MLS point
-
రేషన్ బియ్యం: బస్తాకు 4 నుంచి 11 కిలోల తక్కువ
కౌడిపల్లి (నర్సాపూర్): రేషన్ బియ్యం బస్తా సాధారణంగా 50 కిలోలు ఉంటుంది. కాగా ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి సరఫరా చేసిన రేషన్ బియ్యం బస్తాల్లో మాత్రం ఒక్కో బస్తా ఒక్కోరకంగా ఉంటుంది. ఒక బస్తాలో 46 కిలోలు ఉండగా మరో బస్తా 40 కిలోలు మాత్రమే ఉంది. లెక్కమాత్రం 50 కిలోల చొప్పున ఇస్తున్నారు. దీంతో రేషన్‌డీలర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో నష్టాన్ని తిరిగి డీలర్లు ప్రజలపైనే రుద్దుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామానికి మే నెలకు సంబంధిం రేషన్ బియ్యం 70క్వింటాళ్ల 60 కిలోలు (140) బస్తాలు పంపించారు. ఇక్కడి డీలర్ పదవీ విరమణ చేయడంతో సమీపంలోని కొట్టల గ్రామ డీలర్ కిషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం బియ్యం పంపిణీ చేయగా గ్రామ ఉపసర్పంచ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కాజిపేట రాజేందర్ తదితరులు పరిశీలించారు. దీంతో ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి వచి్చన ఒక్క బస్తాకూడ 50కిలోలు లేదు. ఒక్కో బస్తాలో 4 నుంచి 11కిలోల బియ్యం తక్కువగా వచ్చాయి. దీంతో 70క్వింటాళ్లు రావాల్సిన బియ్యం 60 క్వింటాళ్లు కూడా రాలేదు. చర్యలు తీసుకోవాలి.. ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి ప్రతి రేషన్ షాపునకు బియ్యం వస్తున్నాయి. ఒక్క వెల్మకన్న డీలర్‌కు వచ్చిన బియ్యంలోనే పది క్వింటాళ్లు తక్కువగా వస్తే జిల్లా మొత్తంలో ఇలాగే జరుగుతుంది. దీంతో ఎంఎల్ఎస్ పాయింట్వద్ద పెద్దమొత్తంలో కుంభకోణం జరుగుతుంది. దీని వెనక ఉన్న అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. - కాజిపేట రాజేందర్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు -
ఈవేయింగ్ మెషీన్లు ఉన్నా.. లేనట్టే!
సాక్షి, బొబ్బిలి: జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏడు లక్షలకు పైగా ఉన్న తెలుపు రంగు రేషన్ కార్డు లబ్ధిదారులకు పంపిణీ చేసే సరుకులను ఈ వెయింగ్‌లో ఇచ్చి జిల్లాలోని 1428 రేషన్ షాపులకు తరలిస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం జరగడం లేదు. అలాగే వాహనాలకు జీపీఎస్ సిస్టమ్‌ను అమర్చామ ని చెబుతున్నా ఆ విధానం ఎక్కడా అమలు కాలేదు. మొత్తంగా అంతా సాదా సీదాగా పాత పద్ధతిలోనే నడుస్తున్నది. ప్రజాపంపిణీ రవాణాను జీపీఎస్‌లో పెట్టాక ఇక రూట్ ఆఫీసర్లతో పనేముందని వారిని కూడా తొలగించారు. జిల్లా వ్యాప్తంగా టన్నుల కొద్దీ బియ్యం, పంచదార, కందిపప్పుతో పాటు అంగన్వాడీ కేంద్రాలకివ్వాల్సిన సరుకులను కూడా ఇలానే తరలిస్తున్నారు. ఈవెయింగ్ అన్న ఊసే లేదు. రేషన్ దుకాణాల విధానమే రేషన్ దుకాణాలకు ఇచ్చే సరుకులు తూకం తక్కువ వస్తున్నాయని డీలర్లు పలుమార్లు ఫిర్యాదు చేశారు. వారు కూడా ఈ వేయింగ్ విధానాన్ని కేవలం ఒకే సరకును పెట్టి అన్ని కార్డులకూ దానినే సరుకుగా చూపిస్తున్నారు. పదే పదే డీలర్లు గోదాముల్లో ఈ వెయింగ్ కోరుతున్నారని ప్రవేశ పెట్టినా అమలు మాత్రం జరగడం లేదు. దీంతో రేషన్ షాపుల్లో ఏ విధంగా అమలు చేస్తున్నారో గోదాముల్లోనూ ఇదే పద్ధతిని అమలు చేస్తున్నారు. డమ్మీ ఈ వేయింగ్ చేపట్టినా ఆ విధానం కూడా డీలర్లతోనే చేయించడం విశేషం. ఆ రోజుకు లారీల్లో ఎంత మంది డీలర్లకు సరుకులు వెళితే వారే ఈ వేయింగ్ బిల్లు తీసుకుని సరుకులు పట్టుకుపోతున్నారు. కానరాని వివరాలు ఎంఎల్ఎస్ గోదాముల్లో సరుకుల వివరాలను పట్టికల్లో నమోదు చేయడం లేదు. ఎక్కడి బోర్డులక్కడే ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కానీ పట్టించుకునే నాథుడే లేడు. దీనిపై అధికారులు కూడా చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీనిపై సాక్షి వారిని ప్రశ్నించగా వారినుంచి మౌనమే సమాధానమవుతోంది. -
పేదల బియ్యం.. పెద్దలపాలు
ఎంఎల్ఎస్ పాయింట్లలో మతలబు బస్తాకు రెండు కిలోల తగ్గుదల చౌక డిపోకు వస్తుంది బస్తాకు 48 కిలోలే! నెలకు వేయి టన్నులు పక్కదారి మిగిలిన బియ్యం మిల్లుకు తరలింపు ప్రతినెలా తెల్ల రేషన్ కార్డుదారులకు పంచాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నాయి. అధికారులు.. కింది స్థాయి సిబ్బంది సహకారంతో యథేచ్ఛగా రేషన్ బియ్యాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. శుక్రవారం పెద్దాపురం మండలం దివిలి గోదాముల నుంచి 198 బస్తాల రేషన్ బియ్యం ఉండూరులోని తేజ రైస్ మిల్లుకు తరలించగా, విజిలెన్స్ అధికారులు పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకోవడంతో ఈ బాగోతం వెలుగు చూసింది. – సాక్షి, రాజమహేంద్రవరం సాధారణంగా సరుకుకు అయిన మొత్తానికి డీలర్ డీడీ తీసిన తర్వాత మండల స్థాయి సరుకు (ఎంఎల్ఎస్) పాయింట్ల నుంచి చౌక డిపోలకు ప్రతినెలా రేషన్ తరలిస్తారు. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి డీలర్‌కు వస్తున్న 50 కిలోల బస్తాలకు గాను 48 కిలోలే వస్తున్నాయి. డీలర్‌కు చేరే ముందు ప్రతి బస్తాను ఎంఎల్ఎస్ పాయింట్లలో ఈ–వేమెంట్ ద్వారా తూచి ఇవ్వాలి. అందుకు ప్రతి పాయింట్లో ఎలక్ట్రానిక్ కాటాలను ప్రభుత్వం సమకూర్చింది. ఈ యంత్రాలు వచ్చి 16 నెలలైనా ఇప్పటివరకు వినియోగించలేదు. సాధారణ కాటా ద్వారానే బస్తాలను తూకం వేసి పంపుతున్నారు. నెలకు వెయ్యి టన్నులు పక్కదారి! జిల్లాలో 2,444 చౌక డిపోల ద్వారా 15,79,555 కార్డుదారులకు ప్రతినెలా 20 వేల మెట్రిక్ టన్నుల రేషన్ పంపిణీ జరుగుతోంది. పట్టణాలు, గ్రామాల్లో ఒక్కో డీలర్ పరిధిలో 300 నుంచి వెయ్యి కార్డుల వరకూ ఉంటున్నాయి. ఎంఎల్ఎస్ పాయింట్లో లోడింగ్‌కు ముందే బస్తాకు రెండు కిలోల చొప్పున బియ్యాన్ని తగ్గిస్తున్నారు. క్వింటాకు నాలుగు కిలోల బియ్యం తక్కువగా వస్తుండడంతో సరాసరిగా ఒక్కో డీలర్‌కు రెండు నుంచి ఆరు క్వింటాళ్ల బియ్యం తక్కువగా చేరుతోంది. ఇలా ప్రతినెలా సుమారు వెయ్యి టన్నుల బియ్యం ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి పక్కదారి పడుతున్నాయి. ఇలా మిగిలిన బియ్యాన్ని గుట్టుచప్పుడు కాకుండా మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గోడౌన్ సిబ్బంది, ఎంఎల్ఎస్ పాయింట్ అధికారులు వారి స్థాయికి తగ్గట్టు వాటాలు పంచుకుంటున్నారు. లబ్ధిదారులకే నష్టం చౌకడిపోల వద్ద బియ్యం పక్కదారి పడకుండా ప్రభుత్వం అన్ని షాపుల్లో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ–పోస్ యంత్రం ద్వారా లబ్ధిదారుని వేలిముద్ర తీసుకున్న తర్వాతే డీలర్ రేషన్ ఇచ్చేలా కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. బియ్యం కూడా ఈ–వేమెంట్ (ఎలక్ట్రానిక్ కాటా) ద్వారా కొలిచి ఇచ్చేలా ప్రతి దుకాణానికి యంత్రాన్ని సమకూర్చింది. ఎంఎల్ఎస్ పాయింట్లో కూడా ఈ–వేమెంట్ ద్వారా బస్తాలను తూకం వేయాల్సి ఉన్నా అక్కడ అమలు కావడంలేదు. తమకు బస్తాకు 50 కిలోల బియ్యం రావడం లేదని, ఈ–వేమెంట్ ద్వారా తూకం వేచి ఇవ్వాల్సిందిగా రేషన్ డీలర్లు సంయుక్త కలెక్టర్(జేసీ) సత్యనారాయణ, డీఎస్ఓ ఉమామహేశ్వరరావుకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా, సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. చౌకడిపోలకు బియ్యం తక్కువగా వస్తుండడంతో అంతిమంగా లబ్ధిదారులు నష్టపోతున్నారు. డీలర్ దగ్గరుండి సరుకు తెచ్చుకోవచ్చు రేషన్ బస్తాల్లో తరుగుదల వస్తోందని డీలర్లు ఫిర్యాదు చేశారు. వారే ఎంఎల్ఎస్ పాయింట్ వద్దకు వెళ్లి స్వయంగా తూకం వేయించుకుని తెచ్చుకోమని చెప్పాం. అందరూ వెళ్లలేరు కనుక వారి తరఫున ఒక డీలర్‌ను వెళ్లమని చెప్పాం. తక్కువగా వస్తున్నాయనుకుంటే బయట తూకం వేసి చూసుకోవచ్చు. త్వరలో ఎంఎస్ఎల్ పాయింట్ల వద్ద కూడా ఈ–పోస్ యంత్రాలు పెట్టే ప్రతిపాదన ప్రభుత్వం చేస్తోంది. ఇది అమలులోకి వస్తే ఈ సమస్య ఉండదు. – జి.ఉమామహేశ్వరరావు, డీఎస్ఓ -
పదో తేదీ దాటినా పత్తాలేని బియ్యం
నిత్యావసర వస్తువుల సరఫరాలో జాప్యం బియ్యం కోసం నిరుపేదల ఎదురు చూపు వర్షాల కారణంగా ఆలస్యమైందన్న పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజరు లింగాలఘణపురం : ప్రభుత్వం చౌకధరల దుకాణాల నుంచి నిత్యావసర వస్తువుల సరఫరాలో జాప్యం జరుగుతోంది. ప్రతీ నెల 1వ తేదీ లోపు మండల లెవల్ స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్ నుంచి గ్రామాల్లోని చౌకధరల డిపోలకు సరుకులు అందాల్సి ఉంటుంది. గత మూడు మాసాలుగా ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రావాల్సిన సరకులు సకాలంలో రావడం లేదు. దీంతో నిరుపేదలకు ప్రతీ నెల బియ్యం కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. వచ్చిన బియ్యం డీలర్లు సకాలంలో పంపిణీ చేయడం లేదని ఇప్పటికే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి రావడం ఆలస్యం కావడంతో పేదలు మరిన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారు. లింగాలఘణపురం మండలంలోని 17 గ్రామ పంచాయితీల పరిధిలో 26 చౌకధరల దుకాణాలు ఉండగా 1,962.30 కిలోల బియ్యం, 11,048 కిలోల చక్కెర సరఫరా చేయాల్సి ఉంటుంది. కాగా 10వ తేదీ వరకు కూడా సగం షాపులకు కూడా బియ్యం సరఫరా కాలేదు. 15 తేదీలోగా స్టాక్ వివరాలను తెలియజేస్తూ డీలర్లు డీడీలు తీయాల్సి ఉంటుంది. 10 తేదీ వరకు కూడా బియ్యం రాకపోవడంతో అయోమయ పరిస్థితిలో ఉన్నారు. చాలా మండలాల్లో ఇదే పరిస్థితి ఉంది. వర్షాల కారణంగా ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి బియ్యం సరఫరాలో ఆలస్యమైందని పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజరు విజయేందర్‌రెడ్డి చెప్పారు. జిల్లాలో 2115 చౌకధరల దుకాణాలు ఉండగా 384 షాపులకు సరుకులు చేరలేదని ఆయన చెప్పారు. -
‘బఫర్‌స్టాక్’ భద్రమా?
గోదావరి నది ఉప్పొంగితే దాదాపు పది మండలాల్లో జనజీవనం అతలాకుత లమవుతుంది. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభిస్తాయి. ఇలాంటి సమయాల్లో ప్రజలకు నిత్యావసరాలు అందించేందుకు మూడు నెలలకు సరిపడా సరుకులు ‘బఫర్‌స్టాక్’ పేరిట నిల్వ చేస్తారు. అయితే విపత్తుల సమయంలో బాధిత ప్రజానీకానికి అవసరమైన నిత్యావసర సరుకులను భద్రపరిచే విషయంలో సంబంధిత శాఖల అధికారులు పెద్దగా పట్టించుకోకపోవటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రాచలంలోనే ఇలా ఉంటే మిగతా చోట్ల పరిస్థితి ఏంటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. * భద్రాచలం గోదాములో తడిసి ముద్దయిన బియ్యం * వాటినే ఎంఎల్ఎస్ పాయింట్లకు తరలింపు * నిల్వలపై పూర్తి పర్యవేక్షణ కరువు భద్రాచలం : గోదావరి నదికి వరదలు వచ్చే సమయంలో ప్రజలకు అందజేసే బఫర్ స్టాక్ నిల్వలపై జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందనే ఆరోపణలున్నాయి. భద్రాచలంలోని వ్యవసాయ మార్కెట్ గోదాముల్లో నిల్వ చేసిన బియ్యం ఇటీవల కురిసిన వర్షానికి తడిసి ముద్దయింది. బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్లకు తరలించే క్రమంలో తడిసిన బియ్యం బస్తాలు వెలుగుచూశాయి. సుమారు వంద బస్తాల వరకూ బియ్యం తడిసిపోయి, బూజు పట్టింది. వీటిలో కొన్ని బస్తాలు పూర్తిగా గడ్డలు కట్టగా, మరికొన్నింటిలో బియ్యం బయటకు రావటంతో వాటిని అక్కడి సిబ్బంది గోదాం కాంపౌండ్ వాల్‌కు సమీపంలో పడేశారు. ఇలా పడేసిన బియ్యం పందులు, పశువులకు మేతగా మారింది. వీటిని గుర్తించిన సంబంధిత అధికారులు బియ్యాన్ని హడావిడిగా సోమవారం వివిధ మండలాల్లో ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్లకు తరలించారు. తడిసిపోయిన బియ్యం బస్తాలను కూడా వాటితో పాటుగా తరలించినట్టు సమాచారం. బాగా పాడై బూజు పట్టిన బియ్యాన్ని మహిళా కూలీలతో బాగుచేయించి వాటినే తిరిగి బస్తాల్లో పోశారు. గోదాముల్లో నిల్వ చేసిన బియ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అధికారులు, నిర్లక్ష్యంగా వ్యవహరించటంతోనే ఇలా జరిగిందనే విమర్శలు ఉన్నాయి. ప్రకృతి విపత్తులు సంభవించే సమయంలో బాధిత ప్రజానీకాన్ని ఆదుకునేందుకు గాను ముందుగానే నిత్యావసర సరుకులు నిల్వ చేస్తారు. గోదావరి నది పరీవాహక ప్రాంతంలోని పాల్వంచ, భద్రాచలం డివిజన్లలోని పది మండలాలతో పాటు, వాగులు పొంగి, దారీతెన్నూ లేని గిరిజన గ్రామాలను ముందుగానే గుర్తించటంతో ఆయా ప్రాంతాల్లో అప్రమత్తత కావాలని కలెక్టర్ లోకేష్ కుమార్ ఆదేశించినప్పటికీ, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. భద్రాచలం గోదాములో బియ్యం తడిసిన విషయమై సంబంధిత గోదాం ఇన్చార్జ్ నరసింహారావు దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లగా తడిసిపోయిన నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. భద్రతపై అనుమానాలు ! గోదావరి నదికి వరదల వచ్చే సమయంలో పంపిణీ చేసేందుకని సిద్ధం చేసిన బఫర్ స్టాక్ భద్రంగానే ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భద్రాచలంలోని ఏఎమ్‌సీ గోదాములో నిల్వ చేసిన బియ్యం తడిసిపోగా, మిగతా గోదాముల్లో ఉన్నవాటి పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గోదావరి వరదల సమయంలో ప్రజల కోసం మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు ముందుగానే ఆయా ప్రాంతాల్లో నిల్వ చేస్తారు. దమ్మపేటలో 46.077 టన్నులు, పాల్వంచలో 61.596 టన్నులు, ఇల్లెందులో 409.815 టన్నులు, వెంకటాపురంలో 829.983 టన్నులను నిల్వ చేశారు. వీటితో పాటు అదనంగా స్టేజ్ ఒన్ గోదామలుగా ఉన్న భద్రాచలంలో 200 టన్నులు, వెంకటాపురంలో 460 టన్నులు, బూర్గంపాడులో 10 టన్నులను అందుబాటులో ఉంచారు. కానీ భద్రాచలం ఏఎమ్‌సీ గోదాములో ఉన్న బియ్యం బస్తాలు ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షాలకే తడిసిపోగా, మిగతా ప్రాంతాల్లో ఉన్న బియ్యం పరిస్థితి ఏంటనే దానిపై అధికారులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. విపత్తుల సమయంలో ఇంత నిర్లక్ష్యమా..? గోదావరి వరదలు ఈ ప్రాంత వాసులను కంటిమీద కునుకు లేకండా చేస్తాయి. అధికారులు సైతం వారికి అందుబాటులో ఉండి రేయింబవళ్లు పనిచేస్తారు. కానీ విపత్తుల సమయంలో బాధిత ప్రజానీకానికి అవసరమైన నిత్యావసర సరుకులను భద్రపరిచే విషయంలో మాత్రం సంబంధిత శాఖల అధికారులు పెద్దగా పట్టించుకోకపోవటంపై సర్వ త్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోదాముల్లో ఉన్న బియ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు గాను ఉద్యోగులను నియమించినప్పటికీ, వారు విధుల పట్ల అలసత్వంగా వ్యవహరిస్తున్నట్లుగా భద్రాచలం ఘటన నిద ర్శనంగా నిలుస్తోంది. దీనిపై జిల్లా కలెక్టర్ తగిన రీతిలో స్పందించాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు. గోదాములకు బాధ్యులను నియమించాం బఫర్ స్టాక్ నిల్వలు ఉంచిన గోదాములను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకుగాను బాధ్యులను నియమించాం. భద్రాచలం గోదాములో బియ్యం తడి సిన విషయం నా దృష్టికి రాలేదు. దీనిపై వివరాలు తెప్పించుకొని తగిన చర్యలు తీసుకుంటాను. - వాణి, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ తడిసిన బియ్యం తీసుకోం స్టేజ్ వన్‌గా ఉన్న గోదాములతో మాకు సంబంధం లేదు. ఆయా గోదాముల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు వచ్చిన వాటికే మేమే రక్షణగా ఉంటాము. తడిసిన బియ్యం వస్తే తీసుకోం. తమకు సరఫరా అయిన బియ్యాన్ని డిపోలకు చేరవేస్తున్నాము. - శంకర్, జీసీసీ బ్రాంచ్‌మేనేజర్ వాటితో మాకు సంబంధం లేదు భద్రాచలం గోదాములో ఉన్న బియ్యం నిల్వలతో మాకెటువంటి సంబంధం లేదు. రేషన్‌డిపోలకు వచ్చినవి భద్రంగా ఉన్నాయా లేదా అనే దానిపై ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. - సైదులు , సివిల్ సప్లై డీటీ -
భైంసాలో విజిలెన్స్ అధికారుల దాడి
అక్రమ బియ్యం, గోధుమ నిల్వల పరిశీలన ఎంఎల్ఎస్ పాయింట్‌కు నిల్వల తరలింపు మరిన్ని దుకాణాలను సీజ్ చేసిన అధికారులు భైంసా : పట్టణంలోని ఆటోనగర్‌లో రేషన్ దుకాణాలకు సంబంధించిన బియ్యం, గోధుమలను అక్రమంగా నిల్వచేసిన దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. గురువారం కరీంనగర్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎ.శ్రీనివాస్, వి.శ్రీనివాస్, భైంసా, నిర్మల్ డీటీఎన్ఫోర్స్మెంట్ అధికారులు శ్రీధర్, ఎజాజ్, ఆర్ఐ ఈశ్వర్ ఆధ్వర్యంలో ఆటోనగర్‌లోని దుకాణాలను తనిఖీ చేశారు. ముందస్తు పక్కా సమాచారం మేరకు రెండు దుకాణాల షట్టర్లు తెరువగా.. అందులో రేషన్ షాపుల్లో పేదలకు అందించాల్సిన బియ్యం, గోధుమలు కనిపించాయి. పక్కనే మరిన్ని దుకాణాలను తెరిచేందుకు ప్రయత్నించినా సంబంధిత వ్యక్తులు లేరు. ఏడు దుకాణాలను సీజ్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నిల్వ చేసిన సరుకులను భైంసా ఎంఎల్ఎస్ పాయింట్‌కు తరలించారు. పూర్తివివరాలను త్వరలో వెల్లడిస్తామని స్పష్టం చేశారు. మహారాష్ట్రకు తరలించేందుకు.. అక్రమంగా కొంత మంది రేషన్‌దుకాణాలను నడుపుతున్న వ్యక్తులు ఈ తతంగానికి పాల్పడుతున్నట్లు సమాచారం. ఆటోనగర్‌లో నిల్వ ఉంచిన ఈ సరుకును లారీల్లో నింపి నేరుగా మహారాష్ట్రకు తరలించి అక్కడే విక్రయిస్తున్నట్లు తెలిసింది. విజిలెన్స్ అధికారులకు అందిన సమాచారం మేరకు దాడులు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ బృందం దీనిపై మరింత లోతుగా పరిశీలిస్తే రేషన్ సరుకులు ఏ మేర పంపిణీ అవుతున్నాయో తేటతెల్లమవుతుంది. -
అడిగేవారు లేరు... దోచేద్దాం!
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమం అక్రమార్కులకు వరంగా మారింది. పౌరసరఫరాల శాఖలో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఉన్నతాధికారులు సైతం ఉద్యమంలో పాల్గొనడంతో ఎవరూ పట్టించుకోరన్న ధీమాతో దోపిడీ పంజా విసురుతున్నారు. జిల్లాలోని మండల లెవల్ స్టాకిస్ట్ (ఎంఎల్ఎస్) పాయింట్లు అక్రమాలకు అడ్డాగా మారాయి. జిల్లాలో మొత్తం 15 ఎంఎల్ఎస్ పాయింట్లు ఉన్నాయి. వీటిలో అతి పెద్దది నగరానికి సమీపంలో కొత్తూరులో ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్. ఈ పాయింట్ పరిధిలో 265 రేషన్ షాపులు ఉన్నాయి. నెల్లూరు సిటీ, రూరల్‌తో పాటు వెంకటాచలం, ముత్తుకూరు మండలాల్లోని చౌకదుకాణాలకు 2,129 మెట్రిక్ టన్నుల బియ్యం, 65 టన్నుల పంచదార, 144 టన్నుల పామాయిల్‌తో పాటు అమ్మహస్తం సరుకులు సరఫరా అవుతున్నాయి. అవినీతి జరుగుతుంది ఇలా.. జిల్లాలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు బియ్యం సరఫరా అవుతుంటాయి. ఎఫ్‌సీఐ నుంచి వచ్చే ప్రతి బస్తాను తూకం వేసి పంపుతారు. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ చౌకదుకాణాలకు వెళ్లే బియ్యం బస్తాలను తూకం వేసి పంపాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియ ఇక్కడ చేపట్టడం లేదు. రేషన్ షాపులకు సరఫరా చేసే బియ్యంలో బస్తాకు కనీసం 2 నుంచి 3 కిలోలు లోడేస్తున్నారు. దీని వల్ల డీలర్లకు నష్టం వస్తున్నా.. ఏం చేయలేని పరిస్థితి. ఎవరైనా ప్రశ్నిస్తే కొందరు అధికారులకు ‘మేము పంపాలి’ కదా అంటూ గోడౌన్ ఇన్చార్జి చెబుతుంటారని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారుల పేరు చెప్పి గోడౌన్ ఇన్చార్జి బహిరంగంగా అందినకాడికి దోచుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 15 స్టాక్ పాయింట్లు నుంచి జిల్లాలోని 1,872 రేషన్ షాపులకు 11,246 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. మొత్తం 1,500 లారీల ద్వారా రేషన్ షాపులకు బియ్యం సరఫరా అవుతున్నాయి. మొత్తం మీద ప్రతి నెల 6 వేల బస్తాలకు పైగా బియ్యం పక్కదారిపడుతున్నట్లు సమాచారం. వీటి విలువ సుమారు రూ.75 లక్షలకుపైగా ఉంటుందని అంచనా. ఈ తరుగు నష్టం చివరకు లబ్ధిదారుల మీదనే పడుతుంది. డీలర్లు లబ్ధిదారులకు సరఫరా చేసే సరుకుల్లో తూకాల్లో మోసం చేసి తరుగు నష్టాన్ని డీలర్లు పూడ్చుకుంటున్నారు. అయిన వారికి ఆకుల్లో... కాని వారికి కంచాల్లో.. రేషన్ షాపులకు ఇచ్చే అలాట్మెంట్లో డిప్యూటీ తహశీల్దార్‌తో పాటు, గోడౌన్ ఇన్చార్జి ‘అయిన వారికి ఆకుల్లో..కాని వారికి కంచాల్లో’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. తమకు అనుకూలంగా ఉంటూ నచ్చిన వారికి అలాట్మెంట్ ఎక్కువ, నచ్చని వారికి అలాట్మెంట్ తక్కువ చేస్తున్నట్లు డీలర్లు వాపోతున్నారు. ర్యాప్, టాప్ కూపన్లకు సంబంధించిన అలాట్మెంట్లో కూడా అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. వాస్తవానికి అలాట్మెంట్ ఉన్న డీలర్లుకు సరుకులు పంపకుండా, ర్యాప్, టాప్ లేని కొందరు డీలర్లుకు పంపుతున్నట్లు డీలర్లు లబోదిబోమంటున్నారు. పంచదార, పామాయిల్ పంపిణీలోనూ... డిమాండ్ డ్రాఫ్ట్‌లు చెల్లించిన ప్రతి డీలరుకు పంచదార సరఫరా చేయాల్సి ఉంది. అయితే సెప్టెంబరులో కేవలం 20 శాతం మంది డీలర్లకు పూర్తిస్థాయిలో పంచదార సరఫరా అయింది. మిగిలిన 80 శాతం మంది డీలర్లకు సంబంధించి కోటాలో 17 శాతం తగ్గించి పంపినట్లు డీలర్లు చెబుతున్నారు. ముఖ్యంగా బాలాజీనగర్, పొదలకూరురోడ్డు, పోస్టాఫీస్ ఏరియా, నవాబుపేట వంటి ప్రాంతాల్లోని డీలర్ల్లకు ఇంకా పామాయిల్ చేరలేదు. దీంతో ఆయా ప్రాంతాల డీలర్లు వినియోగదారులకు ఏమి చెప్పాలో అర్థంకాక అయోమయంలో ఉన్నారు. మా దృష్టికి రాలేదు ఎంఎల్ఎస్ పాయింట్లలో అక్రమాలు జరుగుతున్నట్లు మా దృష్టికి రాలేదు. అక్రమాలకు పాల్పడే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. ఇటీవల కొత్తగా బాధ్యతలను స్వీకరించాను. పూర్తిస్థాయిలో విచారణ జరిపి ప్రజాపంపిణీ వ్యవస్థ పటిష్టతకు చర్యలు తీసుకుంటాను. టి. ధర్మారెడ్డి, డీఎం, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్.