సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ దుకాణాల నుంచి బియ్యం, ఇతర సరుకులు తీసుకునేందుకు కేవైసీ (నో యువర్ కస్టమర్– మీ వినియోగదారుని తెలుసుకోండి) నమోదు తప్పనిసరి కాబోతుంది. రేషన్ దుకాణాల్లో అప్‌డేట్ చేసిన ఈపాస్ మిషన్ల ద్వారా కార్డులో నమోదైన వారందరి వేలి ముద్రలు తీసుకొని, వారి వివరాలు నమోదు చేసుకునే ప్రక్రియ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతోంది.
అందులో భాగంగానే రాష్ట్రంలో కూడా ఈ కేవైసీకి ఈనెల 5వ తేదీ నుంచి శ్రీకారం చుట్టారు. వేలి ముద్రలు వేయకుంటే రేషన్ కార్డులో పేరుండదు అనే ప్రచారం నేపథ్యంలో జిల్లా కేంద్రాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారు కూడా వచ్చి ఈ కేవైసీ కోసం రేషన్ దుకాణాల వద్ద బారులుతీరి మరీ పేర్లు నమోదు చేయించుకుంటున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కూడా కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా ఈపాస్ మిషన్లను అప్‌గ్రేడ్ చేసి, కార్డుదారుల వేలి ముద్రలు తీసుకోవలసిందిగా అన్ని జిల్లాల అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో రేషన్ దుకాణాల్లో కార్డు దారుల వేలి ముద్రలు తీసుకుంటున్నారు.
మంత్రి లేఖకు స్పందించని కేంద్రమంత్రి
రేషన్‌కార్డులో పేర్లు ఉన్న వారంతా వేలిముద్రలు వేయాల్సిన నేపథ్యంలో దూర ప్రాంతాల్లో ఉన్న వారు రాలేకపోతున్నారు. ఈ మేరకు ఈ కేవైసీ వల్ల తలెత్తుతున్న సమస్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ఇటీవల సుదీర్ఘ లేఖ రాసి, ప్రభుత్వ ప్రతినిధి ద్వారా ఢిల్లీలో అందజేశారు.
అయితే కేంద్రం నుంచి ఎలాంటి ప్రత్యుత్తరం రాలేదు. కాగా ఈ విషయమై మంత్రి గంగుల మాట్లాడుతూ రాష్ట్రంలోని రేషన్‌కార్డుల్లోని లబ్ధిదారులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని , కార్డుదారుల పేర్లు ఎవరివీ తొలగించడం జరగదని స్పష్టం చేశారు. కేవైసీ విషయంలో మరోసారి సీఎంతో చర్చించి తమ నిర్ణయాన్ని కేంద్రానికి తెలియజేస్తామని తెలిపారు.
గడువు తేదీ ఏమీ లేదు: అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్
ఈ కేవైసీకి తుది గడువు అంటూ ఏమీ లేదని పౌరసరఫరాల సంస్థ అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ ‘సాక్షి’కి తెలిపారు . కేవైసీలో వివరాలు ఇవ్వని కార్డుదారుల పేర్ల విషయంలో ఎలాంటి ఆదేశాలు లేవని, దేశ వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగానే వేలి ముద్రలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్డుల నుంచి ఎవరి పేర్లు తొలగించబోమని, ఎవరూ ఆందోళన చెందనవసరం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment