Illegal rice
-
అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
దాచేపల్లి: అక్రమంగా లారీలో తరలిస్తున్న రేషన్‌బియ్యాన్ని పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. లారీలో తరలిస్తున్న 240 బస్తాల రేషన్ బియ్యంతో పాటుగా రూ.2.76 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ అద్దంకి వెంకటేశ్వర్లు చెప్పారు. తెలంగాణలోని కోదాడ పరిసర ప్రాంతాల్లో సేకరించిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా లారీలో తంగెడ మేజర్ కాలువ కరకట్ట మీదుగా నకరికల్లు వైపు తరలిపోతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో ఎస్ఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కరకట్ట మీద మకాం వేశారు. కరకట్టపై వస్తున్న లారీని ఆపి తనిఖీ చేయగా అందులో రేషన్‌బియ్యం ఉన్నట్లు గుర్తించారు. పౌరసరఫరాల గిడ్డంగుల నుంచి వచ్చిన బియ్యం బస్తాలను నేరుగా లారీలోనే తరలిస్తుండటం గమనార్హం. లారీలో ఉన్న చిట్యాల ఆంజనేయులు, మేదరాజు కృష్ణశివదీప్, కిచ్చంశెట్టి గిరి, పి, క్రాంతి, శోఠెం జాన్‌బాబులను అదుపులోకి తీసుకుని లారీలో తనిఖీలు నిర్వహించారు. తెలంగాణలో రేషన్‌బియ్యం విక్రయించగా వచ్చిన రూ. 2.76లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. లారీతో పాటుగా ముందు ఎస్కార్ట్‌గా వస్తున్న మరో ట్రాలీ ఆటోను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, రేషన్‌బియ్యాన్ని సేకరించి విక్రయించే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఈ నెల 17వతేదీన దాచేపల్లి సమీపంలో లారీలో అక్రమంగా తరలిస్తున్న 400బస్తాల రేషన్‌బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా పట్టుబడిన రేషన్‌బియ్యాన్ని ఆర్ఐ సునీత పరిశీలించారు. సరుకును రెవెన్యూ అధికారులకు అప్పగించారు. -
‘రేషన్’ దొంగల కొత్త మార్గాలు!
- క్వింటా బియ్యం మించకుండా రైళ్లలో మూటల తరలింపు - రైల్వేస్టేషన్లపై దాడులు చేస్తున్న ‘సివిల్ సప్లైస్’ - పటిష్టమైన చర్యలతో కాకినాడపోర్టుకు బందైన అక్రమ బియ్యం లారీలు సాక్షి, హైదరాబాద్: రేషన్ బియ్యం పక్కదారి పట్టించేం దుకు అక్రమార్కులు కొత్త మార్గాలు కనిపెట్టారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రేషన్ దొంగలు తమ అక్రమాలను యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఇటీవల వరసగా జరిగిన సంఘటనలు చౌకధరల బియ్యం అక్రమార్కుల వ్యూహాన్ని బయటపెట్టింది. ఏభై కేజీలు, క్వింటా పరిమాణంలో మూటలు కట్టి బియ్యాన్ని రైళ్లలో రాష్ట్రసరిహద్దులు దాటిస్తున్నారు. ఇన్నాళ్లూ రోడ్డు మార్గంలో లారీలు, వ్యాన్లు, ఆటోల్లో మాత్రమే బియ్యాన్ని అక్రమంగా తరలించేవారు. కేవలం నెల వ్యవధిలోనే నాంపల్లి స్టేషన్లో 8 క్వింటాళ్లు, కాచిగూడ స్టేషన్లో 22 క్వింటాళ్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 18.50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసకున్నారు. పట్టుబడిన ఈమొత్తం కలిసినా 48.50 క్వింటాళ్లే అయినా, ప్రతీ నిత్యం చిన్న, చిన్న మూటలుగా పెద్ద మొత్తంలోనే తరలిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలకు బియ్యాన్ని అక్రమం గా తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో అన్ని రైల్వే స్టేషన్లపై దృష్టి పెట్టాలని పౌర సరఫరాల శాఖల అధికారులను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. దాడులు కూడా నిర్వహిస్తున్నారు. ఏటా రూ.25 వందల కోట్ల సబ్సిడీలు రాష్ట్రంలోని 2.70కోట్ల మంది లబ్ధిదారుల కోసం ప్రతీ నెలా 1.75 లక్షల టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. దీనికోసం ఏటా రూ.2 వేల నుంచి రూ.2500కోట్ల సబ్సిడీనీ ప్రభుత్వం భరిస్తోంది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని రేషన్ బియ్యం అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు సివిల్ సప్లైస్ కమిషనర్ సి.వి.ఆనంద్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అన్ని జిల్లా కార్యాలయాలను, బియ్యం గోదా ములను, బియ్యం రవాణా చేసే వాహనాలను ఈ కేంద్రం తో అనుసంధానించారు. సుమారు 13వందల రవాణా వాహనాలకు జీపీఎస్ అమర్చగా, మండల స్థాయి నిల్వ కేంద్రాల్లో సైతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీనికి తోడు ఇరవై మందితో ఎన్‌పోర్స్‌మెంటు విభాగాన్ని నెల కొల్పారు. దీంతో బియ్యం అక్రమార్కులకు చెక్ పెట్టిన ట్టయింది. ప్రధానంగా కాకినాడ పోర్టుకు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే లారీలను కట్టడి చేశారు. రేషన్ బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్న వ్యాపా రులను గుర్తించి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేశారు. దీంతో కాకినాడ పోర్టుకు తరలిపోయే రేషన్ బియ్యం దాదాపు బందైనట్లు పేర్కొం టున్నారు. ఈ కారణంగానే బియ్యం వ్యాపారులు కొత్త మార్గాల అన్వేషణలో పడినట్లు తెలుస్తోంది. -
భైంసాలో విజిలెన్స్ అధికారుల దాడి
అక్రమ బియ్యం, గోధుమ నిల్వల పరిశీలన ఎంఎల్ఎస్ పాయింట్‌కు నిల్వల తరలింపు మరిన్ని దుకాణాలను సీజ్ చేసిన అధికారులు భైంసా : పట్టణంలోని ఆటోనగర్‌లో రేషన్ దుకాణాలకు సంబంధించిన బియ్యం, గోధుమలను అక్రమంగా నిల్వచేసిన దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. గురువారం కరీంనగర్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎ.శ్రీనివాస్, వి.శ్రీనివాస్, భైంసా, నిర్మల్ డీటీఎన్ఫోర్స్మెంట్ అధికారులు శ్రీధర్, ఎజాజ్, ఆర్ఐ ఈశ్వర్ ఆధ్వర్యంలో ఆటోనగర్‌లోని దుకాణాలను తనిఖీ చేశారు. ముందస్తు పక్కా సమాచారం మేరకు రెండు దుకాణాల షట్టర్లు తెరువగా.. అందులో రేషన్ షాపుల్లో పేదలకు అందించాల్సిన బియ్యం, గోధుమలు కనిపించాయి. పక్కనే మరిన్ని దుకాణాలను తెరిచేందుకు ప్రయత్నించినా సంబంధిత వ్యక్తులు లేరు. ఏడు దుకాణాలను సీజ్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నిల్వ చేసిన సరుకులను భైంసా ఎంఎల్ఎస్ పాయింట్‌కు తరలించారు. పూర్తివివరాలను త్వరలో వెల్లడిస్తామని స్పష్టం చేశారు. మహారాష్ట్రకు తరలించేందుకు.. అక్రమంగా కొంత మంది రేషన్‌దుకాణాలను నడుపుతున్న వ్యక్తులు ఈ తతంగానికి పాల్పడుతున్నట్లు సమాచారం. ఆటోనగర్‌లో నిల్వ ఉంచిన ఈ సరుకును లారీల్లో నింపి నేరుగా మహారాష్ట్రకు తరలించి అక్కడే విక్రయిస్తున్నట్లు తెలిసింది. విజిలెన్స్ అధికారులకు అందిన సమాచారం మేరకు దాడులు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ బృందం దీనిపై మరింత లోతుగా పరిశీలిస్తే రేషన్ సరుకులు ఏ మేర పంపిణీ అవుతున్నాయో తేటతెల్లమవుతుంది. -
నిప్పు మీద ఉప్పు... ఆనక గప్‌చుప్
అక్రమబియ్యంపై దాడుల తీరిదీ తొలుత హడావుడి డీలర్లకు కొమ్ముకాస్తున్న అధికారులు అధికార పార్టీ ఒత్తిడితో చర్యలు శూన్యం నిప్పు మీద ఉప్పు వేస్తే ఏమవుతుంది ... ఈ తరం వారికి తెలియకపోవచ్చు... ఎందుకంటే గ్యాస్స్టౌలే కదా... నిప్పు ఎక్కడిదీ...ఇక దానిమీద ఉప్పు వేస్తే ఏమవుతుందని ప్రశ్నార్థకంగా మొహం పెట్టే వారికి మరికొంత వివరంగా... నిప్పు మీద ఉప్పు వేస్తే సీమ టపాకాయలా పేలుతాయి...తరువాత అంతా గప్‌చుప్. ఈ చందంగానే జిల్లాలో పేదల బియ్యంపై జరుగుతున్న దాడులు తయారయ్యాయి. రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతున్నా ... అక్రమంగా నిల్వ ఉన్నా విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తూ హడావుడి చేస్తున్నారు ... పట్టుకున్న వాటిని పౌరసరఫరాల శాఖ పరిధిలోని ఎన్ఫోర్స్మెంట్కు అప్పగిస్తున్నారు... తరువాత వీరిపై అధికార పార్టీ నుంచి ఒత్తిడులు రావడంతో తొలుత కన్నెర్ర చేసేవారంతా నీరుగారిపోతున్నారు... తనిఖీల అనంతరం కేసు నీరుగార్చేస్తున్నారు ... అవన్నీ సక్రమమేనంటూ తేల్చేయడంతో ఎంచక్కా బయటపడిపోతున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు, దర్శి : పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం నల్లబజారుకు అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, పోలీసులు దాడులు చేసి పట్టుకుంటున్నా స్పందించాల్సిన పౌరసరఫరాల శాఖ అధికారులు నిద్రమత్తులో జోగుతున్నారు. తొలుత హడావుడి చేసినవారంతా తరువాత వచ్చిన ఒత్తిళ్లకు లొంగి మౌనం వహిస్తున్నారు. రేషన్ దుకాణాల అక్రమాలను అరికట్టాల్సిన క్షేత్రస్థాయి ఎన్ఫోర్స్మెంట్ అధికారులే అక్రమార్కులతో చేతులు కలపడంతో విజిలెన్స్ దాడులు సైతం వృథాగా మారుతున్నాయి. రేషన్ డీలర్ల నుంచి బయటకు బియ్యం తరలిపోవడం వెనుక అధికార పార్టీకి చెందిన నేతల అదృశ్య హస్తాలుండడంతో దొంగలు కూడా దొరల్లా బయట తిరుగుతున్నారన్న విమర్శలున్నాయి. దర్శిలో కూడా ఈ నెల 5వ తేదీ రాత్రి ఓ లారీలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న సమాచారం అందుకుని విజిలెన్స్ అధికారులు 50 కిలోల బస్తాలు 138, 25 కిలోల బస్తాలు 199 పట్టుకున్నారు. లారీ డ్రైవర్‌ను,కూలీలను అదుపులోకి తీసుకుని ఈ బియ్యం ఎక్కడివని విచారించగా కృష్ణాపురం,కొత్తపల్లిలో డీలర్లు పంపగా పొదిలిరోడ్డులోని మిల్లుకు తీసుకు వచ్చినట్లు తెలిపారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి ఆ గ్రామాల్లో దుకాణాలకు వెళ్ళి తనిఖీలు నిర్వహించాలని ఎన్ఫోర్స్మెంట్ అధికారులను విజిలెన్స్ అధికారులు కోరారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించ కుండా రెండు దుకాణాల వద్దకు వెళ్ళి అన్నీ సరిపోయినట్లు రికార్డులు రాసుకుని రావడం పట్ల గుసగుసలు వినిపిస్తున్నాయి. కృష్ణాపురంలో మాత్రం డీలరుకు చాలాసార్లు ఫోన్ చేశామని, అయినా రాకపోవడంతో వీఆర్వో సమక్షంలో తాళాలు తీసి నిల్వలు రాసుకున్నామని అధికారులు చెబుతున్నారు. నమోదు చేసుకున్న నిల్వలు ఎంతన్నదీ తెలి యకుండా గోప్యంగా ఉంచారు. తరచూ పట్టుబడిన లారీయే గోడౌన్ నుంచి డీలర్లకు తరచూ సరుకు తోలుతుండడం మరీ విడ్డూరమని గ్రామస్తులే చెబుతున్నారు. లారీ డ్రైవర్, కూలీలు కూడా ఆ సరుకును ఆ రెండు దుకాణాల నుంచే తీసుకు వచ్చామని విజిలెన్స్ అధికారులకు తెలిపారు. అదే నిజమైతే కొత్తపల్లిలో రేషన్ షాపుల్లో మళ్లీ నిల్వలు ఎక్కడి నుంచి వచ్చాయనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. ఈ మొత్తం వ్యవహారానికి అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండడంతో అక్రమ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. ఈ నెల 10వ తేదీన ఒంగోలులో అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ బియ్యం పెద్ద ఎత్తున గోడౌన్లలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యమేనని తేలింది. అప్పటికే అధికార పార్టీ పెద్దల నుంచి ఒత్తిళ్లు రావడంతో పౌరసరఫరాల శాఖ అధికారులు జోక్యం చేసుకొని రేషన్ బియ్యం పెద్దగా లేవంటూ లెక్క తేల్చేశారు.