ఇప్పుడిది రద్దయ్యింది. మూడు నెలలుగా ‘కానుక’ లేదు ఇదిలా ఉంటే.. పెళ్లి కానుక కోసం దరఖాస్తు చేసుకునేందుకు జ్ఞానభూమి వెబ్సైట్లో లింక్ ఇవ్వగా.. ఇది మూడు నెలలుగా పనిచేయట్లేదు. దీంతో మూడునెలలుగా పెళ్లి కానుకకు దరఖాస్తు చేసుకునే వీల్లేకపోయింది. ఫలితంగా ఐదువేల మంది ముస్లింలు పెళ్లి కానుకకు దరఖాస్తు చేసుకునే అర్హత కోల్పోయారు. ఇక గిరిజనుల్లో దాదాపు పదివేల మంది ఈ అవకాశాన్ని కోల్పోయారు. ఇక ఎస్సీ, బీసీల్లో సుమారు 25వేల మంది ఈ అవకాశాన్ని కోల్పోయినట్లు అధికారులే చెబుతుండడం గమనార్హం. మరోవైపు వెబ్సైట్ లోపాల వల్ల దరఖాస్తు చేసుకున్న వారిలో ఇప్పటికీ సుమారు 25వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెళ్లి కానుక అందలేదని సమాచారం. ఈ విధంగా పేదరికంలో ఉన్న ఆడపిల్లల పెళ్లికోసం ఆదుకునేందుకు ఉద్దేశించిన ఈ పెళ్లి కానుక పథకం ప్రభుత్వం పెట్టిన తిరకాసులతో వారికి ఏమాత్రం అందకుండా పోతోంది. -
పప్పన్నం కొందరికేనా..?
జిల్లాలో ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. చౌక దుకాణాల్లో అందజేస్తున్న కందిపప్పును అరకొరగా ఇస్తూ.. ప్రభుత్వం లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తోంది. జిల్లాకు దాదాపు 2వేల టన్నుల కంది అవసరం కాగా.. అందులో నాలుగోవంతు మాత్రమే పంపిణీ చేశారు. ఫలితంగా పప్పన్నం కొందరికేనా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. చిత్తూరు కలెక్టరేట్: ప్రతి తెల్ల రేషన్‌కార్డుకు కందిపప్పు అందించి, ఇంటింటా పప్పన్నం తినిపిస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్దల మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. జూలైకు అందించాల్సిన కందిపప్పు చౌక దుకాణాల్లో కానరాకపోవడమే ఇందుకు నిదర్శనం. జిల్లాలో మొత్తం 2,880 చౌకదుకాణలు ఉన్నాయి. వీటిలో 11,07,810 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రతినెలా ఈ కార్డుదారులకు ప్రభుత్వం ప్రజా పంపిణీ పేరుతో బియ్యం, చక్కెర, రాగులు అందిస్తోంది. వీటితో పాటు జూలై నుంచి ప్రతికార్డుకు 2 కిలోల చొప్పున కందిపప్పు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లావ్యాప్తంగా అన్ని కార్డులకు పంపిణీ చేయాలంటే 2,215 టన్నుల మేరకు కందిపప్పు అవసరం ఉంది. అయితే పౌరసరఫరాల శాఖ అధికారులు కేవలం 502 టన్నుల మేరకు మాత్రమే ఎంఎల్ పాయింట్లకు చేరవేశారు. అక్కడి నుంచి ఎంపిక చేసిన కొన్ని దుకాణాలకు మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. వీటిలోనూ అధికశాతం కందిపప్పును చంద్రన్న మాల్స్‌కే తరలించడం గమనార్హం. దీంతో చౌక దుకాణాలకు వచ్చే కార్డుదారులందరికీ కంది పప్పు అందడం లేదు. ఆదేశాలు తూచ్.. కందిపప్పును సరఫరా చేసుకునేందుకు డీలర్లు కేజీకి రూ. 39.50 చొప్పున చెల్లించాల్సి ఉంది. ఇంత మొత్తంలో డీలర్లు చెల్లించడం కష్టం అని భావించిన ప్రభుత్వం అప్పుగా ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. ఆయితే ఆ ఆదేశాలను జిల్లా అధికారులు బేఖాతర్ చేశారు. డీలర్లకు పూర్తిస్థాయిలో కందిపప్పు సరఫరా చేయలేకపోయారు. జిల్లాకు వచ్చిన 502 టన్నుల కందిపప్పు కేవలం 2.50 లక్షల కార్డుదారులకు మాత్రమే సరిపోతుంది. మిగిలిన 8.50 లక్షల కార్డుదారులు రిక్తహస్తాలు తప్పడం లేదు. బకాయిల సాకుగా చూపి.. జిల్లాకు వచ్చిన 502 టన్నుల కందిపప్పును కూడా అధికారులు పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు. డీలర్లు గతంలో తీసుకున్న నిత్యావసర సరుకులకు చెల్లించాల్సిన మొత్తాలు పెండింగ్‌లో ఉండడంతో కందిపంపిణీని నిలిపి వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పాత బకాయిలు చెల్లిస్తేనే.. కంది పప్పు అందిస్తామని తేల్చి చెబుతున్నారు. విమర్శల వెల్లువ.. గత ప్రభుత్వ హయాంలో ప్రజాపంపిణీ ద్వారా 12 రకాల నిత్యావసర సరుకులను అందించేవారు. అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర సరుకులకు క్రమేణా కోత విధిస్తూ వచ్చింది. ఆఖరుకు చౌకదుకాణాల ద్వారా కార్డుదారులకు బియ్యం మాత్రమే పంపిణీ చేశారు. దీనిపై ప్రజలు, ప్రతిపక్షాల నుంచి నిరసన వ్యక్తం కావడంతో ప్రభుత్వం అరకిలో చక్కెర, ఆతర్వాత రాగులు పంపిణీ చేస్తూ వస్తోంది. ఇక ఈ నెల నుంచి కందిపప్పు పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం గట్టిగా ప్రచారం చేసింది. అయితే షాపులకు పూర్తిస్థాయిలో పప్పు సరఫరా చేయలేకపోయింది. దీంతో జిల్లా ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. బకాయిలు ఉన్న డీలర్లకు అందించలేదు.. జిల్లాలో ఇప్పటి వరకు 502 టన్నుల మేరకు కందిపప్పును ఎంఎల్ పాయింట్లకు అందించాం. అందులో బకాయిలు ఉన్న డీలర్లను మినహాయించి మిగిలిన వారికి మాత్రమే అందజేశాం. ఎన్ని చౌకదుకాణాలకు ఇవ్వలేదనే పక్కా సమాచారం మా వద్దలేదు.– మంజుభార్గవి,పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ -
ఇచట నిరుద్యోగులు...ఉద్యోగులుగా..
సాక్షి, నంద్యాల(ఎడ్యుకేషన్) : ఇనుప కండలు, ఉక్కు నరాలు కలిగిన పది మంది యువకులు చాలు నాకు. దేశాన్ని పునర్నిర్మించటానికి, అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లటానికి. తన మాటలతో యువతను ఉత్తేజ పరిచారు స్వామి వివేకానంద. కొంత మంది యువకులు వారిని ఆదర్శంగా తీసుకొని తమ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. వివిధ పోటీపరీక్షల కోసం యువకులకు ఉచితంగా శిక్షణనిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కూడా తోడు కావడంతో వివేకానందుల వారి ఆలోచనలకు ప్రాణం పోశారు. కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకొని వివిధ రకాల పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తుంది. ఆ శిక్షణలో రాటుదేలిన పలువురు నేడు అత్యున్నత స్థాయిలో పదవులను అలంకరించారు. నంద్యాలలోని నాగకృష్ణమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆద్వర్యంలో ఏపీపిఎస్సీ నిర్వహించే గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, వీఆర్ఓ ఉద్యోగాలకు నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించబడును. కేవలం 100 మంది విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించబడునని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెలిపారు. అలాగే రైల్వే బోర్డ్ నిర్వహించే గ్రూప్-సి, గ్రూప్-డి, రైల్వే పోలీసు ఉద్యోగాలకు జూలై 16న తరగతులు ప్రారంభం. ఉపాధ్యాయ పరీక్షల కోసం డీఎస్సీ తరగతులను జూలై 18న తరగతులు ప్రారంభిస్తామని, ఈ అవకాశాన్ని ప్రతి పేద విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సంస్థ నిర్వాహకులు గిరీష్ బాబు తెలిపారు. అభ్యర్థులకు తెల్లరేషన్ కార్డు కలిగి ఉంటే వారికి నెలకు 1000 స్టయిఫండ్(శిక్షణ భృతి) కల్పించబడును. అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వసతితో పాటు బోజన సౌకర్యం కల్పించబడునని తెలిపారు. తరగతులు ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 6గం. వరకు నిర్వహించబడును. శిక్షణా కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్ అందించబడునని సంస్థ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అప్లికేషన్లు లభించు స్థలం..శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్, నంద్యాల. మరింత సమాచారం కోసం 99850 41168 నెంబర్‌ను సంప్రదించగలరు. -
వారే ఒక సైన్యం
సాక్షి, నంద్యాల(ఎడ్యుకేషన్) : ఇనుప కండలు, ఉక్కు నరాలు కలిగిన పది మంది యువకులు చాలు నాకు. దేశాన్ని పునర్నిర్మించటానికి, అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లటానికి. తన మాటలతో యువతను ఉత్తేజ పరిచారు స్వామి వివేకానంద. కొంత మంది యువకులు వారిని ఆదర్శంగా తీసుకొని తమ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. వివిధ పోటీపరీక్షల కోసం యువకులకు ఉచితంగా శిక్షణనిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కూడా తోడు కావడంతో వివేకానందుల వారి ఆలోచనలకు ప్రాణం పోశారు. కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకొని వివిధ రకాల పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తుంది. ఆ శిక్షణలో రాటుదేలిన పలువురు నేడు అత్యున్నత స్థాయిలో పదవులను అలంకరించారు. నంద్యాలలోని నాగకృష్ణమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆద్వర్యంలో ఏపీపిఎస్సీ నిర్వహించే గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, వీఆర్ఓ ఉద్యోగాలకు నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించబడును. కేవలం 100 మంది విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించబడునని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెలిపారు. అలాగే రైల్వే బోర్డ్ నిర్వహించే గ్రూప్-సి, గ్రూప్-డి, రైల్వే పోలీసు ఉద్యోగాలకు జూలై 16న తరగతులు ప్రారంభం. ఉపాధ్యాయ పరీక్షల కోసం డీఎస్సీ తరగతులను జూలై 18న తరగతులు ప్రారంభిస్తామని, ఈ అవకాశాన్ని ప్రతి పేద విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సంస్థ నిర్వాహకులు గిరీష్ బాబు తెలిపారు. అభ్యర్థులకు తెల్లరేషన్ కార్డు కలిగి ఉంటే వారికి నెలకు 1000 స్టయిఫండ్(శిక్షణ భృతి) కల్పించబడును. అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వసతితో పాటు బోజన సౌకర్యం కల్పించబడునని తెలిపారు. తరగతులు ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 6గం. వరకు నిర్వహించబడును. శిక్షణా కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్ అందించబడునని సంస్థ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అప్లికేషన్లు లభించు స్థలం..శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్, నంద్యాల. మరింత సమాచారం కోసం 99850 41168 నెంబర్‌ను సంప్రదించగలరు. -
ఉచిత వైద్యం..ఇలా పొందుదాం!
తెల్ల రేషన్ కార్డు, ఎంప్లాయిమెంట్ హెల్త్ స్కీం (ఈహెచ్ఎస్), వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ కార్డులు కలిగినవారు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధానమైన ప్రభుత్వ, ప్రముఖ కార్పొరేట్ హస్పిటల్స్లలో ఉచితంగావైద్య సేవలు పొందవచ్చు.అందుకు తగిన సమాచారం తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఏ హాస్పిటల్లో ఏ వైద్యం లభిస్తుందో తెలియక అయోమయానికి గురి అవుతున్నారు. అనుకోకుండా సంభవించే ఆపదలు,అనారోగ్య సమయాల్లో ఈ ఉచిత వైద్య సేవలు ఎంతగానో ఉపయోగపడుతాయి. మనిషి ప్రాణాలను కాపాడుతాయి. అందుకు ‘సాక్షి’ అందిస్తున్న సమాచారు. కడప రూరల్: మనిషి అనారోగ్యం పాలైతే వైద్య సేవలకు అధిక ఖర్చులు చేయాల్సి వస్తోంది.. ఇలాంటి తరుణంలో నిరుపేదలకు వర్తించే నాటి రాజీవ్ ఆరోగ్య శ్రీ. నేటి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్, వర్కింగ్ జర్నలిస్ట్‌లకు హెల్త్ కార్డులు ఎంతగానో ఉపయోగపడుతాయి. కాగా తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి వర్తించే ఎన్టీఆర్ వైద్య సేవలో 1044 వ్యాధులు, ఈహెచ్ఎస్, వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ కార్డులు కలిగిన వారికి 1885 రకాల జబ్బులకు ఉచితంగా వైద్య సేవలను పొందవచ్చు. ఏ కార్డు లేని వారికి ‘ఆరోగ్య రక్ష’ దిక్కు... మొన్నటి వరకు తెల్లరేషన్ కార్డు ఉంటేనే ఎన్టీఆర్ వైద్య సేవలు వర్తించేవి.కార్డు లేకపోతే సీఎం పేషీకి వెళ్లి ప్రత్యేకంగా అనుమతి తీసుకొని రావాల్సిన పరిస్ధితి ఏర్పడేది. ఇదంతా వ్యయ ప్రయాసాలతో కూడింది. తాజాగా ఆ విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. ఇప్పుడు ఏ వర్గమైనా సరే.. ఏ కార్డు లేనివారు ‘ఆరోగ్య రక్ష’ పథకంలో చేరాలి.ఇందులో చేరాలంటే ఒక వ్యక్తి ఏడాదికి రూ. 1244 లను మీ సేవా కేంద్రాలు లేదా కడప పాత కలెక్టరేట్లోని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా జిల్లా కార్యాలయంలో చెల్లించాలి. ఇందులో చే రిన వారికి ఎన్టీఆర్ వైద్య సేవ తరహలోనే 1044 రకాల వ్యాధులకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఉన్న 22 హాస్పిటల్స్‌లలో ఉచితంగా వైద్య సేవలను పొందవచ్చు. ఆపరేషన్ లేని వ్యాధులకు కూడా వైద్యం... పెరాల్సిస్ తదితర ఆపరేషన్‌తో సంబంధంలేని వ్యాధులకు కూడా ఉచితంగా వైద్య సేవలను పొందవచ్చు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వైద్య సేవలను పొందవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ వెబ్సైట్, ఆయా హాస్పిటల్స్‌లోని ఆరోగ్య మిత్ర లేదా కడప పాత కలెక్టరేట్లో గల డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కో ఆర్డినేటర్ కార్యాలయంలో తెలుసుకోవచ్చు. వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి... ఉచిత వైద్య సేవలకు సంబంధించి ఆయా హాస్పిటల్స్‌లో ఉన్న ఆరోగ్య మిత్రలను లేదా కడప పాత కలెక్టరేట్లోని ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కో ఆర్డినేటర్ కార్యాలయాన్ని సంప్రదింవచ్చు. అలాగే ఏ కార్డు లేనివారు ‘ఆరోగ్య రక్ష’ పథకంలో చేరి లబ్దిపొందాలి. ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి– డాక్టర్ శివనారాయణ,జిల్లా కో ఆర్డినేటర్, ఎన్టీఆర్ వైద్య సేవ -
ఏమాయ చేశారో..!
అనంతపురంలోని మూడో డివిజన్ పరిధిలో భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తెల్లరేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా ఇటీవల రెండు కార్డులు మంజూరయ్యాయి. అతను, అతని భార్యకు కలిపి ఒక కార్డు ఇచ్చారు. ఇద్దరు పిల్లలకు మాత్రమే మరో కార్డు జారీ చేశారు. రెండింటిలోనూ కుటుంబ పెద్ద భాస్కర్‌రెడ్డిని చూపించారు. ఉంటున్నది 3వ డివిజన్ అయితే 16వ డివిజన్ కమలానగర్‌లోని 51 నెంబరు రేషన్ షాపును నమోదు చేశారు. ఒక్క భాస్కర్‌రెడ్డి విషయంలో మాత్రమే జరిగిన తప్పదం కాదు.. జిల్లాలోని వేల సంఖ్యలోని కార్డుల్లో ఇలాంటి తప్పిదాలు చోటు చేసుకున్నాయి. అనంతపురం అర్బన్ : నాల్గో విడత జన్మభూమి సందర్భంగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలకు జారీ చేసిన తెల్లకార్డుల్లో వివరాలు ఇష్టానుసారంగా నమోదయ్యాయి. కంప్యూటర్ ఆపరేటర్ల నిర్వాకంతో తప్పిదాలు చోటు చేసుకున్నాయి. ఒక కుటుంబాన్ని రెండుగా విభజించి వేర్వేరుగా రెండు కార్డులు జారీ అయ్యాయి. కొన్ని కార్డుల్లో కుటుంబ యజమానిని మాత్రమే చూపిస్తూ, మిగతా కుటుంబ సభ్యుల ఫొటోలను, పేర్లను చేర్చలేదు. కొన్ని కార్డుల్లో పేర్లు చేర్చారు తప్ప సభ్యుల ఫొటోలు ముద్రించలేదు. వేలాది కార్డుల్లో ఇలాంటి తప్పిదాలు దొర్లాయి. 99,954 కార్డుల మంజూరు జన్మభూమి కార్యక్రమం సందర్భంగా జిల్లాకు 99,954 కార్డులను ప్రభుత్వం మంజూరు చేయగా జన్మభూమి గ్రామ సభల్లో 72,531 కార్డులను లబ్ధిదారులకు జారీ చేశారు. మిగతా కార్డులను తహసీల్దారు కార్యాలయాలకు లబ్ధిదారులు స్వయంగా వెళ్లి తీసుకున్నారు. జారీ అయిన కార్డుల్లో వివరాలు తప్పుగా నమోదయ్యాయి. దీంతో లబ్ధిదారులు చేర్పులు, మార్పుల కోసం తహసీల్దారు కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ల నిర్వాకం కార్డుల్లో లబ్ధిదారుని వివరాల నమోదు విషయంలో కంప్యూటర్ ఆపరేటర్ల నిర్వాకం కనిపిస్తోంది. కార్డుకోసం దరఖాస్తు చేసుకునే సమయంలో తమ కుటుంబం గ్రూప్ ఫొటోను జతచేసి ఇచ్చారు. దీన్ని స్కాన్ చేసి కార్డులో పొందుపర్చకుండా ఇష్టానుసారంగా వివరాలు, ఫొటోలను నమోదు చేశారు. చాలా కార్డుల్లో కేవలం కుటుంబ యజమాని ఫొటో ఒక్కటే ముద్రించారు. కుటుంబ సభ్యల ఫొటోలు లేవు. కొన్ని కార్డుల్లో కుటుంబ సభ్యుల ఫొటోలు, పేర్లు కూడా నమోదు చేయలేదు. మరికొన్ని కార్డుల్లో ఆధార్‌లోని ఫొటోలను రేషన్ కార్డుల్లో ఉంచారు. ఇవి ఒక రకం తప్పదాలైతే...లబ్ధిదారుల నివాస ప్రాంతానికి సంబంధం లేని డివిజన్లలోని రేషన్ దుకాణం కేటాయించారు. చంద్రబాబు కొట్టాల్లో నివాసముంటున్న ఒకరికి పాపంపేట పంచాయతీలోని చౌక దుకాణం కేటాయించారు. తమకు కేటాయించిన చౌక దుకాణం ఎక్కడ వస్తుందో అంతుపట్టక లబ్ధిదారులు కాలనీలు పట్టుకుని తిరగాల్సి వస్తోంది. ఇలాంటి తప్పిదాలు కేవలం కంప్యూటర్ ఆపరేటర్ల నిర్లక్ష్యంగా కారణంగానే చోటు చేసుకున్నాయి. కొరవడిన పర్యవేక్షణ కార్డుల్లో లబ్ధిదారులు వివరాలు నమోదు ప్రక్రియ చేపట్టినప్పటి నుంచి అధికారుల పర్యవేక్షణ కొరవడింది. కంప్యూటర్ ఆపరేటర్లు కార్డుల్లో వివరాలో ఏ విధంగా నమోదు చేస్తున్నారు. ఫొటోలను ఎలా ఉంచుతున్నారు. అనేవాటిని అధికారులు కనీసంగా కూడా పట్టించుకోలేదని తెలిసింది. దరఖాస్తులను కంప్యూటర్ ఆపరేటర్లకు అందజేసి వివరాలను నమోదు చేయాలని చెప్పి వదిలేశారు. దీంతో కంప్యూటర్ ఆపరేటర్లు ఇష్టానుసారంగా వివరాలను నమోదు చేశారు. త్వరలో మార్పులు, చేర్పులు రేషన్ కార్డుల్లో చోటు చేసుకున్న తప్పిదాలను సరిచేసేందుకు ఒక నెల రోజుల్లో ప్రభుత్వం నుంచి అనుమతి వస్తుంది. కుటుంబ సభ్యుల చేర్పులు, ఫొటో అప్లోడ్ ప్రక్రియను మీ సేవ ద్వారా చేస్తారు. చేర్పులకు, మార్పులకు ప్రభుత్వం అనుమతించిన వెంటనే ప్రకటిస్తాం. అప్పుడు లబ్ధిదారులు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. – శివశంకర్‌రెడ్డి, ఇన్చార్జ్ డీఎస్ఓ -
‘ఆరోగ్యశ్రీ’లో మళ్లీ కోత
సాక్షి, అమరావతి: తెల్ల రేషన్ కార్డు కలిగిన పేదలకు ఉచితంగా వైద్య సదుపాయం అందించే ఆరోగ్యశ్రీ పథకానికి రోజు రోజుకూ గడ్డుకాలం ఎదురవుతోంది. ఇప్పటికే సుమారు 10 లక్షల పైన కార్డులను ఆన్లైన్ జాబితా నుంచి తొలగించిన ప్రభుత్వం తాజాగా మరో లక్షన్నర కార్డులకు కోత వేసినట్టు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ (ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్) అధికార వర్గాలు తెలిపాయి. దీంతో పేద బాధితులు లబోదిబోమంటున్నారు. వైద్యం కోసం ఆస్పత్రులకు వెళ్లిన రోగుల కార్డులను ఆరోగ్య మిత్రలు ఆన్లైన్లో పరిశీలించి.. మీ కార్డులు జాబితాలో లేవని చెబుతున్నారు. దీంతో ఇక చేసేదేమి లేక బాధితులు డబ్బులు చెల్లించి ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లక తప్పని దుస్థితి. రకరకాల జబ్బులతో ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్న వీరి గోడు సర్కారు చెవి కెక్కడం లేదు. 3 నెలలు రేషన్ తీసుకోలేదని... ఆరోగ్యశ్రీని భారమైన పథకంగా భావిస్తున్న సర్కారు ఏదోవిధంగా కోత పెట్టి తగ్గించుకోవాలని చూస్తున్నట్టు బాధితులు వాపోతున్నారు. ఇందులో భాగంగానే రేషన్‌కూ ఆరోగ్యశ్రీకి లింకు పెట్టారు. మూడు మాసాలు వరుసగా రేషన్‌షాపులో రేషన్ తీసుకోకపోతే అలాంటి వారిని ఆరోగ్యశ్రీ జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఈ విషయం ఆరోగ్యశ్రీ కార్డుదారులకు ఏమాత్రం తెలియకుండానే జరుగుతోంది. ఆరోగ్యశ్రీ కార్డు నంబర్‌ను ఆన్లైన్లో తొలగిస్తే చాలు ఏ ఆస్పత్రికి వెళ్లినా ఆ కార్డు పని చేయదు. ఆ విషయం తెలియని పలువురు వ్యయ ప్రయాసలకు ఓర్చి ఆస్పత్రులకు రావడం, కార్డు పని చేయదని తెలుసుకుని వెనుదిరగడం పరిపాటిగా మారింది. గడిచిన ఏడు మాసాల్లో కోత విధించిన కార్డుల సంఖ్య పదకొండున్నర లక్షలకు చేరినట్టు తేలింది. ప్రతి 3 మాసాలకు పౌర సరఫరాల శాఖ రేషన్ తీసుకోని కుటుంబాల వివరాలను ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు ఇవ్వడం, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆ కుటుంబాలను జాబితా నుంచి తొలగించడం జరుగుతోంది. ఆది నుంచి చిన్నచూపే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ పథనాన్ని ఎలాగైనా వదిలించుకోవడానికే మొగ్గు చూపుతోంది. ఏదో ఒక సాకుతో లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడమే ధ్యేయంగా పెట్టుకుంది. ఒక్కోసారి ఒక అంశానికి లింకు పెడుతూ లక్షలాది కుటుంబాలను తప్పించడం దారుణం అని వైద్య వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. భవిష్యత్‌లో ఆధార్ లేదనో, పింఛన్ తీసుకోలేదనో లింకులు పెడుతూ మరిన్ని కుటుంబాలను ఈ పథకానికి దూరం చేయడం ఖాయమని ఓ అధికారి ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. ఎలాగైనా సరే ఈ పథకాన్ని ఎత్తివేయడమే ధ్యేయంగా ప్రభుత్వం చర్యలు ఉంటున్నాయన్నారు. ఆరోగ్యశ్రీలో ఇక్కట్లు ఇవీ.. - మూడు మాసాలు రేషన్ సరుకులు తీసుకోకపోతే ఆరోగ్యశ్రీ జాబితా నుంచి తొలగింపు - రాష్ట్రంలో పలు జబ్బులకు వైద్యం అందకపోయినా హైదరాబాద్‌లో వైద్యం పొందేందుకు నిరాకరణ - కొత్తగా ఇచ్చిన లక్షలాది తెల్లరేషన్ కార్డులకు ఇప్పటికీ మంజూరు కాని ఆరోగ్యశ్రీ కార్డులు - 133 జబ్బులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్యం.. ఇప్పటికీ సరిగా అందని వైనం - రోగులు ఆస్పత్రులకు వచ్చి వెళ్లడానికి ఇస్తున్న రవాణా చార్జీల నిలిపివేత - జబ్బు నిర్ధరణ పరీక్షలు చేయించుకుని వస్తేగానీ ఆరోగ్యశ్రీలో చేర్చుకోవడం లేదు - జబ్బు నిర్ధారణకే వేలాది రూపాయలు ఖర్చు చేయలేక పేదలు సతమతం - సకాలంలో నిధులు చెల్లించకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య సేవల్లో జాప్యం - ప్రభుత్వాసుపత్రుల్లో తగినంత మంది వైద్యులు లేక సత్వరం అందని సేవలు వలస కుటుంబాలకు తీరని నష్టం ఆరోగ్యశ్రీ కార్డుల కోతతో 90 శాతం మంది వలస జీవులకే నష్టం జరుగుతోంది. బతుకుదెరువు కోసం వివిధ ప్రాంతాలకు వెళుతున్న వలస కూలీలు నాలుగైదు మాసాలు సొంత ఊరికి వెళ్లలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో రేషన్ సరుకులు తీసుకోలేరు. ఈ కారణంగా ఆరోగ్యశ్రీ కార్డులు కోల్పోతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన కుమారి అనే మహిళ కుటుంబం ఆరు మాసాలుగా విజయవాడలో ఉంటోంది. భర్త సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుండగా, కుమారి అపార్టుమెంట్లో పని మనిషిగా ఉంటోంది. ఒక రోజు తీవ్ర కడుపునొప్పితో బాధ పడుతున్న తన భర్తను విజయవాడలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చిం ది. ఆరోగ్యశ్రీ కార్డును పరిశీలించి జాబితా నుంచి తొలగించారని అక్కడి సిబ్బంది చెప్పారు. దీంతో భర్తను ప్రైవేట్ అస్పత్రిలో చేర్పించి.. డబ్బులు అప్పు తెచ్చుకుని వైద్యం చేయించింది. ఇలాంటి కుటుంబాలు లక్షల్లో ఉండటం కలచి వేస్తున్న అంశం. హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కార్డుదారులకు వైద్యం అందడంలేదు. ప్రభుత్వం ఆ అవకాశాన్ని లేకుండా చేసింది. పరిమితంగా కొన్ని వర్గాలను మాత్రమే అనుమతించింది. సర్కారు తీరు చూస్తుంటే.. స్థానికంగా బతికేందుకు పనులున్నా లేకపోయినా అర్ధాకలితో అలమటించాలన్నట్లు ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొట్ట చేత పట్టుకుని నగరాలకు వలస వెళ్తే అరోగ్య శ్రీ కార్డును తొలగిస్తారనే భయంతో ఇకపై చాలా మంది పేదలు ఉన్న ఊళ్లోనే బతుకీడ్చాల్సిన దుస్థితి దాపురించింది.