తెల్లవారు జాము 3 గంటలకే క్యూలో కార్డుదారులు
సహనం నశించి.. డీలర్‌పై ఆగ్రహం
త్వరలో దుకాణాల వద్దే రేషన్ పంపిణీ చేస్తామంటూ ప్రభుత్వ ప్రకటన
అదే జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి
ధర్మవరం: రేషన్ దుకాణాల వద్ద కార్డుదారుల అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. గంటల తరబడి క్యూలో నుంచోలేక నానా అవస్థలు పడుతున్నారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవ రం పట్టణం కేతిరెడ్డి కాలనీలోని కార్డుదారులు శనివారం దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చౌక డిపో వద్దకు వచ్చారు. ఎండలో గంటల తరబడి క్యూలో నుంచో లేక సంచులు పెట్టి తమవంతు కోసం ఎదు రు చూస్తున్నారు.
కూలి పనులు చేసుకునే పేదలు ఇలా రోజంతా రేషన్ కోసం పడిగాపులు కాస్తున్నారు. తెల్లవారు జామున 3 గంటలకే ఇలా సంచులను క్యూలో పెట్టి.. ఆ పక్కనే తమ వంతు కోసం ఎదురు చూస్తున్నారు. అయినా తమవంతు రాకపోవడంతో వారు నిరసన వ్యక్తం చేశారు.
రెండు రోజులు మాత్రమే రేషన్ ఇస్తున్నారని, ఆ తర్వాత వెళితే.. సరుకులు అయిపోయాయంటూ డీలర్ తమను వెనక్కి పంపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సీఎస్‌డీటీ లక్ష్మీదేవి అక్కడికి చేరుకుని డీలర్‌తో మాట్లాడి త్వరితగతిన బియ్యం పంపిణీ చేసేలా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.
కూటమి ప్రభుత్వం వచ్చినప్పట్నుంచీ ఇదే పరిస్థితి..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విని యోగదారుల ఇళ్ల వద్దకే వచ్చి రేషన్ పంపిణీ చేశారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ ప్రాంతంలో రేషన్ వాహనాలు రాకపోవడంతో ప్రజలు రేషన్ దుకాణాల వద్దకు వెళ్లి ఇలా అవస్థలు పడుతున్నారు.
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల ద్వారానే సరుకుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేస్తున్న ప్రకటనలతో రేషన్ కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే రాష్ట్రం మొత్తం ఇలాంటి పరిస్థితే నెలకొంటుందని భయపడిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment