దాచేపల్లి: అక్రమంగా లారీలో తరలిస్తున్న రేషన్‌బియ్యాన్ని పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. లారీలో తరలిస్తున్న 240 బస్తాల రేషన్ బియ్యంతో పాటుగా రూ.2.76 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ అద్దంకి వెంకటేశ్వర్లు చెప్పారు. తెలంగాణలోని కోదాడ పరిసర ప్రాంతాల్లో సేకరించిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా లారీలో తంగెడ మేజర్ కాలువ కరకట్ట మీదుగా నకరికల్లు వైపు తరలిపోతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కరకట్ట మీద మకాం వేశారు. కరకట్టపై వస్తున్న లారీని ఆపి తనిఖీ చేయగా అందులో రేషన్‌బియ్యం ఉన్నట్లు గుర్తించారు.
పౌరసరఫరాల గిడ్డంగుల నుంచి వచ్చిన బియ్యం బస్తాలను నేరుగా లారీలోనే తరలిస్తుండటం గమనార్హం. లారీలో ఉన్న చిట్యాల ఆంజనేయులు, మేదరాజు కృష్ణశివదీప్, కిచ్చంశెట్టి గిరి, పి, క్రాంతి, శోఠెం జాన్‌బాబులను అదుపులోకి తీసుకుని లారీలో తనిఖీలు నిర్వహించారు. తెలంగాణలో రేషన్‌బియ్యం విక్రయించగా వచ్చిన రూ. 2.76లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. లారీతో పాటుగా ముందు ఎస్కార్ట్‌గా వస్తున్న మరో ట్రాలీ ఆటోను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, రేషన్‌బియ్యాన్ని సేకరించి విక్రయించే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఈ నెల 17వతేదీన దాచేపల్లి సమీపంలో లారీలో అక్రమంగా తరలిస్తున్న 400బస్తాల రేషన్‌బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా పట్టుబడిన రేషన్‌బియ్యాన్ని ఆర్‌ఐ సునీత పరిశీలించారు. సరుకును రెవెన్యూ అధికారులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment