ఈవేయింగ్‌ మెషీన్లు ఉన్నా.. లేనట్టే! | White Ration Card Consumers Not Receiving Ration In Vizianagaram | Sakshi
Sakshi News home page

ఈవేయింగ్‌ మెషీన్లు ఉన్నా.. లేనట్టే!

Published Fri, Mar 29 2019 9:21 AM | Last Updated on Fri, Mar 29 2019 9:22 AM

White Ration Card Consumers Not Receiving Ration In Vizianagaram - Sakshi

ఈ వేయింగ్‌ డమ్మీ, లారీ నుంచి మరో లారీలోకి ఎక్కిస్తున్న సరుకులు

సాక్షి, బొబ్బిలి: జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏడు లక్షలకు పైగా ఉన్న తెలుపు రంగు రేషన్‌ కార్డు లబ్ధిదారులకు పంపిణీ చేసే సరుకులను ఈ వెయింగ్‌లో ఇచ్చి జిల్లాలోని 1428 రేషన్‌ షాపులకు తరలిస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం జరగడం లేదు. అలాగే వాహనాలకు జీపీఎస్‌ సిస్టమ్‌ను అమర్చామ ని చెబుతున్నా ఆ విధానం ఎక్కడా అమలు కాలేదు. మొత్తంగా అంతా సాదా సీదాగా పాత పద్ధతిలోనే నడుస్తున్నది. ప్రజాపంపిణీ రవాణాను జీపీఎస్‌లో పెట్టాక ఇక రూట్‌ ఆఫీసర్లతో పనేముందని వారిని కూడా తొలగించారు. జిల్లా వ్యాప్తంగా టన్నుల కొద్దీ బియ్యం, పంచదార, కందిపప్పుతో పాటు అంగన్వాడీ కేంద్రాలకివ్వాల్సిన సరుకులను కూడా ఇలానే తరలిస్తున్నారు. ఈవెయింగ్‌ అన్న ఊసే లేదు. 


రేషన్‌ దుకాణాల విధానమే
రేషన్‌ దుకాణాలకు ఇచ్చే సరుకులు తూకం తక్కువ వస్తున్నాయని డీలర్లు పలుమార్లు ఫిర్యాదు చేశారు. వారు కూడా ఈ వేయింగ్‌ విధానాన్ని కేవలం ఒకే సరకును పెట్టి అన్ని కార్డులకూ దానినే సరుకుగా చూపిస్తున్నారు. పదే పదే డీలర్లు గోదాముల్లో ఈ వెయింగ్‌ కోరుతున్నారని ప్రవేశ పెట్టినా అమలు మాత్రం జరగడం లేదు. దీంతో రేషన్‌ షాపుల్లో ఏ విధంగా అమలు చేస్తున్నారో గోదాముల్లోనూ ఇదే పద్ధతిని అమలు చేస్తున్నారు. డమ్మీ ఈ వేయింగ్‌ చేపట్టినా ఆ విధానం కూడా డీలర్లతోనే చేయించడం విశేషం. ఆ రోజుకు లారీల్లో ఎంత మంది డీలర్లకు సరుకులు వెళితే వారే ఈ వేయింగ్‌ బిల్లు తీసుకుని సరుకులు పట్టుకుపోతున్నారు. 


కానరాని వివరాలు
ఎంఎల్‌ఎస్‌ గోదాముల్లో సరుకుల వివరాలను పట్టికల్లో నమోదు చేయడం లేదు. ఎక్కడి బోర్డులక్కడే ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కానీ పట్టించుకునే నాథుడే లేడు. దీనిపై అధికారులు కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీనిపై సాక్షి వారిని ప్రశ్నించగా వారినుంచి మౌనమే సమాధానమవుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement