టికెట్ క్యాన్సిలేషన్ ద్వారా రూ.కోట్లు ఆర్జిస్తున్న రైల్వే శాఖ
రూ.60 నుంచి రూ.240 వరకూ రైల్వే ఖాతాలోకి
2022–23లో టికెట్ క్యాన్సిలేషన్ ద్వారా రూ.2,109 కోట్లు ఆదాయం
2023–24లో ప్రయాణికుల నుంచి రూ.1,762 కోట్లు
సాక్షి, విశాఖపట్నం: దూర ప్రయాణాలకు వెళ్లాలంటే అందరికీ గుర్తొచ్చేది రైలే. మూడు నెలల ముందే టికెట్ తీసుకుంటే గానీ బెర్త్ దొరకని పరిస్థితి. ఒక్కోసారి టికెట్ కన్ఫర్మ్ కాదు. చివరి నిమిషంలోనైనా బెర్త్ దొరకదా.. కనీసం ఆర్‌ఏసీ అయినా అవ్వదా అనే ఆశతో ప్రయాణి కులు ఉంటారు.
చివరి వరకు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే క్యాన్సిల్ చేస్తుంటాం. కొన్నిసార్లు.. అత్యవసరంగా టికెట్ రద్దు చేసుకుంటుంటాం. రద్దు చేసుకున్న ప్పుడు కొంతమేర డబ్బులకు కోత విధించి.. రైల్వే శాఖ రీఫండ్ చేస్తుంటుంది. క్యాన్సిలేషన్ రుసుం కింద కోత విధించిన సొమ్ము రైల్వే ఖాతాలోకి జమ అవుతుంది.
ఏటా సగటున రూ.2 వేల కోట్లు: వెయిటింగ్ లిస్ట్‌లో రూ.240 టికెట్ బుక్ చేసుకుని క్యాన్సిల్ చేసుకుంటే.. కేవలం రూ.180 మాత్రమే రీఫండ్ వస్తుంది. అంటే.. రైల్వే సేవలేవీ వినియోగించుకోకుండానే ఆ శాఖకు సర్వీస్ చార్జ్‌ని ప్రయాణికులు చెల్లిస్తున్నట్టే. ఇలా టికెట్ క్యాన్సిలేషన్ ద్వారా రూ.కోట్లలో ఆదాయాన్ని ఆర్జిస్తోంది రైల్వే మంత్రిత్వ శాఖ.
2022–23 సంవత్సరంలో టికెట్ క్యాన్సిలేషన్, క్లర్కేజ్ చార్జీల ద్వారా రూ.2,109.74 కోట్ల ఆదాయం వచ్చిందని రైల్వే బోర్డు వెల్లడించింది. అదేవిధంగా 2023 ఏప్రిల్ 2023 డిసెంబర్ వరకూ రూ.1,762.62 కోట్లు జమ అయింది. అంటే గతేడాదితో పోలిస్తే.. 2023–24లోనూ పూర్తి లెక్కలు తేలాక రూ.2,200 కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన టికెట్ క్యాన్సిలేషన్స్ ద్వారా రైల్వే శాఖకు ఏటా సగటున రూ.2 వేల కోట్ల వరకూ ఆదాయం లభిస్తోంది.
రూ.60 నుంచి రూ.240 వరకూ కట్
ప్రయాణ తరగతి ఆధారంగా టికెట్ రద్దు రుసుంలు మారుతూ ఉంటాయి. రెండో తరగతి టికెట్ క్యాన్సిలేషన్‌కు రూ.60 నుంచి మొదలై.. ఏసీ ఫస్ట్ క్లాస్ లేదా ఎగ్జిక్యూటివ్ క్లాస్‌కు రూ.240 వరకు చార్జీలు ఉంటాయి. సెకండ్ ఏసీకి అయితే రూ.200, థర్డ్ ఏసీ, ఏసీ చైర్ కార్ అయితే రూ.180 వసూలు చేస్తారు.
స్లీపర్ క్లాస్‌కు రూ.120 వరకూ రుసుం కింద రైల్వే శాఖ కట్ చేసుకుంటుంది. ట్రైన్ బయలుదేరడానికి నాలుగు గంటలలోపు టికెట్లను రద్దు చేస్తే క్యాన్సిలేషన్ చార్జి 50 శాతం ఉంటుంది. ఒక వేళ ట్రైన్ బయలుదేరడానికి 72 గంటలలోపు, అంటే మూడు రోజుల ముందే టికెట్లను రద్దు చేస్తే క్యాన్సిలేషన్ చార్జీలు ఉండవు. వారికి పూర్తి రీఫండ్ లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment