సాక్షి, అమరావతి: పేదల బియ్యాన్ని బొక్కే అక్రమార్కులపై వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. పటిష్ట చర్యలతో బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెడుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత సమర్ధవంతంగా నిర్వహిస్తోంది. చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేసే నిత్యావసరాలను దారిమళ్లించడం, దుర్వినియోగానికి పాల్పడిన వారిపై 6ఏ కేసులతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తోంది. ఇప్పుడు దీర్ఘకాలికంగా బియ్యాన్ని బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ, తరచూ పట్టుబడిన వ్యక్తులపై పీడీ యాక్టును ప్రయోగిస్తోంది.
ప్రత్యేక కార్యాచరణతో సత్ఫలితాలు
గతంలో రేషన్ బియ్యం విచ్చలవిడిగా అక్రమ రవాణా జరిగేది. వందల టన్నుల బియ్యం సరిహద్దులు దాటేసేది. మరోపక్క పేదలు తినే బియ్యంపై కొందరు అసత్య ప్రచారం చేసి, వాటిని తక్కువ రేటుకు కొని, తిరిగి పాలిష్ పట్టి మార్కెట్‌లోకి తెచ్చి అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకునేవారు. లారీలతో లోడ్లు తరలిపోతున్నా కేసులే నమోదయ్యేవి కావు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇటువంటి అక్రమార్కుల ఆట కట్టిస్తోంది. రేషన్ బియ్యం రవాణాపై నిఘాను పటిష్టం చేసింది. అంతర్రాష్ట్ర సరిహద్దులు, మండల నిల్వ పాయింట్లు, చౌక దుకాణాలు, ఎండీయూ వాహనాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నిరంతర నిఘా పెట్టడంతో చాలా వరకు అక్రమ రవాణా తగ్గింది.
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్ వరకు 743 మందిని అరెస్టు చేసింది. నిత్యావసర వస్తువుల చట్టం – 1955 సెక్షన్ 6ఏ ప్రకారం అక్రమ రవాణాలో పట్టుబడిన సరకులు, వాహనాలను స్వాధీనం చేసుకొని, కేసులు నమోదు చేస్తోంది. ఈ కేసులు సత్వరం పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకొని, అక్రమార్కులకు త్వరితగతిన శిక్షలు పడేలా చేస్తోంది. పట్టుబడిన బియ్యాన్ని వెంటనే తిరిగి పీడీఎస్, మార్కెట్‌లోకి తెస్తోంది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.
జిల్లాల్లో బియ్యం అక్రమరవాణాలో పట్టుబడ్డ సరుకు నిల్వల విలువ రూ.50 లక్షల లోపు ఉంటే జేసీలు, అంతకు పైబడి ఉంటే కలెక్టర్లకు కేసుల పరిష్కార బాధ్యతలను అప్పగించింది. ఫలితంగా ఏళ్లు తరబడి సీజ్ చేసిన సరుకు ముక్కిపోయి, పురుగులు పట్టి పాడవకుండా బహిరంగ వేలం ద్వారా వెంటనే తిరిగి మార్కెట్లోకి తెస్తోంది. ఇలా గడిచిన నాలుగేళ్లలో 6ఏ కేసులు 8,696 నమోదు చేస్తే, వాటిల్లో 4,565 కేసులను పరిష్కరించింది. మొత్తం 4.70లక్షల క్వింటాళ్ల స్టాక్‌ను స్వాధీనం చేసుకోగా, 2.82 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని తిరిగి పీడీఎస్, మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
రియల్ టైం మానిటరింగ్
6ఏ కేసుల స్థితిగతులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పర్యవేక్షించేందుకు పౌర సరఫరాల శాఖ ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేసింది. కేసు నమోదు చేసిన వెంటనే సీజ్ చేసిన స్టాక్ వివరాలను ఇందులో అప్‌లోడ్ చేస్తారు. జిల్లాలు, తేదీలు, నెలలవారీగా నమోదైన కేసులు, పరిష్కరించినవి, సీజ్ చేసిన స్టాకు, బయటకు విడుదల చేసిన స్టాక్ వివరాలను రియల్ టైమ్ మానిటరింగ్ చేసేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు. పీడీఎస్ బియ్యాన్ని దారి మళ్లించి, వాటిని రీసైక్లింగ్ చేసి కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద చూపించడం, పాలిష్ పట్టి కొత్త ప్యాకింగ్‌లో మార్కెట్‌లో విక్రయించడాన్ని సంపూర్ణంగా నిరోధించే ప్రయత్నం చేస్తోంది.
పటిష్ట నిఘాతో అక్రమ రవాణా కట్టడి
ఇప్పటి వరకు అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ బియ్యాన్ని సీజ్ చేసి పక్కన పెట్టేవారు. వాటిని పట్టించుకోకపోవడంతో తినడానికి పనికిరాకుండా పాడయ్యేవి. ఈ క్రమంలోనే మేము 6ఏ కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాం. కేసులు వేగంగా పరిష్కారమయ్యేలా పర్యవేక్షిస్తున్నాం. దీనికి తోడు బ్లాక్ మార్కెట్ దందాకు పాల్పడే వారిని పీడీ యాక్టులో పెడుతున్నాం. పటిష్ట నిఘా ఉంది కాబట్టే కేసులు నమోదవుతున్నాయి. అంతేగానీ అక్రమ రవాణా జరిగిపోతున్నట్టు కాదు. – హెచ్.అరుణ్ కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ
Comments
Please login to add a commentAdd a comment