‘ఇందిరమ్మ’లబ్ధిదారుల ఎంపిక కత్తిమీద సామేనా?
ప్రజాపాలనలో ఇళ్ల కోసం 80 లక్షల దరఖాస్తులు
గతంలో లబ్ధి పొందిన 14.75 లక్షల మంది దరఖాస్తులు పక్కకు మిగిలిన దరఖాస్తులు
66.30 లక్షలు... వీలైనంతగా వడపోసే యత్నంలో యంత్రాంగం
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారనుంది. ఈ పథకం కింద ప్రస్తుత సంవత్సరం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే జరిగితే రాష్ట్రవ్యాప్తంగా 4.16 లక్షల ఇళ్లను నిర్మిస్తారు. కానీ ఇళ్ల కోసం ప్రజలు సమర్పించిన దరఖాస్తులు పేరుకుపోయి ఉన్నాయి. ఏకంగా 66.30 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
భారీ కోత ఎలా?
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా వివిధ సంక్షేమ పథకాల కింద లబ్ధి కోసం కుప్పలుతెప్పలుగా దరఖాస్తులు వచ్చిపడ్డాయి. రకరకాల పథకాలకు దరఖాస్తు చేసిన ప్రజలు ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కూడా టిక్ చేశారు. ఈ విధంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన మొత్తం దరఖాస్తులు ఏకంగా 80 లక్షలు దాటాయి. వాటిని ప్రాథమికంగా పరిశీలించిన అధికారులు, గతంలో ఇందిరమ్మ ఇళ్లు పొందిన 14.75 లక్షల మంది కూడా మళ్లీ దరఖాస్తు చేసినట్టు గుర్తించారు.
దీంతో మొదటి వడపోతలో భాగంగా ఆ దరఖాస్తులను పక్కన పెట్టేశారు. దీంతో 66.30 లక్షల దరఖాస్తులు మిగిలాయి. వాటి నుంచి లబ్ధిదారుల ఎంపిక ఎలా అన్న ఆందోళన అధికారుల్లో నెలకొంది. మొదటి ఏడాదిలో 4.16 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి సంవత్సరం ఎలాంటి ఆటంకాలు లేకుండా మంజూరు చేస్తూ వెళ్లినా, వచ్చే ఐదేళ్లలో అటుఇటుగా 20 లక్షల ఇళ్లను మాత్రమే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇవి ఏమూలకూ చాలవు.
దీంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదముందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తులను రకరకాల అంశాల ఆధారంగా వడపోసి వీలైనంత మేర తగ్గించే కసరత్తు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇల్లు లేని నిరుపేదలు 30 – 35 లక్షల మంది ఉంటారన్న అంచనా ఉంది. ఒకవేళ దీన్ని పరిగణనలోకి తీసుకుని తగ్గించినా.. దరఖాస్తుల్లో ఆ సంఖ్య మేరకు పోను మిగిలినవారు అంటే సుమారు 30 లక్షల మంది తప్పకుండా అనర్హులే అవుతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆర్‌సీసీ కప్పు ఉంటే ఔటే..
ప్రాథమికంగా రూపొందించుకున్న నిబంధనల ప్రకారం.. ఆర్‌సీసీ పైకప్పు ఉన్న సొంత ఇల్లు ఉంటే ఇందిరమ్మ పథకానికి అర్హత ఉండదు. చుట్టూ కాంక్రీట్ గోడలు ఉండి, కప్పు భాగంలో రేకులు, తడకలు, పెంకులు లాంటివి ఉంటే అర్హత వస్తుంది. దీంతో ఇప్పుడు గుట్టలాగా పేరుకుపోయి ఉన్న దరఖాస్తుల్లో.. అలా ఆర్‌సీసీ పైకప్పుతో ఉన్న సొంతింటిదారులు ఎవరున్నారని వెతికి పట్టుకునే పనిలో అధికారులున్నారు.
తెల్ల రేషన్‌కార్డు ఉంటేనే..
ఇందిరమ్మ ఇల్లు పొందాలంటే కచ్చితంగా నిరుపేదలై ఉండాలి. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారినే ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది. దీంతో ఈ దరఖాస్తుదారుల్లో ఎంతమందికి తెల్ల రేషన్ కార్డు ఉందో, ఎంతమంది తప్పుడు రేషన్‌కార్డు నంబర్లు నమోదు చేశారో అన్న వివరాలను కూడా వాకబు చేస్తున్నారు.
ఈ సంవత్సరం సొంత జాగా ఉన్నవారికే!
సొంత జాగా ఉన్నవారికే ఈ సంవత్సరం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. సొంత జాగా లేని అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం స్థలం కేటాయించి మరీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా మొదటి సంవత్సరం మాత్రం సొంత జాగా లేని వారిని పరిగణనలోకి తీసుకోకూడదని నిర్ణయించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment