తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల హైదరాబాద్‌లో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందంతో, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) ప్రతినిధి బృందంతో విడివిడిగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు, టెక్నాలజీ, ఉపాధి అవకాశాల కల్పనపై ఈ భేటీల్లో చర్చలు జరిగాయి.
డ్యుయిష్ బోర్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్
జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ నేతృత్వంలోని బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ సంస్థ డ్యుయిష్ బోర్స్ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) ను ప్రారంభిస్తున్నట్లు తెలియజేసింది. ఈ GCC ఏర్పాటు ద్వారా రాబోయే రెండేళ్లలో ఐటీ రంగంలో వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని జర్మనీ బృందం సీఎంకు వివరించింది.
జీసీసీ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి జర్మనీ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరిన సీఎం, ఇందుకు ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. పెట్టుబడుల విషయంలో తెలంగాణ జర్మనీ భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని సీఎం స్పష్టం చేశారు. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
హైదరాబాద్‌ను ఇన్నోవేషన్ హబ్‌గా తయారు చేయడానికి సహకరించాలని సీఎం అన్నారు. స్థానిక విద్యార్థులకు జర్మన్ భాషను నేర్పించేందుకు జర్మనీ టీచర్లను నియమించి TOMCOM ద్వారా వొకేషనల్ ఎడ్యుకేషన్, శిక్షణ అందించేందుకు సహకరించాలని కాన్సుల్ జనరల్‌ను కోరారు. ఈ భేటీలో డ్యుయిష్ బోర్స్ సీఓఓ డాక్టర్ క్రిస్టోఫ్ బోమ్, అమిత దేశాయ్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
AWS ప్రతినిధులతో..
సీఎం రేవంత్ రెడ్డిని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. తెలంగాణలో AWSకు సంబంధించి ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ ప్రాజెక్టులు, వాటి విస్తరణ వంటి అంశాలపై సీఎంతో చర్చించింది. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని సీఏం స్పష్టం చేశారు. ఈ సమావేశంలో AWS డేటా సెంటర్ గ్లోబల్ హెడ్ కెర్రీ పర్సన్, ఇన్‌ఫ్రా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ విక్రమ్ శ్రీధరన్, అనురాగ్ కిల్నాని తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: దేశంలోనే ధనిక జిల్లాగా రంగారెడ్డి


