ఆధార్ అప్‌డేట్ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి.. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సిద్ధమైంది. ఇందులో భాగంగానే.. 2025 నవంబర్ 1 నుంచి ఆధార్ కార్డుదారులు తమ పేరు, చిరునామా, పుట్టిన తేదీ & మొబైల్ నంబర్‌ను ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చు. కాబట్టి ఆధార్ సెంటర్లను సందర్శించాల్సిన అవసరం లేదు.
ఆధార్ కార్డు వివరాలు ఆన్‌లైన్‌లో అప్డేట్
ఆధార్ హోల్డర్లు పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ వంటి వ్యక్తిగత వివరాలను పూర్తిగా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయవచ్చు. అయితే ఈ అప్‌డేట్ ప్రక్రియ.. పాన్ లేదా పాస్‌పోర్ట్ వంటి వాటితో లింక్ అయి ఉంటుంది. అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం ద్వారా.. వివరాలను సులభంగా అప్డేట్ చేయవచ్చు. అయితే.. వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌లు లేదా ఫొటోలతో సహా బయోమెట్రిక్ అప్‌డేట్‌లకు ధృవీకరణ కోసం.. ఆధార్ సేవా కేంద్ర కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది.
ఆధార్ అప్‌డేట్ కొత్త ఫీజులు
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ అప్డేట్ కోసం.. కొత్త ఫీజులను ప్రవేశపెట్టింది. చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ వంటి వివరాలను అప్డేట్ చేసుకోవడానికి రూ. 75 చెల్లించాల్సి ఉంటుంది (గతంలో ఈ ఫీజు 50 రూపాయలుగా ఉండేది). అయితే బయోమెట్రిక్ అప్డేట్ కోసం రూ. 125 చెల్లించాలి. ఆన్‌లైన్ డాక్యుమెంట్ అప్డేట్స్ అన్నీ 2026 జూన్ 14 వరకు ఉచితంగానే చేసుకోవచ్చు. అంతేకాకుండా 5–7 & 15–17 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు ఉచితంగానే.. బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవచ్చు.
ఆధార్-పాన్ లింక్ తప్పనిసరి
ఆధార్ & పాన్ లింక్ తప్పనిసరి. 2025 డిసెంబర్ 31 నాటికి ఆధార్ & పాన్ కార్డులను తప్పకుండ లింక్ చేసుకోవాలి. ఈ డాక్యుమెంట్స్ లింక్ చేయకపోతే.. 2026 జనవరి నుంచి మీ పాన్ కార్డు డీయాక్టివేట్ అవుతుంది. తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఆన్‌లైన్‌లో ఆధార్ అప్‌డేట్ చేసుకోవడం ఎలా?
● మైఆధార్ పోర్టల్ ఓపెన్ చేయండి
● లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి.. మీ 16 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, దానికింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
● నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసిన తరువాత లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి.
● రిజిస్టర్ మొబైల్ నెంబరుకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
● అక్కడే డాక్యుమెంట్స్ అప్డేట్, అడ్రస్ అప్డేట్ వంటివన్నీ కనిపిస్తాయి.
● మీరు ఏది అప్డేట్ చేయాలనుకుంటున్నారో.. దానిపైన క్లిక్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. అయితే దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
● అవసరమైనవన్నీ అప్డేట్ చేసిన తరువాత మీరు సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ పొందుతారు. దీని ద్వారా డాక్యుమెంట్ అప్‌డేట్‌ను ట్రాక్ చేయవచ్చు.
ఇదీ చదవండి: ధరలు పెరుగుతాయ్.. వెండికి ఫుల్ డిమాండ్!


