అక్రమ బియ్యం, గోధుమ నిల్వల పరిశీలన
ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు నిల్వల తరలింపు
మరిన్ని దుకాణాలను సీజ్ చేసిన అధికారులు
భైంసా : పట్టణంలోని ఆటోనగర్‌లో రేషన్ దుకాణాలకు సంబంధించిన బియ్యం, గోధుమలను అక్రమంగా నిల్వచేసిన దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. గురువారం కరీంనగర్ విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఎ.శ్రీనివాస్, వి.శ్రీనివాస్, భైంసా, నిర్మల్ డీటీఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శ్రీధర్, ఎజాజ్, ఆర్‌ఐ ఈశ్వర్ ఆధ్వర్యంలో ఆటోనగర్‌లోని దుకాణాలను తనిఖీ చేశారు. ముందస్తు పక్కా సమాచారం మేరకు రెండు దుకాణాల షట్టర్లు తెరువగా.. అందులో రేషన్ షాపుల్లో పేదలకు అందించాల్సిన బియ్యం, గోధుమలు కనిపించాయి. పక్కనే మరిన్ని దుకాణాలను తెరిచేందుకు ప్రయత్నించినా సంబంధిత వ్యక్తులు లేరు. ఏడు దుకాణాలను సీజ్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నిల్వ చేసిన సరుకులను భైంసా ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు తరలించారు. పూర్తివివరాలను త్వరలో వెల్లడిస్తామని స్పష్టం చేశారు.
మహారాష్ట్రకు తరలించేందుకు..
అక్రమంగా కొంత మంది రేషన్‌దుకాణాలను నడుపుతున్న వ్యక్తులు ఈ తతంగానికి పాల్పడుతున్నట్లు సమాచారం. ఆటోనగర్‌లో నిల్వ ఉంచిన ఈ సరుకును లారీల్లో నింపి నేరుగా మహారాష్ట్రకు తరలించి అక్కడే విక్రయిస్తున్నట్లు తెలిసింది. విజిలెన్స్ అధికారులకు అందిన సమాచారం మేరకు దాడులు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం దీనిపై మరింత లోతుగా పరిశీలిస్తే రేషన్ సరుకులు ఏ మేర పంపిణీ అవుతున్నాయో తేటతెల్లమవుతుంది.
భైంసాలో విజిలెన్స్ అధికారుల దాడి
Published Fri, Jul 31 2015 3:46 AM | Last Updated on Sun, Sep 3 2017 6:27 AM
Advertisement