ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం 58,496 ఇళ్లు, 86,344 కుటుంబాలు ఉన్నాయి. అధికారికంగా కార్పొరేషన్ రికార్డుల్లో మాత్రం 24,500 మంచినీటి కనెక్షన్లు ఇచ్చినట్లు ఉంది. వీటిల్లో బీపీఎల్ కోటాలో 5వేలు, జనరల్ కేటగిరీ కింద 19,500 కనెక్షన్లు ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డు ఉన్న నిరుపేదలు కనెక్షన్ తీసుకోవడానికి రూ.200, జనరల్ కేటగిరి కింద రూ.8 వేలు చెల్లించాలి. ఈ మొత్తం చెల్లించడం కంటే కార్పొరేషన్ సిబ్బంది చేయి తడిపితే వెంటనే కనెక్షన్లు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
మరోపక్క ప్రతీ కనెక్షన్‌కు నెలకు రూ. 110 చెల్లించాలి. ఈ కనెక్షన్‌ల ద్వారా కార్పొరేషన్‌కు నెలకు సుమారు రూ. 27లక్షల ఆదాయం రావాలి. కానీ కొంత మంది ఇళ్లలో పన్ను వసూళ్ల గురించి అధికారులపై రాజకీయ నాయకులు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అలాగే మరికొన్ని మొండి బకాయిలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా ప్రతినిధుల బకాయిలు పోను నెలకు రూ.15 లక్షలు కూడా కార్పొరేషన్‌కు ఆదాయం రావడం లేదు. నిరుపేదలను ముక్కుపిండి పన్ను వసూలు చేస్తున్న సిబ్బంది, బడా బాబుల పన్ను వసూళ్లపై కినుక వహించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అక్రమ కనెక్షన్లతో ఆదాయానికి గండి..
ప్రస్తుతం కార్పొరేషన్ పరిధిలో సుమారు 5 వేల అక్రమ మంచినీటి కనెక్షన్లు ఉన్నాయి. ఒక ఇంటికి ఒక కనెక్షన్ ఉంటే కార్పొరేషన్ సిబ్బందితో తమకున్న పరిచయాలను ఉపయోగించుకుని మరో కనెక్షన్‌ను అక్రమంగా ఏర్పాటు చేయించకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఏటా ఈ అక్రమ కనెక్షన్ల సంఖ్య పెరుగుతోంది. వీటికి తోడు చిన్నచిన్న మోటార్లను ఈ కనెక్షన్‌లకు ఏర్పాటు చేసిన నీటిని తోడుతుండడంతో శివారు కాలనీలకు మంచినీరు సరఫరా కావడం లేదు.
పట్టణంలోని శ్రీనివాస్‌నగర్, ముస్తఫానగర్, జహిర్‌పుర, చెరువుబజార్, పార్శీ బంధం, కాల్వొడ్డు ప్రాంతాల్లో ఎక్కువగా అక్రమ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి వీధిలో ఇష్టారీతిలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది సహకారంతోనే అక్రమ కనెక్షన్లు పుట్టకొస్తున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడంతో ఈ కనెక్షన్ల ద్వారానే నెలకు రూ.5.50 లక్షల కార్పొరేషన్ ఆదాయానికి గండి పడుతోంది. అక్రమ కనెక్షన్లపై కొరఢా ఝుళిపించాల్సిన మున్సిపల్ ఉన్నతాధికారులు వాటిని ముట్టుకుంటే తమ సీట్లకు ఎసరు వస్తుందన్న ఉద్దేశంతో వెనకడుగు వేస్తున్నారు.
పక్కాగా సమాచారం సేకరిస్తేనే..
ఈనెల 19న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమగ్ర సర్వే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ సర్వేతో ఇళ్లు, కుటుంబం పొందుతున్న సంక్షేమ పథకాలు అన్నీ రికార్డు కానున్నాయి. అయితే సర్వే ఫామ్‌లో మంచినీటి సౌకర్యం కూడా నమోదు చేశారు. తొలిసారిగా ఇంటింటికి వెళ్లి ఈ సర్వే చేస్తుండడంతో అక్రమ కనెక్షన్లు బయట పడే అవకాశం ఉంది. ఇతర శాఖల సిబ్బందిని కూడా సర్వేకు వినియోగిస్తుండడంతో కార్పొరేషన్ పరిధిలో అక్రమ కనెక్షన్ల సంఖ్య తేలనుంది.
ప్రతి ఇంటికి ఎన్ని కనెక్షన్లు ఉన్నాయో ‘మంచి నీటి సౌకర్యం’కాలంలో విధిగా ఎన్యుమరేటర్ పేర్కొనాలి. ఇలా వచ్చిన సమాచారాన్ని కార్పొరేషన్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారు. ఈ నివేదికలో అక్రమ కనెక్షన్ల సంఖ్య కూడా పేర్కొననున్నారు. దీంతో సర్వే అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కనెక్షన్లను కట్ చేయనున్నారు. ఇదంతా మున్సిపల్ అధికారులు పారదర్శకంగా చేస్తేనే జరుగుతుంది... లేకపోతే ప్రభుత్వం బృహత్తరంగా తీసుకున్న సమగ్ర సర్వే బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారనుంది.
సర్వేతో అక్రమ కనెక్షన్ ‘కట్’
Published Tue, Aug 12 2014 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM
Advertisement
Advertisement