Telangana: ఉచిత కరెంట్‌లో మెలిక?! | 200 units are not free under Telangana Congress Govt Gruha Jyothi Scheme | Sakshi
Sakshi News home page

Telangana: 200 యూనిట్లూ ఫ్రీ కాదా?.. కాంగ్రెస్‌ సర్కార్‌ మెలిక?!

Published Mon, Feb 19 2024 4:00 AM | Last Updated on Mon, Feb 19 2024 7:47 AM

200 units are not free under Telangana Congress Govt Gruha Jyothi Scheme - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మేరకు ‘గృహజ్యోతి’ పథకం కింద ప్రతి కుటుంబానికి కచ్చితంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ సరఫరా జరగదా? అర్హత గల ప్రతి కుటుంబం నిర్దిష్ట యూనిట్ల మేరకే ఉచిత విద్యుత్‌ను పొందుతుందా? గత ఏడాది విద్యుత్‌ వినియోగాన్ని ఇందుకోసం పరిగణనలోకి తీసుకుంటున్నారా? పథకం అమలుకు ఇంధన శాఖ సిద్ధం చేసిన మార్గదర్శకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయా? అంటే.. అవుననే సమాధానమే లభిస్తోంది.

నెలవారీ ఉచితంగా అనుమతించే వినియోగం (ఫ్రీ మంత్లీ ఎలిజిబుల్‌ కన్‌జంప్షన్‌ (ఎంఈసీ) పేరిట ఉచిత విద్యుత్‌ పథకాన్ని అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. మార్చి 1 నుంచి గృహజ్యోతి పథకం అమల్లోకి రానుంది. దీంతో ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు రెడీ అయ్యాయి.  

అధికంగా వాడితే వాతలే!: ఈ మార్గదర్శకాల ప్రకారం..200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సరఫరాకు షరతులు వర్తించనున్నాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ ఇస్తుందని భావించి గతానికి భిన్నంగా ఇష్టారాజ్యంగా వినియోగాన్ని పెంచేసుకుంటే, ఆ మేరకు అదనపు వాడకానికి బిల్లులు చెల్లించక తప్పదు. గత ఆర్థిక సంవత్సరం అంటే 2022–23లో నెలకు సగటున వాడిన విద్యుత్‌కు అదనంగా 10 శాతం విద్యుత్‌ను మాత్రమే గృహ జ్యోతి పథకం కింద ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయనుంది.

నెలకు 200 యూనిట్ల గరిష్ట పరిమితికి లోబడి ఈ పథకం అమలు కానుంది. ఉదాహరణకు 2022–23లో ఒక కుటుంబ వార్షిక విద్యుత్‌ వినియోగం 960 యూనిట్లు అయితే, సగటున నెలకు 80 యూనిట్లు వాడినట్టు నిర్ధారిస్తారు. అదనంగా మరో 10 శాతం అంటే 8 యూనిట్లను కలిపి నెలకు గరిష్టంగా 88 యూనిట్ల విద్యుత్‌ను మాత్రమే ఆ కుటుంబానికి ఉచితంగా సరఫరా చేయనున్నారు. 88 యూనిట్లకు మించి వాడిన విద్యుత్‌కు సంబంధిత టారిఫ్‌ శ్లాబులోని రేట్ల ప్రకారం బిల్లులు జారీ చేయనున్నారు.   

గతేడాది 2,400 యూనిట్లు మించితే అనర్హులే 
ఒక వేళ 2022–23లో సగటున నెలకు 200 యూనిట్లకు మించి విద్యుత్‌ వాడినట్టైతే ఈ పథకం వర్తించదు. వార్షిక విద్యుత్‌ వినియోగం 2,400 యూనిట్లు మించిన వినియోగదారులు ఈ పథకానికి అర్హులు కారు. ఇక నెలకు అనుమతించిన పరిమితి (ఎంఈసీ) మేరకు ఉచిత విద్యుత్‌ను వాడిన వినియోగదారులకు ‘జీరో’ బిల్లును జారీ చేయనున్నారు. అంటే వీరు ఎలాంటి చెల్లింపులూ చేయాల్సిన అవసరం ఉండదు.
 
