కార్డులకు కోతా?.. బియ్యం మోతా? | No white ration card to produce ration for poor people | Sakshi
Sakshi News home page

కార్డులకు కోతా?.. బియ్యం మోతా?

Published Sun, Aug 3 2014 3:23 AM | Last Updated on Thu, Oct 4 2018 5:10 PM

కార్డులకు కోతా?.. బియ్యం మోతా? - Sakshi

కార్డులకు కోతా?.. బియ్యం మోతా?

ఆహార భద్రతా చట్టం త్వరలో అమల్లోకి రానున్న నేపథ్యంలో తెల్ల రేషన్ కార్డులను కుదించడమా...? లేక మిల్లర్ల నుంచి కిలో బియ్యం రూ.26 చొప్పున కొనుగోలు చేసి సరఫరా చేయడమా?

* ఎటూ తేల్చుకోలేకపోతున్న రాష్ట్ర సర్కారు
* ఆహార భద్రత చట్టం కింద కేంద్రం ఇచ్చే కోటా చాలదు
* తెల్లకార్డుదారులకందరికీ ఇవ్వాలంటే మిల్లర్ల నుంచి కొనాల్సిందే
* రూపాయికి ఇచ్చే బియ్యాన్ని మిల్లర్ల నుంచి రూ.26కి కొనాలి
* ‘ఆధార్’తో తెల్లరేషన్ కార్డుల కుదింపునకు రాష్ట్ర సర్కారు యోచన
* గ్రామాల్లో 60 శాతం, పట్టణాల్లో 40 శాతం జనాభాకే కేంద్ర బియ్యం

 
సాక్షి, హైదరాబాద్: ఆహార భద్రతా చట్టం త్వరలో అమల్లోకి రానున్న నేపథ్యంలో తెల్ల రేషన్ కార్డులను కుదించడమా...? లేక మిల్లర్ల నుంచి కిలో బియ్యం రూ.26 చొప్పున కొనుగోలు చేసి సరఫరా చేయడమా? అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఆహార భద్రతా చట్టం అమలైతే కేంద్రం ఇస్తున్న బియ్యం కోటా తెల్ల రేషన్‌కార్డుదారులకు సరిపోదని అధికారులు చెబుతున్నారు.
 
 ఏపీఎల్ బియ్యం.. తెల్లకార్డుదారులకు
 రాష్ట్రంలో సుమారు 5.50 కోట్ల జనాభా ఉండగా ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా 4.50 కోట్ల మందికి సబ్సిడీపై బియ్యం సరఫరా చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అన్నపూర్ణ, అంత్యోదయ అన్న యోజన, దారిద్య్రరేఖకకు దిగువనున్న( బీపీఎల్), దారిద్య్రరేఖకు ఎగువనున్న ( ఎపీఎల్), అదనపు ఏపీఎల్ తదితర రంగాల కింద కేటాయిస్తున్న బియ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ పెద్దగా భారం లేకుండానే తెల్ల రేషన్ కార్డులకు కిలో రూపాయి చొప్పున సబ్సిడీ బియ్యం సరఫరా చేస్తోంది. కేంద్రం ఏపీఎల్ కింద ఇస్తున్న బియ్యాన్ని పింక్ రేషన్ కార్డులకు సరఫరా చేయాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పింక్ రేషన్ కార్డులకు బియ్యం సరఫరా చేయకుండా ఆ మొత్తాన్ని తెల్ల రేషన్ కార్డులకు సబ్సిడీపై ఇస్తోంది. పింక్ రేషన్ కార్డుల కోసం కేంద్రం ఇచ్చే బియ్యానికి కిలో రూ.7 చొప్పున చెల్లించాల్సి వస్తోంది. అవే బియ్యాన్ని తెల్ల రేషన్ కార్డులను కిలో రూపాయి చొప్పున సరఫరా చేస్తున్నారు.
 
ఒకే కోటా కింద కేంద్రం బియ్యం
 అయితే ఆహార భద్రత చట్టం అమలు కాగానే కేంద్ర ప్రభుత్వం ఒకే విభాగం కింద బియ్యం కేటాయింపులను చేస్తుంది. బీపీఎల్ రంగాలకు మాత్రమే కిలో బియ్యం రూ.3 చొప్పున కేంద్రం ఇస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 90 శాతం మందికి సబ్సిడీ బియ్యం సరఫరా చేస్తున్నారు. ఆహార భద్రతా చట్టం అమలు కాగానే కేంద్రం కేటాయించే బియ్యం కోటా భారీగా తగ్గిపోనుంది. గ్రామీణ ప్రాంతాల్లో 60 శాతం జనాభాకు, పట్టణాల్లో 40 శాతం  జనాభాకు మాత్రమే కేంద్రం ఆహార భద్రతా చట్టం కింద బియ్యం కోటా కేటాయిస్తుంది. అంతకు మించి ఒక్క బియ్యం గింజను కూడా కేంద్రం కేటాయించదు. అదనపు భారం పడితే రాష్ట్ర ప్రభుత్వాలే భరించుకోవాలని కేంద్రం స్పష్టం చేస్తోంది. కేంద్రం కేటాయించే బియ్యం ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 1.40 కోట్ల మంది తెల్ల రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసేందుకు సరిపోవు.
 
అదనంగా రూ.1500 కోట్ల భారం
 తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కిలో రూ. 1 చొప్పున బియ్యం సరఫరా చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్ల నుంచి కిలో రూ.26 చొప్పున బియ్యం కొనాల్సి ఉంటుంది. దీని వల్ల ప్రభుత్వంపై అదనంగా ఏటా రూ.1500 కోట్ల భారం పడుతుందని అంచనా. రేషన్ కార్డులకు ఆధార్‌ను అనుసంధానం చేయడం ద్వారా దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాల సంఖ్యను కుదించి భారం తప్పించుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. దీని వల్ల తెల్లరేషన్ కార్డుల సంఖ్య గణనీయంగా తగ్గి ప్రభుత్వంపై భారం పడదని తెలిపారు. దీనిపై రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఓ సీనియర్ మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కిలో రూపాయికి ఇస్తున్న బియ్యం ధరను పెంచటం వల్ల నిధులు పెద్దగా ఆదా కావని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాల సంఖ్యను తగ్గించడం వల్లే అదనపు భారం నుంచి తప్పించుకోవచ్చునని, లేదంటే అదనపు భారం భరించాల్సిందేనని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement