ఫ్లైట్ టికెట్లకు సంబంధించిన రీఫండ్ నిబంధనల్లో కొన్ని మార్పులు చేసినట్లు.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) వెల్లడించింది. ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకున్న 48 గంటలోపు అదనపు చార్జీలు లేకుండానే రద్దు చేసుకోవచ్చు, లేదా మార్పులు చేసుకోవచ్చు. రీఫండ్ కూడా వేగవంతంగా పూర్తవుతుందని డీజీసిఏ ప్రకటించింది.
టికెట్ బుక్ చేసుకున్న 48 గంటల పాటు విమానయాన సంస్థలు "లుక్-ఇన్ ఆప్షన్" అందించాలి. ఈ కాలంలో అదనపు ఛార్జీలు లేకుండా ప్రయాణీకులు తమ టిక్కెట్లను రద్దు చేసుకోవడానికి లేదా మార్చడానికి అనుమతించాలని డీజీసిఏ పేర్కొంది. దేశీయ విమానాలకు ఐదు రోజుల్లోపు.. అంతర్జాతీయ విమానాలకు 15 రోజుల్లోపు ఎయిర్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా నేరుగా టికెట్ బుక్ చేసుకుంటే ఈ సౌకర్యం అందుబాటులో ఉండదు.
క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపిన సందర్భంలో.. విమానయాన సంస్థలు టికెట్ రద్దు చేసిన ఏడు రోజుల్లోపు తిరిగి చెల్లిస్తుంది. నగదు చెల్లింపుపు ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే.. మీరు రద్దు చేసుకున్న వెంటనే డబ్బు అందుతుంది. అయితే ట్రావెల్ ఏజెంట్లు లేదా పోర్టల్స్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుని.. 48 గంటల్లో రద్దు చేసుకుంటే.. డబ్బు వాపసు అనేది 21 పని దినాలలో మీకు జమ అవుతుంది. రీఫండ్‌లను ప్రాసెస్ చేయడానికి ఏ విమానయాన సంస్థ కూడా అదనపు రుసుము వసూలు చేయదు.
ఇదీ చదవండి: ధరలు పెరుగుతాయ్.. వెండికి ఫుల్ డిమాండ్!