200 యూనిట్లు దాటితే ఉచితం వర్తించదు 
ఒక వేళ వినియోగం అనుమతించిన పరిమితికి మించినా, గరిష్ట పరిమితి 200 యూనిట్లలోపే వాడకం ఉండాలి. ఇప్పుడు కూడా అదనంగా వాడిన విద్యుత్‌కు సంబంధించిన బిల్లును సంబంధిత టారిఫ్‌ శ్లాబు ప్రకారం జారీ చేస్తారు. ఒక వేళ నెల వినియోగం 200 యూనిట్లకు మించితే మాత్రం వాడిన మొత్తం కరెంట్‌కు బిల్లును యథాతథంగా జారీ చేస్తారు. ఎలాంటి ఉచితం వర్తించదు.   

బిల్లులు బకాయిపడినా నో 
విద్యుత్‌ బిల్లుల బకాయిలు చెల్లించాల్సిన వినియోగదారులకు గృహజ్యోతి పథకం వర్తించదు. బకాయిలన్నీ చెల్లించిన తర్వాతే పథకాన్ని వర్తింపజేస్తారు. గృహజ్యోతి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బిల్లులను చెల్లించకుండా బకాయి పడిన వారికి సైతం పథకాన్ని నిలుపుదల చేస్తారు. బిల్లులు చెల్లించాకే మళ్లీ పథకాన్ని పునరుద్ధరిస్తారు. 

తెల్లకార్డు ఉంటేనే అర్హులు 
ఈ పథకం కింద తెల్లరేషన్‌కార్డు కలిగిన ప్రతి కుటుంబం గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ వాడుకోవడానికి అర్హత కలిగి ఉంటుంది. రేషన్‌కార్డు ఆధార్‌తో అనుసంధానమై ఉండాలి. లబ్ధిదారులు దరఖాస్తులో పొందుపరిచిన గృహ విద్యుత్‌ సర్వీస్‌ కనెక్షన్‌ నంబర్‌ను రేషన్‌కార్డుతో అనుసంధానం చేస్తారు. రేషన్‌కార్డుతో విద్యుత్‌ కనెక్షన్‌ను అనుసంధానం చేసినా, విద్యుత్‌ కనెక్షన్‌ ఎవరి పేరు మీద ఉందో వారి పేరు మీదే బిల్లింగ్‌ జరుగుతుంది.

ఇప్పటికే నెలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ లబ్ధి పొందుతున్న ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు కూడా గృహజ్యోతి వర్తించనుంది. గృహజ్యోతి పథకం కింద ఒక నెలకు సంబంధించిన సబ్సిడీలను తదుపరి నెలలోని 20వ తేదీలోగా రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుంది.  

తొలి విడతలో 34 లక్షల గృహాలకు.. 
ప్రజాపాలన కార్యక్రమం కింద గృహజ్యోతి పథకం అమలు కోసం 1,09,01,255 దరఖాస్తులు రాగా, అందులో 64,57,891 దరఖాస్తుదారులు ఆధార్‌తో అనుసంధానమై ఉన్న తెల్ల రేషన్‌కార్డును కలిగి ఉన్నారని రాష్ట్ర ఐటీ శాఖ నిర్ధారించింది. వీరిలో 34,59,585 మంది దరఖాస్తుదారులు మాత్రమే గృహ విద్యుత్‌ కనెక్షన్‌ కలిగి ఉండడంతో తొలి విడత కింద వీరికే గృహజ్యోతి వర్తింపజేయనున్నారు. ప్రస్తుత విద్యుత్‌ టారిఫ్‌ ప్రకారం..గృహజ్యోతి పథకం అమలుకు ఏటా రూ.4,164.29 కోట్ల వ్యయం కానుందని రాష్ట్ర ఇంధన శాఖ అంచనా వేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement